ఆ నాటి సినిమా స్ముతులు
రచన - తాతా కామేశ్వరి
అరుంధతి ఎన్ని పనులు వున్నా వుదయం పూజ ముగించి గంట పాటు భగవద్గీత చదువుకుంటారు. ఆ రోజు కుడా ఆమె హాల్లో కూర్చుని గీత చదువుకుంటున్నారు. అప్పుడే ఆమె మనవడు ఆదిత్య, మనవరాలు రమ్య ఇంగ్లీషులో మాట్లాడుకుంటూ “మామ్, టిఫిన్ పెట్టు” అంటూ కేక వేసి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఆ రోజు వాళ్ళు వెళ్ళే సినిమా గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. విశాల వచ్చి వారి మాటలు అపురూపంగా వింటూ కోసరి కొసరి ఇడ్లీ, సాంబార్, చెట్నీ, పొడి వడ్డించిది. అరుంధతి ఆ తల్లీ పిల్లల మాటలు వింటూ మురిసిపోయింది.
పిల్లలు రోజూ టిఫిన్ తొందరగా, ఇంచుమించు కుక్కుకుని పరిగెడతారు. ఒక ఆదివారం మాత్రం వాళ్లకు తాపీగా మాటలాడుకుంటూ తినడానికి సమయం కుదురుతుంది. అందుకే విశాల కాస్త ఎక్కువగా తింటారని వాళ్ళని మాటలలో పెట్టి వడ్డిస్తుంది. టిఫిన్ తినడం అయ్యాక విశాల మామిడి పండ్లు కోసి రెండు గాజు ప్లేట్లలో వేసి ఫోర్కులు పెట్టి ఇద్దరికీ ఇచ్చింది. “మామ్, ఇంక తినలేము, సాయంత్రం సినిమా చూసి వచ్చి తింటాం” అంటూ ప్లేట్స్ పక్కన పెట్టారు ఇద్దరు. “ఓకే ఓకే, అర్రా! సాయంత్రం తినాలి మరి” అంటూ పండు ముక్కలు ఫ్రిజ్ లో పెట్టి వంట గాది లోకి వెళ్ళింది ఆమె.
పిల్లలు ఇద్దరు విశాల వెంటే వంటిటి లోకి వెళ్ళి పన్నెండు వందల లగ్జరీ సీటీంగ్ సినిమా టిక్కెట్స్ కొనుక్కొని సినిమా చూస్తాము అంటూ ఆమెను బతిమెలాడుతున్నారు. అరుంధతి కి వాళ్ళు ఇంగ్లీష్ లోమాట్లాడుతున్న మాటలు చెవిలో పడ్డాయి. ఆమె ఇంగ్లిషు లో మాటలాడలేదు కానీ అంతా అర్థం అవుతుంది. పన్నెండు వందలు అంటే ఇద్దరికి ఇరవైనాలుగు వందలు, నా చిన్నతనము లో ఒ అణా తో పకోడీ పొట్లం కొనుకొన్ని సినిమా చూసేవాళ్లము అనుకుంది అరుంధతి ఆశచర్యంగా. సినిమా వాలుకుర్చీ లో రిలాక్స్ అయే చూడవచ్చు అని, అదే కాక హాలు వాళ్లు తినుభండారాలు కుడా వేడి వేడి గా చేసి వడ్డిస్తారు అనట్టు చెప్పి వాళ్ళు అమ్మని కాకా పడుతుంటే, అరుంధతి కి తను కూడా మారాం చేసి చూసిన తన మొదటి సినిమా గుర్తు వచ్చింది. తను అమ్మ ద్వారా నాన్న ని సినిమా చూపించమని అడిగించడం, ఆయన చాలా కష్టం మీద ఒప్పుకోవడం కళ్ళ ముందు సినిమా రీలులా తిరిగింది.
