చాలా సంవత్సరాల ముందు - ఒక పల్లెటూరు లో మహేష్ అనే బాలుడు ఉండేవాడు. మహేష్ కి మొక్కలంటే చాలా ఇష్టం. మేడ మీద చిన్న కుండీలలో మొక్కల పెంచడం మొదలు పెట్టాడు. మహేష్ కు మొక్కలు కొని, పెంచడం పెద్దగా నచ్చదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అక్కడ నుంచి మొక్కలు తెచ్చి, తన మేడ మీద కుండీలలో పెంచేవాడు.
మహేష్ కి మొక్కలు గురించి బాగా తెలుసుకోవాలన్న తపన ఉండేది. చాలా పుస్తకాలు చదివేవాడు. మొక్కలను ఎలా బాగా పెంచాలి, కొమ్మల నుంచి మొక్కలు ఎలా పెంచాలో తెలుసుకున్నాడు.
మహేష్ కి పర్యావరణ రక్షణ ఒక బాధ్యతగా భావిస్తాడు. అందుకే, మట్టి కుండీలలోనే మొక్కలు పెంచుతాడు. పెద్ద మొక్కల కోసం సిమెంట్ తో కట్టిన కుండీలు వాడతాడు. ప్లాస్టిక్ వాడడం కాలుష్యం పెంచుతుందని దూరం పెడతాడు మహేష్.
అలా మహేష్ మొక్కల కలెక్షన్ బాగా పెరిగింది. మేడంతా మొక్కలతో అందంగా ఉంది. జామ మొక్క కాపు కి వచ్చింది. జామకాయలంటే మహేష్ కు చాలా ఇష్టం.
తులసి, వేప మొక్కల వనం ఒక చోట వేసాడు. ఔషధ మొక్కలు చాలా ఉన్నాయి.
రకరకాల పువ్వుల మొక్కలు ఉన్నాయి. రంగు రంగుల పూల తో మేడంతా చాలా అందంగా కనిపిస్తుంది.
మహేష్ ఫ్రెండ్స్ అంతా, ఎప్పుడూ మహేష్ ను హేళన చేస్తుంటారు - "మొక్కలు పెంచడం వలన కష్టం తప్ప ఏమి లాభం ఉంటుందని?" మహేష్ అవేమీ పట్టించుకోకుండా తన మొక్కలపై ప్రేమ ని అలాగే కొనసాగించాడు. మొక్కలకి ఏమైనా పురుగు పట్టినా, చాలా విలవిలాడే వాడు మహేష్. వెంటనే, తన కున్న పరిజ్ఞానంతో, ఆర్గానిక్ మందులతో వాటికీ నయం చేసేవాడు.
మహేష్ ఉదయం స్కూల్ కి వెళ్ళి, మధ్యాహ్నం వచ్చేవాడు. సాయంకాలం కొంతసేపు మొక్కల సంరక్షణ చూసేవాడు. ఆదివారం కొంచం ఎక్కువ సేపు సమయం కేటాయించేవాడు.
ఒక రోజు మహేష్ స్కూల్ కి వెళ్ళగానే, ఎక్కడనుంచో ఒక కోతి జంట మహేష్ మేడ మీదకు వచ్చింది. అక్కడ ఉన్న జామకాయలు తిన్నాయి. వాటికి చాలా నచ్చాయి. ఇక రోజూ అక్కడకు రావడం మొదలు పెట్టాయి.
అర్ధరాత్రి అవగానే మొక్కలు అన్నీ స్వేచ్ఛగా తిరుగుతూ, మాట్లాడుకుంటాయి.
" మహేష్ చాలా మంచివాడు. కష్టపడి చదువుతాడు. మొక్కలంటే చాలా ఇష్టం. మనల్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఎక్కడో ఉన్న మనల్ని ఒక చోట కు తెచ్చి పెంచుతున్నాడు. రాన్నున్న ఎండా కాలం మనం అందరం చల్లటి గాలి తో అందరికి సేద తీర్చాలి. మహేష్ ఏసీ కొనలేదు కదా, మనమే తన ఇంటిని చల్లగా ఉంచాలి "
దీనికి మొక్కలన్నీ సరే నని ఒప్పుకున్నాయి. మొక్కలు అనుకున్న ప్రకారం వేసవి కాలం చాలా చల్లగా గడుస్తున్నది మహేష్ కు.
జామపళ్ళు కోసం వస్తున్న కోతి జంట కూడా ఇలాగే అనుకున్నాయి. "రోజూ మనకి పళ్ళు దొరుకుతున్నాయంటే మహేష్ కారణం - అవి కూడా రసాయన మందులు లేకుండా పండించిన పళ్ళు, కూరలు. మనం మహేష్ కు అవసరమైనప్పుడు సహాయం చెయ్యాలి"
మొక్కలు కూడా కోతి జంట మాటలు వింటున్నాయి. చాలా ఆనంద పడ్డాయి.
ఎండలు బాగా ముదిరిన సమయంలో, ఒక రోజు మహేష్ కు ఒంట్లో బాగోలేదు. స్కూల్ కు వెళ్ళలేదు. మేడమీదకు మొక్కలకు నీళ్లు పొయ్యడానికి రాలేదు. ఇలాగే కొన్ని రోజుల పాటు రాలేదు. మొక్కలన్నీ మహేష్ కు ఏమైందో నని చింతించాయి.
వెంటనే వాటికి ఒక ఆలోచన వచ్చింది. రోజూ జామపళ్ళు కోసం వచ్చే కోతి జంట సహాయం తో మహేష్ గురుంచి తెలుసుకుందామని అనుకున్నాయి.
మొక్కలన్నీ కోతి జంట కోసం ఎదురు చూశాయి. ఆ రోజు అవి కొంత ఆలస్యంగా వచ్చాయి. జామ చెట్టు మీద కూర్చున్నాయి. జామ చెట్టు " కోతి రాజా! నేను జామ చెట్టు ని మాట్లాడుతున్నాను. రోజూ మీరు వచ్చి సంతోషంగా, నా పళ్ళు తిని వెళ్తున్నారు. మమల్ని బాగా చూసుకుంటున్న మహేష్ చాలా రోజుల నుంచి ఇక్కడకు రావట్లేదు. మేము మహేష్ దగ్గరకు వెళ్ళలేము, కావున మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైందో తెల్సుకోవాలి. ఇది మా మొక్కల అన్నింటి విన్నపం"
వెంటనే కోతి రాజా - " నాకూ మహేష్ అంటే చాలా ఇష్టమే. మీరు చెబుతుంటే చాలా విషయాలు తెలిసాయి. నేను వెళ్ళి విషయం తెల్సుకొని వస్తాను."
కోతి రాజా వెంటనే వెళ్ళి, మహేష్ ఉన్న గదిలోకి తొంగి చూసింది. అక్కడ మహేష్ మంచం పైన పడుకొని ఉన్నాడు. నుదిటిపై చల్లటి గుడ్డ వేసి ఉంది. ఇంతలో డాక్టర్ వచ్చి మహేష్ ను చూస్తున్నారు.
డాక్టర్ మహేష్ అమ్మ తో " మీ అబ్బాయికి విష జ్వరం తగ్గట్లేదు. చాలా రోజుల నుంచి నయం కావట్లేదు. ఇంక ఆ దేవుని పైన భారం వేసి ప్రయత్నిద్దాం."
ఇదే విషయాన్నీ కోతి రాజా మొక్కలకు వచ్చి చెప్పాడు. మొక్కలన్నీ చాలా బాధ పడ్డాయి. మనమందరం ఎలాగైనా మహేష్ కు నయం చెయ్యాలి.
"ఓ కోతి రాజా! నీవు హనుమంతుని రూపం అంటారు కదా! నీవు ఆ హనుమంతుల వారిని ధ్యానించి, ఆ వాయు పుత్రుని ఆశీస్సులతో ఈ సమస్యను పరిష్కరించగలవు" అని మొక్కలన్నీ కోతి రాజా ని వేడుకున్నాయి.
కోతి రాజా తన కోతి రాణి తో కలసి హనుమంతుని పూజ చేసాయి. తమ వానర స్నేహితులందర్నీ పిలచి, భజనలు చేసాయి. దేవుడు కరుణించి " మహేష్ చాలా ఔషధ మొక్కలు పెంచాడు. వాటితో మందు తయారు చేసి నయం చేయవొచ్చు. ఆ మందు తయారు చేసే శక్తి ని నీకు ప్రసాదిస్తున్నాను." విజయోస్తు!!!
కోతి రాజా మొక్కలతో సమావేశంలో దీని గురించి చర్చించారు.
అప్పుడు మొక్కలన్నీ మంచి నిర్ణయం తీసుకున్నాయి:
పూల మొక్కలు తమ సువాసన చుట్టూ పక్కల ప్రసరించాలి.
ఇన్డోర్ ప్లాంట్స్ అన్నీ, గాలి ని శుద్ధి చేయాలి.
పూలు, పళ్ళు హనుమంతుని పూజ కు వినియోగించాలి.
ఔషధ మొక్కలు మందు తయారీకి సహాయం చేయాలి.
అందరం కలసి వాతావరణాన్ని చల్లగా, ఆహ్లాదంగా చేయాలి.
కోతి రాజా మందును తయారు చేసాడు. ఆ మందు మహేష్ సేవించేటట్టు కోతి రాణి మహేష్ కు మూడు రోజుల పాటు పట్టించింది. అంతా అనుకున్నట్టు జరిగింది.
నాలుగో రోజు తెల్లారింది. మహేష్ కు జ్వరం తగ్గింది. మొక్కలు మహేష్ కు ప్రాణం పోశాయి.
మహేష్ మునుపటి వలే చలాకీ గా స్కూల్ కు వెళ్లి, మొక్కలను బాగా చూసుకునేవాడు. మహేష్ పెద్దయ్యాక కూడా, మొక్కల పై ప్రేమ ఇంకా పెంచుకున్నాడు. మొక్కల వల్ల ఉపయోగాలు అందరికి చెప్పి మొక్కలు పెంచేటట్టు చేసేవాడు. కొన్ని లక్షల మొక్కలు ఊరంతా నాటే ఉద్యమం నడిపించాడు.
*****వృక్షో రక్షతి రక్షితః ******