మనసు స్వేచ్చాజీవి.. బుద్ధి నియంత! - చెన్నూరి సుదర్శన్

Manasu swechca jeevi buddhi niyantha

రమణ, నేను ఈమధ్యనే పదవీ విరమణ చేసాం. ఉద్యోగపరంగా శాఖలు వేరైనా.. అభిరుచులు కలిసిన వాళ్ళం. పైగా ఒకే కాలనీ వాసులం. ఏ వయసులో ఏమి చేయాలో! అదే చేస్తున్నాం. ఆరోగ్యరరీత్యా.. పార్కులో నడక, కబుర్లతో కాసేపు కాలక్షేపం. అదేమో గానీ!.. రమణతో మాట్లాడుతుంటే సమయమే తెలిసి రాదు. మనసు ఉల్లాసంగా ఉరకలు వేస్తుంది. అది అతని మాటల చాతుర్యం.. ప్రతీ మాటలో హాస్యం తొణికిసలాడుతుంది. పదాలను విరచి సరసమైన రీతిలో చెప్పడం అతనికి వెన్నతోపెట్టిన విద్య. రమణ పెద్ద గ్రంథసాంగుడని నా అనుమానం. అది నిజమయ్యింది కూడా..! ఆ పూట మా సంభాషణతో..

“వాసూ!.. నీకెంత మంది మగువలతో పరిచయముంది?. పరిచయమంటే అర్థమయ్యిందనుకుంటాను. కాళ్ళ ‘సం.. బంధం’ లేకపోయినా.. కనీసం పెదాల బంధం” అంటూ పెదవులపై ముసి, ముసి నవ్వులు పూయించాడు. అనుకోని ప్రశ్నకు బిత్తర పోయాను. వాస్తవంగా నేను ‘రాముడు.. మంచిన బాలుడు’ అనే బాపతు. ఆడవారంటే ఆమడ దూరం. అదే విషయం నా సహజ రీతిలో ప్రమాణం చేస్తూ చెప్పాను.

రమణ నమ్మినట్టుగా కనిపించలేదు. మళ్ళీ అదే చిరునవ్వులను కొనసాగిస్తూ..

“చూడు వాసూ.. ప్రతీ మగాడి హృదయాన్ని కనీసం ఐదుగురు అమ్మాయిలు స్పర్శిస్తారన్నది వాస్తవం. కనీసం నా అనుభవాలు విన్నాక అయినా.. నిజం చెప్పు. ఈవయసులో సిగ్గు పడాల్సిన పనేముంది? మగువల తెగువ చూసే ఉంటావు” అంటూ తన అనుభవాల మూటను విప్పాడు రమణ.

***

“నేను పదవ తరగతి చదువుతున్న రోజులవి..

రాములు, కొమురయ్య, నేను మంచి స్నేహితులం. ఇద్దరూ అమ్మాయిల రుచి చవి చూసిన వారే. తమ, తమ అనుభవాలను చెబుతూ.. నన్ను రెచ్చగొట్టేవారు. కొమురయ్య తన ఊళ్ళోని అమ్మాయి శ్యామల గురించి చెబుతూ.. చాక్లెట్ ఇస్తే చాలని నన్ను రెచ్చగొట్టాడు. నేను చలించక పోతే నన్ను మూడవ రకం అనుకుంటాడేమోనని అనుమానమేసింది. అయితే మీ ఊరికి వస్తా.. చాక్లెట్ తెస్తా.. అంటూ నా మనోరథాన్ని బయట పెట్టాను. నా ఉత్సుకతను గమనించిన కొమురయ్య సంక్రాంతి సెలవుల్లో తన ఊరికి ఆహ్వానించాడు. మా ఊరు నుండి నడిచి కూడా పోవచ్చు దాదాపు ఐదు కిలో మీటర్ల దూరం. ‘కలవరమాయే మదిలో.. నా మదిలో..’ అని మనసు రాగాలు తీస్తుంటే.. కొమురయ్య ఊరికి సైకిలు పైన పయనమయ్యాను.

కొమురయ్య ఇంటికి చేరే సరికి సాయంత్రం నాలుగయ్యింది. చుట్టపు మర్యాదల్లో భాగంగా కొమురయ్య నాన్న కోడిని పట్టుకునే యత్నంలో నిమగ్నమయ్యాడు. నేనేమో..! ఆ రాత్రికి చాక్లెట్ తినిపించాలని సైగలు చేయడంలో.. మాటి మాటికి జేబులో నుండి చాక్లెట్ తీసి కొమురయ్యకు చూపించడంలో మునిగి పోయాను. నా ఆత్రుత గమనించి ముహూర్తం పెట్టుకు వస్తానని శ్యామల ఇంటికి పరుగు తీసాడు. దేనికైనా ప్రాప్తముండాలి. శ్యామల షాపింగ్.. అలాగే సినిమా చూడాలని మా ఊరికే వెళ్ళిందట. నిరాశ వార్త మోసుకు వచ్చాడు. నా సైకిలు ట్యూబ్ నుండి గాలి ఎవరో తీసేసినట్టు అనుభూతి చెందాను. ఆ రాత్రికి నాకు అన్నం సహించ లేదు. మరునాడు ఉదయమే ‘ఆశా నిరాశేనా..! జీవితానా వెలుగింతేనా!’ అని మనసు రోదిస్తుంటే.. తిరుగు ప్రయాణం తప్ప లేదు.

‘మూలిగే నక్క తల మీద తాటికాయ పడ్డట్టు’ రాములు మరో సంచలన వార్తతో నా నెత్తిన మోదాడు. గత రాత్రి సినిమా హాల్లో చాక్లెట్ శ్యామల కలిసిందట. సినిమా చూసాక ఇంటికి తీసుకు వెళ్ళాడట. రాత్రంతా తాను అనుభవించిన స్వర్గ సుఖాలను కళ్ళకు కట్టినట్టు రంగుల చిత్రాలలో చూపించాడు. ఆ వయసులో మనసు పడే ఆరాటం వర్ణించ శక్యం కాదు. నేను మౌనంగా రోదించడం తప్ప చేసేదేముంది? కాని ఆ రోదన మరి కొద్ది రోజుల్లోనే వాస్తవ రూపం దాల్చింది. శ్యామలను మూకుమ్మడిగా మానభంగ పర్చి హత్యచేసారనే వార్త కొమురయ్య చెప్పగానే మ్రాన్పడి పోయాను” అంటుంటే రమణ గొంతు పొర మారింది. వాటర్ బాటిల్ చేతికందించాను. ఒక గుటక వేసి తిరిగి చెప్పసాగాడు.

“కనబడని శ్యామల నా హృదయాన్ని తట్టి లేపింది. అలాంటి అనైతిక పనులు చేయరాదని మేము దేవుని గుళ్ళో ప్రమాణం చేశాము. కాని అతివలు సామాన్యులు కారు. మన మానాన మనల్ని బతుక నివ్వరు. నేను పట్నంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రోజులవి.. సెలవుల్లో మా ఊరు వచ్చే వాణ్ణి.

‘బాబూ..! విజయకు లెక్కలట చెప్పరాదూ! ట్యూషన్ కు వస్తానంటే వద్దన్నావట’ అంది అమ్మ. ‘పాపం! అమ్మాయి నాతో మొరపెట్టుకుంది’ అన్న రీతిలో..

అమ్మా.. అమ్మాయిలకు నేను చెప్పను. అనవసరంగా అభాండాలు మోయాల్సి వస్తుందని నిర్మొహమాటంగా సమాధానమిచ్చాను.

‘అంటే నీ మీద నీకే నమ్మకం లేదా? నిప్పు లేనిదే పొగ రాదు. నీ మంచితనం వాడలో ఎవరికీ తెలియంది కాదు! ఏదో నాలుగు రోజులు చెప్పు బాబూ..!’ అంటూ అమ్మ బతిమాలే సరికి కాదన లేక పోయాను.

విజయ ఇంటర్ చదువుతోంది. ముస్తాబై పుస్తకాలతో వచ్చింది. లెక్కలు చెప్పడం ఆరంభించాను. నా చెయ్యి తగిలినప్పుడల్లా ఆమె మెలికలు తిరిగి పోతూ.. అరమోడ్పు కన్నులతో కను విందు చేసేది. కాని నాకు మరో దగ్గర చెయ్యి వేయాలంటే భయం.. ఆరోజు ఆరు బయట వెన్నెల వెలుగులో పడుకున్నాను. ఎవరో వచ్చి నా పక్కలో పడుకున్నట్లనిపించ గానే చటుక్కున కళ్ళు తెరిచాను. విజయ.. నన్ను నిలువెల్లా కౌగిలించుకొని పారి పోయింది. ఎవరైనా చూసారేమోనని వణకి పోయాను. ట్యూషన్ చెప్పడం మానేసాను. వాసూ చూసావా ఆమె తెగువ..” అంటూ నవ్వాడు.

“డిగ్రీ రెండవ సంవత్సరం వేసవి సెలవుల్లో మరో విచిత్రం జరిగింది.. కొత్తగా వివాహమైన సరోజ అనే మహిళ మా కాలనీలో అడుగు పెట్టింది. అలా పరిచయమయ్యిందో లేదో!.. హోలీ పండుగ రోజు వచ్చి నా ముఖానికి రంగు పులిమి, నా పెదాలను తన పెదాలతో తడి చేసి పరుగు తీసింది. అది నా మొదటి పెదవుల బంధం. ఎవరికీ చెప్పుకోలేనిది. నాలో ఏముందో ఏమో! మగువ తెగువకు మ్రాన్పడి పోయాను. అనతి కాలంలోనే ఒకే ఒక సారి కాళ్ళ సంబంధం వరకూ వెళ్ళింది. అది నా మొదటి అనుభవం. పెళ్ళికి ముందు ఇలాంటి అనుభవాలు అవసరమే అని కొమురయ్య, రాములు వంత పాడిన ఫలితమది. వివాహిత కాబట్టి మన ప్రమాణానికి ప్రమాదమేమీ లేదని ప్రోత్సహించారు. కాని నా మనసు తప్పు చేసావని పదే, పదే వ్యాకుల పడింది. ఆ మరునాడే భర్తతో పట్నం వెళ్లి పోయింది సరోజ. అందుకేనేమో! అవకాశం తీసుకుందని అనుకున్నాను. అలా మూడవ మగువ నా ఎదను తాకి వెళ్ళింది”

మరో మారు మంచి నీళ్ళు తాగి చెప్పడం ఆరంభించాడు రమణ.

“నేను మొదటగా ఉద్యోగంలో చేరిన ఊళ్ళో మరో అమ్మాయి తెగువకు భయమేసింది. అప్పుడు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షలకు తయారవుతున్నాను గూడా.. ఉదయమే లేచి తలుపు ఓరగా తెరచి చదువుకుంటున్నాను. ఇంతలో ఒక అమ్మాయి చటుక్కున లోనికి వచ్చి తలుపు మూసి నా ఒళ్లో కూర్చుంది. ఆమెను అనుసరిస్తూ.. వచ్చిందేమో! ఒక ముసలావిడ గుమ్మం ముందు నిలబడి ‘మాయిలమే మాయమయ్యింది పొల్ల. ఎటుపాయే..!’ అనడం విన వచ్చింది. నేను చటుక్కున అమ్మాయిని ముందుకు తోసేసి వంటగదిలోకి పరుగెత్తాను. అమ్మాయి బయటకు రావడం చూసి ముసలామె లోనికి వచ్చి పరుష పదం వాడింది. నేనూ ఎదురు తిరిగాను. నాకేమీ తెలియదని.. అమ్మాయిని అసలే చూడ లేదని బుకాయించాను.

చూసావా వాసూ.. నాలుగవ అమ్మాయిల తెగువ.. అది వయసు ప్రభావం కావచ్చు కానీ.. మనం అలాంటి తెగువ చూపలేమనిపిస్తుంది”

నేను నిజమే అన్నట్టు తలూపుతూ.. “కొందరు చూపక పోరు..” అన్నాను. నాలో ఆసక్తి పెరిగింది. ఇంకా చెప్పమన్నట్టు తలూపాను. రమణ అదే చిరునవ్వుతో చెప్పసాగాడు.

ఐదవ అమ్మాయి అనుభవం మా అమ్మమ్మ గారి ఊళ్ళో జరిగింది. ‘నా పెదవులు చాలా బాగున్నాయని’ అంటూ చటుక్కున పెనవేసుకొని ముద్దాడింది. ఆమె పెళ్లి కావాల్సన స్త్రీ.. ఇలా తెగువ చూపడం ఆమె జీవితం పైన చెడు ప్రభావం చూపుతుదేమోనని భయం ఒక వంక.. నా మీదున్న సదభిప్రాయం పోతుందేమోనని మరో వంక మదన పడిపోయాను. కాళ్ళ బంధానికి అవకాశమొచ్చినా.. ఆ రోజు మేము గుళ్ళో చేసిన ప్రమాణం గుర్తుకు వచ్చి తప్పించుకున్నాను. నన్ను అపార్థం చేసుకుంటుందేమోనన్న జంకు లేక పోలేదు. అయినా ప్రమాణానికే మొగ్గు చూపాను. అది వాస్తవం అని చెప్పడానికి మరికొంత చెప్పక తప్పదు” అంటూ సెల్ ఫోన్ ఆన్ చేసి సమయం చూసాడు రమణ. ఫరవాలేదు చెప్పు మరీ చీకటేమీ పడలేదని ప్రోత్సహించాను. రమణ మరో మారు మంచినీళ్ళు తాగాడు. గొంతు సవరించుకుని చెప్పడం మొదలు పెట్టాడు.

“నాకు వివాహమయ్యాక జరిగిన సంఘటన ఇది. తలుచుకుంటుంటే.. నవ్వొస్తుంది..” అంటూ లిప్తకాలం నా వంక చూసి తల వంచుకొని చెప్పసాగాడు.

“నా సతీమణి ప్రసూతి కోసం వారి పుట్టింటికి వెళ్ళింది. ప్రథమ పురుడు తల్లి వారి ఇంటనే పోసుకోవాలట. ఆమె వెళ్ళాక ఇల్లు బోసి పోయింది. నా మది శూన్యమయ్యింది. ‘శూన్యమైన మదిలో దెయ్యాలు నాట్యమాడుతాయి’ అన్నట్టుగానే.. ఆ నాడు రుచి చూపించిన సరోజ కోసం నా మనసు తహ, తహ లాడింది. వాట్సాప్ లో ఆమె కోసం అన్వేషణ మొదలు పెట్టాను. చివరికి విజయం సాధించాను. సరోజ సెల్ ఫోన్ నంబర్ తెలుసుకోగలిగాను. మీనమేషాలు లెక్కిస్తూ కూర్చొంటే కుదురదని వెంటనే ఫోన్ చేసాను. రింగ్ అవుతోంది. నా గుండెల్లో లబ్.. డబ్.. శబ్దాలు.. కొత్త నంబరని ఫోన్ ఎత్తుతుందో లేదో! అనే అనుమానం.. ట్రూ కాలర్ ఉంటే నా పేరు కనబడుతుంది.. గుర్తు పడ్తుందో లేదో!.. అని మరో అనుమానం.. అదృష్టవశాత్తు సరోజ ఫోన్ ఎత్తింది. గుర్తు పట్టింది. ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ‘గారె విరిగి నేతిలో పడ్డట్టు’ ఎగిరి గంతులు వేసాను. వెంటనే సోగ్గానిలా తయారై సరోజ ఇంటికి బయలుదేరాను.

‘ఎంత ఘాటు ప్రేమయో..! ఎంత తీవ్రమీ క్షణమో ఓ.. నా మనసు మురిసెనే..” అని నా మదిలో పాడుకుంటూ కారు బయటకు తీశాను. మా ఇంటి నుండి సరోజ ఉండే నాగారం అరగంట ప్రయాణం. ట్రాఫిక్ ను చూస్తూ.. తిట్టుకుంటున్నాను. విమానంలా ఎగిరి పోతే బాగుండునని ఉవ్విళ్లూరుతున్నాను. అయినా సరోజ ఇంట్లో పరిస్థితులు ఎలాంటివో..! కాళ్ళ బంధానికి మళ్ళీ అవకాశం దొరుకుతుందో లేదో! అని వ్యాకులపడుతూ.. లేస్తూ.. మొత్తానికి మరో పది నిముషాల ఆలస్యంగా చేరుకున్నాను. గూగుల్ మ్యాప్ పుణ్యమా అని చిరునామా దొరకడం.. పెద్ద కష్టమేమీ కాలేదు.

నా కోసమే అన్నట్టుగా సరోజ వీధి గుమ్మంలో నిలబడి చూస్తోంది. నన్ను చూడగానే చిరునవ్వుతో స్వాగతం పలికింది. ఆ నవ్వులో లైన్ క్లియర్ అని గోచరించింది. నా మనసు ఉవ్వెత్తున ఎగిసింది.. ఆకాశం అడ్డు రాకుంటే.. ఎక్కడికి చేరేదో ఏమో..! బయటకు మాత్రం ఏమీ ప్రదర్శించకుండా గంభీరంగా హాల్లోకి అడుగు పెట్టాను.

ఇద్దరం సోఫాలో కూర్చొన్నాం. కుశల ప్రశ్నలు మాట్లాడుకున్నాం. తనకు ఇద్దరు పిల్లలని భర్త, ఒక ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడని చెప్పింది. పిల్లలు బడికి, భర్త పరిశ్రమకు వెళ్ళారని వారి ఫోటోలు చూపించింది. తాను ఒక్కర్తే ఉన్నానని నొక్కి చెబుతున్నట్లుగా అనిపించింది. కాఫీ కలుపుకు వస్తానంటూ వంట గదిలోకి దారి తీసిన సరోజ వంక తదేకంగా చూశాను. నా మనసు ఊగిసలాడుతోంది. వంట గదిలోకి వెళ్లి వాటేసుకొమ్మని ఒక వంక ప్రోత్సహిస్తూనే .. వద్దని మరొక వంక వారిస్తోంది. నా సతీమణి కళ్ళల్లో కదలాడుతోంది. సంఘ కట్టుబాట్లు, నీతి, నియమాలు తప్పితే మనిషికి పశువుకు తేడా లేదని మనసు బలంగా అడ్డుపడింది. వయసు ప్రభావంతో.. తెలిసీ తెలియక కొన్ని తప్పులు అప్రయత్నంగా జరుగుతూ ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవాలే గానీ.. తప్పులు చేస్తూ వెళ్ళడం సబబు కాదని నెమ్మది పడ్డాను. కాఫీ కప్పుతో కడలి వస్తున్న సరోజ నా కంటికి ఒక దేవతలా గోచరించింది. కాఫీ సేవించి.. నా సతీమణిని తీసుకొని మరోసారి వస్తానని సెలవు తీసుకున్నాను. తప్పకుండా రావాలని వీడ్కోలు పలికింది సరోజ.

ఇక బయలుదేరుదాం. రేపు నీ అనుభవాలు తప్పకుండా చెప్పాలి వాసూ.. రాత్రికి మననం చేసుకో..” అంటూ కరచాలనం చేసి తన ఇంటికి కదిలాడు రమణ.

వాస్తవమే.. ప్రతీ మనిషికి సరసమైన అనుభవాలు కనీసం ఐదు ఉండడం సహజం.. అని నా మనసు ఆ రాత్రి గతంలోకి పరుగులు తీసింది. *

మరిన్ని కథలు

Dhruvuni vamshamu
ధృవుని వంశము.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Aachari mastari vupayam
ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ )
- కొత్తపల్లి ఉదయబాబు
Aadaleka maddela odu
ఆడలేక మద్దెల ఓడు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Garam chai
గరం చాయ్
- వేముల శ్రీమాన్
Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao