ఏదైనా ఒక సమావేశానికి ముఖ్యులైనవారు, సమర్థులైనవారు హాజరైనప్పుడు వారిని అతిరథ మహారథులుతో పోలుస్తారు. అతిరథ మహారథులంటే గొప్పవారు అని, శక్తి సామర్ధ్యాలు గల ఒకరిని మించినవారు మరొకరిని అర్ధం. అలాంటి వారి ప్రస్తావన వచ్చినప్పుడు అతిరథ మహారథులు అని పిలవడం ఒక నానుడి. ఈ నానుడి ఎలా వచ్చిందో? ఎప్పుడు వచ్చిందో? చూద్దాం. ఈ నానుడి మహా భారతం నుండి వచ్చింది. కురుక్షేత్ర యిద్ధంలో యోధానుయోధులు పాల్గొన్నారు. వీరినే అతిరథ మహారథులు అనేవారు. రథి అంటే రథంపై ఉండి యుద్ధం చేసేవాడు అని అర్ధం. ఐదువేల మంది సైనికులతో పోరాటం చేయగల వారిని రథి అనేవారు. దుర్యోధనుడు మినహా మిగిలిన కౌరవులంతా రధులే. వీరికంటే 12 రెట్లు ఎక్కువ మందిపై యుద్ధం చేయగలిగే యోధులను అతిరథులు అంటారు. ( 5,000×12=60,000) అంటే 60 వేల మందితో యుద్ధం చేసేవారిని అతిరథులు అంటారన్నమాట. శల్యుడు, దుర్యోధనుడు, ధర్మరాజు, కృపాచార్యుడు, వంటివారు ఈ కోవకు చెందుతారు. మహారధి అంటే అతిరధికంటే 12 రెట్లు మందితో యుద్ధం చేయగలవాడు. (60,000×12=7,20,000) .ఏడు లక్షల ఇరవైవేల మంది సైనికులతో యుద్ధం చేయగల వారు మహారథులు. కృష్ణుడు, కర్ణుడు, అభిమన్యుడు, అశ్వద్ధామ, భీముడు, అర్జునుడు, భీష్ముడు, ద్రోణుడు, బలరాముడు, జరాసంధుడు, వీరంతా మహారథులు. వీరేకాక ఇంకా మరెందరో అతిరథమహారధులు వుండేవారు. అర్ధరధులు కూడా వుండేవారు. వారు కేవలం 2.500 మందితో మాత్రమే రథంపై ఉండి యుద్ధం చేయగలరు. ఇలా మహా భారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న వీరాధివీరుల నుండి ఈ అతిరథ మహారథులు అనే మాట వాడుకలోకి వచ్చింది. అర్ధరధి, రధి ని మినహాయించి, అతిరధి,మహారథులను మాత్రమే ఈ నానుడిలో చేర్చారు. తమ తమ రంగాలలో నిష్ణాతులైన పెద్దలను మహారధులని, వారికన్నా కొంచం తక్కువ స్థానంలో నిలిచేవారిని అతిరథులని ఈ నానుడి ప్రయోగం ద్వారా తెలుసుకోవొచ్చు.