సావిరహే...! - విద్యాధర్ మునిపల్లె

Saa virahe

కాలం ఎంతసేపు గడిచిందో తెలీదు.. చాలా సేపటి నుంచి వారు అలాగే వున్నారు.. అక్కడ అంతా గంభీరమైన వాతావరణమే నెలకొంది... నిశ్శబ్దం రాజ్యమేలుతోంది... ఫ్యాను కూడా ఆగిపోయింది... ఆ నిశ్శబ్దం ఎంతసేపటి నుండో... ఎప్పటిదాకో... కదుతున్న కాలానికే... తెలియాలి...

‌----------

రేడియోలో ‘‘సావిరహే తవ దీనారాధా’’ అంటూ జయదేవుని అష్టపది మంద్రంగా వినిపిస్తోంది.
రాధ సోఫాలో కూర్చొని నిద్రపోతోంది..
తన భర్త కృష్ణ కోసం ఎదురుచూసీ.. ఎదురుచూసీ.. అలసిపోయి నిద్రిస్తున్నట్లుంది.
పున్నమినాటి చందమామ తన వెండి వెన్నెతో ప్రపంచాన్నంతా పరవశింప చేస్తోంది.
ఇంటి ముంగిలిలోని కొబ్బరిచెట్ల ఆకుల నీడలు రాధ ముఖంపై దోబూచులాడుతున్నాయి.
దాంతో రాధ అందంలో కొత్తదనం సంతరించుకుంది.
తెల్లటి చీరె.. కురులలో అరవిరిసిన గుండుమల్లెలు... మత్తెక్కించేలా పండువెన్నెలా... వెరసి రాధ ఒక శృంగార దేవతలా కనిపిస్తోంది.
ప్రకృతి స్వరూపిణి అయిన స్త్రీకి ప్రకృతి మాత తన అందంతో మరింత మెరుగు దిద్దినట్లుగా అనిపిస్తోంది.
ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి వచ్చిన కృష్ణ తన భార్య రాధని ఆ స్థితిలో చూసి.. సహజంగానే భార్యపట్ల విపరీతమైన ప్రేమకలిగిన అతను ఆమె సౌందర్యానికి దాసుడయ్యాడు.
ఆమె సౌందర్యం.. ఆ సౌందర్యాన్ని వర్ణించేలా రేడియోలో వస్తున్న అష్టపది సాహిత్యం అతనిలోని అలసటని దూరం చేస్తూ వెరసి అతను సౌందర్యోపాసన చేసేందుకు సన్నద్ధమయ్యాడు.
ఆమె నిద్రకి భంగం కలిగించకూడదని భావిస్తూ ఆమె అందాన్ని తన కన్నుతో గ్రోలుతూ ఆమె ఒడిలో అతని తల పెట్టి తదేకంగా చూస్తుండిపోయాడు.
కిటికీలోంచి వీస్తున్న సన్నని గాలితెమ్మెరలకు ఆమె ముంగురులు నుదిటిపై నాట్యమాడటాన్ని గమనించాడు.
ఆమె తీసుకునే ఉఛ్వాసనిచ్వాసలకు అనుగుణంగా కదులుతున్న ఆమె యద, ఆ ఘనమైన యెదపై సుతిమెత్తగా లయబద్ధగా కదులుతున్న చీరె..
అందులోంచి అతనికి కనిపించీ కనిపించనట్లు దోబూచులాడుతూ స్త్రీత్వానికి ప్రతీకగా అనిపించే ఆమె యదసంపదలు..
చందమామను అప్పుడప్పుడూ కప్పేసే తెల్లని మేఘాలలా తెల్లని చీరెమాటునుండి కనిపించీ కనిపించనట్లు దోబూచులాడుతున్న ఆమె నాభి...
ఆమె కురులలోని విరులు వెదజల్లుతున్న గుభాళింపులు ఆమె మేనిపరిమళం వెరసి తన మనోదేవాలయంలో కొలువుదీరిన శృంగారదేవతకి విరహభక్తితో తన తలను ఆమె సున్నితమైన పాదాలపై వుంచుతూ..
తనను తానే అర్పించుకున్న అనుభూతికి లోనయ్యాడు.
అలాగే అతను నిద్రలోకి జారుకున్నాడు.
ఈ సన్నివేశం చూసిన చందమామకి ఏ తార గుర్తొచ్చిందో తెలీదు కానీ అతను కూడా సిగ్గుపడుతూ మేఘాల మాటుకి మెల్లెగా జారుకున్నాడు.
*****
తెల్లవారింది...
దగ్గరలోని కృష్ణదేవాలయంలో తిరుప్పావై పారాయణం జరుగుతోంది..
అది వింటూ రాధ హరేకృష్ణ.. హరేకృష్ణ అనుకుంటూ పూలు కట్టుకుంటోంది..
కృష్ణ ఆఫీసుకి రెడీ అయ్యి బయటికొచ్చాడు.
రాధ తనలో తనే మురిసిపోతోంది.
కృష్ణ కారణమేంటన్నట్లుగా సైగచేశాడు.
రాధ ఏమీ మాట్లాడకుండా తన పక్కనే వున్న రిపోర్టు అతని చేతిలో పెట్టింది.
కృష్ణ ఆ రిపోర్టు చూస్తూనే రాధని అమాంతం ఎత్తుకొని గిరగిరా తిప్పేశాడు.
రాధ ఆనందంతో కళ్ళల్లో నీరు పెట్టుకుంది.
కృష్ణ ఆమెని కిందకి దింపుతూ ఆమె కన్నీరు తుడిచాడు.
వారిద్దరి ఆనందానికి కారణం రాధ చాలా కాలం తర్వాత గర్భవతి కావటమే..
చాలా కాలంగా రాధ, కృష్ణలకి పిల్లలు పుట్టలేదు.
లోపం రాధలోనే వుందని తేలింది.
రాధకి పిల్లలు పుట్టని కారణంగా కృష్ణని వేరే పెళ్ళి చేసుకొమ్మని బంధువు, కృష్ణ తండ్రీ కూడా బలవంతం చేశారు. రాధకూడా ఈ విషయమై కృష్ణకి చాలా సార్లు చెప్పింది. కానీ కృష్ణ అందుకు ఒప్పుకోలేదు.
చావైనా, బ్రతుకైనా రాధతోనే అని తేల్చి చెప్పేశాడు.
అంతే దాంతో కృష్ణ తండ్రి జానకిరామయ్యకీ, కృష్ణకి పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఏనాడైతే పిల్లలు పుడతారో ఆనాడే తాను కృష్ణతో మాట్లాడతాననీ, అప్పటి వరకూ పలకరింపు, కలుసుకోటాలు లేవని జానకిరామయ్య తేల్చిచెప్పేశాడు. అలాగే రాధ బంధువు కూడా రాధ, కృష్ణలని చూడ్డానికి వీల్లేదని ఆంక్షలు పెట్టాడు. దాంతో వారి కుటుంబాల మధ్య దాదాపు పదేళ్ళకు పైగా దూరం పెరిగింది. కనీసం ఫోనులో మాట్లాడుకోటాలు కూడా లేవు.. ఎటువంటి పరస్పర ప్రత్యుత్తరాలూ లేవు.. అలా రాధకి కృష్ణ, కృష్ణ కి రాధ మాత్రమే మిగిలారు.. వాళ్ళే పిల్లలు.. వాళ్ళే పెద్దలు.. వాళ్ళకి వాళ్ళే అంతా...
అలాంటిది ఈరోజు రాధ గర్భవతి అని తెలియగానే రాధ,కృష్ణలు భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే కృష్ణ తన తండ్రికి, రాధ బాబాయికి ఫోనుద్వారా సమాచారం అందించాడు.
వాళ్ళు కూడా విని సంతోషించారు.
జానకి రామయ్య ఊరబంతికి కూడా ఏర్పాట్లు చేశాడు.
రాధని తీసుకొని తమ ఊరు పోలేపల్లికి రమ్మని ఆహ్వానించారు.
ఇంతలో డాక్టర్‌ రమేష్‌.. రాధకి దూరపు బంధువు.. వరసకు బాబాయి అవుతాడు.. హడావుడిగా కేస్‌ షీట్‌ తీసుకొని రాధ ఇంటికి వచ్చాడు.. రాధని టిఫెన్‌ ప్రిపేర్‌ చెయ్యమని చెప్పి కృష్ణతో అసలు విషయం చెప్పాడు రమేష్‌..
‘‘ అయాం సారీ కృష్ణ. రాధ పేరుతో నిన్న మా హాస్పిటల్‌ కి వేరే అమ్మాయి కూడా వచ్చింది. రిపోర్టు మారింది. రాధ రిపోర్టే అనుకొని తను కన్సీవ్‌ అయిందని కన్ఫర్మ్‌ చేశాను. నిజానికి రాధ కడుపులో పెరుగుతుంది బిడ్డకాదు.. కేన్సర్‌ గడ్డ. ’’
అంతే కృష్ణ కాళ్ళకింద నేల కదిలిపోయింది. భూకంపం వచ్చి అగాధంలోకి పడిపోతున్నట్లు అనిపించింది. కృష్ణ తేరుకోటానికి కొంత సమయం పట్టింది.
‘‘ అంకుల్‌ రాధని ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకుపోదాం.. తనకి ట్రీట్మెంట్‌ ఇప్పిద్దాం అంకుల్‌.. నాకు రాధ కావాలి.. రాధలేకపోతే నేను బ్రతకలేను అంకుల్‌ ’’ అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు..
‘‘కృష్ణ నీ సంగతి నాకు తెలుసు. రాధ నాకు చిన్నప్పటి నుంచీ తెలుసు.. తనని కాపాడుకోవాని నాకు మాత్రం వుండదా.. ఏమీ చెయ్యలేం కృష్ణ.. అడ్వాన్స్‌డ్‌ స్టేజీలో వుంది. ఫోర్త్‌ స్టేజీలో వున్న కేన్సర్‌ ని మనం ఏమీ చెయ్యలేం. పైగా తనకి సెర్వికల్‌ కేన్సర్‌ విత్‌ మల్టిపుల్‌ డిజార్డర్‌..’’
‘‘ ఎందుకు చెయ్యలేరు.?’’ అంటూ కృష్ణ రమేష్‌ కార్‌ పట్టుకున్నాడు. అంతలోనే వదిలేస్తూ..
‘‘ అంకుల్‌.. మీరు బాగా చదువుకున్నారు.. ఆపరేషన్‌ చేయండంకుల్‌... రాధ లైఫ్‌ స్పాన్‌ పెంచండి.. ఎలాగోలా రాధని రక్షించండి..’’
‘‘కృష్ణ.. ఐ కెన్‌ అండర్‌స్టాండ్‌.. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. మేం దేవుళ్ళంకాదు.. కేవలం డాక్టర్లం.. మనిషికి రోగాల నుంచి ఉపశమనం మాత్రమే ఇవ్వగం.. ఈ ప్రపంచంలో ఏరోగాన్నీ పూర్తిగా నిర్మూలించలేం.. ఆ రోగం నుండి మనిషి తట్టుకొని నిబడటానికి కావాల్సిన మందు మాత్రమే ఇవ్వగలం . నీ భార్య గర్భాశయానికి వచ్చిన కేన్సర్‌ ప్రేగు, జీర్ణాశయం వరకూ పాకింది. దేన్నని ఆపరేషన్‌ చేస్తాను.. దేన్ని తొగించగలను.. నేనే కాదు ప్రపంచంలో ఏ డాక్టరూ దీనికి ఏం చెయ్యలేడు.’’ నిర్వేదంగా ముగించాడు రమేష్‌.
‘‘ మరి రాధని రక్షించుకోలేమా...?’’ అన్నాడు ఆర్తిగా...
రమేష్‌ నుంచి సమాధానం లేదు.
‘‘ అంకుల్‌ తను ఎన్నాళ్ళు బ్రతుకుతుంది. ’’ అన్నాడు నిర్వేదంగా..
‘‘ ఆ దేవుడికే తెలియాలి.. ’’ అంటూ ముగించాడు.
‘‘ ఈ విషయం దయచేసి రాధకి తెలీనీకండి..’’ అంటూ చేతులెత్తి దణ్ణం పెట్టాడు కృష్ణ.
రాధ టిఫెన్‌ తీసుకొని బయటికొచ్చింది.. ఉన్నట్లుండి రాధ విపరీతమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడింది. ఆ కాసేపూ ఆమె నరకాన్ని ప్రత్యక్షంగా చూసింది. రమేష్‌, కృష్ణ ఇద్దరూ కంగారు పడ్డారు. రమేష్‌ వెంటనే పేపరు, పెన్ను తీసుకొని మందులు తీసుకురమ్మని కృష్ణని బయటికి పంపాడు.
కాసేపటికి రాధ మామూలు స్థితికి వచ్చింది.
తను అనుభవించిన బాధని రమేష్‌ కి వివరించింది. రమేష్‌ ఆమెకి రకరకా టెస్టు చేశాడు. హాస్పిటల్‌ కి రమ్మన్నాడు. రాధ తన కేస్‌ షీట్స్‌ రెండు వుండటం చూసి ఆశ్చర్యపోయింది. రమేష్‌ ని నిదీసింది. రమేష్‌ కూడా దుఃఖాన్ని ఆపుకోలేక ఉన్నది చెప్పాడు. రాధ నిర్వేదంగా నవ్వుతూ... ఈ విషయం తన భర్తకి చెప్పద్దు అని చెప్పింది. కానీ అప్పటికే కృష్ణ మందు తీసుకొని వచ్చాడు. రాధ, కృష్ణ ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకున్నారు...
*****
ఆరోజునుంచీ రాధాకృష్ణల జీవితంలో ఆనందంలేదు..
అప్పటి వరకూ బృందావనంలా అలరారిన ఆ ఇల్లు చూడ్డానికి జీవచ్ఛవాలతో నిండిన స్మశానంలా తోస్తోంది.
కృష్ణ చంటిపిల్లాడై ఏడుస్తున్నాడు.
కానీ రాధ ముందు తనను తాను ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా కూడా అతని వల్ల కావటంలేదు.
ఉద్యోగం మానేశాడు.
రాధ దగ్గరే వుంటూ ఆమెకి సేవలు చేస్తున్నాడు.
రోజు రోజుకీ రాధ ఆరోగ్యం క్షీణిస్తోంది. రాధకి ఆహారం లోపలికి పోవటంలేదు.
తిన్న ఆహారం బయటికి వచ్చేస్తోంది.
కృష్ణ ఆమెకి సపర్యలు చేస్తున్నాడు.
ఎంతో అందంగా వుండే రాధ శరీరం పూర్తిగా కృశించి పోయింది. ఎముకల గూడైపోయింది. మొహం పీక్కుపోయింది. ఒక అస్థిపంజరంమీద తోలు కప్పినట్లుగా తయారైంది. రాధ కళ్ళల్లో జీవం ఎక్కడో వున్నట్లుగా వుంది. ఆమె పరిస్థితి చూస్తున్న కృష్ణ తనలో తనే నలిగిపోతున్నాడు.
కాలం సాగిపోతోంది.
ఆరోజు..
ఆరోజు.... రాధ ఒక నిర్ణయం తీసుకుంది. తన భర్త కృష్ణకి మళ్ళీ పెళ్ళి చేయాని.
తను లేని తన భర్త బ్రతకలేడని ఎలాగైనా అతనికొక తోడునివ్వాని అనుకుంది.
తన బాబాయ్‌ రమేష్‌ కూతురు సత్యనిచ్చి కృష్ణకి పెళ్ళి చెయ్యాని నిర్ణయించుకుంది.
తన నిర్ణయాన్ని రమేష్‌ కి చెప్పింది.
రమేష్‌ ఆనందంగా ఒప్పుకున్నాడు.
పెళ్ళికి ఏర్పాట్లు చేసుకోమని తన భర్తకి ఎలాగోలా నచ్చచెప్తానని రాధ తన బాబాయ్‌ రమేష్‌ కి మాటిచ్చింది.
ఈ పెళ్ళికి కృష్ణ ఒప్పుకోలేదు.
బవంతంగా రాధ కృష్ణని ఈ పెళ్ళికి ఒప్పిస్తూ తన చేతిలో చెయ్యివేసుకుంది.
అంతే ఆమె ఊపిరి ఆగిపోయింది.
సోఫాలో అలాగే అచేతనమైపోయింది.
తన రాధ తనను వదిలి వెళ్ళిపోయిందని అతనికి అర్థమైంది.
అతని కళ్ళలోంచి చుక్క కన్నీరు కూడా రాలేదు.
ఆమె శరీరాన్ని పూర్తిగా తడిమాడు.
అదే సోఫాలో కూర్చొని, లేదా పడుకొని తన రాకకోసం ఎదురు చూస్తుండే తన భార్యని తనలో తను ఊహించుకున్నాడు. మెల్లిగా వచ్చి ఆమె ఒడిలో తన తలపెట్టి ఆమె అందాలను చూస్తున్నాడు.
కాలం ఎంతసేపు గడిచిందో తెలీదు.. చాలా సేపటి నుంచి వారు అలాగే వున్నారు. అక్కడ అంతా గంభీరమైన వాతావరణమే నెలకొంది. నిశ్శబ్దం రాజ్యమేుతోంది. ఫ్యాను కూడా ఆగిపోయింది. ఆ నిశ్శబ్దం ఎంతసేపటి నుండో, ఎప్పటిదాకో కదుతున్న కాలానికే తెలియాలి...
చాలా సేపటికి రమేష్‌ వచ్చాడు. పెళ్ళికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకొచ్చానని రాధకి చెప్పాడు. కృష్ణ చెయ్యి ఆమె చేతిలో వుండటం చూసి కృష్ణ కూడా పెళ్ళికి ఒప్పుకున్నాడని సంతోషించాడు. కృష్ణని లేపబోతుండగా అతను వెనక్కి వాలిపోయాడు. సోఫాలో కూర్చున్నరాధ కృష్ణతోపాటే అతని గుండెమీద వాలింది.
రమేష్‌ కి అర్థమైంది.. రాధా కృష్ణుల రసమయ ప్రేమని ఎవ్వరూ విడదీయలేరని.. ‘‘ సా విరహే..’’ అంటే స్వచ్ఛమైన ప్రేమ అని అర్థం.. అటువంటి ప్రేమే వీరిద్దరిదీ అని అనుకుంటూ తన కన్నీళ్ళు తుడుచుకున్నాడు.
గంటలో ప్రేమించి, మరో గంటలో విడిపోతున్న యువతరమున్న ఈ రోజుల్లో ఇటువంటి ప్రేమలే ఆదర్శం కావాని అతనికి అనిపించింది. ఈ రాధాకృష్ణుల ప్రేమకథ, జీవితం ప్రతి ఒక్క యువజంటకూ ఆదర్శం కావాని అప్పటికప్పుడు భావించి వీరి ప్రేమకి చిరస్థానాన్ని కలిగించాని భావించాడు రమేష్‌..
భార్యపోతే భర్త, భర్తపోతే భార్య.. ప్రియుడు చనిపోతే ప్రేయసి.. ప్రేయసి చనిపోతే ప్రియుడూ.. బాధ తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడటం అనేది ప్రేమ అనిపించుకోదు.. ప్రకృతి-పురుషుడు ఏకమైతేనే సృష్టి ఎలా అవుతుందో అలాగే ప్రేమ-మరణం అనేది కూడా ప్రకృతి సిద్ధంగానే జరగాలి.. ప్రేమకి వయసుతో సంబంధంలేదు.. స్వచ్ఛమైన ప్రేమని కలిగిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ... వారికీ కథని అంకితం ఇస్తున్నాను.

శుభం

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు