వినాయకుడి వివాహం (పురాణగాథ) - కందుల నాగేశ్వరరావు

Vinayakudi vivaham

వినాయకుడి వివాహం

(పురాణగాథ)

బంగారు రంగుల కాంతులు వెదజల్లే మేరుపర్వత శిఖరంపై వేయి యోజనాల దూరం విస్తరించి ఉంటుంది కైలాసం. కైలాసం మహాదేవుని తపోభూమి. ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులకు విహారస్థలం. శివభక్తులైన శివగణాలకు నివాసం.

చేతిలో త్రిశూలమూ, మెడలో ఎముకల హారమూ, తలపై నెలవంకా ధరించి తాండవనృత్యంలో పరవశించే పరమేశ్వరుడు పరమశివుడు. నిర్గుణ, నిరాకార, నిర్మోహితిడైన పరబ్రహ్మం పరమశివుడు. ‘హర హర మహదేవ’ అంటూ భక్తితో స్మరించే జీవులకు ముక్తిని ప్రసాదించే పరమాత్మ పరమశివుడు. గౌరీదేవికి భర్త అయినవాడు, తత్త్వముల నెరిగినవాడు, మాయకు ఆశ్రయమైనవాడు, మాయచే ప్రభావితుడు కానివాడు, జ్ఞానస్వరూపుడు, శాంతస్వరూపుడు, పురుషోత్తముడు శివుడు.

అద్వితీయము, ఆద్యంతరహితము, సర్వవ్యాపకము అయిన పరబ్రహ్మము యొక్క మూర్తి సదాశివుడు. అటువంటి సదాశివుడు కల్పించిన మూర్తియే పరాశక్తి. ప్రకృతి, శక్తి, మాయ, త్రిగుణాత్మిక, అంబిక, ఈశ్వరి, పరమేశ్వరి, గిరిజ, గాయత్రి, సకల భూతేశ్వరీ, శివకామిని, విశ్వజనని, శివాత్మిక, విశ్వమాత అయిన ఆదిశక్తి అనేక నామాలతో ఆమెయే సర్వరూపాలు ధరించి, సర్వమును చూస్తూ, సర్వమును చేస్తూ ఉంటుంది.

శివశక్తి స్వరూపమే ఈ జగత్తు. ఈ సర్వజగత్తు బిందునాదాత్మకం. బిందువు శక్తి. శివుడు నాదం. బిందువునకు నాదం ఆధారం. ఈ జగత్తుకు బిందువు ఆధారం. బిందువు నాదంతో కలియటం సకలీకరణం. దాని నుండి జగత్తు ఆవిర్భావం అవుతుంది. బిందు రూపిణియగు దేవి తల్లి. నాదరూపుడగు శివుడు తండ్రి.

ఒకరోజు కైలాసంలో శంకరుడు సభాకార్యక్రమం ముగించుకొని ప్రమధగణాలతో కలిసి తన మందిరానికి తిరిగి వచ్చాడు. నందీశ్వరుని నాయకత్వంలో ప్రమధగణాలు ఆ మందిరం బయట ఎల్లప్పుడూ శివాజ్ఞకై ఎదురు చూస్తూ ఉంటారు. శివుడు సతీదేవిని చూడాలని కుతూహలంతో ఆమె మందిరం వైపు నడిచాడు. ఆ సమయంలో జగన్మాత అభ్యంగన స్నానం చేస్తూ ఉంది. శంకరుడు ద్వారపాలకుడైన నందీశ్వరుణ్ణి గద్దించి మందిర ప్రవేశం చేశాడు. శివుడు చేసిన ఈ చర్యకు అమ్మవారు సిగ్గుపడి స్నానాన్ని మధ్యలోనే ఆపి హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. శివుడు అలా హఠాత్తుగా రావడం పార్వతీదేవికి నచ్చలేదు. మరల ఇలా జరగకుండా ఉండడానికి ఉపాయం చెప్పమని చెలికత్తెలను అడిగింది. జయ విజయ అనే చెలికత్తెలు ఆమెతో చదరంగం ఆడుతూ “దేవీ! మన దగ్గర ఉన్న సేవకులందరూ శివుని ఆజ్ఞను పాలించే రుద్రగణాలే. వారెవ్వరూ స్వామిని ఆపరు. శివుడు కూడా వాళ్ళను ఏమీ అనడు. కాబట్టి మీరు రుద్రగణములు కాకుండా వేరెవరినైనా ప్రవేశద్వారం దగ్గర కాపలా ఉంచాలి” అని చెప్పారు.

ఆనాడు జరిగిన అనుభవంతో పార్వతీదేవి చెలికత్తెలు చెప్పిన సలహాను వెంటనే అమలుపెట్టాలని నిశ్చయించుకుంది. పిండితో నలుగు పెట్టుకుంటూ తన శరీరం నుండి రాలిన రజస్సుతో ఒక బాలుని రూపాన్ని సృష్టించింది. జగన్మాత శక్తితో ఆ రూపం ప్రాణం పోసుకుంది. సర్వాంగసుందరుడైన ఆ బాలుడికి గిరిజాదేవి వస్త్రాలను, అమూల్యమైన ఆభరణాలను ఇచ్చి దీవించింది.

ఆ బాలుడు “మాతా! నా కర్తవ్యాన్ని ఉపదేశించండి” అని అడిగాడు. అప్పుడు కాత్యాయని “పుత్రా! నీవు నా కుమారుడవు. నా గృహాన్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ, ద్వారపాలకుడవై ఉండు. నా అనుమతి లేకుండా లోనికి ఎవ్వరూ ప్రవేశించ రాదు” అని చెప్పింది. ఆ కుమారుడు ద్వారపాలకుడై తల్లి మాటను నెరవేరుస్తున్నాడు.

ఒకరోజు తన చెలికత్తెలతో కలిసి సతీదేవి జలక్రీడలు ఆడుతోంది. శంకరుడు మందిరంలోకి రాబోగా ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఈ బాలుడెవరా అని ఆలోచిస్తూ “ఓ ద్వారపాలకా! ఇది నాగృహం. నేను శివుడను. లోపల ఉన్నది నా భార్య పార్వతి. నువ్వు అడ్డు తప్పుకో” అని కోపంగా అన్నాడు.

ఆ బాలుడు ఆ మాటలకు “నా తల్లి ఆజ్ఞ ప్రకారం నేను ఈ గృహాన్ని కాపలా కాస్తున్నాను. ఆమె అనుమతి లేకుండా నేనెవరినీ లోపలకు పంపను. నీవు వెనక్కి వెళ్ళు లేదా ఆమె పిలిచే వరకూ వేచి ఉండు” అని చెప్పి శివుణ్ణి లోపలకు పోనీయకుండా అడ్డుకున్నాడు. కొడతాను అన్నట్లుగా కర్ర ఎత్తి చూపించాడు. ఇది చూస్తున్న శివగణాలు బాలుని చర్యను సహించలేక పోయాయి. “వ్రేలెడంత కూడా లేని ఈ బాలుడు శివుణ్ణి అడ్డగించడమేమిటి” అనుకున్నారు.

శివుడు బాలకుడి జన్మను గ్రహించాడు. ‘ఈ బాలుడికి ఎలా నచ్చచెప్పాలా’ అని ఆలోచిస్తున్నాడు. తనకు కాసేప్పు వినోదం, గణాలను అనుభవం అనుకున్నాడో ఏమో గణాలతో “ఎవరీ కొత్త ద్వారపాలకుడు. నన్నే అడ్డుకుంటున్నాడు. నేనెవరో వీడికి చెప్పి మెడ పట్టి బయటకు గెంటండి” అన్నాడు.

వారు గణపతిని సమీపించి “బాలకా! మన ప్రభువునే అడ్డుకుంటావా? బ్రతుకు మీద అశ ఉంటే వారిని అడ్డగించకుండా వెంటనే దారి ఇయ్యి” అని చెప్పారు. అయినా ఆ బాలుడు చలించకుండా వారిని బెత్తంతో కొట్టాడు. నందీశ్వరుడు వచ్చి ఆ బాలుని కాలు పట్టి లాగాడు. భృంగి వచ్చి రెండవ కాలు పట్టాడు. గిరిజానందనుడు కాళ్ళతో తన్నగా ఇద్దరూ దూరంగా ఎగిరి పడ్డారు. ఇంతలో బ్రహ్మగారు వచ్చి నీతి పాఠాలు చెప్పగా ఆ బాలుడు నవ్వి “నేను మా అమ్మ మాట తప్ప ఎవరి మాటా వినను. ఎవ్వరినీ లోనికి రానీయను. ఎవరైనా నాపై యుద్ధానికి వస్తే నేను కూడా సిద్ధం” అన్నాడు. శివగణాలకు గిరిజాసుతునికి యుద్ధం మొదలైంది.

బయట కలకలం విని జరిగింది గ్రహించింది పార్వతి. ‘భర్తతో పంతమా’ అని కాస్సేపు ఆలోచించినా తగ్గకూడదనే నిర్ణయానికి వచ్చిన గిరిజ బాలుణ్ణి ప్రోత్సహించింది. తల్లి ప్రోత్సాహంతో గిరిజాసుతుడు రెచ్చిపోయాడు. పార్వతి జంట శక్తులను సృష్టించి కుమారుడికి తోడుగా పంపింది. ఒక శక్తి గణాలు వేసిన అస్త్రాలను నోరు తెరిచి మింగి వేస్తోంది. రెండవ శక్తి వేయి బాహువులతో చేతికి దొరికిన వారిని నలిపేస్తోంది. ఏమి చెయ్యాలో తోచక గణాలు శివుడికి మొరపెట్టుకున్నారు. రుద్రుడు స్వయంగా వచ్చి కుమారుడితో వాదులాడి ఒప్పించలేకపోయాడు. కోపగించిన రుద్రుడు తన త్రిశూలంతో బాలుని శిరస్సు ఖండించాడు. శిరస్సు గాలిలో ఎగిరివచ్చి శివునిలో ఐక్యమయ్యింది.

కుమారుని మరణాన్ని తట్టుకోలేని దుర్గాదేవి నుండి లెక్కలేనన్ని భయంకరమైన శక్తులు ఉద్భవించాయి. ఆ మహాశక్తులు రుద్రగణాలను, వారికి తోడుగా వచ్చిన దేవతలను దొరికినవాళ్ళను దొరికినట్లుగా గడ్డిని కాల్చిన విధంగా కాల్చివేయసాగాయి. శివుడు ఆ శక్తులను ఎదిరించకుండా చూస్తూ ఉండిపోయాడు. దేవతలు విష్ణుమూర్తిని శరణువేడారు. విష్ణువు సలహా ప్రకారం అందరూ కలిసి జగన్మాతను స్తుతించారు. “జగన్మాతా! నీకు నమస్కారం. జగత్తును పాలించు శక్తివి నీవే! నీవు కోపించుటచే ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి. శాంతించు తల్లీ! మా అపరాధాన్ని మన్నించి మమ్ము కాపాడు” అని ప్రార్థించారు.

వారి ప్రార్థనకు సంతోషించిన జగన్మాత “నా కుమారుణ్ణి తిరిగి జీవింపజేసి గణాధ్యక్షుడుగా నియమించాలి. అప్పుడే నేను శాంతించి నా శాక్తేయగణాలను వెనక్కి తీసుకుంటాను” అని చెప్పింది. దేవతలు వెళ్ళి శివునికి ఈ విషయం విన్నవించారు. పార్వతి చెప్పినట్లు చేయడం శివుడికి కూడా తప్పలేదు. శంకరుడు సమ్మతించి “మీలో కొందరు ఉత్తర దిక్కుగా వెళ్ళి ముందుగా ఏ జీవి కనపడితే దాని తల నరికి తీసుకు వచ్చి ఆ బాలుడి శరీరానికి అతకండి” అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఉత్తర దిక్కుగా వెళ్ళినవారికి ఒక ఏనుగు కనుపించింది. దాని శిరస్సు నరికి తీసుకువచ్చి బాలుని దేహానికి అతికించారు. అప్పుడు త్రిమూర్తులు ముగ్గురూ వేదోక్తంగా మంత్రించి బాలుని తేజస్సును తిరిగి దేహంలో ప్రవేశపెట్టారు. బాలుడు పునర్జీవితుడై లేచాడు. అందరూ ఆనందించారు.

పార్వతి ఆనందంగా బాలుని ముద్దాడి ఒడిలో కూర్చుండబెట్టి ‘గజాననుడు’ అని నామకరణం చేసింది. “పుట్టిన వెంటనే నీకు కలిగిన ఆపద తొలగింది కావున నిన్ను పూజించిన వారి ఆపదలు వెంటనే తొలగిపోతాయి” అని పార్వతి కుమారుడికి వరమిచ్చింది. పార్వతి గజాననుణ్ణి నూతన వస్త్రాభరణాలతో అలంకరించి శివుని వద్దకు తీసుకు వెళ్ళి తండ్రిని పరిచయం చేసింది. శివుడు కుమారుని దగ్గరకు తీసుకొని ముద్దాడి గజాననుణ్ణి దేవగణాలకు అధిపతిగా ప్రకటించి ‘గణపతిని’ పుత్రప్రేమతో ఆశీర్వదించాడు. దేవతలు గొప్ప ఉత్సవం చేసి గణాధ్యక్షునిగా పట్టాభిషేకం చేసారు.

గణపతి తను చేసిన తప్పులను మన్నించమని త్రిమూర్తులను, దేవతలను ప్రార్థించాడు. వారు సంతోషించి “గణనాథుడైన గజాననుడు, త్రిమూర్తులమైన మాతో సమానంగా పూజింపబడతాడు. ముఖ్యమైన పని ఏది చేయాలన్నా గణనాథునికి ముందుగా పూజచేస్తే విఘ్నాలన్నీ తొలగిపోయి ఆ పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది. అందువలన గజాననుడు ‘విఘ్నేశ్వరుడు’ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు” అన్నారు. “పార్వతీదేవి సంకల్పం నుండి బాద్రపద శుక్ల చతుర్థినాడు చంద్రోదయ కాలంలో గణేశుడు పుట్టిన కారణంగా ఆరోజు గణేశుని పూజించిన వారికి శుభం కలుగుతుంది” అని శివుడు వరమిచ్చాడు.

కుమారస్వామి, గణపతి ఆటపాటలతో తల్లితండ్రులకు ఆనందం కలిగిస్తూ పెరిగి పెద్దవారయ్యారు. వారిద్దరికీ వివాహం చేసుకొనే వయస్సు వచ్చింది. ‘నేను ముందు పెళ్ళి చేసుకుంటాను’ అని స్కందుడు, ‘కాదు నేనే ముందు పెళ్ళి చేసుకుంటాను’ అని గణేశుడు ఇద్దరూ వారిలో వారు తగవులాడుకోసాగారు. ఈ విషయం గ్రహించిన పార్వతీ పరమేశ్వరులు కుమారుల నిద్దరినీ పిలిచి “కుమారులారా! మీరిద్దరి మీదా మాకు సమానమైన ప్రేమ ఉంది. అందువలన మీలో ఎవరైతే భూమండలాన్ని చుట్టి ముందుగా తిరిగి వస్తారో వారికి వివాహం ముందు చేయడం జరుగుతుంది” అని చెప్పారు.

తల్లితండ్రులు చెప్పిన నియమం ప్రకారం షణ్ముఖుడు తక్షణం తన వాహనాన్ని అధిరోహించి భూప్రదక్షిణకై బయలుదేరి వెళ్ళాడు. గణపతి ‘తను స్థూలకాయుడు, సులువుగా ప్రయాణం చేయలేడు, కాబట్టి బుద్ధిని ఉపయోగించాలి’ అని తలంచి కైలాసంలో ఉండిపోయాడు. గణపతి తల్లితండ్రులను ఒకచోట సముచిత ఆసనంపై కూర్చుండబెట్టి వారిని పూజించి ఏడుసార్లు ప్రదక్షిణం చేసాడు. చేతులు జోడించి ‘మాతాపితలారా! నాకు వివాహం చేయండి” అన్నాడు.

ఆ మాటలకు పార్వతీ పరమేశ్వరులు “కుమారా! షణ్ముఖుడు భూప్రదక్షణకై బయలుదేరి వెళ్ళాడు. నీవుకూడా వెంటనే వెళ్ళి భూప్రదక్షిణ చేసిరా. అప్పుడే వివాహం ఎవరికి ముందు చెయ్యాలో నిర్ణయిస్తాం” అన్నారు. అప్పుడు గణేశుడు నవ్వి ‘జననీ జనకులారా! ఎవడైతే తన తల్లిదండ్రులను పూజించి ప్రదక్షిణం చేస్తాడో వాడు భూప్రదక్షిణ ఫలాన్ని పొందుతాడని వేదాలు చెప్పుతున్నాయి కదా! నేను మీ చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణం చేశాను” అన్నాడు.

గజాననుడి మాటలకు సంతసించిన గిరిజాశంకరులు “కుమారా! నీ మాటలు ధర్మబద్ధమైనవి. నీవు ధర్మాన్ని పాటించావు. సంకట పరిస్థితిలో ఎవరి బుద్ధి చురుగ్గా పని చేస్తుందో వారు విజయాన్ని సాధిస్తారు. కల్యాణమస్తు” అని దీవించి గజాననుడి వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అదే సమయంలో విశ్వరూప ప్రజాపతి సిద్ధి, బుద్ధి అనే తన ఇద్దరి కుమార్తెలకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. శివపార్వతులను దర్శించి తన కుమార్తెలను గణపతికి ఇచ్చి వివాహం చేయాలనే కోరికను తెలియపరిచాడు. శివపార్వతులు తమ అంగీకారం తెలిపారు. వారు గణేశుని వివాహం అందరి సమక్షంలో అత్యంత వైభవంగా జరిపించారు. కొంత కాలానికి గజాననునకు సిద్ధి యందు ‘క్షేముడు’, బుద్ధి యందు ‘లాభుడు’ అను ప్రీతిపాత్రులైన ఇద్దరు కుమారులు కలిగారు.

స్కందుడు భూప్రదక్షిణం పూర్తి చేసుకొని తిరిగి వస్తుంటే దారిలో నారదుడు కలిసి “కుమారా! నీ తల్లితండ్రులు నీకు తీరని అన్యాయం చేసారు. నిన్ను భూప్రదక్షిణానికి పంపి ఇక్కడ వినాయకుడికి వివాహం చేసారు. అప్పుడే మీ సోదరుడికి ఇద్దరు పిల్లలు కలిగారు. కన్న తల్లితండ్రులే ఇటువంటి అన్యాయం చేస్తే నువ్వు ఇంకెవరికి మొర పెట్టుకుంటావు” అని చెప్పి రెచ్చగొట్టాడు.

శివపార్వతులు వినాయకుడు బుద్ధిబలంతో పోటీలో విజయం సాధించిన సంగతి కుమారస్వామికి వివరించారు. ఎన్నివిధాల సముదాయించినా కార్తికేయుని కోపం తగ్గలేదు. తల్లిదండ్రులపై అలిగాడు. గౌరీశంకరులకు నమస్కారం చేసి కైలాసం వదిలిపెట్టి దూరంగా క్రౌంచపర్వతానికి వెళ్ళిపోయాడు. అక్కడే ఉంటూ భక్తుల కోరికలు తీరుస్తూ ఉండిపోయాడు. కార్తీక పౌర్ణమినాడు కుమారస్వామి ధర్శనం చేసుకున్న భక్తులకు విశేషమైన పుణ్యం లభిస్తుంది.

స్కందుడు లేకపోవడం కైలాసవాసులకు చాలా లోటుగా ఉంది. పార్వతి పుత్రవియోగాన్ని భరించలేకపోయింది. అప్పుడు శివపార్వతులు క్రౌంచపర్వతము (శ్రీశైలము) చేరారు. అక్కడ శివుడు మల్లికార్జునుడు అనే పేరుతో జ్యోతిర్లింగంగా వెలిసాడు. పార్వతీదేవి భ్రమరాంబగా అవతరించింది. వారిద్దరూ కుమారస్వామి కొరకు అక్కడే కొలువుండిపోయారు. ఇది నచ్చని కుమారస్వామి మూడు యోజనాలు దూరంగా వెళ్ళి స్థిరపడ్డాడు. కొడుకు పట్ల వ్యామోహం వదులుకోని కారణంగా ప్రతి అమావాస్య నాడు శంకరుడు, ప్రతి పౌర్ణమినాడు పార్వతీదేవి వచ్చి కుమారస్వామిని చూసి వస్తుంటారు.

ఈ గాథ చదివినవారికి, విన్నవారికి పుణ్యాన్ని, కీర్తిని జ్ఞానాన్ని, ఆయుర్ధాయాన్ని మరియు ముక్తిని ఇస్తుంది.

*శుభం*

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు