" గడియ పురుసత్ లేదు,గవ్వ ఆముదానీ లేదు.ఎలా బతుకుతావురా " అప్పుడే నిద్ర లేచిన రాంబాబు కి హిత వచనం బోధించింది సుమిత్ర. " నెత్తి మీదికి పాతికేళ్లు వచ్చాయి.నీ ఈడోళ్ళు ఏదో ఒక పని చేస్తుంటే,నువ్వు బలాదూర్ గా తిరగడానికి ఇజ్జత్ లేదారా " సుబ్బారావు కొట్టినంత పని చేసాడు. ఎప్పుడున్న భాగోతమే నని తేలికగా తీసుకుని రాంబాబు బెడ్ దిగి సరాసరి బాల్కనీలోకి వెళ్ళాడు. " ఇగురం లేని కొడుకును కని నాకో రంధి పెట్టావు కదే ! " సుమిత్ర పైకి విరుచుకుపడ్డాడు సుబ్బారావు. నా ఒక్కదానిదే తప్పా అన్నట్లు గుడ్లురిమి చూసింది.గుటకలు మింగుకుంటూ సుబ్బారావు మెల్లగా అక్కడినుండి జారుకున్నాడు. తాను చదివిన చదువుకు తగిన ఉద్యోగం దొరికేవరకు తనకు ఈ తిప్పలు తప్పవని రోజులాగే రాంబాబు బయటకి వెళ్ళాడు. కొడుకుని ఎలా ప్రయోజకుడిని చేయాలో అర్థం గాక సుబ్బారావు బుర్ర గోక్కున్నాడు.పగలంతా దోస్తులతో హవారా లాగా తిరిగి రాత్రి పది గంటలకు ఇంటికి వచ్చాడు రాంబాబు. గేటు దగ్గర సెక్యూరిటీ గార్డులా నిలబడ్డ తండ్రి ని చూసి రాంబాబు ఒక్క క్షణం ఆగాడు. "అయ్యగారు,ఏమి వెలగబెట్టారో ఇంత సేపు " వెటకారంగా అడిగాడు సుబ్బారావు. రాంబాబు మారు మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళాడు. ఎనిమిది గంటలకు ముందు ఏనాడు నిద్రలేవని రాంబాబు నాలుగు గంటలకే లేచి బయటకు వెళ్ళాడు.అలా వెళ్ళిన వాడు రాత్రి పదకొండు దాటినా రాలేదు.సుమిత్ర గుమ్మం వైపు చూస్తూనే ఉంది. నెల రోజులు గడిచాయి.రాంబాబు ఎటు వెళ్తున్నాడో తెలుసుకోవాలని సుబ్బారావుకు అనిపించింది.ఒకరోజు మారు వేషంతో రాంబాబుని అనుసరించాడు.రాంబాబు నడుచుకుంటూ నాలుగు వీధులు దాటి ఒక ఇంట్లోకి వెళ్ళాడు. సుబ్బారావు అక్కడే కాపు కాసాడు.మారు వేషంలో ఉన్న సుబ్బారావు దొంగ చూపులు పసిగట్టి కొందరు కుక్కలు వదిలారు.బతుకు జీవుడా అనుకుంటూ పరుగులు తీసాడు. పది గంటల తర్వాత రాంబాబు ని మళ్లీ అనుసరించాడు. రాంబాబు సరాసరి బస్ స్టాప్ కి వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళి పోయాడు.సుబ్బారావు కు ఏమి అర్థం కాలేదు.ఇంటికి తిరుగు ముఖం పట్టాడు. దారిలో ఉదయం రాంబాబు వెళ్ళిన ఇంటిదగ్గరికి వెళ్ళి పరిసరాలను గమనించాడు.ఇంటికి తాళం వేసి ఉంది. ఇక లాభం లేదని ఇంటికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు రాంబాబు కంటే ముందే లేచి ఆ ఇంటి దగ్గర కాపు కాసాడు.రాంబాబు వచ్చి తాళం తెరిచి ఇంట్లోకి వెళ్ళాడు.సుబ్బారావు పరుగున ఇంట్లోకి చొరబడ్డాడు. ఊహించని పరిణామానికి రాంబాబు షాక్ తిన్నాడు.అక్కడున్న దృశ్యం చూసి సుబ్బారావు అంతకంటే ఎక్కువ షాక్ తిన్నాడు. ఎదురుగా కుర్చీలో ఒక అమ్మాయి బంధించబడి ఉంది. సుబ్బారావు రాంబాబు వైపు కోపంగాచూసాడు. "పొరపాటు పడకండి సార్ " అన్న పిలుపు విని పక్కకు చూసాడు.ఒక పెద్ద మనిషి రెండు చేతులు జోడించాడు. ఇంటి లోపలి నుండి మరో ఇద్దరు వచ్చి నమస్కారం చేసారు.భార్యభర్తల్లా ఉన్నారు. సుబ్బారావు కు అంతా అయోమయంగా ఉంది. "సర్,మా అమ్మాయికి మతి స్థిమితం లేదు.ఒకరోజు ఆసుపత్రి నుండి వస్తుండగా మీ అబ్బాయి ని చూసి,నవ్వింది.అప్పటి నుండి మీ అబ్బాయి మా ఇంటి చుట్టూ తిరగడం మొదలెట్టాడు.మీ అబ్బాయి గురించి తెలుసుకున్నాము.మా అమ్మాయి ని ప్రేమిస్తున్నానని చెప్పాడు.మేము అమ్మాయి పరిస్థితి వివరించాము.ఆమె ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా కోలుకుంటుంది. ప్రతి రోజు నాలుగు గంటలకు నిద్ర లేచి రమ్మని మేమే చెప్పాము.మేము మా ఆఫీసులో అతనికి ఉద్యోగం ఇచ్చాము. ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలు ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్,తర్వాత ఆఫీసు లో ఉద్యోగం.మీ అబ్బాయి ఈ నెల రోజుల్లో చాలా మారిపోయాడు.మా అమ్మాయి కి జబ్బు నయం కాగానే మీ ఇంటికి వచ్చి మాట్లాడాలనుకున్నాము.ఇలా మీరే……" వారు ఇంకా ఏదో చెబుతూనే ఉన్నారు.సుబ్బారావు అమ్మాయిని చూసాడు. ఆమె నవ్వుతూనే ఉంది. &&&&&&&