1957లో సువర్ణ సుందరి సినిమా రిలీజ్ అయింది, అప్పటకి అరుంధతికి పదేళ్లు వుంటాయి. ఆమె పెద్ద అక్క నిర్మల, మరియు వాళ్ళ పెద్ద నాన్న కొడుకు మురళి ఆ సినిమా చూసి వచ్చి మరురోజు సినిమా సంగతులు చర్చించుకుంటూ వుంటే ఎవరికీ కనిపించకుండా తలుపు చాటున నిలబడి ఆ సంగతులు విన్నది ఆ చిన్న పిల్ల. తనకి అంతా అర్థం కాక పోయిన వాళ్ళు చెప్పుకునే పాటలు, కొన్ని సంగతులు ఆమెను ఆకట్టుకున్నాయి. ఆమెకు విశేషంగా సినిమా లో ఎంత ఆహారమైనా సరఫరా చేసే జగ్, ఎక్కడికైనా ప్రయాణించే చాప అలాగె శక్తితో సంబంధం లేకుండా వ్యక్తిని శిక్షించే మంత్రదండం చాలా ఆకట్టుకున్నయి. ఇక రోజంతా అక్కకి, మురళికి ఆ సినిమా లో పాటల చర్చే. రోజంతా వాళ్ల నోట “పిలువకురా.. అలుగకురా..” అనే పాటె. మురళి అన్న అయితే ఇంచుమించు రోజు ఒ బేడ డబ్బులు తీసుకుని ఆ సినిమా చూసి వచ్చేవాడు. ఆమె ఇలా ఆలోచిస్తూ వుండగా, ఆదిత్య మరియు రమ్య వాళ్ళ అమ్మని ఒప్పించి “బై మామ్, బై బామ్మా” అంటూ సినిమాకి బయలుదేరారు.
పిల్లలు అలా వెళ్ళగానే మరలా అరుంధతి పాత జ్ఞాపకాలలొ ములిగిపోయింది. అక్క, మురళి అన్న సువర్ణ సుందరి సినిమా గురించి అలా ముచ్చటించుకుంటూ వుంటే తనకి ఆ సినిమా చూడాలని కోరిక కలిగింది. తను ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చూసి ఎరగదు. కానీ వాళ్ళు రోజూ పాడుకునే ఆ మధురమైన పాట ‘పిలువకురా…’ వినాలని, గమ్మతైన జగ్, చాప మరియు కర్ర చూడాలని వుంది. కానీ తనకి నాన్న ని ఆడగలంటే భయం. ఒక నాడు వంటింట్లో అరుంధతి తల్లి సుగుణ పనిచేసుకుంటూ వుంటే, వంటింటి గుమ్మంలో కూర్చొని అమ్మని ఎలా అడగాలా అని ఆలోచిస్తూ ఆఖరికి ధైర్యం కూడ తీసుకొని, “అమ్మా!” అని పిలిచింది.
“ఏమిటి పాపా, పిలిచావా. ఏం కావాలమ్మా” అంటూ ముద్దుగా అడిగింది సుగుణ.
అరుంధతి “అదీ… అదీ…అమ్మా నన్ను.. నన్ను.. సువర్ణ సుందరి సినిమాకు తీసుకుని వెళ్ళవా... మురళి అన్న, అక్క చెప్పుకుంటూ వుంటే విన్నాను, చాలా బాగుందట. బడి లో తోటీ పిల్లలు అంతా కూడా చూసేసి, పాపా నువ్వు సువర్ణ సుందరి సినిమా చూడలేదా? అని అడిగారు. నాకు ఆ పాటలు వినాలని సినిమా చూడాలని ఉంది, నన్ను తీసుకొని వెళ్ళావా. అక్క వెళ్ళిందిగా మరి నన్ను ఎందుకు తీసుకొని వెళ్ళవు” అంటూ గొణుగుడు రాగం తీసింది.
సుగుణ “పాపా, నేను ఏనాడు సినిమా చూడడానికి వెళ్లను. రోజంతా ఇంటి పనులు, మీ నాన్నగారి సేవ, మీ పిల్లల సేవతో గడిచిపోతుంది.”
అరుంధతి “అమ్మా, మరి నన్ను సినిమా కి ఎవరు తీసుకొని వెళ్తారు? పోనీ నాన్నతో చెప్పవా”. అన్నది అమాయకంగా.
“మీ నాన్నను ఆడగనమ్మా, నన్ను పిల్లని పడుచేస్తున్నానని దెబ్బలాడతారు” అన్నది ఆమె.
తల్లి మాటలకి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ముభావంగా ఉలుకు పలుకు లేకుండా కూర్చుంది అరుంధతి. సుగుణ కి పాప అలుక తెలుసు, భోజనం కూడా మానేస్తుంది. ఆమె భర్త జగన్నాథ రావు గారు ఆఫీస్ నుండి వచ్చేక మంచి సమయం చూసి, పాప సినిమా విషయం చెప్పగానే ఆయన కోపంగా, “నీకేం పిచ్చి పట్టిందా, దానికి పదేళ్లు కూడా లేవు, సినిమా అంట సినిమా. ఇప్పటినుంచి వెర్రి పోకడలు పోకుండ బాగా చడువుకోమను. మరో రెండేళ్లు పోయాక సినిమా, ఇప్పుడేం కాదు” అన్నారు. చాటు నుంచి వింటున్న అరుంధతి తెల్ల మొహం వేసింది. ఆయన ఉగ్రరూపం చూసి తల్లి పాపకి కాదని సంజ్ఞ చేసింది.
ఇంట్లో అందరి కన్నా చిన్నది అవడం వల్ల అరుంధతి అంటే జగన్నాథ రావు గారికి చాలా ముద్దు. మర్నాడు అరుంధతి చూడువు కుంటూ వుంటే, జగన్నాథ రావు గారు వచ్చి “పాపా, న దగ్గరకి రా!” అని ప్రేమగా పిలిచారు. ఆమె భయంగా ఆయన వద్ద చేతులు కట్టుకొని నిలబడ్డాది.
“పాపా, సినిమా చూపించమని అమ్మతో అన్నావా, ఏం సినిమా అమ్మ” అన్నారు ఆయన.
“అక్క, మురళి అన్న చూశారు కదా ఆ సినిమా, సువర్ణ సుందరి, చాలా బాగుందట, మంచి పాటలు కూడా వున్నాయి. మురళి అన్న ఇప్పటికి ఇరవై సార్లు చూశాడు నీకు తెలుసా?” అంటూ తండ్రికి చెప్పింది. “ఇంకా నాన్నా! మా స్కూల్ లో కూడా అంతా ఆ సినిమా చర్చే, యెవరి నోట విన్నా ఆ పిలువకురా.. అన్న పాటే ” అంటూ ముద్దుగా కళ్ళు తిప్పుతూ చెప్పింది.
ఆ పసిపాప ముద్దు ముద్దు మాటలు విని జగన్నాథ రావు గారు, “పాపా నువ్వు చిన్న దానివి, రోజూ సాయంత్రం అయ్యేసరికి పడుకుంటావు. సినిమా హాల్ లో కూడా అలాగె పడుకుంటావు, నీకు అర్థం కాదు అమ్మా” అన్నారు.
“లేదు నాన్నా, అందులోని హీరో నాగేశ్వరరావు గారు రాయిగా మారి మళ్ళీ మనిషిగా అవుతారుట. మాయ చాప, కర్ర, జగ్ గురించి అక్క ఎంత బాగా చెప్తుందో తెలుసా. ఆ సినిమా గురించి చెప్పుకుంటూవుంటే నాకు అర్థం అయింది, నాకు చూడాలని ఉంది నాన్నా” అని బతిమాలింది ఆమె.
దానికి ఆయన “సరే, నువ్వు రేపు సాయంత్రం అమ్మను అడిగి మంచి బట్టలు వేసుకో తయారు గా వుండు. నేను ఆరు గంటలకు వచ్చి నిన్ను సినిమాకు తిసుకొని వెళతాను,” అన్నారు జగన్నాథ రావు గారు
నాన్న మాటలకు ఆ నాడు ఆ చిన్న పాప ఎంత మురిసిపోయిందో తలుచుకుని కళ్ళలో నీరు చిమ్మేయి ఈనాటి డెభై ఏళ్ల అరుంధతి కి.
అరుంధతి కి మంచు తెర తొలిగినట్టు ఆ నాడు నాన్న సినిమా కి తీసుకుని వెళ్ళిన రోజు గుర్తు వచ్చింది. చెప్పాలంటే తనకు ఆ రోజు ఒక మరవలేని మధురానుభవం. ఆ రోజు తను బడి నుంచి వచ్చి, అమ్మ పెట్టిన భోజనం త్వరగా అయింది అనిపించింది. అమ్మ ఎర్రటి రిబ్బన్లతో రెండు జడలు వేసి మడత పెట్టి కట్టి కుచ్చులు పెట్టింది. నాన్న పుట్టినరోజుకి కొన్న నీలం గౌను వేసి, అంగారుతో చిన్న బొట్టు పెట్టి, కాటుక పెట్టి మద్దుగా తయారు చేసింది. ఆరు కల్లా అరుంధతి తాను జాగ్రత్తగా దాచుకున్న బెల్టు జోళ్ళు తీసి తొడుక్కొని తయారు అయింది, కానీ ఆరుంపావు అయినా నాన్న జాడేలేదు. ఆమె ముస్తాబు పోతుందని ఏడవలేదు కానీ ఏడుపే వచ్చింది ఆమెకు. అలా ఇంటి లోపల నుండి బయటకు, బయట నుంచి లోపలికి తిరుగుతునేవుంది ఆమె. సినిమా మొదలు పెట్టేస్తే తనకి ఇష్టమైన పాట అయిపోతుందని గాభరా మొదలైంది. ఆమె దిగులుగా “అమ్మా, నాన్న రాలేదు” అంటూ వుండగానే జగన్నాథ రావు గారు రిక్షాలో వచ్చి, కాఫీ అయినా తాగకుండా తనను చెయ్యి పట్టుకుని రిక్షా ఎక్కించడం జరిగింది. ఆయన పదిహేను అణాల బాల్కనీ టికెట్ కొని, సోఫాలో కూర్చోబెట్టారు తనని. అరుంధతి కి అంతా కొత్తగా ఒ మాయాలోకం లా ఉంది. ఆమెకు సినిమా మొదలవగానే ఆ చీకటిలో తెల్లటి సినిమా తెర మీద ఆడుతున్న బొమ్మలు ఒ కొత్త లోకం చూపించాయి. ఆమె రెప్ప వాల్చకుండా సినిమా చూస్తూవుంటే నాన్న అది చూసి మురిసిపోయారు. ఇంటర్వల్ లో నాన్న బయటకు వెళ్లి ఆకు పొట్లంలో వేడి వేడి మసాలా గారెలతోపాటు బుడ్డి సోడా తెచ్చి తనకి ఇచ్చారు. సినిమా పూర్తి అయి ఇంటికి చేరే సరికి రాత్రి పది అయ్యింది. అరుంధతికి ఆ రాత్రి అంత సినిమా కలలే.
ఆ రోజు ఆ చిన్న అరుంధతి పొందిన ఆనందం ఎప్పటికీ మారువలేనిది. ఆరోజు నాన్నను బతిమిలాడి చూసిన సినిమా ఆమెకు ఒ మరువలేని అనుభూతి. సువర్ణ సుందరి సినిమా తరువాత తను జీవితం లో చాలా సినీమాలే చూసింది, కానీ ఆ మొదటి సినిమా చూసిన అనుభూతి దేనికి కలగలేదు. ఇప్పటికీ ఆమె సుశీలమ్మ పాడిన పిలువకు రా.. అన్న పాట కి మైమరచిపోతుంది. తన ఆ నాటి మోదటి సినిమా స్మృతులు తన మనవలకి ఎప్పుడైనా చెప్పాలని మనసులో అనుకుంది అరుంధతి.
***