వినీల - బొబ్బు హేమావతి

Vineela

స్పెయిన్....మాడ్రిడ్...పోష్ ఏరియా... అందమైన ఇల్లు.... త్రీ ఫ్లోర్ హౌస్...ఇంటి ముందు స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియా…ఇంటి చుట్టూ ప్రత్యేక లైటింగ్, ఎక్సోటిక్ ప్లాంట్స్…. కిటికీ పరదాలు తొలగించుకుంటూ సూర్య కిరణాలు లోపలికి ప్రవహిస్తున్నాయి... అందమైన సూర్యోదయపు వెలుగు ఆ గదిని మరింత అందంగా మారుస్తున్నది.

ఫోన్ రింగింగ్......బద్దకంగా లేచి ఫోన్ తీశాడు "కడియాల " ఉరఫ్ కడియాల రామక్రిష్ణ...అతను డైరెక్టర్... అరోరా ఫ్యూచరిస్తిక్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కి...సింపుల్ గా "అరోరా" అతని ప్రాణం.

"అరోరా"...అది మాడ్రిడ్ లో ఒక పెద్ద సంస్థ....ఫోన్ లిఫ్ట్ చేయగానే "హేయ్ రామ్స్" అంటూ అటు పక్కనుండి అమ్మాయి పిలుపు.

"బతికే ఉన్నావా" అంటూ నన్ను ఎక్కడో దూర తీరాల నుంచి తియ్యటి గొంతు పలకరించింది.

ఆమె వాయిస్... ఆ తియ్యటి పలకరింపు నాలో ఏవో మరచిపోలేని సంఘటనలను పైకి రేపాయి. ఇంత పొద్దున్నే నన్ను పలకరిస్తూ ఉన్న ఈమె ఎవ్వరు అని ఆ మనిషి గుర్తురాక ఆలోచనలో నేను ఉన్నాను. నాకేమో నిద్రమత్తు ఇంకా దిగలేదు.

ఎక్కడో ఈ వాయిస్ విన్నట్లు ఉంది అనుకుంటూ నేను నా ఆలోచనల్లో ఉండగానే ...ఒక్కసారి గా ఆలోచన తట్టింది...నన్ను "రామ్స్" అని పిలిచేది ఒక్కరే ఈ భూమి మీద అని...అది "నీల" ఉరఫ్ "ఒబులరెడ్డి వినీల" అని…..చాలా రోజుల తరువాత...ఒక ఫోన్ కాల్ ..."వినీల" నుండి...ఇంకా నమ్మలేకపోతున్నా...నిజమేనా అని గిల్లుకొని చూసా.....నిజమే..."కల కాదు"

ఎక్కడ స్పెయిన్ లోని మాడ్రిడ్....ఎక్కడ ఇండియా లోని జమ్మలమడుగు...తల గట్టిగా విదిల్చాను...కలలో నుండి బయటకు రావడానికి...

ఇంత పొద్దున్నే నాకు చాలా ఏండ్ల తరువాత నా స్నేహితురాలి దగ్గర నుండి ఫోన్ కాల్...నీల....!!! నేను ఆశ్చర్యంతో గట్టిగా అరిచాను.

"నేనే రామ్స్... ఇంకా నమ్మలేకపోతున్నావా" అటు వైపు నుండి నీల నాతో అన్నది. "మేము మీకు ఫోన్ చెయ్యాల్సిన వాళ్ళమే కానీ...మీకు మేము గుర్తుంటామా"...కొంచం అలిగినట్లు గొంతు మార్చి అన్నది. వెంటనే "మిడిల్ డ్రాపర్" అంటూ నన్ను గేలి చేసింది ...గేమ్ మధ్యలో వేదిలేసావు నీవు అన్నది.

"హే... నీల...అదే డాషింగ్ ఇప్పుడు కూడా. నీలో ఏ మార్పు లేదు నీల" అన్నాను నేను."అల్లరి పిల్ల...వేళాకోళాలు చాలు ఇక"....అని నవ్వాను నేను.

"మనం కలిసేదేమైనా ఉందా బాస్"... అన్నది నీల..నేను జవాబు ఇవ్వక తన మాటలు వింటూ ఊహ లోకములోనికి వెళ్ళిపోయాను. ఇంతేనా జీవితం ? ..... రామ్స్ ...అన్నది వెంటనే."కరోనా లో పోయావేమో నీవు అని అనుకున్నాను నేను" అంది పకపకా నవ్వుతూ...

"అమ్మా తల్లీ...కాస్త ఊపిరి తీసుకోనీ నన్ను"... అన్నాను నేను వెంటనే నవ్వుతూ..."నీవు ఎక్కువగా ఓటీటీ షోలు చూస్తున్నట్లు ఉన్నావు!!! అందుకే అతిగా ఊహలు నీకు నీల" అన్నాను నేను. " త్వరగా మమ్మల్ని పైకి పంపేస్తున్నావు. మమ్మల్ని నమ్ముకున్నవారు ఉన్నారు నీల" అన్నాను నేను నీలతో..

"ప్రొఫెసర్ నారాయణ్ ఫెలిసిటేషన్ కి కూడా రాకపోతే ఏమనుకోవాలి"... అని అంది నీల నాతో. "అది కాకుండా ఆయనకు అనుంగు శిష్యుడు నీవు. నిన్న జరిగిన ఫంక్షన్ లో ఇక్కడ అందరూ నిన్నే తలుస్తూ ఉంటే నా కెంతో గర్వంగా అన్పించింది. నువ్వు ఉన్నత శిఖరాలకు ఎదిగితే నేను ఎదిగినట్లు ఉంది" అంది..."నీల" అని నేను ప్రేమగా పిలుచుకునే వినీల.

"రావాలి అనుకున్నా ... టికెట్ చివరి నిమిషంలో కేన్సిల్ చేయాల్సి వచ్చింది కొన్ని చెప్పలేని కారణాల వలన". "నీకు తెలుసు కదా ప్రొఫెసర్ నారాయణ్ అంటే నాకు దైవం అని" అన్నాను నేను నీల తో.

"ఆ... తెలుసు...ఆ కారణం ఏంటో"... అని నవ్వుతూ... "నీకు నీ కంటే నీ ...అరోరా... ముఖ్యం కదా" అంది మాటలను సాగదీస్తూ, చిన్నగా నవ్వుతూ.

తను నవ్వుతుంటే నాకు తనని అలా చూస్తూ ఉండాలని అనిపిస్తుంది.ఆ చిన్ని కండ్లు, చిక్కనైన బుగ్గలు, తెల్లటి పలువరుస,విచ్చుకున్న పెదవులలోని ఆ నవ్వు... ప్చ్ ...మనస్సులో అనుకున్నాను ఎప్పటికి మేము కలవగలము అని.

నేను మన స్నేహితులు అందరినీ కలిసా..ఒక్క నిన్ను తప్పా.. "నేచర్ లో నీ రీసెర్చ్ పేపర్ చదివా..ఈ ఇయర్ నీ పేరు నోబుల్ ప్రైజ్ విన్నింగ్ టీమ్ లో ఉంటుంది" అంది సంతోషం తో కిలకిలా నవ్వుతూ వినీల..."సరే ఇప్పుడే నిద్ర లేచినట్టు ఉన్నావు...నా కాల్ తో. నిన్ను చూడాలి అనుకున్నా, కానీ మాకు నీ దర్శనం ఎప్పటికో. ఒక్కటి నువ్వు అన్నా అనుగ్రహించాలి లేదా దైవం అన్నా అనుగ్రహించాలి. కొన్ని కోరికలు కోరుకుంటాం కానీ అవి చిన్నవి అయినా తీరని ఆశలు అవుతాయి. బహుశా నిన్ను చూడటం కూడా అంతేనేమో" అని నిసృహతో అంది నీల. తన మనస్సు నాకు అర్థం అవుతున్నా కూడా తన మాటలకు జవాబు ఇవ్వక నిశ్శబ్దంగా ఉన్నాను నేను.

వెంటనే నీల మాట మారుస్తూ అన్నది "నేను జమ్మలమడుగు లో ఇంటర్నేషనల్ స్కూల్ నడుపుతున్నా. స్కూల్ ప్రేయర్ టైం అయ్యింది...అదిగో పిల్లలు అందరూ గ్రౌండ్ లో వరుసగా నిలబడ్డారు. ప్రిన్సిపాల్ పిలుస్తున్నారు నన్ను అంటూ..రామ్స్ ... బై...అని నీల కాల్ కట్ చేసింది.

ఇండియా కి స్పెయిన్ కి 3.30 గంటల టైం తేడా...మాడ్రిడ్ లో ఇప్పుడు టైమ్ పొద్దున్నే 5.30. మాడ్రిడ్ ... స్పెయిన్ క్యాపిటల్...సౌత్ యూరప్...చాలా దేశాల రాయబార కార్యాలయాలు...పెద్ద పెద్ద కంపెనీలు..మంచి విశ్వవిద్యాలయాలు...కొత్త వ్యాపారాలకు, ఉన్నత ఉద్యోగాలకు ఎన్నో అవకాశాలు...నా కల నా ఆశ నా స్వంత కంపెనీ..

పుట్టేటప్పుడు బీదవాడు గా పుట్టోచ్చు గానీ చచ్చిపోయేటప్పటికి ధనవంతుడిగా చావాలి అన్నదే నా ఆలోచన. ఆఖరికి ధనవంతుడు గా మారడానికి, డబ్బు సంపాదనకు నా ప్రేమని కూడా వదిలేసాను.

నేను పెట్టిన స్థాపించిన కంపెనీని ప్రపంచములో ఉన్నత స్థానంలో నిలపడం నా ఆశయం. మాడ్రిడ్ లో ఉన్న ఆపర్టునిటీస్ నాకు స్వాతంత్య్రాన్ని ఇస్తాయి. కంపెనీ ఎంతగానో ఎదుగుతుంది అని ఆలోచించాను.అందుకే నేను మాడ్రిడ్ లో స్థిరపడ్డాను....అక్కడే "అరోరా" మొదలు పెట్టాను. ఇప్పుడు "అరోరా"ప్రపంచంలోని స్పేస్ కంపెనీలలో రెండో స్థానంలో ఉంది. దాన్ని మొదటి స్థానంలో నిలపడానికి నేను పట్టుదలగా ప్రయత్నిస్తున్నాను.

ఒక్కసారి గా నాకు గతం గుర్తుకు వచ్చింది...ఇరవై ఐదు సంవత్సరాల ముందు .....నేను బెంగళూరు లోని ఐఐఎస్సీ లో పీహెచ్డీ చేసేటప్పుడు...వినీల నా జూనియర్..నేను సియేస్ఐఆర్ జేఆర్ఎఫ్ తో బయోఫిసిక్స్ డిపార్ట్మెంట్ లో....తను ఇన్స్టిట్యూట్ ఫెలోషిప్ తో అదే విభాగం లో...

వినీల ఎంతో చలాకీగా...నవ్వుతూ... తుళ్ళుతూ...అరమరికలు లేకుండా...అందరితో స్నేహంగా ఉండేది. నేను పూర్తిగా భిన్నం...నెమ్మదిగా.... ఇంట్రావర్ట్ గా...అప్పుడప్పుడే వ్యక్తిత్వం ఒక రూపం గా మారుతూ నాలో. తనను చూస్తే నాకు తన లాగా మారాలని ఉండేది...రాత్రి పగలు తేడా లేకుండా రీసెర్చ్...క్యాంటీన్ లో కబుర్లు...

ఒక్కరా ఇద్దరా...ఎంతో మందిని నీల స్నేహం తో తన వైపు లాగేసుకుంది...నాకేమో తనని చూస్తే జెలసీ...సీనియర్...జూనియర్ అని లేదు...అందరికీ వినీల స్నేహితురాలు...నాకేమో ఒంటరిగా ఉండాలని ఉంటుంది.

నీల ఎప్పుడూ మందిని వెంటపెట్టుకుని ఏమో పెద్ద యువరాణి లా నన్ను మించిన వారెవ్వరూ లేరు అన్నట్లు తనలో తనే అనుకుంటూ క్యాంపస్ అంతా తిరుగుతుండేది. "అబ్బో మనుషులంటే ఏమి పిచ్చి ఈ పిల్లకి" అనుకునేవాడిని.

ఒకరోజు నేను తన వైపు చూస్తున్నట్లు తనకు అనిపించగానే నా వైపు చూసి కళ్ళు ఎగరేసింది ఏమిటన్నట్టు???. నేను చిన్నగా నవ్వుతూ ఏమీ లేదని కళ్ళతో జవాబు ఇచ్చాను.

వెంటనే మూతి మూడు వంకర్లు తిప్పి తన పొట్టి జుట్టు ని చేత్తో ఎగరేసుకుంటూ వెళ్ళింది. నాకు నవ్వాగలేదు. పది నిమిషాలపాటు పడి పడి నవ్వుతూనే ఉన్నాను.

ఒక ఆదివారం...నేను క్యాంపస్ క్యాంటీన్ లో కాఫీ వేడి వేడిగా తాగుతూ ఉంటే "నీల" ఎదురుగా ప్రత్యక్షం. దేవి కటాక్ష సిద్ధిరస్తు...అని పొద్దున్నే నా రూం మేట్ ఆకుతోట సంతోష్ అన్నట్లే...

"హే నీల ఎవ్వరు ఎక్కువ అల్లరి చేస్తారో చూద్దాం... బెట్ " అన్నా నేను ....

నీల తో నవ్వుతూ...కొంచెం తనతో ఆడుకోవాలి అనిపించి...

"హే రామ్ ఈ రోజు నువ్వు నాకు దొరికావు ముద్దపప్పు" అంటూ నీల నాతో ....

"ఋష్యశృంగుడివి అని అనుకున్నా...కానే కాదు సుమా" ...నేను రెడీ...అంది నవ్వుతూ...

వెంటనే తన కండ్లు నా కండ్లల్లో కలిశాయి...సిగ్గుతో వాలుతున్న నీల కండ్లల్లో నేను...

ఆ క్షణాన కాలం అలా నిలచి పోతే బాగుండు అనిపించింది...

అప్పుడు అనిపించింది నీల కి నా మీద ప్రేమ అని...

ఓహ్ అందుకేనా నేను లైబ్రరీ లో ఉంటే అక్కడ తను ప్రత్యక్షం...

నేను పక్క లాబ్ లో ఉంటే తను అక్కడే...

స్నేహితులతో కబుర్లప్పుడు నేను ఉన్నాను అంటూ అక్కడ కూడా తయారు...ఓహ్ గాల్లో తేలినట్లు ఉంది నాకు ఆ క్షణం...

she is my stalker...ఆ ఆలోచనతో ...జూమ్ అని గుండెలో ఏదో పొంగింది.

ఇక అప్పటి నుండి తనతో కబుర్లే కబుర్లు...నీల నువ్వు నా హార్ట్ బ్రేక్ చేయకు ...కావాలంటే నా బోన్స్ బ్రేక్ చెయ్యి... Beacuse I have 206 of them ....అన్నాను.క్యాంపస్ లో ఎక్కడ చూసినా మేమే..

నీల ...నీవు ABCDEFGH అన్నాను ఒక రోజు .తన బ్లాంక్ ఫేస్ చూసి చెప్పాను ...“Adorable, beautiful, cute, delightful, elegant, fashionable, gorgeous, and hot.” తనలో ఒక పులకరింత... తనని అలాగే చూస్తూ ఉండాలని అనిపించింది.బెంగళూరు వీధుల్లో షికార్లు...నీల అనగానే ఎస్ బాస్ అంటూ తయ్యారు...

రాత్రి పగలు తేడా లేకుండా రీసెర్చ్... అధ్యయనం...ఎంత పని ఉన్నా మాకు అలసట అనేది లేదు...ప్రేమ పవర్...అలాంటిది....

ఏయ్ నీకు పొగరు అంటే....ఏదైనా అమ్మాయి కి కొంచెం పొగరు ఉంటేనే కదా అందం. నువ్వు నన్ను పొగరు అన్నావు అంటే నేను అందగత్తెను. పొగరున్న కొడెద్దును వంచడానికి అప్పుడు ఒక వీరుడు వస్తాడు , నీలాంటి వాడు. "మరేమో నా దగ్గర ఉన్న ఆస్తి పొగరు. నీకు కట్నం క్రింద పొగరు రాసిస్తా తీసుకో " అంటూ నవ్వు...

ఉన్నట్టుండి ఏదో చిన్న మాట మా మధ్య...అది కూడా సెమినార్ లో చెప్పాల్సిన ఒక రీసెర్చ్ పేపర్ మీద....నీల నాతో మాట్లాడటం మానేసింది...నీల నాతో మాట్లాడు అన్నా...నో అన్నట్లు తను తల ఊపింది...

ఒక రోజు రెండు రోజులు చూసా...నీల నాతో మాట్లాడక పోతే ప్రాణం పోయినట్టు ఉంది...ఆకలి లేదు...ఏ పని చేయ బుద్ది కాలేదు....

ఒక రోజు లాబ్ లో ఉన్నప్పుడు నేను నీల మాత్రమే ఉన్నాం...తన ఆలోచనలతో ఉన్న నేను నీల దగ్గరకు నెమ్మదిగా వెళ్ళా...తన ముఖాన్ని గట్టిగా దగ్గరకు లాక్కుని నా పెదవులతో తన పెదవులు కలుపుతూ ఒక స్ట్రాంగ్ కిస్ ఇచ్చా...(sexual assault without consent is a crime)

తను అలా అదిరిపోయి నిల్చొని ఉండిపోయింది...కండ్లు కదపలేదు ...శరీరాన్ని విదల్చలేదు...అలాగే నిర్జాంతపోయి ...ఒక బొమ్మ లా...నేను నాకు గా తనకి దూరం జరిగా. తనని అలా చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయా...ఇక తరువాత మా మధ్య మాటలు లేవు...

ఆ తరువాత వారం ....నేను తిరిగి తనను మాట్లాడించాలని చూసా...వినీల నన్ను కన్నెత్తి చూడలేదు...నా గురించి ఎవరికీ చెప్పలేదు...సారి చెప్పినా పలకలేదు...నీల నన్ను తప్పించుకొని తిరగడం మొదలు పెట్టింది....నీల ని అలానే చూస్తూ ఉండేవాడిని...కానీ తను నా వైపు చూసేది కాదు...నీల లో ఏదో మార్పు. చిన్నగా నా మనస్సు పసిగట్టింది. నేను చేసిన తప్పు వలన తనలో శృంగార భావనలు రేగాయి. అప్పటి వరకు తాను చిన్నపిల్ల కానీ నా స్పర్శ వలన పెద్దదయ్యింది.స్పర్శ వలన పుట్టిన ఆక్సిటోసిన్ తనలో మార్పుకు కారణం అయ్యింది.

తప్పు చేసానని నాలో ఎంతో బాధ...వెంటనే ప్రయాణమై ఊరికి వెళ్లి...నాన్న ఎప్పటినుండో చెబుతున్న పెళ్లి సంబందానికి ఓకే చెప్పాను...పెళ్లి కుదుర్చుకొని ఇంటి నుంచి వచ్చాను కానీ ....ఒక తప్పు చేశాను కదా అని తొందరలో మరొక తప్పు చేశానని గుర్తించలేకపోయాను....

ఆ రోజు ...వినీల ని కలిసాను....లాబ్ లో వర్క్ లో ఉన్నప్పుడు వినీల నా కోసం వచ్చింది. నీల ని చూడగానే తెలిసింది తన కోపం తగ్గింది నా మీద అని.కానీ నీల కళ్ళు నాతో ఏదో చెప్తున్నాయి. ప్రేమ...తన కళ్ళ నుండి నా మీద ఆప్యాయత పొంగుతోంది....నీల...అనగానే... రామ్స్ అంది.ఇద్దరం నిశ్శబ్దం గా ఒకరిని ఒకరు చూసుకున్నాం...పోగొట్టుకున్న పెన్నిధి దొరికినట్లు గా ఉంది మాకిద్దరికీ ....తను నా దగ్గరికి వచ్చి...లాబ్ లో అందరి ముందు....అందరూ చూస్తుండగానే...I LOVE YOU అంది....అందరూ ఒక్కసారిగా చప్పట్లతో స్వాగతించారు...నేను తన చేతులు నా చేతుల లోకి తీసుకున్నాను... ఆదరముతో .

కానీ నాన్నకి ఇచ్చిన మాట...మాట తప్పలేడు....ఈ రామ్. నీల ను నేను కాదనలేదు...అవుననలేదు. కళ్ళలో కళ్ళు పెట్టి అమాయకపు మొహంతో నీల ....నా వైపే చూస్తూ.......నా కళ్ళల్లోకి చూస్తూ I LOVE U అని చెప్పిన రోజు....నేను తనని ఆదరముతో చూసా కానీ....ఏ జవాబు ఇవ్వలేదు. జవాబు లేని ప్రశ్న గా నేను మిగిలాను తన మదిలో....

ఒక్క క్షణం నన్ను చూసి నవ్వి....వెళ్ళిపోయింది.

పెళ్లి పత్రికలు ...పంచటం మొదలుపెట్టాను.నీల కి పత్రిక ఇచ్చేటప్పుడు నా చేతులు వణికాయి.నీల నా కాబోయే భార్య పేరుని పెళ్లి పత్రిక లో చూసి...నా కళ్ళల్లోకి చూస్తూ చిన్నగా నవ్వింది.

ఇంటి దగ్గర పెళ్లి పనులు మొదలయ్యాయి. పెళ్ళికి ఐదు రోజుల ముందు నేను ఇంటికి చేరుకున్నాను. "ఏమే గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేది ఎంతసేపు.... తొందరగా కానీ అవతల పెళ్ళి వారు వచ్చేస్తున్నారు"....అంటున్నది జేజి అమ్మతో...పెళ్లి అయిపోయింది.నా భార్య ఎవరో కాదు...స్వయానా మా నాన్నకు చెల్లెలు కూతురు అంటే...నా మేనత్త కూతురు అలివేణి....కానీ నేను నీలవేణి గా తన పేరు మార్చేశాను.... అలివేణి నీలవేణి అయ్యింది .పెళ్ళికి అందరూ వచ్చారు ఒక్క వినీల తప్ప.

వినీల నుండి నీకు ఒక చిరు కానుక అంటూ డోనా......నా చెయ్యి పట్టుకుని నా చేతికి ఒక వాచ్ ని వేసింది .ఎంతో అందంగా ఉంది వాచ్ వినీల మనసు లా.....

పెళ్లి నుంచి తిరిగి వచ్చేటప్పటికి...వినీల కనిపించలేదు. ఎక్కడ రా అని అడిగితే మా ల్యాబ్ నుంచి వేరొక ల్యాబ్ కి మారింది అన్నారు. నేను అనుకున్నాను పెళ్లి తో వినీలతో నా బంధం తెగిపోతుంది....తన జీవితం తనది నా జీవితం నాది అని....అలా జరిగితే ఇంకేముంది. మా బాంధవ్యాన్ని నేను తక్కువగా అంచనా వేసాను.

మొదటి రాత్రి...నీలవేణి....నేను...? కానీ అందులో యాంత్రికత నాలో విరక్తిని రేకెత్తించింది....వినీల కనిపిస్తుంది....నా భార్య లో. మనస్సు లేని పెళ్ళి....మరమనిషి లా అయ్యింది నా జీవితం....ఏదో తినడం...పడుకోవడం....బాధ....విరహం....అది తీరేది వినీల దగ్గరే!!!

అప్పటికీ రామ్ పెళ్లి అయ్యి పది రోజులు అయ్యింది....వినీల ల్యాబ్ లో నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. తన సహచర స్కాలర్స్ తన బాధను దిగులు ని అర్థం చేసుకుని నీల ను నిశ్శబ్దంగా వదిలేశారు.

నీల అటు తలుపు వైపు చూస్తూ ఉండగా... రామ్... ఓ మైగాడ్....నిజంగా రామ్...లోపలికి వస్తూనే....ఆమె వైపు చూసాడు....నీల అతని కోసం ఎదురు చూస్తుందా అని అనిపించింది.....నీల కళ్ళల్లో వెలుగులు...ఆ కళ్ళని ...వాటిలో తన మీద ఉన్న ప్రేమను చూస్తూ రామ్ అలాగే నడచి వచ్చి ఆమె ముందు కూర్చున్నాడు....ఇద్దరు ఒకరిని ఒకరు చూస్తూ ఉండిపోయారు.

నీల వైపు చూసి చూడగానే..."నేను నీకు బ్యాకప్ కాదు.. రామ్" అన్నది నీల . అక్కడ కాకపోతే ఇక్కడ..."ఇక్కడ కాకపోతే అక్కడ అంటూ ఆడుకోకు".

"నీల.... బి స్ట్రాంగ్....సిల్లీ గా ఆలోచించకు. నాకు నువ్వు కావాలి...ఇక నేను నిన్ను వదులుకోను. నాకు ప్రాన్స్ లో పోస్ట్ డాక్టోరల్ ఫెల్లో గా ఆఫర్ వచ్చింది "అన్నాడు రామ్.

రామ్స్ కు ప్రాన్స్ నుండి చాలా మంచి ఆఫర్ వచ్చింది అని వినగానే నీల కొంచెం దిగులుపడ్డా... ఆమె అతనికి ధైర్యం అయ్యి అతనిని ఈ ఆఫర్ కోవద్దు అని చెప్పింది.

రామ్ వైపు చూస్తూ నీల అన్నది " నువ్వు తొందరపడి పెళ్ళి చేసుకున్నావు అని నేను అనలేను. ఎందుకంటే నీ ఆలోచనలు నీ భవిష్యత్తు మీద నీకు ఉంటాయి.నీ మీద నాకు ప్రేమ ఉంది...కానీ పెళ్ళి అంటే బాధ్యత. దాని కంటే ముఖ్యమైనది నీ భవిష్యత్తు. ప్రేమ గోలలో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నువ్వు బాగుండాలి...నేను నీ జ్ఞాపకాలతో బతికేయగలను " అన్నది.

రామ్ దిగులుగా బాధతో "ఇక నేను రోజు కొంచం కొంచం విషం తాగాలి " అనగానే...నీల చటుక్కున రామ్స్ వైపు చూసి "విషమేంటి" "నీకు గా నువ్వు కోరుకుని పెళ్ళి చేసుకున్నావు...పెద్ద వాళ్లకు ఏమి సమాధానం చెప్తావు...ఆ అమ్మాయి భవిష్యత్తు, ఇక నీ భవిష్యత్తు ఏమి కావాలి...అనగానే రామ్ నీల వైపు చూసి "సరే, చెప్పింది చేస్తాను. కనీసం అప్పుడప్పుడు ఉత్తరాలు రాయి " అంటూ చటుక్కున లేచి వెళ్ళి పోయాడు.

రామ్స్ ...ఫ్రాన్స్ లో తన ల్యాబ్ లో కూర్చొని నీల ఉత్తరాలు చదువుతూ ...ఆలోచిస్తున్నాడు....

వారిద్దరూ స్నేహితులుగా ఉన్న రోజుల్లో ఒక రోజు... నీల నాతో కబుర్లు చెబుతూ "చూసావా ఆ మామిడి చెట్టుకు కాయలు లేవు" అన్నది దిగులుగా లాబ్ వెనక వైపు ఉన్న బంగిన పల్లి మామిడి చెట్టును చూస్తూ . తన బాధ నాకు అర్థమైంది.

వెంటనే నీల అంది "రామ్స్ మా ఇంటి పక్కన పండు అనే బాబు, బుజ్జి అనే పాప.... ఉండేవాళ్ళు...ఎంత ముద్దుగా ఉండేవారు తెలుసా..." అంటూ నా కళ్ళల్లోకి చూసి సిగ్గుపడింది.

నాకు అర్థం అయ్యి "ఊహూ...అంత ముద్దు వచ్చేవారా" అంటూ "ఇంతకీ వారివి నీ పోలికలా లేక నా పోలికలా" అన్నాను.

సిగ్గుతో నీల తన కళ్ళు ఆర్పుతూ "మన ఇద్దరి పోలికలు" అన్నది గుర్తుకు రాగానే నా మనస్సు ఆనందంతో నిండి పెదవులపై నవ్వు విచ్చుకుంది.

ల్యాబ్ లోని నా సన్నిహితులు నా చిరునవ్వు చూసి "లవర్ గుర్తుకు వచ్చిందా" అంటూ నా వైపు చూసి నవ్వారు.

నేను నవ్వుతూ "ఎప్పుడైనా మర్చిపోతే కదా" అన్నాను.

నీల దగ్గర నుండి ఉత్తరాల మీద ఉత్తరాలు....

"ఎలా ఉన్నావు బంగారు"...అంటూ

"బంగారు నిన్ను చూసి చాలా రోజులు అయ్యింది...కనీసం నీ మొహం కూడా చూపించ లేదు" అంటూ....దిగులుతో

"తిన్నారా, బాగా నిద్ర పోతున్నారా ...అబ్బాయి గారు" ...అంటూ ...

"అబ్బాయి గారు మీకు కంగ్రాట్స్ చెబితే థాంక్స్ కూడా లేదు. మూడు నెలలకో ఆరు నెలలకో కొన్ని సంవత్సరాలపాటు చూపులే లేవు. మొహం చూస్తే మోహం రాదా. మగవాళ్ళు మీరు ... మాకు దిగులు రాదా.. ఒక్క క్షణం వదిలి ఉండలేను అనుకున్నా...ఎప్పటికీ వదిలి ఉండేలా గుండె బరువెక్కింది"

ఏంటిది పిచ్చి ప్రేమ...అసలు నేను నీల ప్రేమకు అర్హుడినా ?

రామ్స్ తల భారంగా విదిలించాడు...నేను నీలని మోసం చేసాను...ఎంతో నమ్మింది నన్ను .....

తన ప్రాణాన్ని నా పైన ఉంచుకుంది...కానీ తన ఉత్తరాలకి ఇప్పుడు జవాబు ఇచ్చి....తనని నేను ఇంకా మభ్య పెట్టలేను.....

ఒక రోజు వచ్చిన ఉత్తరము చదవగానే... అది నీల చివరి ఉత్తరం... పది ఏండ్ల క్రితం వచ్చిన ఉత్తరం... తరువాత నీల ఏమయ్యిందో తెలియలేదు... నీలను తలచుకోగానే, నా కంట్లో నీళ్లు...

" ప్రియమైన రామ్స్..ఏదో శక్తి నన్ను నీ వైపు లాగేస్తుంది. అనుక్షణం నిన్నే తలుస్తూ ఆ అనురాగం ఎలా చూపాలో తెలియక తపిస్తున్నా బంగారు. మళ్ళీ మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టను. దూరంగా ఉన్నా తప్పించుకోలేక, నీ బంధాన్ని, నాలోని శూన్యాన్ని నీతోనే నింపేస్తున్నా. ఎప్పటికీ సెలవ్...నీల" ....

ఇన్ని ఏండ్ల తరువాత ఇప్పుడు తిరిగి నీల దగ్గర నుండి నాకు ఫోన్ కాల్. తనకు నేను ఎంతో అవసరం ఉన్నా, నన్ను వదిలి పెట్టి తన భవిష్యత్తు తాను నిర్మించుకోవడం కాక దారి చూపి నా భవిష్యత్తును నిర్మించింది.

మరిన్ని కథలు

Dhruvuni vamshamu
ధృవుని వంశము.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Aachari mastari vupayam
ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ )
- కొత్తపల్లి ఉదయబాబు
Aadaleka maddela odu
ఆడలేక మద్దెల ఓడు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Garam chai
గరం చాయ్
- వేముల శ్రీమాన్
Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao