సస్పెన్స్ - వెంకటరమణ శర్మ పోడూరి

Suspence

"ఒరేయ్ కృష్ణా ! పెద్ద మావయ్య రేపు గోదావరి కి వస్తున్నాడు. నువ్వే వెళ్లి తీసుకు రావాలి " ఇంటికి చేరగానే అమ్మ మాటలు వినగానే , ఆఫీసులో పడిన మీటింగ్స్ శ్రమ అంతా మరిచి పోయి ఒక్క మాటు మంచి ఉత్సాహం వచ్చింది. ఒక వారం రోజులు పెద్ద మావయ్య కంపెనీ లో గడప బోతున్నాను అని తెలిసి ఉత్సాహం వచ్చింది. **** పెద్ద మావయ్య అమలాపురం లో ఉంటాడు. నాన్న గారు లా ప్రాక్టీస్ వదిలి జడ్జీ అయేదాకా మేము అమలాపురం లోనే ఉండేవాళ్ళం. నా హై స్కూల్ చదువు అంతా అక్కడే సాగింది. చిన్న మావయ్య కంటే నాకు పెద్ద మామయ్య తో చనువు ఏర్పడటానికి కారణం సినిమాలు. మా తాత గారు వాళ్ళు కూచిమంచి వీధి లో ఉంటే, కోర్టు కు దగ్గర గా మేము మొబర్లీ పేట లో ఉండేవాళ్ళం. నాన్న గారు, అమ్మ కూడా సినిమా లు ఎక్కువ చూసేవారు కాదు. అప్పట్లో సినిమా కి వెళ్లడం అంటే ఏ పరీక్ష లో పూర్తి అయితేనే పంపే వారు. పోకెట్ మనీ ఇచ్చే అలవాటు లేదు. క్లాస్ మెట్ సుబ్బరాజు నాన్నగారు కమలేశ్వర టాకీస్ మేనేజర్ గా చేసే వారు. ఫ్రీ గా వాడే తీసుకు వెళ్లే వాడు. ఒక మాటు, ఫ్రీ యే కదా సినిమాకి వెడుతున్నాను అంటే అమ్మ అలా వెళ్ళ కూడదు అని ఆపేసింది. అప్పటినుంచి ఇంట్లో చెప్ప కుండా వాడితో మేట్నీ లే చూసేవాడిని. ఒక రోజూ నేను, వాడు మాట్నీ చూస్తున్నాము. నాకు ఒక పక్కన కూర్చున్నాయన వేరు శనగ కాయలు ఒక్కొక్కటే ఒలిచి గుళ్ళు నోట్లో వేసు కుంటూ ఉంటే మంచి వాసన వస్తోంది. " ఎవడు రా బాబు " అని మనసులో అనుకున్నాను. ఇంటర్వెల్ లో లైట్లు వేయగానే చూస్తే పెద్ద మావయ్య. నన్ను చూశి ఆశ్చర్య పోయి, నాకు కూడా వేరు శనగ కాయలు ఇచ్చి " ఎరా ఒక్కడి వే వచ్చావా? అక్కయ్య తో చెప్పావా? అన్నాడు ఇంట్లో విషయం తెలుసు కాబట్టి. సుబ్బరాజుని పరిచయం చేసి విషయం చెప్పాను. "ఇక పైన మనిద్దరం చూద్దాం లే" అన్నాడు. అదుగో అప్పటి నుంచి, అమ్మకి తెలియ కుండా పెద్ద మావయ్య తో సినిమా లు చూడటం ప్రారంభం. హిందీ సినిమాలు, తెలుగు సినిమాలు చూసే వాళ్ళం. సినిమాలలో డైరెక్టర్ గొప్పతనం గురించి ఉదాహరణ లతో బాగా వివరించే వాడు. సినిమా చూడటం కార్యక్రమం చాలా పూర్తి గా అనందించేవాడు ఆయన. సినిమా టైం కంటే బాగా ముందే బయలు దేర తీసేవాడు. సినిమా కి వెడితే టైటిల్స్ కి ముందు న్యూస్ రీల్ దగ్గర నుంచి చూడవలిసిందే. ఏదయినా మిస్ అవడం ప్రశ్న లేదు.హాలుకి వెళ్లే దారిలో సత్యనారాయణ విలాస్ లో టిఫిన్, ఫిల్టర్ కాఫీ. ఇంటర్వల్ లో వెన్నా బిస్కెట్ లు, కూల్ డ్రింక్ తప్పని సరి.. అప్పట్లో సినిమాలు ఎక్కువ రోజులు ఆడేవి. కొత్త సినిమా రాగానే, అమ్మతో చెప్పి సినిమా అయిన తరువాత తాత గారి ఇంట్లోనే పడుకునే ఏర్పాటు చేసే వాడు. అక్కడ నుంచి నేను హైదరాబాద్ వచ్చేసే దాకాసినిమాల విషయం లో గోల్డెన్ పీరియిడ్ అని చెప్పాలి. అయితే పెద్ద మావయ్య తో సినిమా కనెక్షన్ అక్కడితో ఆగి పోలేదు. చిన్న మావయ్య ఉద్యోగానికి కలకత్తా వెళ్లి పోయినా, ఎంబియే చదివినా పెద్ద మావయ్య కొబ్బరి వ్యాపారం చేస్తూ అమలాపురం లోనే ఉండిపోయాడు. ఆ వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ వచ్చి నాలుగు అయిదు రోజులు ఉండేవాడు. ఉన్న నాలుగు రోజులు సినిమాలు తప్పని సరి. మల్టి ప్లెక్స్ లు వచ్చేదాకా మామూలు థియేటర్లు, ఆ తరువాత మల్టిప్లెక్స్ లలో. సినిమా చూడటం కార్యక్రమం అంతా అప్పటి లాగే ఉన్నా కొద్ది మార్పులు చేరాయి. వేళ్లే ముందు రెండు పాన్ లు, జరదా, మీఠా , కాదు కానీ కిమామ్ వేసిన వి కట్టించే వాడు. ముందు ఒకటి, ఇంటర్వెల్ తరువాత ఒకటి. ఒక వేళ సెకండ్ షో కనక అయితే దానికి ప్రత్యేక ప్రిపరేషన్ . " ఒరేయి సెకండ్ షో ఎలా ఎంజాయ్ చేయాలో ఆర్ కె నారాయణ్ రాసిన బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ నవల లో వివరించాడు రా " అని చెప్పి ఆ నవల నా చేత చదివించాడు . ఆ నవల లో నారాయణ్ చేసిన కామెంట్ చాలా మాట్లు సినిమా లో టైటిల్స్ రన్ అవుతున్నప్పుడు చెప్పేవాడు. " ఈ టైటిల్స్ ఇంచు మించు అయిదు నిముషాలు నడుస్తాయి. వాటిలో డైరెక్టర్, ముఖ్య నటీ నటులు తప్ప మిగతావి ఎందుకు వేస్తారో అర్థం కాదు. వాటిలో నూటికి తొంభై శాతం, ఆ పేరు ఎవడిదో వాడు చూసుకుని ఆనందించాలి తప్ప మిగతా వాళ్ళు ఎవరు గుర్తు పట్టరు. అటువంటప్పుడు వాటిని రన్ చేయడానికి ఎందుకు ఇంత సమయం , శ్రమ, డబ్బు వృధా చేస్తారో అర్థం కాదు. నారాయణ్ ఎప్పుడో నలభై ల లో ఆ నవల రాసినా ఆ పధ్ధతి ఇప్పటికీ నడుస్తూ ఉండటం ఒక అర్థం కానీ వ్యర్థం. మనమే కాదు ఇంగ్లీష్ సినిమా లు లో కూడా అదే ఆలోచనా రహితం. మనవాళ్ళు చూస్తావా, చస్తావా అన్నట్టు కథా ప్రారంభం ముందు వేస్తారు. ఇంగ్లీష్ సినిమా లలో, జనం లేచి వెళ్లి పోతారని తెలిసినా సినిమా కథ అయిపోయినా అవి రోల్ అవుతూ నే ఉంటాయి. " పెద్ద మావయ్య పరిశీలనాత్మక కామెంట్ కి నేను ఆశ్చర్య పోయాను. అంత వృధా చేయడానికి మనకి తెలియని బల మయిన కారణం ఎమన్నా ఉందేమో ఆనుకునే వాడిని. ****** అవేళ సోమవారం, నేను, మా తమ్ముడు రామం, చెల్లాయి సుగుణ పెద్ద మామయ్య తో కలిసి డిన్నర్ చేస్తున్నాము. నాన్న గారు వేళాకోళం గా అన్నా, మా అమ్మ, పెద్ద మావయ్య వచ్చినప్పుడు వంటలు మంచి రుచి కరం గా చేస్తుంది అనటం లో నిజం లేక పోలేదు. అవి అశ్వాదిస్తూ డిన్నర్ మొదలు పెట్టాము. అప్పుడే అమ్మ తెచ్చి టేబుల్ మీద పెట్టిన అప్పడం తీసుకుని, " ఒరేయి రామం నా చిన్నప్పటి సంగతి ఒకటి చెబుతాను విను. అమలాపురం కదా. పన్నెండు ఏళ్ళు వచ్చినా రైల్ చూడ లేదు.మా రెండో పిన్ని వాళ్ళు కాకినాడ లో ఉండేవారు. ఒక మాటు వేసవి శలవల కి ఎవరో వెడుతోంటే అక్కడికి పంపారు నన్ను. వెళ్లిన మరునాడే మా బాబాయ్ రైల్ చూపించడానికి బయలుదేర తీసి నాకు చెప్పులు లేకపోవడం చూసి " ఒరేయి నీకు చెప్పులు కొందాము రా " అన్నాడు. నిజంగా కొనే ఉద్దశ్యం లేదని నాకు అప్పుడు తెలియదు. అప్పట్లో చిన్నతనం లో పిల్లలికి చెప్పులు కొనడం లేదు. మానాన్న ఆ సంగతి ఆలోచించేలేదు . అలాంటిది అయన అలా అనడం తో నాకు ఆశ్చర్యం వేసింది. నిజం గా కొంటాడా అని. అన్నాడు గానీ అప్పుడే మరిచి పోయాడు అయన" అని ఆపి నాకేసి చూసి గట్టిగా నవ్వాడు. నేను మధ్యలోనే ఊహించాను రామం తో చెబుతున్నాడు అంటే ఇదేదో మనమీదకే రాబోతోంది అని. నాకు అర్థం అయింది. అయన ఆ కథ ఎందుకు చెప్పాడో. చురక వేయడానికి అయన ఎంచుకునే పద్ధతి అది. ఇంతకీ జరిగింది ఏమిటంటే ఆయనని శుక్రవారం స్టేషన్ లో రిసీవ్ చేసుకుని ఇంటికి వస్తూ " పెద్ద మావయ్యా శనివారం మన ఇంటిదగ్గర మల్టిప్లెక్స్ లో మంచి సినిమా ఉంది వెడదాం " అన్నాను. కానీ శనివారం కొత్త గా మా ఆఫిస్ లో చేరిన మాలతి కాఫీ షాప్ కు రమ్మంటే అన్ని మరిచిపోయి పరిగెత్తాను. మాలతి పరిచయం పెంచుకోవాలని బ్రహ్మచారులు అందరం పోటీ పడుతున్నాం. ఆఫీసులో చేసిన చిన్న సహాయానికి ఆమె కృతజ్ఞతగా రమ్మంటే వెళ్లాను . తర్వాత గుర్తు వచ్చింది. పెద్దమావయ్య తో సినిమా సంగతే మరిచిపోయాను. ఇప్పుడు చురక దానికి అన్న మాట ****** గతం లో అయితే ఆయన వచ్చినప్పుడల్లా థియేటర్లకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఓటిటి లోనే చాల తెలుగు సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఆదివారం అంతా అవి చూశాము. పెద్దమా వయ్య సినిమా చూసే పద్ధతే వేరు. ఆయన అసలు చూడబోయే సినిమా లోని కథ కొద్దిగానైనా ముందు తెలుసుకోవడం ఇష్ట పడడు. సమీక్షలు చదివినా కథ పోర్షన్ స్కిప్ చేస్తానని చెప్పాడు. అమలాపురం లో ఉండగా ఒక మాటు అంతకు ముందు గుప్తా గాడు చూసి నాకు కథ చెప్పిన సినిమా , పెద్దమవయ్య తో చూడడం జరిగింది. మయంలో కథ గురించి ఒకటి రెండు విషయాలు నేను వాగాను. అప్పుడు ఒక సంగతి చెప్పాడు . గతం లో అయన బీస్ సాల్ బాద్ సినిమా చూస్తుండగా పక్కన కూర్చుని ఒకడు "అడుగో వాడే విలన్" అని అరిచాడట . ఈయన వాడిని సాచి లెంపకాయ కొట్టాడట. ఆ తర్వాత గొడవ చెప్పలేదు. కానీ నాకు మెసేజ్ అందింది . అయన కి కథ ఏమాత్రం ముందు గా తెలియడం ఇష్టం ఉండదని అయన తో సినిమా చూసేటప్పుడు అది దృష్టిలో పెట్టుకుంటాం నేను, రామం. ఈ మాటు వచ్చినప్పుడు, పని అవలేదని నాలుగు రోజులు ఎక్కువే ఉన్నాడు. రోజూ రాత్రి, సోషల్ మీడియా లో గాసిప్ బట్టి ఏవి బాగుంటే అవి రోజూ చూస్తున్నాము. ఓరోజు సాయంత్రం, ఏదో సస్పెన్స్ సినిమా ఓటిటి లో చూస్తున్నాం. మేము సినిమా చూస్తూ ఉండగా రామం ఫ్రెండ్ నాగరాజు వచ్చాడు. వచ్చి నేరుగా అమ్మ దగ్గరికి వెళ్లి పోయాడు. వాడు రామానికి బాగా క్లోజ్. మా ఇంటికి తరచు వచ్చి మా అమ్మకి పనులు లో సహాయ పడుతూ ఇంట్లో బాగా కలిసిపోయాడు. కానీ వాడి దగ్గర పెద్ద జబ్బు ఒకటి ఉంది. మనం సినిమా చూస్తూ ఉండగా, వాడు చూసిన సినిమా అయితే "సినిమాలో ఒక కారక్టర్ ని చూపించి అదిగో వాడు చివరికి చచ్చిపోతాడు " అంటాడు వచ్చి కూర్చుని. ఇంక మనకి ఆసక్తి పోతుంది. వాడికి చాలా మాట్లు చెప్పినా వాడు అలవాటు మార్చుకోలేదు. ఎప్పుడు వచ్చి కూర్చున్నాడో, వాడు మా పక్కన వచ్చి కూర్చోవడం, మేము గమనించనే లేదు. ఎవడు విలనో తెలియక మంచి సస్పెన్స్ లో నడుస్తోంది కథ. " అదుగో వాడే విలన్" అని తెర మీద ఉన్న క్యారెక్టర్ ని నాగరాజు చూపించడం తో నేను, రామం ఒక్క మాటు స్టన్ అయిపోయాము. ఇద్దరం పెద్ద మావయ్య కేసి చూశాం. హీరోషిమా లో బాంబు పడి పెలే ముందు నిశ్శబ్దం లా ఉంది. నాకు బీస్ సాల్ బాద్ గుర్తు కు వచ్చింది. నాగరాజు చంప పగులుతుందేమో నని. ఆశ్చర్యం గా పెద్ద మావయ్య రియాక్ట్ అవలేదు. వాడికేసి ఒక మాటు చూసి సినిమా లో మునిగి పోయాడు. ఆ తర్వాత మేము నాగరాజు ని తిట్టి పోశాం. వాడు " సారీ రా ఆపుకోలేక పోయాను " అన్నాడు నసుగు తూ. *** పెద్ద మావయ్య మర్నాడు వెళ్లి పోతాడు అనగా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఉందంటే, నేను, రామం కూడా అయన తో వెళ్ళాము. బయలు దేరుతోంటే నాగరాజు వచ్చి తాను కూడా వస్తాను అన్నాడు. మేము జవాబు చెప్పేలోపే, పెద్ద మావయ్య, వాడి భుజం మీద తట్టి "తప్ప కుండా రావయ్యా" అన్నాడు నవ్వుతూ. థియేటర్ లో ముందు రామం , తరవాత నేను, నా పక్కన పెద్ద మావయ్య, అయన పక్కన నాగరాజు కూర్చున్నాం. సినిమా మధ్య లో పెద్ద మావయ్య నాగరాజు తో ఎదో మాట్లాడాడు. ఏమి మాట్లాడాడో నాకు వినపడలేదు. సినిమా అయి అందరం ఇంటికి బయలు దేరాం. కారు ఎక్కగానే నాగ రాజు పెద్ద మావయ్య నిద్దేశించి " ఏమి ట్రిక్ చేశారు సార్!. సస్పెన్స్ లో మజా ఇవాళ సినిమా చివర లో తెలిసింది " అన్నాడు " ఏమిట్రా ఆ ట్రిక్? " అడిగాడు రామం. " సినిమా లో మనం మోహన రావు, వెంకటరావు లలో " ఎవరు హత్య చేశారా అని ఉత్కంఠ తో ఉన్నాము కదా!. మీ మావయ్య గారు, నా చెవి లో "నేను కథ చదివాను. వెంకటరావు హత్య చేశాడు " అన్నారు. అప్పటి నుంచి సినిమా చివర దాకా నిరుత్సాహం గా చూశాను. హత్య చేసింది మోహన రావు అని కదా ఆఖరికి తెలిసింది. అది తెలిసినప్పుడు నేను స్టన్ అయిపోయాను " అన్నాడు " ఇంకెప్పుడూ సినిమా మధ్యలో కథ ఎవరికి చెప్పకు " అన్నాడు పెద్ద మావయ్య నవ్వుతూ. సమాప్తం.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న