అందమైన పువ్వుల లోకం - Sri Vijaya Durga.L

Andamaina puvvula lokam

అందమైన పువ్వుల లోకం అదొక నందనవనం. ఆ నందనవనంలో పువ్వులన్నీ ఎంతో సంతోషంగా ఉన్నాయి. అన్నీ సంతోషంగా ఆడుతూ పాడుతూ.. ఏ దిగులు లేకుండా ఉంటే, ఒక పువ్వు మాత్రం.. అక్కడ ఉన్న చిన్న కొలను గట్టున దిగాలుగా కూర్చుని ఉంది. అంతా కలిసి ఆడుకుంటుంటే! దిగులుగా కూర్చుని ఉన్న ఆ పువ్వుని చూసి, ఆ పువ్వు స్నేహితురాలు తన దగ్గరికి చేరి.. "ఏమిటే! అలా ఉన్నావు? మాతో ఆడట్లేదు. ఏమిటి?" అని అడిగింది. ఆ దిగులుగా ఉన్న పువ్వు! "నాకు అక్కడికి వెళ్లాలనిపిస్తుంది! నాకు వాళ్ళు కావాలనిపిస్తుంది!" అని అంది. సముదాయించడానికి వచ్చిన పువ్వు! "నీకేమైనా పిచ్చి పట్టిందా! అక్కడికి వెళ్తానంటున్నావు? వాళ్లు కాదనుకుని, వద్దనుకుంటేనే! కదా! మనకి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చి.. ఆ దేవుడి దయ వల్ల, ఇలాంటి ప్రశాంతమైన చోట మనం ఉన్నాము. మరలా అక్కడికి వెళ్లాలనే ఆలోచన.. నీ మనసులోకి ఎందుకు వచ్చింది? అది మనలాంటి వాళ్ళు ఉండే ప్రదేశం కాదు. అక్కడ మనకి చోటు లేదు. మనం వెళ్లాలని.. ఎంత కోరుకున్నా! బలవంతంగా మన ప్రాణాలు తీసే వరకూ.. వాళ్లు వదలరు. మనకి స్వేచ్ఛగా ఊపిరి తీసుకునే అవకాశం వాళ్లు మనకి ఇవ్వడం లేదు. ఏదైనా అద్భుతం జరిగితేనే కానీ.. మనం అక్కడ ఊపిరి పోసుకోలేము." అని అంది. అయినా! ఆ దిగులుగా ఉన్న పువ్వు, తన స్నేహితురాలు మాట వినకుండా! "లేదు. నాకు ఇక్కడ నచ్చలేదు. నేను అక్కడికే వెళ్తాను. ఏదైతే అది అవుతుంది." అని మొండిగా చెప్పింది. ఇక, ఆ స్నేహితురాలు పువ్వు! "నీ ఇష్టం. నువ్వు అంత మనస్ఫూర్తిగా కోరుకుంటే! ఆ దేవుడు నీ కోరిక నెరవేరుస్తాడు. ఇప్పుడు నువ్వు.. ఒక సాహసవంతమైన ప్రయాణం కోరుకుంటున్నావు. ఈ ప్రయాణంలో నీవు విజయం సాధించి.. అక్కడ ఊపిరి పోసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సాహస ప్రయాణంలో.. నీకు ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అని ఆ పువ్వుని గుండెలకు హత్తుకుని.. "క్షేమంగా వెళ్ళు! సుఖంగా అక్కడ జీవించు." అని చెప్పి పంపించింది. ఆ దిగులుగా ఉన్న పువ్వు అంత గట్టిగా, తన మనసులో ఉన్న కోరికను కోరుకోవడంతో.. భగవంతుడు ఆ పువ్వు కోరికను నెరవేర్చి, తాను అనుకున్న ప్రదేశానికి పంపించాడు. "పువ్వు తన సాహస ప్రయాణాన్ని మొదలుపెట్టింది". మొదటిగా తను, ఒక చీకటి ప్రదేశానికి చేరుకుంది. ఆ చీకటిని చూసి కొద్దిగా భయపడింది. "నేనున్నాను!" అంటూ.. ధైర్యం ఇచ్చిన ఒక స్పర్శ వలన, తన భయం తగ్గింది. అలా ఒక వారం రోజులు గడిపింది. అలా ఒక వారంలో.. తన చుట్టూ నీరు, ఒక గట్టిగా ఉన్న సంచి ఏర్పడింది. తన చుట్టూ ఉన్న నీరు ద్వారానే, తనకి ఆహారం అందేది. అలా నాలుగు వారాలు గడిపింది. నాలుగో వారం వచ్చే సరికి తనికి చిన్న రూపు ఏర్పడింది. కళ్ళకు పెద్ద నల్లని వలయాలతో, ఒక ఆదిమ ముఖం ఏర్పడి, నోరు దిగువ దవడ, గొంతు ఏర్పడ్డాయి. రక్తనాళాలు రూపుదిద్దుకున్నాయి. రక్తప్రసరణ మొదలైంది. నాలుగో వారం చివరికి చేరుకునేటప్పటికీ, తన గుండె శబ్దం నిమిషానికి 65 సార్లు కొట్టుకున్నట్టుగా వినపడింది. తను కోరుకుంటుంది జరుగుతుంది. అని తనకి తాను మురిసిపోయింది. ఆ పువ్వు! తను అప్పటికి ఇంకా అంగుళంలో నాలుగవ వంతు. అంటే బియ్యం గింజ కంటే చిన్నగానే ఉంది. అలా ఐదవ వారంలోనికి అడుగు పెట్టింది. ఆరు, ఏడు వారాలలో.. తన తల వైపు చర్మం చిన్నగా ముడతలు పడి, చెవులు ఏర్పడ్డాయి. తన శరీరానికి చిన్న చిన్న మొగ్గల్లాగా చేతులు కాళ్లు పైకి తేలాయి. క్రమ క్రమంగా కాలికి వేళ్ళు ఏర్పడి, కళ్ళు కూడా ఏర్పడ్డాయి. అవయవాలను అనుసంధానం చేస్తూ.. నాడీ కణజాలం మెదడు నుంచి వెన్నుపాము మరియు కేంద్ర నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ఇంద్రియ అవయవాలు రూపుదిద్దుకున్నాయి. ఎముక మృదులాస్థిని భర్తీ చేయడం ప్రారంభించింది. ఎనిమిదవ వారానికి, తన హృదయ స్పందనలు సాధారణ స్థితికి చేర్చి, ఒక అంగుళం పొడవు పెరిగింది. ఇక అప్పటి నుంచే, తన ఉనికి బయటపడుతుంది. ఇక వారి నిర్ణయం మీదే, తన యొక్క ప్రయాణం ఆధారపడి ఉంటుంది. తను క్షేమంగా బయటపడాలా? లేదా! ఆ చీకటి గోడల మధ్యలోనే, రక్తపు ముద్దలాగా మారిపోవాలా? అనేది తెలుస్తుంది. తన చెవులకు లీలగా.. ఏవో మాటలు వినిపించాయి. "ఎందుకంత తొందర! ఏమంత వయసు అయిపోయింది. అని! ఇప్పుడు మనమున్న పరిస్థితులలో.. మనకి అవసరమా? మనల్ని 'ఉద్ధరించే' వాళ్ళు వస్తే పర్వాలేదు. అలా కాకుండా మన నెత్తి మీద 'గుదిబండలా' తయారయ్యేవాళ్లు వస్తే.. మన పరిస్థితి ఏమిటి? అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. 'అది' మనకు వద్దు." అని ఒక కరుకు గొంతు వినబడింది. ఆ కరుకు గొంతు విని, భయంతో హడలిపోయి.. ఆ చీకటి ప్రదేశంలోనే మూలకి ఒదిగిపోయింది. ఆ పువ్వు. మరొక సున్నితమైన గొంతు.. "అలా అంటే ఎలా? ఇందులో దాని తప్పేముంది. మనం ముందు జాగ్రత్త తీసుకుంటే! అలా అవ్వకపోదును. కదా! ఇప్పుడు మన చేతులతో.. ఆ పాపాన్ని ఎలా చేయగలుగుతాం. జరిగేదే! జరుగుతుంది. అంతే! అందరికీ కోరుకున్నప్పుడే అదృష్టం దక్కదు. ఒకసారి చేజార్చుకున్నాము అంటే, మరల మనం దాని కోసం ఎంత వెంపర్లాడినా! మనకు దొరకదు. కాబట్టి! నా మాట వినండి." అని కరుకు గొంతుని బ్రతిమాలుకుంది. సున్నితమైన గొంతులోని బాధను గ్రహించి.. "సరేలే నువ్వు అంత బాధపడకు. సమయానికి కావాల్సినవన్నీ అందించు." అని చెప్పింది. కరుకు గొంతు. కరుకు గొంతు.. సున్నితమైన గొంతు చెప్పిన దానికి ఒప్పుకోవడంతో.. ఆనందంగా నవ్వింది. ఆ నవ్వు ఆ పువ్వును చేరి, తనలోని భయాన్ని పోగొట్టింది. ఆ ఆనందంలోనే.. మరొక రెండు మూడు వారాలు గడిపేసి, పదమూడవ వారంలోకి అడుగు పెట్టింది. పదమూడవ వారంలోకి వచ్చినప్పటి నుంచి.. పువ్వుకి కాస్త ధైర్యం వచ్చింది. తన ముఖంలో కనురెప్పలు, కనుబొమ్మలు, తల పై వెంట్రుకలు, చేతి వేళ్ళకు గోర్లు కనిపిస్తున్నాయి. తనకి ఆకలి అనిపించినప్పుడల్లా.. తన బొటనవేలిని నోట్లో పెట్టుకుని పీల్చుకోవడం, ఆవలించడం, తన ఒళ్ళు విరుచుకోవడం చేస్తుంది. అలా పదహారవ వారంలోకి అడుగు పెట్టింది. అప్పుడే తను ఏమిటి? అనేది నిర్ధారణ అయ్యే అవయవాలు రూపుదిద్దుకున్నాయి. తనకి అర్థఅయ్యింది. "తను ఎవరు?" అని. తనలో తనే మురిసిపోయింది. మరలా ఎందుకో భయపడింది. కూడా! అప్పుడు విన్న.. కరుకు గొంతు కోపంగా.. మరలా మళ్ళీ పలికింది. "నేను చెబుతూనే ఉన్నాను. వద్దు అని, నా మాట విన్నావా? ఇప్పుడు చూడు మన నెత్తి మీద 'గుదిబండే' మన కోసం సిద్ధం అవుతుంది. ఇప్పటికైనా నా మాట విను. మనకి వద్దు 'అది'. మనల్ని 'ఉద్ధరించే' వాళ్లు వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుందాం. ఈ సరికి నా మాట విను." అని ఆవేశపడింది. సున్నితమైన గొంతు ఏడుస్తుంది కాబోలు.. మాట పూర్తిగా రావట్లేదు. "అలా అంటే ఎలా? ఎవరైనా మనవాళ్లు కాకుండా పోతారా? ఈ రోజుల్లో కూడా 'ఉద్ధరించే వాళ్ళు' 'గుదిబండ' ఏంటి? మనం ముసలి వాళ్లము. అయ్యాక.. ఆ 'ఉద్ధరించే వాళ్ళు' చూస్తారు. అని నమ్మకం ఏమిటి? ఈ రోజుల్లో ఎవరైనా ఒకటే! వాళ్లను జాగ్రత్తగా పెంచి, మంచి బుద్ధులు చెప్పడం వరకే! మన బాద్యత. అంతకుమించి వారి నుంచి మనం ఆశించడం తప్పు. నా మాట వినండి." అని బ్రతిమాలుకుంది. కరుకు గొంతులో అసహనం ధ్వనించింది. "ఏదో ఒకటి చేసుకో! ఇక నీవు నాతో మాట్లాడకు." అని కోపంగా బయటకు వెళ్ళిపోయింది. కరుకు గొంతు అంత కోపంగా వెళ్లిపోవడంతో.. సున్నితమైన గొంతు చాలా సమయం ఏడుస్తూనే ఉండిపోయింది. ఆ సున్నితమైన గొంతుని ఊరడించాలని ప్రయత్నించిన పువ్వు ప్రయత్నం విఫలమే అయ్యింది. కానీ, అప్పటికే తను ఆరు అంగుళాల పొడవు పెరగడంతో.. చిన్నగా తన కదలిక తెలిపి.. తన ఉనికిని చాటింది. పువ్వు తన ఉనికి చాటగానే.. ఆ సున్నితమైన గొంతు ఏడుపు మాయం అయి పోయి, తన ముఖం పై చిరునవ్వు వచ్చి చేరింది. అలా కష్టంగా ఇరవై వారాలు గడిపి, తన ఆకారం పొడవు పది అంగుళాలు పెంచుకుంది. అలా ఇరవై ఒకటో వారంలోకి అడుగుపెట్టి.. కళ్ళు తెరిచి చూసుకుంది. తన చర్మం ఎర్రగా ఉండి ముడతలు పడి ఉంది. తన రక్తనాళాలన్నీ తనకి కనిపిస్తున్నాయి. తన కాలి వేళ్ళకు, చేతి వేళ్ళకు ముద్రలు కనిపించాయి. వాటిని చూసుకుని మురిసిపోయింది. అలా ఇరవై నాలుగవ వారం చివరికి పన్నెండు అంగుళాల పొడవు పెరిగింది. ఇరవై ఐదో వారంలో అడుగుపెట్టినప్పటి నుంచి.. తనలో కదలికలు మొదలయ్యాయి. తనకి ఉత్సాహం వచ్చినప్పుడల్లా.. ఆ చీకటి ప్రదేశంలో ఉన్న నీటిలో తిరుగుతూ.. తనకి బయట నుంచి వినిపించే శబ్దాలను వింటూ.. ఏదైనా నొప్పి కగిలినా, తన మీద పడే వెలుగుకి కూడా ప్రతిస్పందిస్తూ.. ఉంది. ఇక్కడి నుంచి తన యొక్క పెరుగుదల త్వరగా ఉండడంతో.. తను వీలైనంత ఆహారాన్ని.. ఎక్కువగా ఆ నీటి ద్వారా గ్రహిస్తూ.. తన బరువును పెంచుకుంది. తన శరీర ముడతలు కొద్ది కొద్దిగా తగ్గుతూ కొంచెం కండ తేలాయి. అలా ముపై రెండవ వారానికి చేరుకుంది. తనకి అప్పటికే మెదడు, తన అంతర్గత వ్యవస్థలు అన్నీ అభివృద్ధి చెందాయి. కానీ, తన ఊపిరితిత్తులు ఇంకా పరిపక్వత సాధించుకోలేదు. ఒకానొక సమయంలో.. ఊపిరి అందక తను తిరిగి నందనవనం చేరుకుంటుందేమోనని చాలా భయపడింది. కానీ, తనకి నచ్చే ఆ సున్నితమైన గొంతు తనని స్పర్శిస్తూ.. తనకి కావలసిన అవసరాలను ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉండడంతో, తన ఊపిరి మరలా సాధారణ స్థితికి వచ్చి.. తన భయాన్ని పోగొట్టింది. తన పొడవు పద్దెనిమిది అంగుళాలకు చేరుకుని, తన బరువు రెండున్నర కిలో గ్రాముల వరకూ పెంచుకుంది. పువ్వు తన బరువు పెంచుకోవడం, తన పొడవు పెరగడం వలన.. తనకి నచ్చిన సున్నితమైన గొంతుకు కదలికలు భారమయ్యాయి. పువ్వుకి చాలా బాధ అనిపించింది. తను వీలైనంత త్వరగా.. ఆ సున్నితమైన గొంతుకు బాధ తగ్గించి బయటపడాలని ఎదురుచూసింది. అలా ముప్పై మూడవ వారంలోకి అడుగుపెట్టి.. తను బయట పడే సమయం అతి దగ్గరలోనే ఉందనే ఉత్సాహంతో.. ఇంకా ఎగిరెగిరి పడుతూ, తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ముప్పై ఆరవ వారం వచ్చేసరికి, తన పూర్తిస్థాయి కదలికలను తెలుసుకుంది. కళ్ళు మూసుకోవడం, తలను తిప్పడం, గట్టిగా పట్టుకోవడం చేసింది. బయట నుండి వినిపించే శబ్దాలకు తగ్గట్టుగా కదిలింది. తన మీద పడే కాంతికి స్పందిస్తుంది. తనని స్పర్శిస్తున్నది ఎవరు? అనేది. గుర్తించింది. అలా ముప్పై ఆరో వారం చివరికి తన పొడవుని పంత్తొమ్మిది అంగుళాల వరకూ పెంచేసుకుని.. మూడు కిలోగ్రాముల బరువు వరకూ పెరిగిపోయింది. అంత వరకూ తనని ఎంతో ఇష్టంగా భరించిన.. ఆ సున్నితమైన గొంతు ఇక భరించలేనట్టుగా గట్టిగా అరుస్తూ ఉండే సరికి, చీకటి నీటిలో బందీ అయిపోయిన పువ్వు.. భయంతో అటు ఇటు పరుగులు పెట్టింది. అలా పరుగులు పెడుతూ.. పెడుతూ తన కోసమే తెరిచి ఉన్న ద్వారం నుంచి.. ఒక్కసారిగా బయట ప్రపంచంలోనికి దూకింది. అప్పటి వరకూ ఎంతో ధైర్యంగా ఉన్న ఆ పువ్వు.. బయట ప్రపంచాన్ని! ఆ వెలుగుని భరించలేక.. ఒక్కసారిగా గొంతు పగిలేలా ఏడ్చింది. అదేమిటో! తను అంత బిగ్గరగా ఏడుస్తూ ఉంటే.. తన చుట్టుపక్కల అంతా.. ఆనందంగా ఉన్నట్టుగా, నవ్వులు వినిపించాయి. తనని ఏదైతే వద్దు అనుకుందో.. ఆ కరుకు గొంతు తనని చూసి, "నా చిన్ని తల్లి" అంటూ మురిసిపోవడం తో, పువ్వు ఆశ్చర్యపోయింది. తనని భరించలేను అన్న కరుకు గొంతు ఇప్పుడు నవ్వుతూ.. తనను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని, గుండెలకు హత్తుకుంది. భయం భయంగా ఉన్న ఆ పువ్వుకి.. ఆ కరుకు గొంతులోని మాధుర్యం అర్థమయ్యి, నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. అదే తను కోరుకున్న చోటు, తను అనుకున్న చోటికి తను చేరుకుంది. తన "సాహస యాత్ర" ముగిసింది. ఇక పై తన మరో యాత్ర "జీవన పోరాటం" మార్గంలోనేమో! అని, ఆ పువ్వు స్థిరమైన తన ఆలోచన సరళిని గుర్తించింది ఆ పువ్వు మనసును ఎరిగిందో! ఏమో! కాన్పు చేసిన నర్స్.. బిడ్డను తదేకంగా చూస్తూ మురిసిపోతున్న తండ్రిని గమనించి, ఆ సున్నితమైన గొంతు తో… "చూశారా! మేడం. మీ ఆయన మొన్నటి వరకూ, నీ కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిసి ససేమిరా! వద్దే వద్దన్నాడు. ఇప్పుడు చూడు.. పుట్టిన బిడ్డను చూసి ఎంతలా మురిసి పోతున్నాడో! అదే తల్లిదండ్రులుగా.. తమకు పుట్టే సంతానం పై మమకారం. అంతటి మాధుర్యాన్ని వదిలేసి... మూర్ఖత్వంతో ఆడపిల్ల అని దూరం చేసుకుంటూ, భ్రూణ హత్యల పేరుతో పాపాన్ని ఒడిగట్టుకుంటున్నారు. పుట్టే బిడ్డ ఎవరైనా... మాతృత్వం దక్కిందని సంబరపడి, వారికి జీవించే హక్కును ఇవ్వాలి. అదే మనం మన ముందు తరాలకు ఇచ్చే సుమధురమైన మార్గం." అంది. ఆ నర్స్ మాటలు.. ఆ తండ్రిలో తన తప్పును ఎత్తి చూపి,పశ్చాత్తాప పడేలా! చేసాయి. తన చేతులలో ఉన్న పసిపాప బోసి నవ్వులను మనసంతా నింపుకుని, గుండెలకు హత్తుకున్నాడు. "భ్రూణ హత్యలు ఆపండి. వాటికి జీవించే హక్కును ఇవ్వండి. లేదా! ముందుగానే జాగ్రత్త వహించండి". *** సమాప్తం ***

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు