చిత్రావతి - ఆకెపాటి కృష్ణ మోహన్

Chitravathi

చిత్రావతి మా యింటి ఎదురుగా ఉండే టీచర్ గారి ఆఖరి అమ్మాయి. చిత్రావతి నాన్న గారు జానకిరామయ్య. చిత్రావతి వాళ్ళ అమ్మ గౌరీశ్వరి. గౌరీశ్వరి మేడమ్ లెక్కలు చెప్పేది. వారి పెద్దమ్మాయి భైరవి డాక్టరు పూర్తి చేసింది. రెండవ అమ్మాయి కాత్యాయని ఆర్దిక శాస్త్రంలో పరిశోధన చేసేది. మూడవ వాడు రాజశేఖర్ ఇంజనీరింగ్ చదివేవాడు చివరిగా చిత్రావతి. చిత్రావతి మా ఊరిలోని విమెన్స్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదివేది. చిత్రావతి ఖచ్చితంగా పెద్ద ఆఫీసరో లేక శాస్త్రవేత్తో అవుతుందని అనుకునేవారు. చిత్రావతి అద్భుతమైన తెలివితేటలు కల అమ్మాయి. చిన్న వయస్సు లోనే అపారమైన మేధస్సు ప్రదర్శించేది.

చిత్రావతి అంటే చదువు మాత్రమే కాదు, ఆటలు, పాటల్లోనూ ముందుండేది. కాలేజీ NCC క్యాంపుల్లో విద్యార్ధి సంఘ కార్యక్రమాల్లో చిత్రావతి ఉండాల్సిందే. ఇంట్లో అందరూ చిత్ర అనేవాళ్ళు. మా యింటి ఎదురిల్లే కాబట్టి రోజూ కనపడేది. చిన్నప్పుడు మాతో అన్ని ఆటలు ఆడేది. కాలేజీ చేరిన తర్వాత కలవడం తగ్గిపోయింది. చిత్రావతి ధైర్యవంతురాలు కూడా. వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగా లేకపోతే తోడుగా తనొక్కటే మద్రాసు తీసుకు వెళ్ళి డాక్టరుకి చూపించి తీసుకొచ్చింది. సైకిలు నేర్చుకుని తొక్కుతూ ఉంటే ఎవరో మగ పిల్లలు ఎగతాళి చేశారు. సైకిలు ఆపి ఎదురు పోయి నాలుగు చెంప దెబ్బలు కొట్టింది. కొంతమంది ధైర్యం, ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి అన్నారు. కొంతమంది గౌరిశ్వరి పిల్లలకి కొద్దిగా అణుకువ నేర్పాలి. ఆడపిల్ల అలా చేయొచ్చా? యింట్లో చెబితే మందలించే వాళ్ళు కదా అన్నారు. అలాంటి వాళ్ళకి చిత్రావతి వాళ్ళ అమ్మ తగిన బుద్ది చెప్పింది. గౌరిశ్వరి మేడమ్ దగ్గిర మేము సాయంత్రం లెక్కలు చెప్పించుకునే వాళ్ళం. చాలాసార్లు మేడమ్ వంట చేయడమో వేరే పని చేయడమో చేస్తే మాకు లెక్కలు చిత్రావతే చెప్పేది. ఎందుకో చిత్రావతి లెక్కలు చెబితే మాకు బాగా అర్ధమయ్యేది. లెక్కలతో బాటు యితర సబ్జెక్టులలో సందేహాలు అడగమని చెప్పేది.

ఆమె ధైర్యం, మానసిక శక్తి చిత్రని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తోడ్బాటు యిచ్చేవి. ఒకసారి సినిమా హాలులో టిక్కెట్ల విషయంలో గొడవ జరిగింది. ఆడవారి క్యూ లైన్లోకి వచ్చి కొందరి ప్రముఖుల పిల్లలు అమ్మాయిల్ని కామెంట్ చేస్తుంటే సిగ్గుతో అందరూ తలవంచుకుంటే ధైర్యంగా కామెంట్ చేసిన వాడి కాలర్ పట్టుకొని లాక్కొచ్చి పోలీసుకి అప్పజెప్పిన శివంగి చిత్ర. మరీ చిత్ర అంటే బలశాలి, దేహపుష్టి ఉన్న అమ్మాయి అనుకోలేము.

అంత పొడుగు కాదు, మధ్యస్తంగా ఉండేది. కళ్ళు చురుకుగా ఉండేవి. కొంతమందికి అతి విశ్వాసం అనిపించేది. కాని అది ఆమె నైజం. కంఠం చాలా శ్రావ్యంగా ఉండేది. అప్పుడప్పుడు సంగీతం కూడా సాధన చేసేది. ఎందులోనైనా అందరికంటే ముందు ఉండడం ఆమెకు అలవాటు. కాని ఎపుడైనా వేరే ఎవరైనా తన స్థానాన్ని తీసుకున్నా అంతగా స్పందించేది కాదు. తన కంటే వాళ్ళు మెరుగ్గా ఏం చేశారన్నది గమనించేది. కానీ చిత్రావతి మొదటి స్థానంలో లేకపోవడం అన్నది అసాధారణమైన విషయం.

అక్కలు, అన్నయ్య చదువు లేదా ఉద్యోగాల వల్ల మదరాసు, హైదరాబాద్ లో ఉండడంతో అమ్మా నాన్నలతో చిత్రావతి ఒక్కటే ఉండేది. జానకిరామయ్య ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ముందుగానే పదవీ విరమణ చేసాడు. మంచి ఉద్యోగమైనా, లంచాల కోసం అధికారుల వేధింపులు తరచూ బదిలీలు చేస్తుండటంతో విసిగిపోయి రాజీనామా చేశాడని తెలిసింది. సాయంత్రం అయితే ఆయనకీ చిత్రవతితోనే కాలక్షేపం. గౌరీశ్వరి మేడమ్ వంట చేయడమో, పేపర్లు దిద్దడమో చేస్తూ ఉండేది.

“చిత్రా ఇది చదివావా? సోవియట్ యూనియన్ లోంచి పలు రాష్ట్రాలు, విడిపోయే అవకాశం ఉంది తెలుసా. మరింక U.S.S.R అనేది ఉండదు.”

“గోర్బచేవ్ ఆధ్వర్యంలో రెండు కార్యక్రమాలు మొదలయ్యాయి కదా. Glas not – Perestroika పారదర్శకత మరియు సంస్కరణ. త్వరలో అతి పెద్ద రాష్ట్రమైన రష్యా నుంచి ఇతర రాష్ట్రాలు విడిపోవడం మొదలవుతుంది. “U.S.S.R పుట్టుక, విచ్చిన్నం రెండూ ఈ శతాబ్దంలోనే జరగడం ఆశ్చర్యంగా లేదూ? ఆపరేషన్ Blue Star సిక్కుల మనోభావాలు దెబ్బ తీసిందంటావా? ప్రపంచ కప్ ఫుట్ బాల్ లో ఆర్జెంటినా గెలుపు బంతితో మారడోనా మాయాజాలం. జర్మనీపై ఫైనల్లో 3-2 తో విజయం. క్రికెట్ ను ఆదరించినట్లు మన దేశంలో ఎందుకు ఫుట్ బాల్ గురించి రాయరు. ఫుట్ బాల్లో ఆసియా క్రీడల్లో మనదేశం ఒకప్పుడు బంగారు పతకం సాధించింది. కాని ఇప్పుడు బెంగాల్, కేరళ, గోవా తప్ప ఇంకెక్కడా పెద్దగా ఆదరణ లేదు.”

యిలాంటి చర్చల మధ్య భోజనాల సమయమయ్యేది. అక్కలు, అన్నయ్య అందరూ ఉన్నప్పుడు ఆ యింట్లో వాతావరణమే వేరుగా ఉండేది. ఇలాంటి చర్చల్లో వకాల్తా తీసుకొని గట్టిగా వాదించుకునే వాళ్ళు. గౌరీశ్వరి మేడమ్, కలుగ జేసుకుని ఆ వాదనలు పరిష్కరించాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి పుస్తకాల పైన చర్చ జరిగేది.

ఈ పుస్తకం చదువమ్మా అని జానకిరామయ్య చిత్రావతికి పుస్తకాలు సిఫారసు చేసేవారు. ఆయనకు అన్ని రంగాలపైన అభిరుచి ఉండేది.

Letters to a Daughter by J.N.Nehru, The forgotten Empire by Robert Sewall, Sunny Days by Sunil Gavaskar, Dialectical Materialism లాంటి పుస్తకాలన్నీ చిత్ర వాళ్ళింట్లో నేను చూశాను.

ఆంగ్ల సాహిత్యంతో చిత్రావతికి బాగా పరిచయం ఉండేది. Mill on the Floss, Tess of the Durbervilles, Jude the Obscure, Vanity Fair, Jane Eyre, తన కిష్టమైన నవలలని చెప్పేది. అన్నింట్లో కథానాయిక ప్రధానమైన పాత్రలో ఉన్న విషయం చిత్రావతిని అడిగితే “ఏం అలా ఉండకూడదా అని అడిగేది?”

వర్షం వస్తే వెళ్ళి వర్షంలో నిలబడేది. “అమ్మా తడుస్తావు, వచ్చేయ్” అన్నా వినేది కాదు. ఆ వర్షం ఆగేంత వరకు వర్షంలో నిలబడి తడిచేది. “హృదయాన్ని దాటి ప్రకృతిని స్పర్శించడానికి ప్రయత్నం చేయలేమా? ఆ స్పందనలు, ఆ ప్రాధమిక శక్తి ఉనికి తెలుసుకోవడానికి వీలు కాదా”? అనే చర్చ లేవతీసేది“

“ఏం చిత్రా - నీ కెంత ధైర్యం? అంత భయం లేకుండా ఎవరితోనైనా ఎలా మాట్లాడగలవు?”

“నువ్వు నమ్మితే ధైర్యంగా నిలబడాలి. శక్తి దానంతట అదే వస్తుంది. ఎవ్వరికీ తల వంచాల్సిన పని లేదు. మనిషి తన స్వంత మార్గాన్ని ఏర్పరుచుకొన గలిగేటట్లుగా ఉండాలి. ఏది ఎవ్వరికీ నేర్పించరు. మనకు న్యాయం అన్పించిన దానికోసం చివరి వరకు పోరాడాలి” అని అనేది.

“చిత్రా, అన్నీ మాటలే. ఆ సమయం వచ్చినప్పుడు మాట్లాడి తప్పించుకుంటావో ఏమో”. అని స్నేహితులు అనేవారు. కాలేజిలో రెండవ సంవత్సరం డిగ్రీ విద్యార్ధులకు పిక్నిక్ ప్లాన్ చేశారు. రెండు బ్యాచీలుగా విభజించారు. ఒక బ్యాచిని శ్రీహరికోట/నేలపట్టు చూడడానికి పంపించాలని, మరొక బ్యాచిని వారు కోరుకున్న ఏదేని ప్రాంతానికి పంపాలని కాలేజి యాజమాన్యం నిర్ణయించింది. రెండవ బ్యాచి విద్యార్ధులకు సారధిగా చిత్రావతిని Principal ఎంపిక చేసారు. ఇంట్లో పిక్నిక్ కి అన్ని ఏర్పాట్లు చేసుకుంది చిత్ర.

“ఏమ్మా చిత్రా సముద్రంలో బాగా లోపలికి పోకండి. ఆటుపోట్లు ఎక్కువుంటాయట” అని జానకిరామయ్య గారు జాగ్రత్తలు చెప్పారు. చిత్రావతి మనస్సు ఉత్సాహంగా ఉరకలేస్తూ ఉంది. కాలేజిలో చేరిన తర్వాత మొదటి outing గౌరీశ్వరి త్వరత్వరగా పులిహోర, దద్యోజనం ఇంకా ఒక ఫ్లాస్క్ లో టీ తయారు చేసేసింది. “అమ్మా చిత్రా 11 గంటలకు టీ తాగకపోతే నీకు Head ache వస్తుంది. మర్చిపోవద్దు. ఫ్లాస్క్ లో టీ పెట్టాను.” అన్ని items ని సర్దేసి బాగ్ చిత్రావతికి ఇస్తూ, సాయంత్రం త్వరగా వచ్చేయండమ్మా అని చెప్పి సాగనంపింది. “చిత్రా , చిత్రా “ వీధి వాకిలి లోంచి స్నేహితురాండ్ర పిలుపు.” ఇదిగో వస్తున్నా” “అమ్మా నాన్నా Bye- సాయంత్రం వచ్చేస్తాను”. గాలిలో చేతులూపుతూ చిత్ర, వాకిట్లోకి వెళ్ళి సైకిల్ తీసింది.

స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్ళేటప్పటికి పిక్నిక్ బస్సు బయల్దేరడానికి సిద్దంగా ఉన్నది. చిత్రావతిని చూడగానే విద్యార్ధినులు అందరూ వచ్చి తన చుట్టూ చేరిపోయారు.

టీచర్ వచ్చే లోపల అందరి హాజరు తీసుకొని బస్సులో వారికి సీట్లు కేటాయించింది చిత్ర. ఒకరిద్దరు అమ్మాయిలు వెనకాల బస్సు కుదుపులకు తల తిప్పుతుందని వాంతులు అవుతాయని అంటే వారిని ముందు సీట్లలోకి మార్చింది.

టీచర్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రతల గురించి అందరికి తెలియజేసింది. కోలాహలం మధ్య బస్సు పిక్నిక్ కి బయల్దేరింది. బస్సులో ఉన్న అమ్మాయిలందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, పాటలు పాడుకుంటూ పిక్నిక్ ని జాలీగా గడుపుతూ ప్రయాణం సాగిస్తున్నారు. కొంతమంది అప్పుడే తెచ్చుకున్న టిఫిన్/చిరుతిళ్ళు తీసి తినడం చేస్తుంటే, కొంతమంది బస్సు కిటికీలోంచి తరలిపోతున్న పచ్చటి పొలాలు చెట్లను చూస్తూ చల్లటి వర్షపు గాలిని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నారు.

అందరిలోకి చిత్రావతే చాలా చురుకుగా కదులుతూ ఉంది. అందరిని పలుకరిస్తూ, అన్ని గమనిస్తూ ఆ పిక్నిక్ టీంకు నిజమైన leader గా వ్యవహరిస్తూ ఉంది. చేరాల్సిన ప్రదేశం వచ్చిందన్నట్లు డ్రైవర్ బస్సు ఆపి దిగాడు. అందరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ వారి బాగులు తీసుకుని బస్సు దిగారు. ఎదురుగా నీలి సముద్రం. సముద్రం మీదినుంచి రివ్వున గాలి వీస్తూ ఉంది. అక్కడక్కడ చేపల వాళ్ళ పడవలు నిలబెట్టి ఉన్నాయి. ఎక్కువ శాతం పడవలు సముద్రం మీదికి పోయినట్టు తెలుస్తూ ఉంది. ఇసుక మీద ఎండు చేపలు ఆరబెట్టి ఉన్నాయి. చేపలు, తేమ, ఉప్పు కలిసిన వింత వాసన సముద్రం మీది నుంచి వస్తూ ఉంది. బస్సు నిలిపిన దగ్గిర సర్వి తోటల మధ్యలో పిక్నిక్ పార్టీ కోసం అందరూ Blankets, Carpets పరచుకొని కూర్చున్నారు. కొంతమంది Card games, కొంతమంది ఇసుకలో గవ్వలు ఏరడం, కొంతమంది throw ball లాంటివి ఆడడం మొదలు పెట్టారు. కొంతమంది టీ, కాఫీ లాంటివి తాగడం చేస్తున్నారు. తోటల వెలుపల మత్స్యకారులు, మహిళలు చేపల వలలు బాగు చేసుకుంటున్నారు.

“Girls సముద్రంలో కాళ్ళు కడుక్కోవడం వరకే అనుమతి. ఎవ్వరూ 5 అడుగులు దాటి లోనికి వెళ్ళకూడదు. ఇక్కడ సముద్రం చాలా ప్రమాదకరంగా ఉంటుందని చెబుతున్నారు.” అందుచేత ఎవరూ లోనికి పోవద్దు, అని వాళ్ళ టీచర్ చెప్పింది. సాహసవంతులు రమ్య, పూర్ణిమ, చిత్రావతి, జెస్సి కూడా సముద్రం లోనికి వెళదామనుకుంటూనే ఆ మాటలకు ఆగిపోయారు.

మధ్యాహ్నం అయ్యేటప్పటికి భోజనాలు కానిచ్చారు. ఒకరి ప్లేటు లోంచి ఒకరు పంచుకోవడం, క్రొత్త వంటకాల గురించి తెలుసుకోవడంతో సమయం సరదాగా గడిచిపోయింది. Lunch తర్వాత చిత్రావతి మనస్సులో ఏదో అశాంతి మొదలయ్యింది. యింతదాకా వచ్చి సముద్ర స్నానం చెయ్యకుండా కేవలం కాళ్ళు తడుపుకొని పోవడం ఏమిటి? అసలు ఎందుకొచ్చినట్టు శరీర భారాన్ని వదలి వేసి, ఆ సముద్రపు అలల హొయలో పైకి కిందకీ ఊగిసలాడాలని మనస్సు ఉవ్విళ్ళూరుతోంది. ఏమవుతుంది. 5 లేక 6 మంది చేతులు గట్టిగ పట్టుకొని దిగితే అని ఆలోచించ సాగింది. టీచర్ అప్పుడే భోజనం చేసి కాస్త కునుకు తీస్తున్నట్లుగా ఉంది.

అక్కడే ఉన్న చేపలోళ్ళ తో మాటలు కలిపింది చిత్రావతి. “సముద్రం ఆటు పోట్లు ఎక్కువగా ఉన్నాయా?” “ఇప్పుడు ఉండవమ్మా. సాయంత్రానికి ఎక్కువవుతాయి. ఒక్కోసారి నీళ్ళు ఇది దాటి వచ్చేస్తాయి.” సముద్రం లోపలికి మీరు ఎంతదాకా పోతారు? “మాకేమీ దూరాలు లేవమ్మా. అలా పడవల మీద ఎల్లి పోతాము. ఒక్కోసారి మూడు-నాలుగు రోజులు సముద్రం మీదే ఉంటాము.” “యిక్కడ దిగి స్నానం చేయొచ్చా? “దిగొచ్చు గాని, కొత్త వాళ్ళు జాగ్రత్తగా ఉండాలమ్మా, అక్కడక్కడా గుంటలు ఉండాయి. దాంట్లో కాలు బెడితే అల కప్పేస్తదమ్మ.”

“ఔను మీకేమీ భయం లేదా?” “యిక్కడ పుట్టి పెరిగినోళ్ళము, రోజూ మాకు గంగమ్మతోనే కదమ్మా పని” ఆ అమ్మే మమ్మల్ని కాపాడుతది.” “పని పూర్తి చేసుకొని పల్లెకారులు వారి పల్లెకి వెళ్ళిపోయారు.” మధ్యాహ్నం మూడు దాటి సాయంత్రం ఎండలోకి సూర్యుడు మారుతున్నాడు. అలలఫై కిరణాలు పడి మిలమిలా మెరుస్తున్నాయి. రెండు మూడు కొంగలు అలల మీద కొట్టుకొచ్చే చేపలో లేదా తీరం మీద నత్తల కోసమో గాలిలో చక్కర్లు కొడుతున్నాయి. అల్లంత దూరంలో వేరే బ్యాచి సముద్రంలోకి దిగి బంతితో ఆడుతున్నారు. సముద్రంలోకి దూరంగా విసిరేసిన బంతి అలలపై తేలుతూ మళ్ళి ఒడ్డుకి వస్తూ ఉంది. కొంతమంది అమ్మాయిలు సముద్రపు అలలు తాకుతూ తీరానికి అడ్డంగా నడుస్తున్నారు. జెస్సి, పూర్ణిమ ఒకరి చేయి ఒకరు పట్టుకొని సముద్రపు అలలకు ఎదురు వెళుతున్నారు. రమ్య చేయి లాగుతానే చిత్రావతి కూడా వారితో జతకలిసింది. సముద్రం ప్రశాంతంగా ఉంది. అలలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. చూస్తూ ఉండగానే గంటపైగా సముద్రంలో ఆడుకున్నారు. సముద్రంలో ఎగిరెగిరి వెనక్కి వస్తున్న బంతిని పట్టుకోవడం తిరిగి విసిరేయడం, ఎదురొస్తున్న అలను గమనించి చటుక్కున ఎగరడం చేస్తూ సరదాగా గడిపారు. యింక వెనక్కి వచ్చేద్దాం పదండి” అని చిత్రావతి గట్టిగా అరుస్తూ చెప్పింది. “ఇదిగో వచ్చేస్తున్నాము” అని మిగతా ముగ్గురూ చెప్పుతూ ఉండగానే వారు ఎదురుచూడని విధంగా పెద్ద అల ఒకటి వారిని ఎదుర్కొంటూ వచ్చింది. చాలా భీభత్సంగా వచ్చిన అల తాకిడికి చిత్రావతి, జెస్సి వెనక్కి నేట్టేయగా రమ్య, పూర్ణిమ నీళ్ళల్లోకి జారిపోయారు. అలల ఉదృతి పెరిగినట్లుగా ఉంది. ఎక్కడా కాలు నిలపలేక పోయారో ఏమో, వాళ్ళిద్దరూ చేతులు తప తప కొడుతూ చిత్ర, చిత్ర అని అరుస్తున్నారు. స్నేహితురాండ్ర కోసం చిత్రావతి ఒక్కసారిగా ముందుకి దూకింది. తీరం నుంచి చూస్తున్న అమ్మాయిలందరూ అందోళనతో హా హా కారాలు చేస్తున్నారు. కొంతమంది టీచర్ని లేపి విషయం చెబుతున్నారు.

అప్పటికే అలల ఉదృతికి యిద్దరు అమ్మాయిలు బాగా సముద్రం లోనికి వెళ్ళారు. చిత్రావతి ధైర్యం చేసి రమ్య కాలుని పట్టుకోగలిగింది. రమ్యని లాగేసి పూర్ణిమ కోసం ముందుకు కదిలింది.

పట్టపు పాలెం పల్లె వైపు కొంతమంది పరిగెత్తుకు వెళ్ళారు. ఎవరైనా కనబడితే పిలిచి కాపాడమని. అందరూ భయంతో చూస్తూ ఉండగానే అక్కడ అలల ఉదృతి అమాంతంగా పెరగడం ఆరంభించింది. పెద్ద పెద్ద అలలు ముందుకొస్తున్నా చిత్రావతి, పూర్ణిమ కోసం మునక వేసి వెతుకుతూ ఉంది. ఏదో విధంగా పట్టు దొరికిందేమో ఒక్కసారిగా చిత్రావతి కొద్దిగా లేచి పూర్ణిమ చేయితో పాటు తన చేయి ఊపింది. బహుశా అదే ఆఖరుగా మేమందరం చిత్రావతిని చూడడం.

ఆటుపోట్లు సమయం కావడంతో ఒక రాకాసి అల వారిద్దరిని సముద్రంలోకి లాగేసింది. ఇంతలో కొంతమంది జాలర్లు వచ్చారు. అప్పటికే సాయంత్ర మయ్యి చీకటి పడడం ప్రారంభించింది.

“లోపలికి పోయినా ఇప్పుడు ఏం కనపడదమ్మా . సముద్రం ఇప్పుడు చాలా కల్లోలంగా ఉంటది. చెప్తానే ఉంటిమి. తొందర పడొద్దు , తొందర పడొద్దు” అని వారన్నారు.

“క్రింద గుంటలు ఉండాయి. మరీ లోపలికి పోబాకండి అని చెబుతానే ఉంటిమి.” అని యింకొకరు.

టీచరు, విద్యార్దులు అందరూ ఏడుస్తున్నారు. కానీ ఎవరికీ ఏం చేయాలో తెలియడం లేదు. అనుకోని ఈ ప్రమాదం - తిరిగి ఎలా వెళ్ళడం. వెళ్ళి చిత్రావతి, పూర్ణిమ తల్లి దండ్రులను ఎలా ఎదుర్కోవడం? రమ్య, జెస్సి లయితే ఏదో విధంగా లోపలికి వెళ్ళి వెతుకుతాం అంటే అందరూ కలిసి వారిని ఆపారు.

“ఇంక ఏం వెతకతారమ్మ? పైకి తేలకపోతే అంతేనమ్మా రెండు నిముషాలకు మించి నీళ్ళలో ఉండలేరమ్మా “ వాస్తవాన్ని చెప్పలేక ఒక పల్లెకారుడు చెప్పాడు.

పోలీసులకు వార్త చేరిందేమో, పోలీసులు కూడా వచ్చారు. కాసేపటికి తహసిల్దారు, ఇంకా యితర అధికారులు కూడా వచ్చారు. మిగతా విద్యార్దినులను బలవంతంగా బస్సేక్కించి పంపించివేసారు.

అధికారులతో పాటు టార్చ్ లైట్ లు, లాంతర్లు వచ్చాయి. తీరం వెంబడి వెతకటానికి బృందాలు బయల్దేరాయి. చంద్రోదయం తర్వాత సముద్రం శాంతించింది. రాత్రి 10 గంటల తర్వాత పూర్ణిమ మృతదేహం రెండు కి.మీ అవతల దొరికింది. చిత్రావతి మాత్రం తనలోనే ఉన్నట్లు సాగరం అనంత ఘోషతో భాషిస్తూ ఉంది. సాగర గర్భంలో చిదిమి వేయబడిన చిత్రావతి హృదయ స్పందనలు తలుచుకొని మేము వెక్కి వెక్కి ఏడ్చాము.

రెండు రోజుల తర్వాత 15 కి.మీ అవతల భయంకరమైన స్థితిలో చిత్రావతి ‘దేహం కనపడింది.

@@@

మరిన్ని కథలు

Dhruvuni vamshamu
ధృవుని వంశము.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Aachari mastari vupayam
ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ )
- కొత్తపల్లి ఉదయబాబు
Aadaleka maddela odu
ఆడలేక మద్దెల ఓడు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Garam chai
గరం చాయ్
- వేముల శ్రీమాన్
Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao