రంభ కోసం - తాత మోహన కృష్ణ

Rambha kosam

చాలా సంవత్సరాల మునుపు-

ఒక పల్లెటూరు లో రంగా అను ఒక యువకుడు ఉండేవాడు. చిన్నప్పటినుంచి ఊరిలో ఎవరిగురించి విన్నా -

"వాడికి రంభ లాంటి పెళ్ళాం వచ్చింది"
"వాడి పెళ్ళాం రంభ లాగా ఉంటుంది"
"నాకు రంభ లాంటి పెళ్ళాం కావాలి"
"రంభ లాంటి అప్సరస కోడలిగా రావాలి"

ఇలాంటి మాటలు ఊళ్ళో అందరు అనుకోగా వింటున్నాడు. రంగా కు ఒక ఆలోచన వచ్చింది. అసలు ఈ రంభ ఎవరు? అందరూ, అమ్మాయిలను ఎందుకు రంభ తో పోలుస్తున్నారు? ఆమె ఎవరు?

విషయం తెలుసుకోవాలని తన నానమ్మ దగ్గరకు వెళ్ళాడు. రంగా వాళ్ళ నానమ్మ అప్పుడప్పుడు రంగా కు కొత్త విషయాలు చెబుతూ ఉంటుంది.

"నానమ్మా! ఈరోజు నిన్ను ఒక విషయం అడగడానికి వచ్చాను. రంభ అంటే ఎవరు? అందరూ ఆమెను గొప్పగా చెబుతున్నారు?"

"అదా రంగా! రంభ స్వర్గం లో నాట్యం చేసే ఒక గొప్ప నర్తకి. సంగీతం లో, నాట్యం లో చాలా ప్రావీణ్యం ఉన్న అప్సరస. ఆమె అందానికి చాలా మంది దాసోహం అయ్యారు. అందుకే అందరూ అందంగా ఉన్న స్త్రీ ని రంభ తో పోలుస్తారు! అర్థమైందా?"

"అయితే నానమ్మా! ఆ రంభ నే పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా"

"పూర్వం, కొంత మంది రంభ మంత్రం జపించి, రంభ తో కలసి ఉన్న వాళ్ళు ఉన్నారని కధలు ఉన్నాయి. ఈ కాలంలో అది జరిగే పని కాదు."

నానమ్మ రంభ గురించి చెప్పిన తర్వాత, రంగా కు చాలా ఆసక్తి పెరిగింది. దగ్గరలో ఉన్న గ్రంధాలయానికి రోజూ వెళ్ళేవాడు. రంభ గురించి ఉన్న పుస్తకాలూ, శీర్షికలు చదివేవాడు. చాలా విషయాలు తెలుసుకున్నాడు.

రంభ ను ప్రసన్నం చేసుకోవడానికి ఒక మంత్రం ఉన్నట్టు ఒక పుస్తకం లో చదివాడు. ఆ మంత్రం గురించి, దాని మీద ఉన్న కధలు గురించి తెలుసుకున్నాడు. ఆ మంత్రం జపిస్తే, రంభ ను ప్రసన్నం చేసుకోవచ్చునని అందులో ఉంది.

రంగా కు ఇంట్లో పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఒక ఆలోచన వచ్చింది. రంభ ను ప్రసన్నం చేసుకొని పెళ్లి చేసుకుందామని! అప్పుడు అందరూ " రంభ లాంటి పెళ్ళాం అనకుండా, రంభే పెళ్ళాం గా వచ్చింది అంటారు కదా!"

ఒక రోజూ ఊరి చివర ప్రశాంతంగా ఉన్న చోటు కి వెళ్ళాడు. ఇంట్లో మాత్రం ఫ్రెండ్స్ తో టూర్ కి వెళ్తున్నట్టు చెప్పాడు.

ఒక ప్రశాంతంగా ఉన్న చోటు లో కూర్చొని " రంభా మంత్రం జపించడం మొదలు పెట్టాడు"

చాలా రోజులు అలాగే జపం చేసాడు. ఎండనకా, వాననకా, జపం చేసాడు. చాలా రోజుల తర్వాత, ఒక తీయని స్వరం రంగా ను పలకరించింది. " ఓ అందగాడా! నా గురించి ఏల ఇంత పట్టుదలతో తపస్సు చేస్తున్నావు? నా నుంచి ఏమిటి నీవు కోరుకుంటున్నావు? నీ దీక్ష కు మెచ్చాను. ఏమిటి కావాలో చెప్పు?"

"నా పేరు రంగ! నేను మీ గురించి తెలుసుకున్నాను. నేను పుస్తకములలో చదివిన దానికంటే మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు ఒప్పుకుంటే మిమల్ని పెళ్ళి చేసుకుంటాను. మిమల్ని బాగా ప్రేమగా చూసుకుంటాను".

"నేను స్వర్గం లో ఉంటాను. ఇంద్ర సభలో నాట్యం చేస్తాను. నాకు అక్కడ అప్పగించిన పనులు చెయ్యాలి. ఇక్కడ భూలోకంలో ఉండడానికి సాధ్యపడదు. ఐనా, దేవతా స్త్రీ కు మానవునకు పెళ్లా? సంసారమా?" కావాలంటే, నీవు స్వర్గానికి వచ్చిన తర్వాత, నాతో ఉండవొచ్చు."

"నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని ఉంది. అందుకే మీ జపం చేస్తున్నాను!"

"నీకు మాట ఇచ్చాను కాబట్టి, ఒక షరతు తో ఒప్పుకుంటాను. నన్ను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలి. నన్ను ఎప్పుడూ సుఖపెట్టాలి. నాకు అప్పగించిన పనులు నేను చేసుకోవాలి. ఇంట్లో పనులు నేను చేయలేను. ఈ షరతులు, ఎటువంటి పరిస్థితులలోనూ, తప్పకూడదు."

"తప్పినచో , మనకు ఎడబాటు తప్పదు."

"నీ కోసం ఏమైనా చేస్తాను రంభా!. నాకు సమ్మతమే."

రంభ పెళ్ళి కి ఒప్పుకుంది. రంగా, రంభ ను వైభవంగా పెళ్ళి చేసుకున్నాడు. రంగా అనుకున్న ప్రకారం అందరూ తనని మెచ్చుకున్నారు.

రంగా ప్రతిరోజూ రంభ కౌగిలిలో, భువిలోనే స్వర్గం చూసాడు. కొంత కాలం ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు.

ఒక రోజు, రంగా కు వొంట్లో బాగోలేదు. దేవకార్యం నిమిత్తం, రంభ అక్కడ లేదు. రంగా చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పుడు కొన్ని విషయాలు అర్ధమయ్యాయి. వాళ్ళ నాన్న కు వొంట్లో బాగోనప్పుడు, అమ్మ ఎంత సేవ చేసేదో గుర్తు చేసుకున్నాడు. మానవులకు సెంటిమెంట్స్ ఎక్కువ అను మాట గుర్తుకు వచ్చింది రంగా కు.

దేవతా స్త్రీల గురించి వర్ణనలో అందం గురించి, సౌఖ్యం గురించే ఎక్కువగా చెప్పారు. మానవులకు కష్టాలు ఎక్కువే, అంకితభావం కూడా ఎక్కువే అని గుర్తు చేసుకున్నాడు.

రంభ తాను పెట్టిన షరతులలో, తన సుఖం సంతోషం గురించే ప్రస్తావించింది. తాను సేవ చేస్తానని, ఎక్కడా చెప్పలేదు.

రంగా కు అనారోగ్యం చేత రంభ ను సుఖపెట్టలేకపోయాడు. షరతు ప్రకారం రంభ వెళ్లిపోవడానికి నిశ్ఛయించుకుంది. వెళ్లే ముందు రంగా తో ఇలా చెప్పింది:

"రంగా! నువ్వు చాలా మంచివాడివి. ప్రేమించండంలో, సంతోషపెట్టడంలో నువ్వు చాలా దిట్ట. కానీ, కాల పరిస్థితుల వలన వచ్చే ఇబ్బందులు, అనారోగ్యాల వలన నీవు నీరసించావు. నేను నీ దగ్గర ఉండలేను.

"నువ్వు వెళ్ళిపోతే, నేను ఎలా ఉండగలను రంభా! నిన్ను చాలా ప్రేమించాను. నిన్ను ఊళ్ళో అందరు చూసారు. నిన్ను పెళ్లి చేసుకున్నట్టు అందరికీ తెలుసు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి?"

"నీ బాధ నాకు అర్ధమైంది. నేను ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేను. అందుకే, షరతు పెట్టాను. నువ్వు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకో. నీ భార్య నీ కష్ట సుఖాలలో నీకు తోడుగా ఉంటుంది."

"నీవు స్వర్గానికి వచ్చునప్పుడు, నాతో ఉండవచ్చు. సకల భోగాలు అనుభవించగలవు "

"ఇప్పుడు ఈ భూలోకంలో నువ్వు పెళ్ళి చేసుకునే అమ్మాయి అందరికీ - ఈ రంభ లాగే కనిపిస్తుంది." తదాస్తూ!!!

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి