అమ్మ రమ్మంది అని కృష్ణ, కిరణ్ లు రామాపురం వచ్చేరు. వచ్చిన దగ్గరినించీ ఎందుకు రమ్మందో అడిగితే నవ్వి వూరుకుంటోంది తల్లి. రోజూ సాయంత్రం మాత్రం బయటికి వెళ్లి వస్తోంది. ౩ రోజులు గడిచేయి, రేపు సాయంత్రం హైదరాబాద్ వెళ్లి పోవడానికి నిశ్చయించు కున్నారు వాళ్ళు . అన్నదమ్ములు చాలా అభిమానంగ వుంటారు. ఆ రోజు కూడా అమ్మ పడుతున్న కష్టం మరోసారి వాళ్ళిద్దరిలో చర్చకి వచ్చింది. వాళ్ళ భార్యల ఇష్టానికి వ్యతిరేకంగా అయినా, తల్లి కి ఆ వూళ్ళో ఒక ఇల్లు కట్టించాలని అనుకున్నారు. ఆ పూరింట్లో అమ్మ ఉండడం వాళ్లకి అసలు ఇష్టం లేదు.
ఆ రోజు ఉదయాన్నే రాజేశ్వరి పిల్లల్ని పిలిచి
"మరో రెండు రోజులు ఉండాలి రా, కరణం గారు శుభ వార్త తీసుకు వచ్చేరు. కోర్ట్ తీర్పు వచ్చింది ...మనకు న్యాయం జరిగిందిట . మన పొలం మనకు వస్తోంది" అంది. పిల్లలిద్దరూ చాలా సంతోషించేరు. సెలవు పొడిగించేరు.
"అమ్మకి ఇల్లు కట్టడానికి ఆ పొలం అమ్మేస్తే సరిపోతుంది" అని వాళ్ళ లో వాళ్ళు అనుకున్నారు...ఎందుకంటె, వాళ్ళ భార్యలు హైదరాబాద్ నుండి డబ్బు తెచ్చి , ఆ పల్లెటూర్లో ఇల్లు కట్టడం అంటే ఇష్ట పడడం లేదు.
అసలు రాజేశ్వరి కి వాళ్ళు ఆ పల్లెటూర్లో ఎందుకు ఇల్లు కట్టాలి అనుకుంటున్నారో తెలియాలి అంటే, రాజేశ్వరి కథ పూర్తి గా తెలియాలి.
రాజేశ్వరి కి చిన్న వయసులోనే పెళ్లి అయిపొయింది. భర్త రామారావు కూలికి వెళ్ళేవాడు. వాళ్ళు ఉండేది పూరి గుడిసె లోనే. భర్త పేరు మీద ఒక ఎకరం పొలం వున్నా, అది... దాయాదుల గొడవల్లో ఉండడం తో సేద్యం కూడా లేదు. అయినా పుట్టిన వూరు మీద మమకారం తో వూరు దాటి వెళ్ళలేదు. ఉన్న పూరిల్లే వాళ్ళకి స్వర్గ సీమ. రాజేశ్వరి తెలివయినది. భర్తకి చేదోడు వాదోడు గా ఉంటూ ఖాళీ సమయాలలో పొలం పనులకి వెళ్ళేది. అలాగే బుట్టలు అల్లడం, మిషను కుట్టడం లాంటి చిన్న పనులు చేస్తూ ఏదో విధం గా తానూ సంపాదించేది. పెరట్లో కూరలు పండించు కుంటూ, ఉన్నంతలో సంసారం జాగ్రత్తగా నడుపుకునేవారు.
4 కిలోమీటర్ల దూరం లో వున్న పట్నం లో పిల్లలు చదువు కున్నారు. అమ్మ, నాన్నల క్రమ శిక్షణ లో పిల్లలు కూడా బాగానే చదువుకున్నారు. కృష్ణ, కి 13 ఏళ్ళు, కిరణ్ కి 12 ఏళ్ళ వయసు వచ్చింది. ఆ ఏడాది, పొలం గొడవ కోర్టులో తేలింది అని, తమ కస్టాలు తీరిపోతాయి అని, అన్నాడు రామారావు. అయితే కోర్టు తీర్పు కోర్టు తీర్పు అమలుకాలేదు. కారణం ప్రత్యర్ధులు అప్పీల్ కి వెళ్ళేరు. . పట్నం లో కోర్టుకి వెళ్లి వస్తున్న రామారావు ని లారీ గుద్దేసింది. అక్కడి కక్కడే చనిపోయాడు. భర్త మరణం వలన కుటుంబానికి ఆదాయం లేకుండా పోయింది. గుండె ధైర్యం తో సమస్యలని ఎదుర్కొంది రాజేశ్వరి. పొలం పనులకి వెళ్లి, కాయ కష్టం చేసి కుటుంబాన్ని చూసుకుంది.
పిల్లలిద్దరినీ పట్నం లో సాంఘిక సంక్షేమ హాస్టల్ లో చేర్పించి చదివించింది. కష్ట పడి చదివిన కృష్ణ, కిరణ్ లు బ్యాంకు లో ఒకేసారి వుద్యోగం సంపాదించేరు. కృష్ణ కి వుద్యోగం హైదరాబాద్ లో వచ్చింది , కిరణ్ కి నిజామాబాదు లో వచ్చింది.
భర్త మరణించిన తర్వాత , ఆమె వూరు దాటి రాలేదు. తమ పొలం కోసం భర్త చేసిన పోరాటం కొనసాగించింది. ఊరి కరణం మంచివాడు. రాజేశ్వరి కి కోర్టు పనుల్లో సలహాలు ఇచ్చేవాడు.
కానీ ఏళ్ళు గడుస్తున్నా కోర్టు గొడవ తెమిలి రాలేదు.
ఉద్యోగాలు వచ్చేక కృష్ణ కిరణ్ లు మొదటి సారిగా తల్లిని అడిగేరు
"అమ్మ! నువ్వు హైదరాబాద్ వచ్చేయి .. ఇక్కడ సుఖం గా ఉందాం, నువ్వు ఒక్కర్తివే ఆ పల్లెటూర్లో ఉండడం ఎందుకు" అని
“ రాను” అంది రాజేశ్వరి. రామాపురం వదిలి రావడం ఆమె కి ఇష్టం లేదు.
అప్పుడు అనుకున్నారు అన్న దమ్ములు.. పోనీ అమ్మకి రామాపురం లోనే ఒక మంచి బిల్డింగ్ కట్టించాలి అని.
అయితే కొత్తగా ఉద్యోగాలు వచ్చేయి, అప్పుడే అంత డబ్బు సమకూరటం కష్టం, ఒక మూడు సంవత్సరాలు వుద్యోగం చేసేక ఇల్లు కట్టించాలి అనుకున్నారు.
ఏడాది తిరిగేసరికి కృష్ణ కి పెళ్లి చేసింది. కోడలు స్వాతి కృష్ణ లు హైదరాబాద్ లో సనత్ నగర్ లో ఫ్లాట్ అద్దెకి తీసుకుని కాపురం పెట్టేరు. కిరణ్ అమీర్ పెట్ లో హాస్టల్ లో ఉండేవాడు. మళ్ళీ అడిగేరు తల్లిని హైదరాబాద్ వచ్చేయమని. కానీ ఆమె రానంది. 2 సంవత్సరాలయ్యే సరికి కిరణ్ కి కూడా పెళ్లి చేసేసింది. అప్పటికి కిరణ్ కూడా హైదరాబాద్ TRANSFER మీద వచ్చేసేడు. కిరణ్ స్వప్న లు అన్నయ్య దగ్గర్లోనే ఇల్లు తీసుకుని కాపురం పెట్టేరు.
ఇద్దరి పెళ్లిళ్లు అయిపోయాయి కనుక, అప్పుడు కృష్ణ మళ్ళీ అడిగేడు తల్లిని, హైదరాబాద్ వచ్చేయమని.
కానీ రాజేశ్వరి ఒప్పుకోలేదు. "తనకు రామాపురం లోనే తోచుబాటు అవుతుంది కానీ ఇంకెక్కడా ఉండలేను" అంది. “ఆ పూరింట్లోనే అన్నీ తనకు ఉంటాయి... పైగా వాళ్ళ నాన్న కోర్ట్ కేసు తేల లేదు, కదా అంది.
" కోర్ట్ కేసు ఇన్నాళ్లు తేల లేదు, ఇంక అది తేలడం, నువ్వు రావడం ఎప్పుడు" ? 'మాతో వచ్చేయి, కోర్టు కేసు తేలితే, వెళ్లి చూసుకోవచ్చు'. అన్నాడు కృష్ణ.
కానీ ఆమె నిర్ణయం మారలేదు.
కిరణ్, కృష్ణ లు అప్పుడు మళ్ళీ అనుకున్నారు, “అమ్మకి ఎలాగయినా, ఊర్లో పూరిల్లు పడేసి మంచి బిల్డింగ్ కట్టాలి”.. అని.
స్వాతి స్వప్నలకి ఆ నిర్ణయం నచ్చలేదు. ఆ పల్లెటూర్లో ఇల్లు కట్టడం కాపిటల్ వేస్ట్ అని వాళ్ళ ఉద్దేశ్యం. పెళ్ళాల మాటలకు, యేమని అనాలో తోచలేదు వాళ్లకి.
మరో సంవత్సరం గడిచింది. ఇద్దరికీ మగ పిల్ల లు పుట్టేరు. పిల్లల్ని చూడడానికి వచ్చిన రాజేశ్వరి హైదరాబాద్ లో ఒక్క రోజు కంటే ఎక్కువ ఉండేది కాదు.
ఇదీ ఆమె కథా, మరియు ఇల్లు కట్టడం నేపధ్యం.
***
ఆ రోజు కారణం గారి నుండి కబురొచ్చింది. లాయర్ గారు కోర్టు తీర్పు కాపీ వచ్చిందని చెప్పేరట. సంబరంగా పిల్లల్ని తీసుకుని లాయర్ గారి ఇంటికి వెళ్ళింది రాజేశ్వరి.
" నీ కష్టం ఫలించింది రాజేశ్వరి, ఆ పొలం నీకు స్వాధీనం చెయ్యమని కోర్టు ఆర్డర్స్ వచ్చేయి అన్నారు ఆయన.
రాజేశ్వరి ఆనందానికి అవధులు లేవు. పిల్లల్ని పిలిపించింది అందుకే. వాళ్ళుండగా ఆ శుభ వార్త వినాలని ఆమె ఉద్దేశ్యం. కోర్ట్ ఆర్డర్ కాపీ తీసుకుని, ఫార్మాలిటీస్ పూర్తి చేసి, పంచాయితీ PRESIDENT కి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆయన సమక్షం లో కృష్ణ కిరణ్ లు దగ్గరుండి పొలం కొలతలు వేయించి, స్వాధీనం చేసుకున్నారు. అధికారులకి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వచ్చేరు.
స్వాధీనం చేసుకున్న పొలం లో వ్యవసాయం చేద్దామని అంది రాజేశ్వరి. కృష్ణ, కిరణ్ లు మొహాలు చూసుకున్నారు. ఎన్నో సంవత్సరాలు పోరాడి సాధించుకున్న పొలం. .. ఇప్పుడు అమ్మడం ప్రస్తావన తెస్తే, అమ్మ మనసు చిన్నపుచ్చుకుంటుంది అనుకుని ఊరుకున్నారు.
ఆ రాత్రి పక్క ఇంటి ఆమె తో రాజేశ్వరి అనడం విన్నాడు కృష్ణ
" వదినా! మా పిల్లలు నాకు ఇక్కడ పూరిల్లు పడేసి, మంచి బిల్డింగ్ కడతారట. నా వంతు సాయం గా ఓ 5 లక్షలు దాచెను. వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు, అది వాళ్ళకి ఇస్తాను " అంటోంది.
“ అమ్మ ఎప్పటికీ రామాపురం వదిలి రాదన్నమాట” అనుకున్నాడు.
మరో ఆరు నెలలు గడిచేక, పొలం అమ్మి ఇల్లు కట్టడం ప్రస్తావన తేవచ్చు అనుకున్నారు అన్నదమ్ములు.
అలా అనుకుని, వాళ్ళు ప్రశాంతంగా పడుకున్నారు. మరునాడు సాయంత్రం వాళ్ళ తిరుగు ప్రయాణం.
తెల్ల వారింది. లేచి పనులు చేసుకుంటోంది రాజేశ్వరి. ఇంతలో గుండెల్లో నెప్పి లా అనిపించింది. గుండె పట్టుకుని వరండాలో కూలబడింది. ఆమె చేతి లో బకెట్ జారి పడి, పెద్ద శబ్దం తో కిందకు దొర్లి పోయింది.
ఆ శబ్దానికి బయటకి వచ్చిన కృష్ణ, కిరణ్ లకు రాజేశ్వరి నేలమీద పడిపోయి ఉండడం కనపడింది. తల్లికి ఏమయిందో అని ఆందోళనగా చూసేరు. ఆమె లో చలనం లేదు.
ఊరి డాక్టర్ ని తీసుకుని వచ్చేడు కృష్ణ. నాడి కొట్టుకోవట్లేదు. డాక్టర్ పెదవి విరిచేడు.
“మీ అమ్మ, మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది నాయనా..., massive heart attack. “ అన్నాడు DOCTOR.
అన్నదమ్ములు ఇద్దరూ గొల్లు మన్నారు. ఇల్లు కట్టే పని ఎప్పుడో పూర్తి చేసి ఉండాల్సింది...
అమ్మకి ఇల్లు కట్టాలన్న కోరిక తీర కుండానే, వెళ్లి పోయింది అని వెక్కి వెక్కి ఏడ్చారు.
- END-