దాంపత్యం - మద్దూరి నరసింహమూర్తి

Daampatyam

ఆనందరావు అనసూయ అదే పనిగా సినిమాలు – అందునా, తెలుగు సినిమాలు మాత్రమే - చూసేవారు. ఆనందరావు ‘ANR’ అభిమాని అయితే అనసూయ ‘NTR’ అభిమాని. ఇద్దరూ కలిసే సినిమాకి వెళ్లేవారు. సినిమానుంచి వచ్చిన తరువాత రెండు రోజుల వరకూ ‘మీ హీరో అదేమిటి అలా చెత్తగా నటించేడు’ అంటే ‘మీ హీరోకి అసలు నటించడమే రాదు’ అని ఇద్దరూ పగలంతా వాదులాడుకుంటూ, రెండు రోజులయేసరికి మరో సినిమా చూడడానికి వెళ్లేవారు. వచ్చి మరలా వాదులాడుకోవడమే.

వారి దాంపత్యం మూడు రోజులు సినిమాలు చూస్తూ ఆరు రోజులు వాదులాడుకుంటూ గమ్మత్తుగా గడిచింది.

అదృష్టమూ దురదృష్టమూ కలిసి ఒకేసారి వచ్చినట్టు, ‘ఉమ్మడికుటుంబం’ ‘ఆదర్శకుటుంబం’ సినిమాలు ఒకేసారి వచ్చేయి. తొలిరోజు మలిరోజు అవి చూసి వచ్చి –

“పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళై 'NTR' చెప్పినట్టుగా అందరూ కలిసి ఉంటే, మన ఇల్లు కూడా కొడుకులు కోడళ్లతో ఎంతో సందడిగా హాయిగా ఉంటుంది” అని అనసూయ అంటే --

“అదేమీకాదు, ‘ANR’ చెప్పినట్టుగా ఎవరి కుటుంబంతో వారు వేరుగా ఉంటేనే పొరపొచ్చాలు లేకుండా అందరి మనసులూ కలిసి మెలిసి ఉంటాయి” అని ఆనందరావు జవాబు.

వారి పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు. వాళ్లు పెద్ద అవాలి, ఉద్యోగస్తులు అవాలి, వారికి పెళ్లిళ్లు అవాలి.

అయినా --

"ఇప్పుడే చెప్తున్నాను. రేపు ‘మీకుటుంబాలతో వేరుగా ఉండండి’ అని మొండిగా మీరు పిల్లలని వేరు పెడితే, నేను ఉరేసుకొని చస్తాను" అని, అనసూయ బెదిరిస్తే --

"అందరూ ఒక్కచోటే ఉండాలని నువ్వు పట్టు పడితే, నేను సన్యాసుల్లో కలిసిపోవడం ఖాయం. ఆ తరువాత మీరందరూ కలిసి కట్టకట్టుకుని ఎలా చచ్చినా నాకు అనవసరం" అని ఆనందరావు బెదిరింపు.

వారిద్దరూ అలా వాదులాడుకుంటూ ఆ వాదనలు పునశ్చరణ చేసుకుంటూ ఉండగానే -- పిల్లలకి పెళ్ళిళ్ళై కోడళ్ళు వచ్చేరు.

-2-

అక్కడనుంచీ మొగుడు పెళ్ళాం రాత్రుళ్ళు పడుకోవడం మానేసి -- 'ANR మాట నెగ్గాలి' అంటే 'NTR మాట నెగ్గాలి' అని వాదులాడుకోవడం ఆరంభించేరు.

నిద్రలేమితో ఎర్రబడ్డ కళ్ళతో కనబడే అత్తగారిని చూసే కొత్త కోడళ్ళు -- ఆ కళ్ళు ఎర్రబడ్డడానికి వేరే అర్ధం చదువుకొని /చెప్పుకొని చాటుగా బుగ్గలు నొక్కుకొని ముసిముసిగా నవ్వుకొనేవారు.

పురుషాధిక్యంతో ‘ANR’ మాటనే గెలిపించేరు ఆనందరావు.

ఆ తరువాత --

"అనసూయా నేను చెప్పింది అర్ధం చేసుకో. కాస్త ఆలోచించేవంటే, పిల్లల చేత వేరు కాపురాలు నీ మంచికే పెట్టించేనని నీకే తెలుస్తుంది, 'కోడల్లేని అత్త గుణవంతురాలు' అన్నారు కదా."

"ఏడిసినట్టుంది. ఈ ముసలాళ్ళకి ఇంకా 'ఆ యావ' పోక ఏకాంతం కావలసి వచ్చింది కాబోలు - అని నలుగురూ నోళ్లు నొక్కుకుంటూంటే నాకు సిగ్గేస్తోంది"

"కోడళ్లు వచ్చినంత మాత్రాన మనం ముసిలాళ్ళయిపోతామేమిటి. నా కంటికి నువ్వింకా ఆనాటి ‘శోభనపు పెళ్లికూతురు’ లానే కనపడుతున్నావు తెలుసా. అయినా, ఎవరో ఏదో అనుకుంటే మనకేమిటి. మన ఈ చిన్ని రాజ్యానికి నువ్వు మహారాణివి నేను రాణిగారి భర్తని. అవునా కాదా, నిజం చెప్పు"

"నిజమే కానీ, చూసేవాళ్ళకి కూడా బాగుండాలి కదా."

"ఏం ఇప్పుడు బాగుండనిది ఏముంది"

“సరైన ఆలోచన లేని మీ నిర్వాకం వలన వియ్యపురాళ్ల దగ్గర నాకు మొహం చెల్లకుండా చేసేరు. ‘మా అత్తగారికి కోడళ్ల పొడే గిట్టదు కాబోలు, మేం ఎవరమూ వేరు కాపరం ఊసు ఎత్తకుండానే తెలివిగా మామగారిచేత చెప్పించి మమ్మల్ని బయటకి తోలేసేరు మా అత్తగారు’ అని కోడళ్లు చెప్పుకోరూ వారి వారి పుట్టింట్లో. మీకేమిటి మగ మహారాజులు. మొండితనంతో మీ మాట నెగ్గించుకొని నన్ను చెడ్డదాన్ని చేసేరు."

భార్య అలా బాధపడడం చూస్తూంటే తాను తప్పు చేసేనేమో అనిపించింది ఆనందరావుకి. అయినా ఒప్పుకుందికి – అందునా, భార్య దగ్గర - అభిమానం అడ్డొస్తోంది.

పదిహేను రోజులయేసరికి ఆవిడ బాధ చూడలేక - -

"నువ్విలా బాధ పడుతూంటే నేను చూడలేకపోతున్నాను, పోనీ పిల్లల్ని వెనక్కి పిలిచేసేదా?"

-3-

"ఆ బుద్ధి ముందర ఉండాలి. ఇప్పుడనుకొని ఏమి లాభం. మీదు మిక్కిలి అలా వెనక్కి పిలిస్తే, కోడళ్ల మాటేమో కానీ, మన పిల్లలే మనకి ఎదురు తిరిగే అవకాశం లేకపోలేదు. పైగా, మిమ్మల్ని అందరూ కలిసి 'పిచ్చి తుగ్లక్' అంటే విని మీరు భరించగలరేమో కానీ, ‘నా మొగుడి’ ని అలా ఎవరేనా అంటే నేను సహించలేను."

"అలా ఆలోచిస్తే, నువ్వు ఎప్పటిలాగే నవ్వుతూ నా పూర్వపు అనసూయ లాగ ఉంటేనే నాకు తృప్తి”

"సరేలెండి, ఉండక ఛస్తానా"

"అగో మళ్ళీ"

"నేను సర్దుకొనేసరికి కొద్ది రోజులు పడుతుంది"

"అయితే, ఓ పని చేద్దాం. మనిద్దరం కలిసి ఓ నెల రోజులు తీర్థయాత్రలు చేసి వద్దాం"

"మీ ఆలోచన బాగేనే ఉంది. కానీ, ఇప్పుడే వెళ్తే, మనం తీర్థయాత్రలకు వెళ్ళేం అనుకోరెవరూ"

"మరి"

"సెకండ్ హనీమూన్ కి విహారయాత్రలకు వెళ్ళేరు ఈ ముసిలాళ్లు అనుకుంటారు" అని నవ్వింది ఆవిడ.

"అనుకోనీ. ఎవరెలా అనుకుంటే మనకేమిటి"

"ఆ మొండితనమే వద్దన్నది. మీరు చెప్పినట్టుగా వెళదాం, కానీ ఆరు నెలలు ఆగి వెళదాం"

"అలాగే. పోనీ ఈరోజు సినిమాకి వెళ్లి హోటల్లో భోజనం చేసి వద్దామా"

"ఆ తిరుగుళ్లే కూడదన్నది"

"ఎందుకు"

"లోకానికి భయపడాలి. పైగా ఊళ్ళోనే ఉన్న పిల్లలు తారస పడితే వాళ్ళ దగ్గర, ముఖ్యంగా కోడళ్ల దగ్గర, నాకు సిగ్గు వేస్తుంది."

"నీ ఇష్టం. ఇక మీద ఈ మహారాణిగారు చెప్పినట్టే నడుచుకుంటాడు ఈ రాణిగారి భర్త. సరేనా"

"రాణిగారి భర్త ఏమిటి - ముందు మీరు మహారాజు, ఆ తరువాతే నేను మహారాణిని" అని మనస్ఫూర్తిగా నవ్విన భార్యని చూసిన ఆనందరావు మనసు తేలికపడింది.

*****

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న