మహాకవి మహాప్రస్థానం - విద్యాధర్ మునిపల్లె

Mahakavi mahaprastanam
‘‘ ఈ పడకగది తలుపులూ, కిటికీలు తెరవండి, నా ఒంటిమీదుండే ఈ అడ్డంకులను తీసిపారేయండి. మిలమిల మెరిసే సూర్యకిరణాలు నన్ను ముద్దు పెట్టుకోనివ్వండి.. చల్లటి పొద్దుటిగాలి నన్ను లాలించనివ్వండి.. ఒక్కసారిగా శూన్యంలో కలిసిపోయే ముందు నన్ను ప్రకృతితో ఆడుకోనివ్వండి.. డాక్టరుగారూ.. నాకోసం ఒక గ్లాసు వైను, కస్తూరి జవ్వాది తదితర మిశ్రమాలతో కూడిన ఘనమైన తాంబూలాన్ని తెప్పించి ఇవ్వండి.. ఈ పిచ్చికవి ఆనందంగా స్వీకరిస్తాడు...’’
అంటూ కవిగారు ఏమేమో చెప్పకు పోతున్నారు. ఆయాసం అడ్డుపడుతున్నా.. ధారలా వస్తున్న ఆయన మాటలకు అడ్డుపడలేదు ఎవ్వరూ.. ఆశ్చర్యపోయి చూస్తున్నామంతా..!
మృత్యువు సమీపించే వేళ కవిగారి మతి చలించిందేమోనని అనిపించింది నాకు.ఇంతలో ఎవరో ఆయన కోరినవన్నీ తెచ్చి ఇచ్చారు.కవిగారు మనసారా దానిని అందిపుచ్చుకుని చివరికంటా ఖాళీచేవారు. అలాగే తెచ్చిన తాంబూళాన్ని నములుతూ పొలమారగా డాక్టర్ల సూచనమేరకు ఉమ్మేశారు.కాసేపు మౌనం...అంత మౌనంలో తన ఉనికి చాటుకుంటూ ఎనిమిది గంటలు కొట్టింది... పాతకాలంనాటి గోడగడియారం.. సూర్యుడు తన నులివెచ్చని కిరణాలను ఆ గదిలో పూర్తిగా నింపేశాడు.కేంద్రప్రభుత్వం వారు ఆయన రాసిన ‘‘ఆఖరిమజిలీ’’ అనే పుస్తకానికి సాహిత్యపీఠం పురస్కారం అందించినట్లుగా... అప్పుడే తెలిసింది.. ఈ విషయం కవిగారి చెవిన వేద్దామని ఆయన అభిమాన ఆఘమేఘాలమీద మేడ మెట్లు ఎక్కుతున్నాడు. ఆ అభిమానికంటే వేగంగా మృత్యుదేవత మరీ తొందరగా మేడ మెట్లు ఎక్కివస్తోంది... మృత్యుదేవత కవిగారిని వుంచిన గుమ్మం ముందు నిలబడి గోడగడియారాన్ని చూస్తోంది. తన సమయం కాగానే ఆయన్ని తీసుకెళ్ళాలని కాబోలు. ఆ అభిమాని మృత్యుదేవతను దాటుకొని గుమ్మంలోంచి కవిగారున్న గదిలోకి వచ్చాడు. కవిగారికి తనకు తెలిసిన విషయాన్ని చెప్పాలని. అయితే అక్కడే వున్న మిగిలిన అభిమానులు అతన్ని రచయితగారి దగ్గరకి వెళ్ళనివ్వలేదు. తోసేశారు.. ఎలాగోలా అతను వారందరినీ తప్పించుకుంటూ తనకు తెలిసిన వార్తను చెప్పాలని మెల్లిగా గోడవాటుగా కవిగారి దగ్గరకు చేరుకునే ప్రయత్నం చేశాడు.అయితే కవిగారి పక్కనే వున్న డాక్టరుగారు ఆ అభిమానిని దూరంగా వుండమన్నారు.ఆఖరి ఘడియల్లో వున్న కవిగారికే తనకు తెలిసిన ఈ వార్తను వినిపించాలని ఆ అభిమాని కోరిక.. అతను మళ్ళీ మళ్ళీ డాక్టరుని బ్రతిమాలుతునే వున్నాడు. చివరికి డాక్టరు చెప్పారు.. ‘‘ మీరు ఆయనకి ఏం చెప్పినా వేస్ట్.. ఎందుకంటే ఆయన మతిస్థిమితం కోల్పోయారు. ఇహనో.. మరికాసేపట్లోనో ఆయన ఈ భౌతిక కాయం వదిలేయవచ్చని’’ఆ అభిమాని బ్రతిమాలుతునే వున్నారు.. ‘‘ ఎన్నో సంవత్సరాలుగా ఆయన చేసిన కృషికి బ్రిటన్ ప్రభుత్వం గుర్తింపు లభించింది.. ఈ విషయం గురువుగారికి నేనే చెప్పాలి.. దయచేసి ఆయన విన్నా .. వినకపోయినా ఆయన చెవిలో నేను చెప్పాలి.. ’’ అన్నాడు ఏడుస్తూ... చివరికి డాక్టరుగారు సరే అన్నారు. ఆ అభిమాని కవిగారి చెవి వద్దకు వచ్చి ‘‘ గురువుగారూ... మీరు చేసిన సాహితీ కృషిని ఎలిజిబెత్ మహారాణి గుర్తించారు. మీరు రచించిన ‘‘ఆఖరి మజిలీ ’’ కావ్యానికిగానూ లక్షరూపాయలు బహుమానం ప్రకటించారు ఎలిజిబెత్ మహారాణిగారు. మిమ్మల్ని ఆవిడ జన్మదినానికి లండన్ రమ్మని ఆహ్వానిస్తూ బహుమతిని తీసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తూ పోస్టు మాస్టరుగారికి నిన్ననే ఉత్తరం అందిందిట. గౌరవించింది..’’అంతే కవిగారి కన్నులు మూసుకొనే వున్నా ఆయన పెదవులపై చిన్న చిరునవ్వు క్షణకాలం చిగురించి మాయమైంది. మృత్యుదేవత ఏ క్షణానైనా ఆ కవిగారిని నిర్దయగా గాఢాలింగనం చేసుకోవచ్చు.. ఆయన మీదకి తన కర్కశ కరాళ పాశాన్ని విసిరేయవచ్చు.. ప్రతి జీవికీ తప్పని సరే అయినప్పటికీ కవిగారికి మృత్యువు తనను తాకక ముందే ఒక్కసారి తన శ్రమను కళ్ళారా చూసుకోవాలనే కోరిక...
*******

అది క్రీ.శ.1892. డిసెంబరు నెల.. 10వ తేదీ... ఆ రోజు కూడా రోజూలాగే సూర్యుడు ఉదయిస్తున్నాడు. కానీ ఆ ఇంట మాత్రం అప్పటి వరకూ తన రచనలతో తెలుగునాట పాఠకులను ఉర్రూతలూగించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఒక మహారచయిత అస్తమించనున్నాడు. ఇది అందరూ ఎరిగిన సత్యమే.. కానీ ఎవ్వరూ భరించలేకున్న సత్యం.

పిల్లలు లేని కారణంగా రాజావారు ఒక పిల్లవాడిని దత్తత తీసుకున్నారు. రాజుగారి మరణానంతరం ఆయన తీసుకున్న దత్తతు చెల్లదంటూ బంధువులు కోర్టులో దావాదాఖలు చేశారు. ఆ బంధువులనే రాబందుల నుండి ఆస్థిని కాపాడటానికి ఈ మహాకవి దివాన్ గా పడ్డ శ్రమను గుర్తించిన రాజావారి దత్తపుత్రుడు రాజా వెంకటాద్రి రాయణిం బహద్దూర్ వారు కృతజ్ఞతగా సమర్పించిన రెండంతస్థుల మేడ అది. దాన్ని బాగు చేసుకున్నారీన. దివాన్ గా పనిచేస్తూ క్షణం తీరికలేని జీవనం కొనసాగించిన ఈ మహాకవి పదవీ విరమణ చేసిన అనంతరం సాహిత్య సేవలో పాఠకలోకానికి మరింతగా దగ్గరయ్యారు. మత ఛాందసాన్ని అడ్డుకుంటూ యువతను ప్రేరేపించారు.. అలా ఎన్నో కథలు, నాటకాలు, నవలలు రాస్తూ యువతకు అభిమానపాత్రుడయ్యారు.
ఆ కవిరాజు మాత్రం ఉదాసీనంగా ఉన్నాడు. తనను మృత్యువు మరికొద్ది సేపట్లో కబళించ బోతుందన్నదని తెలుసు. అయినా ఆయన ముఖంపై చెదరని చిరునవ్వు. ఎన్నో సంవత్సరాలుగా ా అనారోగ్యంతో బాధపడుతూ.. ఎదుటివారిని నవ్విస్తూ.. తనలోని శారీరక ఆరోగ్య లోపాన్ని బయటపడనివ్వకుండా బ్రతికాడు ఆ కవి మహారాజు.
భానుడు తన కిరణాలతో ప్రపంచానికి వెలుగు పంచుతూ వీరి ఇంటకూడా చీకటిని పారద్రోలే ప్రయత్నం చేస్తున్నా.. మృత్యువు తన దట్టమైన నల్లని రెక్కలు విప్ప విషాదఛాయలనే చీకటిని నింపే ప్రయత్నం చేస్తోంది. సూర్యోదయం ఒకవైపు.. ఈ కవిభానుని అస్తమయం మరో వైపు.. పోటీపడుతున్నాయి..
తన వారంటూ లేకపోవటం ఆ కవిమహారాజుకు తీరని లోటని ఆయన ఏనాడూ భావించలేదు. ఎందుకంటే తనను అభిమానించే వారందరూ తనవారే అని ఆయన నమ్మకం... ఒకప్పుడు రాజా వారి ఆస్థానంలో దీవాన్ గా ఆయన వెలగబెట్టిన తీరు.. అప్పుడు ఆయన అందుకున్న గౌరవం.. ఆ క్షణంలో ఆ కవిమహారాజు కంటి ముందు తొణికిస లాడుతున్నట్లు నాకు అనిపించింది.
ఎందుకంటే.... ఆయన చూపు రాజావారి చిత్రపటం మీద కేంద్రీకృతమవ్వటం నేను గమనించాను. అందరిలాగే మౌనంగా నిలుచున్న నావైపు ఆయన చూస్తూ దగ్గరకు రమ్మని కళ్ళతోనే ఆజ్ఞాపించాడు.. నన్నేనా ఆయన పిలిందని నమ్మలేనట్లు చూస్తున్న నావైపు ఆయన చూపుడు వేలుని అతి కష్టంమీద కదుపుతూ పిలిచాడు.. దగ్గరకు వెళ్ళాను. నా చెవిలో ఆయన చెప్పిన మాటేంటంటే...
‘‘ నేను నా ఒంటరి తనాన్ని పోగొట్టుకోటానికి ఏర్పాటు చేసుకున్న గ్రంధాలయాన్ని ఒక్కసారి చూసి రావాలి.. నా ఒళ్ళు సహకరించటంలేదు.. ’’
ఒక్కసారిగా నా చెవులను నేనే నమ్మలేక పోయాను. ఈ సమయంలో ఆయన అలా కోరటంలో ఆయన ఆరాటం కనిపించింది. కానీ కదలటానికి వీలుకాని పరిస్థితిలో ఆయన కోరిన కోరికను ఎలా తీర్చాలా అన్న సందేహం.. శక్తి వుండి కూడా ఆయన కోరిక తీర్చలేకపోవటం చాలా అమానుషంగా అనిపించింది.
ఎవరో అభిమాని నన్ను అడిగాడు.. కవిగారు నా చెవిలో ఏం చెప్పారని..
ఉన్న విషయం చెప్పాను.
రెండు సంవత్సరాలపాటు మంచంలో వుండే రచనలు సాగించిన ఆ మహాకవి ఆఖరి క్షణాలు ముంచుకొస్తున్నాయ్...!
ఇక ఆయన భౌతిక కాయం వదిలి కాంతి దేహం పొందటానికి వ్యవధి గంటల్లోనో.. నిమిషాల్లోనో.. సెకన్లలోనో...
ప్రతి ఒక్కరూ ఆయనవైపే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...
కవిగారు నా వైపు ఆసక్తిగా చూస్తున్నారు. నేను ఏమీ చెయ్యలేని స్థితి..
ఇంతలో సీమడాక్టరు(ఆంగ్ల) వచ్చారు.
సీమ డాక్టరు కవిగారిని పరీక్షించారు. నవ్వుతూ కవిగారి భుజం తట్టి..
‘‘డోంట్ వర్రీ.. యు విల్ బి ఆల్ రైట్.. ’’ అని చెప్పి కవిగారు మంచంలో వుండి చెబుతుంది రాసే రాయసగాడు పార్వతీశంతో.. ‘‘ కమ్ విత్ మీ’’ అని పక్క గదిలోకి తీసుకెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు.
ఆ ఊరి రాజావారు కవిగారి అనారోగ్యం గురించి తెలుసుకొని సీమ డాక్టరుని ప్రతిరోజూ వచ్చి చూసి మందులిచ్చి వెళ్ళమని ఏర్పాటు చేశారు. ప్రత్యేక శ్రద్ధతో సీమ డాక్టరు కవిగారికి వైద్యం చేస్తూ వచ్చారు. అనునిత్యం కంటికి రెప్పలా చూసుకుంటున్నారు డాక్టరు గారు. ఈ కొద్ది కాలంలోనే డాక్టరుగారికీ కవిగారికీ మధ్య ఆత్మీయత ఏర్పడింది..
పార్వతీశం చెప్పాడు.. డాక్టరు గారికీ కవిగారికీ తరచూ ఆంగ్లసాహిత్యంలో చర్చలు జరిగేవనీ.. కవిగారి వల్లే ఆయన తెలుగు భాష చదవటం, రాయటం నేర్చుకున్నారనీ.. నాకు చాలా ఆశ్చర్యం వేసింది.

నేను కవిగారు రాసిన ‘‘జీవన్మృతగీత’’ కావ్యాన్ని చదివి ఆయనని కలిసి అభినందించాలని గుంటూరు నుంచి విజయనగరానికి వచ్చాను. నిజానికి కవిగారి పరిస్థితి ఇలా వుందని నాకు ఇక్కడికి వచ్చేవరకూ తెలీదు. నేను ఏదైనా పనిమీద విజయనగరం వచ్చినప్పుడు కవిగారిని కలిసేవాడిని.. అయితే డిస్ట్రీటు కలెక్టేరుగారి దగ్గర కొలువులో చేరినప్పటి నుంచీ నాకు విజయనగరం వెళ్ళటానికి వీలుపడలేదు. అయినా తరచూ ఉత్తరాలద్వారా మాట్లాడుకునే వాళ్ళం. కనీసం ఆ ఉత్తరాల్లో కూడా నాకు ఆయన అనారోగ్యం గురించి చెప్పలేదు.
ఇంతలో డాక్టరు గారిని పిలవమన్నారు కవిగారు.
పక్కగదిలో తనను నియమించిన అభిమానితో మాట్లాడుతున్న డాక్టర్ పరుగు పరుగున వచ్చారు.
ఆక్షణంలో కవిగారి మాటలు వింటే నాకు ఆయనలోని ఆత్మవిశ్వాసపు విశ్వరూపం కనిపించింది. ఆ ఆత్మవిశ్వాసం ఎంతగా ఈ ప్రపంచాన్ని ఆక్రమించేసి తనను కబళించటానికి వచ్చిన మృత్యువును కూడా మింగేయాలని చూసిందంటే.. అది ఆయన మాటల్లోనే ధ్వనించింది... కళ్ళల్లో కనిపించింది.. అతి కష్టంగా లేని ఓపికనుకూడగట్టు కొని ఆయన గొంతు లోతుల్లోంచి మెల్లెగా గాలితో కూడుకున్న మాటలు...
‘‘ డాక్టరు గారూ.. నేను ఆరోగ్యవంతుడిని అయినట్లేనా.. ఇంక నేను నా రచనలు చేసుకోవచ్చా.. ఆరు నెలలు అయింది. నేను రచనలు ఆపేసి.. ఆరోగ్యం కుదుటపడ్డాక రచనలు చేయమన్నారు మీరు. ఈ రోజు చాలా హుషారుగా వున్నాను. సగంలో ఆపేసిన ఆ నవల పూర్తి చేద్దామని అనుకుంటున్నా..! ’’

నిజానికి ఆయన పరిస్థితి అదికాదు.! కానీ, ఆయన స్థితి చూస్తుంటే అనిపిస్తుంది బహుశ మనిషంటే ఇంతేనేమోనని.! అంతిమ ఘడియలు ముంచుకొస్తున్నా వాటి నుంచి దూరంగా పరిగెట్టాలని ప్రయత్నించి, చివరికి మ‌త్యు కౌగిటిలో ఒదిగి పోవాల్సిందే అన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు.
మౌనంగా ఉన్న ఆ వాతావరణాన్ని ఛేదిస్తూ..
‘‘ డాక్టర్ మీరు పర్మిషన్ ఇస్తే నవల పూర్తిచేస్తాను’’ మరోసారి అడిగారు సుదీర్ఘమైన శ్వాస తీసుకుంటూ..
డాక్టరు గారు ఏం చెప్తారోనని నేను, మిగిలిన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.. అది గమనించిన డాక్టర్ కవిగారి చేయి పట్టుకొని భరోసా ఇస్తున్నట్లు...
‘‘ ముందు విశ్రాంతి తీసుకోండి.. రచనలు తరువాత చెయ్యచ్చు..’’ అన్నారు.
లేని ఓపికను కూడగట్టుకొని పెద్దగా నవ్వాలని ప్రయత్నించారు కవిగారు. కానీ అందుకు శరీరం సహకరించలేదు. ఆ నవ్వు పెదవులమీద, ఆయన కళ్ళల్లో కనిపించింది.
‘‘ మీ డాక్టరు.. ఎప్పుడూ ఇంతే.. నాకు తెలుస్తోంది డాక్టర్.. నా నావ లంగరు ఎత్తుకొని ఈ మజిలీ నుంచి మరో మజిలీని వెతుక్కుంటూ బయల్దేరుతోందని. బహుశ ఈ ప్రపంచపు మజిలీలు దాటి మరో క్రొత్త ప్రపంచం వైపు వెళుతుందేమో.. అంతిమ వీడ్కోలు పలకటానికి ఇంతమంది అభిమానులు... ’’ పెద్దగా దగ్గువచ్చింది... నోటి వెంట నెత్తురు పడ్డది..!
డాక్టరుగారు విశ్రాంతి తీసుకోమన్నట్లుగా రచయితగారి భుజం తట్టారు.. డాక్టర్ కి ఏం మాట్లాడాలో తెలియటంలేదు. గొంతునుండి మాట పెగల్లేదు..
మా అందరి పరిస్థితీ అలాగే వుంది.
కవిగారు నవ్వుతూ..
‘‘ అలా అయిపోయారేంటి డాక్టరు గారూ.. మీకు సెంటిమెంట్లు లేవని నాతో చాలాసార్లు అన్నారు.. మరేంటి...!’’
డాక్టర్ మొహం తిప్పుకున్నారు. అప్పుడే గమనించాను. ఆయన కళ్ళల్లో నీళ్ళు ధారలా కారుతున్నాయి. కఠినంగా వ్యవహరించే ఆంగ్లేయుల హృదయాల్ని కూడా కదిలించి వారిలోని భావోద్వేగాలను ఉద్దీపన చేయగల ధీశాలురు మన రచయితగారని.!
‘‘డాక్టర్’’ రచయిత పిలిచారు.
ఏంటన్నట్లు చూశారు డాక్టర్
‘‘ నాకీరోజు పత్యం కూరలు వద్దు.. మామిడి పండు తినాలని వుంది.. తిననిస్తారా’’ ఆసక్తిగా, ఆర్తిగా అడిగారు..
ఆయన కళ్ళలో నాకు మామిడి పళ్ళు తినాలన్న ఆశ కనిపించింది. కానీ అది తీరేది కాదన్న సంగతి గ్రహించిన వాడిలా ముహంలో భావం కనిపించింది. ఒకే మనిషి మొహంలో ఒకేసారి ఇన్ని రకాల భావాలు పలకటం నేను మొదటిసారి చూశాను.
‘‘ఇది మామిడి పళ్ళు కాసే కాలం కాదుగా...’’ అన్నాడు డాక్టర్.
సరే అన్నట్లు తలూపే ప్రయత్నం చేస్తూ కళ్ళతో సర్ది చెప్పుకున్నారు కవిగారు.
‘‘ ఏమో..! తినాలనిపించింది.. అడిగాను.. నేను బయటి ప్రపంచాన్ని చూడక ఇప్పటికి రెండు సంవత్సరాలు.. ీ ప్రపపంచాన్ని దాటితే మళ్ళీ ఈ ప్రపంచంలో ఉండే వితలు చూడగలనో లేదో అన్న భయం.. డాక్టర్ అటు చూడండి...’’
అంటూ మాకు గది గుమ్మం వైపు చూపించారు. మేమంతా ఆసక్తిగా అటు చూశాం...
మాకేం కనిపించలేదు..
‘‘ ఏముందక్కడ’’ అడిగాడు డాక్టర్ ఆసక్తిగా...
‘‘ నన్ను తనతో తీసుకెళ్ళటానికి మృత్యువు మేడమెట్లెక్కి ఈ లైబ్రరీలోకి వస్తోంది.. ఆ శబ్దం నాకు వినిపిస్తోంది. ఇక్కడ నేను నిర్వహించాల్సిన బాధ్యతలున్నాయి.. మరికొంతకాలం నన్ను బ్రతికించగలరా..’’ అన్నారు రచయిత డాక్టర్ చెయ్య పట్టుకొని
మాకు అర్థమైంది.. మృత్యువు మరింత తొందరగా ఆయన్ను చుట్టు ముడుతోందని. మృత్యువు దుర్వారమైంది. మృత్యువు తనను తాకక ముందే ఒక్కసారి జీవితానందం అనుభవించాలనే కోరిక.
డాక్టరుకి ఏం మాట్లాడాలో అర్థంకాని పరిస్థితిలో వున్నారు. కానీ ఏదో ఒకటి మాట్లాడాలి. లేకపోతే రచయిత మరింతగా కృంగిపోతాడు.
మహారచయితకు ఆయాసం అంతకంతకూ అధికం అవ్వసాగింది. తాను చెప్పదలచుకున్నది చెప్పాలనే తాపత్రయం.. కానీ చెప్పనీకుండా ఆయాసం అడ్డుతగులుతోంది. అక్కడున్న పేపరు వాళ్ళు తంత్రిలో మహారచయిత అస్తమయం అని మెసేజ్ లు పంపే ప్రయత్నంలో వుండిపోయారు.
ఆ మహారచయితను తనతో తీసుకుపోటానికి మృత్యువు గుమ్మంలో నిలబడి వుంది.. దాని అడుగుల చప్పుడు బహుశ ఆయనకు వినిపిస్తూ వుండి వుండచ్చు. ఎందుకంటే ఆయన గుమ్మం వంకే కన్నార్పకుండా చూస్తున్నారు.
ఆయసపడుతూనే కవిగారు డాక్టర్ ని పిలిచారు...
‘‘ డాక్టర్ గారూ... మృత్యువు నన్ను తన కౌగిట్లో బంధించేలోగా నాతో సహజీవనం చేసిన ఈ గ్రంథాలయ బాధ్యతలను మీకు అప్పగిస్తున్నాను. చివరిసారిగా నా గ్రంధాలను నేను చూసుకుంటాను.. నన్ను లేపి కూర్చోపెట్టండి.. నా అనంతరం వీటిని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే...’’ అంటూ తన గ్రంధాలయ బాధ్యతను డాక్టర్ కి అప్పగించారు.. డాక్టర్ మెల్లిగా కవిగారిని లేపి కూర్చోపెట్టారు. కవిగారు ఆయన రాసిన గ్రంథాలను తనివితీరా చూసుకున్నారు.
ఆయాసం అంతకంతకూ అధికమౌతోంది..
‘‘మీరు విశ్రాంతి తీసుకోండి.. అలా మాట్లాడుతుంటే మీ ప్రాణానికే ప్రమాదం’’ అన్నారు డాక్టర్.
కవిగారి పెదవులపై నిర్లిప్తమైన లాస్యం.. తనలోని ఓపికను కూడదీసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.
‘‘ నన్ను మరి రెండు రోజులు బ్రతికించలేరా..! నేను మధ్యలో ఆపేసిన రచనను పూర్తి చేసుకుంటా....’’
ఇదే ఆ రచయిత ఆఖరుమాట.. ఆయన ప్రాణాలు అనంతవాయువుల్లో అంతర్లీనమై పోయాయి.
సీమ డాక్టరు నిర్లిప్తంగా రచయిత పక్కనుండి లేచి నిలబడ్డాడు. రచయిత కోరిక మేరకు ఆయన్ని ఆ గ్రంథాలయం నుంచి కదపలేదు.. అందరూ ఆయన పార్థివదేహం చూడటానికి ఆ గ్రంథాలయంలోకే వస్తున్నారు. కొంత దూరంగా రచయితగారి డైరీ కాగితాలు రెపరెపలాడుతున్నాయి. సీమ డాక్టర్ చూపు ఆ డైరీ మీదపడింది...

అప్పుడు సీమ డాక్టర్ గొంతు ఉద్వేగంగా పలికింది.
‘‘ ఈ మహాకవి మరణించారని ఎందుకు అనుకుంటున్నారు. ఈయన మరణించారని నేను చెప్పలేదు.. ఆయన ఇప్పటికీ.. ఎప్పటికీ బ్రతికే వుంటారు. మనమధ్యనే ఎప్పటికీ నిలిచిపోయి వుంటారు.’’
మాట పూర్తయ్యేసరికి ఆయన గొంతులో గద్గదత చోటుచేసుకుంది. ఆయన వెళుతూ వెళ్తూ రచయిత డైరీని నాకు అప్పగించి వెళ్ళిపోయారు..

నేడు ఆయన భౌతిక శరీరం నుండి విముక్తి పొంది కాంతి దేహంతో కొత్త లోకాలకి పయనమయ్యారు. కానీ ఆయన యువతకు అందించిన రచనల్లో ఆయన జ్ఞాపకాలు ఇంకా ఈ లోకంలో తన తరువాతి తరానికి విడిచిపెట్టి మహాప్రస్థానం చేరుకున్నారా కవిమహారాజు.

*********

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి