పూర్వకాలంలో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాలలోని మానససరోవరం దగ్గర పర్ణశాల నిర్మించుకొని భీకరమైన తపస్సు చేస్తున్నాడు.
నారదుని తపస్సు భంగము చేయ్యమని దేవేంద్రుడు తన అప్సరసలను పంపించాడు.
అప్సరసలు నారదుని సమీపించి వీనులవిందుగా గానం చేశారు. కనుల పండువుగా నాట్యం చేశారు.
మహర్షి చలించలేదు. చివరి అస్త్రంగా అప్సరసలు అంగాంగ ప్రదర్శనం చేశారు.
నారదుడు ‘‘శివ.. శివా..’’ అంటూ కళ్ళు మూసుకొని తపస్సు ప్రారంభించాడు.
అప్సరాంగనలు దేవేంద్రుని వద్దకు పోయి నారదుని తపస్సు భంగము చేయలేకపోయామని విన్నవించి సిగ్గుతో తలలు వంచుకున్నారు. నారదుడు ఆ తపస్సు తన ఇంద్రపదవి కోసం చేయటంలేదు.. కేవలం పరమేశ్వరుని అనుగ్రహం కోసమే చేస్తున్నాడని తెలుసుకున్న దేేవేంద్రుడు కూడా శాంతించాడు.
అప్సరసల వయ్యారములకు లొంగక ఇంద్రియ నిగ్రహము పాటించినందుకు నారదుడు తనను తానే అభినందించు కున్నాడు, లోలోన సంతసించాడు. క్రమంగా ఆ సంతోషము గర్వముగా మారింది. 'అవ్సరాంగనలకు లొంగలేదు కాబట్టి మాయను జయించినల్లే' అని తీర్మానించుకున్నాడు.
ఇలా ఉండగా ఒక రోజున నారదుడు సత్యలోకానికి వెళ్ళి, బ్రహ్మదేవుడితో తను తపస్సు చేసిన విధానము, అప్పరాంగ నలను జయించిన విధానము వివరించి “తండ్రీ! ఇదేకదా మాయ. ఆ మాయను నేను జయించగలిగాను'' అన్నాడు. అ మాటలు విన్న పరమేపష్టి నవ్వి ఊరుకున్నాడు.
తరువాత నారదుఠు కైలాసానికి వెళ్ళి, శివుడికి నమస్కరించి “దేవదేవా! శివ మాయను జయించటం వల్ల నేను ధన్యుడనైనాను" అన్నాడు. ఆ మాటలు విన్న ఈశ్వరుడు ‘‘ నారదా! శివ మాయ అంటే ఏమిటో పూర్తిగా నాకే తెలియదు. దాన్ని జయించానం టున్నావు. ఎందుకయినా మంచిది, జాగ్రత్తగా ఉండు” అన్నాడు.
తరువాత నారదుడు వైకుంఠం చేరి, విష్ణువుకు నమస్కరించి, తాను చేసిన తపస్సు గురించి తెలిపి, “తాను శివమాయను జయించాను, విష్ణు మాయ కూడా నన్నేమీ చెయ్యలేదు" అన్నాడు. ఆ మాటలు విన్న విష్ణుమూర్తి “నారదా! త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి ఉన్నది, అదే పరమ శక్తి. మహామాయ. దానిని గురించి తెలియనివారు విష్ణుమాయ, శివమాయ అనుకుంటారు. కాని మహామాయ త్రిమూర్తులను కూడా బద్దులను చేస్తుంది. మాయకు అతీతుడైన వారెవరూ లేరు. కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవలసినది” అన్నాడు.
ఆ మాటలు విన్న నారదుడు సరే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు. భూలోకంలో కళ్యాణపురము పట్టణమున్నది. అది సస్యశ్యామలమై ఉన్నది. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు యుక్తవయస్కురాలైన కుమార్తె ఉన్నది. కుమార్తెకు వివాహం చేద్దామని నిశ్చయించి, దేశం నలుమూలలా చాటింపు వేయించాడు మహారాజు.
రాజభవనముతో పాటు కళ్యాణపుర మంతా అందంగా అలంకరించారు. అంత కోలాహలంగా. ఉన్నది. ఆ రాజ్యానికి బయలుదేరాడు నారదుడు.
రాజభవనానికి వచ్చాడు.
మహర్షిని చూడగానే రాజు అర్హ్యపాద్యాదులు ఇచ్చి స్వాగతం పలికాడు.
సుఖాసీనుడైనాడు నారదుడు. మహర్షిని ఘనంగా సత్కరించాడు మహారాజు, చెలికత్తెలు రాకుమారిని తోడ్కొని వచ్చారు.
రాజహంసలా వచ్చిన రాకుమారి అతి వయ్యారంగా నమస్కరించింది.
నిండు యవ్వనంలో ఉన్న రాకుమారి అవురూస సౌందర్యరాశి.
ఆమెను చూడగానే నారదుని మనసు పరిపరివిధాల పోయింది, అమె పేరు రమాదేవి.
ఆమె అందచందాలకు ముగ్గుడైన మహర్షి “రాజా! నీకు అభ్యంతరం లేకపాతే నీ కుమార్తెను నేను వివాహం చేనుకుంటాను". అన్నాడు.
ఆ మాటలు విన్న రాజు “మునీంద్రా! అంతకన్నా నాకు అదృష్టం ఇంకేదైనా ఉంటుందా? నీ కోరిక తప్పక మన్నించాలి. కాని నా కుమార్తె "శ్రీహరిని తప్ప వేరివరినీ వివాహమాడను అంటోంది. అంతా భగవదేచ్చ. రేపే కదా స్వయంవరము.. మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి” అన్నాడు,
నారదుడు సంతోషముగా సరే అన్నాడు.
వెంటనే నారదుడు వైకుంఠానికి బయలుదేరాడు.
వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషపాన్పుపై శయనించి ఉన్నాడు.
నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి “మహాప్రభో! సుఖాలు, భోగాలు అనుభవించటంలో నీకు మించినవాడు ఈ జగత్తులో మరెవరూ లేరు, నేను సన్యాసిని, ఏకాకిని. “స్వామీ! కళత్ర సుఖము, స్వర్గసుఖము కన్నా కూడా మిన్న’' అంటారు, భూలోకంలో కళ్యాణపురాధీసుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆమె ఆందాల రాశి, అపరంజి బొమ్మ, నేను ఆమెను వివాహ మాడాలనుకుంటున్నాను. కానీ ఆమె శ్రీహరిని తప్ప మరెవ్వరినీ వివాహమాడను అంటున్నది. కాబట్టి ఓ జగన్నాధా! నీ హరి రూపము నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటి వాణ్ణి చేసి పుణ్యం కట్టుకో!” అంటూ అనేక విధాల ప్రార్గించాడు.
ఆ మాటలు విన్న విష్ణుమూర్తి “నారదా! వివాహము అంటే ఒక స్రీని కట్టుకుని ఆమెతో కాపురం చెయ్యటమే కదా? మాయలో పడ్డవాడు ఆ మూయ నుండి బయటపడే మార్గమున్నది కాని సంసారంలో పడ్డవాడికి దానిలోనుంచి బయటవడే మార్గమే లేదు. “సారము లేనిది సంసారము" అని పండితులు చెబుతారు. సంసారివై మాయలో పడితే నిన్ను రక్షించేవారెవరు? ఒక్కసారి ఆలోచించు" అన్నాడు. ఆ మాటలకు కోపించిన నారదుడు "తాతా! వివాహం చేసుకున్నంత మాత్రం చేతనే మాయలో పడిపోతానా? శివమాయ, విష్ణు మాయలను జయించిన వాణ్ణి. ఇప్పటివరకూ నిన్ను ఏమీ అడగలేదు. ఈ ఒక్కటీ అడుగుతున్నాను. నీ హరి రూపాన్ని నాకు ప్రసాదించు” అన్నాడు.
‘‘తధాస్తు’’ అన్నాడు శ్రీహరి.
భూలోకంలో కళ్యాణపురం పెళ్ళిసందడితో కోలాహలంగా ఉంది. దేశవిదేశాల నుండి రాజులు, మహారాజులు, రారాజులు, లెక్కలేనంత మంది న్వయంవర మంటపానికి విచ్చేశారు. వారందరూ రతనాల హారాలు ధరించారు. వజ్రాలు పొదిగిన కిరీటాలు ధరించారు. వారు ధరించిన వజ్రవైడూర్యముల కాంతులతో స్వయంవర మంటపము కొత్త కాంతులీనుతోంది. స్వయంవర మంటపం ప్రవేశించాడు నారదుడు. రాకుమారి కోరినట్లుగానే తను హరిరూపము ధరించి వచ్చాడు. అందాల రాశి తప్పక తననే వరిస్తుంది ఆని ఆలోవిస్తూ ఒకచోట ఆసీనుడైనాడు.
రాజకుమారి వరమాలను చేత ధరించి వరాన్వేషణలో బయల్దేరింది. ఆమెతోపాటు చెలికత్తెలు ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైన రాజుల వివరాలు చెప్తున్నారు. రాజకుమారి మౌనంగా ముందుకు సాగిపోతుంది. రాజకుమారి దగ్గరకు రాగానే కూర్చున్న రాజులు మెడలు ముందుకు సాచుతున్నారు. మందంగా నడిచిపోతోంది రాకుమారి. అలా నడిచి నడిచి నారదుని వద్దకు వచ్చింది. చెలికత్తెలు రాకుమారితో ఏదో చెప్పారు. నారదుడు మెడను ముందుకు వంచాడు.
చిరునవ్వు నవ్వింది రాకుమారి. ఘొల్లుమన్నారు చెలికత్తెలు. ఆ కోలాహలానికి అటువైపు చూసిన రాజులు కూడ పగలబడి నవ్వారు. ఏం జరుగుతుందో .. అందరూ ఎందుకు నవ్వుతున్నారో నారదునికి అర్ధంకాలేదు..
రాజకుమారి ముందుకు సాగిపోయింది. దూరంగా చివరన కూర్చున్నాడు శ్రీహరి. వరమాల ఆయన కంఠసీమన అలంకరించింది రాకుమారి. ఆమెని తీసుకొని గరుడ వాహనం మీద వైెకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. ఆ విషయం ఎవరూ పట్టించుకోకుండా స్వయంవరానికి వచ్చిన రాకుమారులు,రాజులు అందరూ తననే వింతగా చూస్తూ పరిహాసంగా నవ్వుతుండటంతో ఏం జరిగిందో అర్ధంకాలేదు నారదునికి. ఇక వుండబట్టలేక అసలేం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలంతో.. వారిని అడిగాడు నారదుడు..
అప్పుడారాజులు.. ‘‘ ఏమ్యా.. నువ్వెవరో పిచ్చివాడిలా వున్నావే. వంటి మీద వున్న వస్త్రాలు, ఆభరణాలు చూస్తే శ్రీనాధునిలావున్నాకు. కానీ నీ ముఖం ఒకసారి చూసుకో.. కోతిలాగా వున్నది. అట్టి నిన్ను రాకుమారి ఏరకంగా వరిస్తుందనుకున్నావు? ’’ అంటూ నారదుని ఎగతాళి చేశారు.
నారదునికి విషయం అర్ధమైంది. శ్రీహరి తన రూపాన్నిమ్మంటే కోతిరూపాన్నిచ్చి తనను మోసం చేశాడు. సభల తనకు తీరని పరాభవాన్ని కల్పించాడు. తలవంపులయింది నారదునికి.. దీనికి కారణమైన విష్ణువుని అస్సలు క్షమించరాదు అనుకుంటూ, కోపంతో ఊగిపోతూ హుటాహుటిన వైకుంఠం చేరాడు. అక్కడ శ్రీమహావిష్ణువుని చూసి, నారాయణా! నువ్వెంత మోసగాడవు. దేశ దేశాల నుంచి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు. దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవింపకుండా వుండలేవు. ‘‘ భార్యకోసం నేను ఏవిధంగా తల్లడిల్లిపోయానో అలాగే నీవు కూడా నీ భార్యకోసం నానా కష్టాలు పడతావు. నాకు కోతి ముఖం ప్రసాదించావు కనుక ఆ కోతిమూకలే నీకు కష్టకాలంలో సాయంగా నిలుస్తాయి. ఇదే నా శాపం’’ అన్నాడు.
ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు ‘‘ నారదా ! శాంతించు.. శివమాయ నిన్ను ఆవహించింది. హరి రూపము కావాలని కదా నువ్వు అడిగింది. హరి అంటే కోతి అని అర్థం నీకు తెలియదా? జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరటం నీకు తగినదా చెప్పు. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నిన్ను నేను మోసగించానా? నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావు. సరే నీ శాపం నిష్ఫలం కాదులే. అయితే త్రేతాయుగంలో శ్రీరామ చంద్రునిగా దశరధుని ఇంట పుట్టి, నీశాపమును అనుభవిస్తాను. నువ్వు నన్ను శపించినా, నేను మాత్రం నీకు వరమిస్తున్నాను. కలహప్రియుడ వైనప్పటికీ ముల్లోకములందూ నీవు గౌరవింపబడతావు.’’ అన్నాడు శ్రీహరి.
మాయను జయించానని విర్రవీగిన నారదునికి గర్వభంగం అవ్వటంతో శ్రీహరి మాటలకు అతని హృదయం ద్రవించింది. కళ్ళు చెమర్చాయి. వెంటనే శ్రీమన్నారాయణుని పాదాలపై పడి ‘‘ హే నారాయణా... నన్ను క్షమించు. నా తప్పులను మన్నించు. సదా నీ అనుగ్రహానికి పాత్రుడయ్యేలా నన్ను కటాక్షించు స్వామీ’’ అంటూ వేడుకున్నాడు.
ఆ తర్వాత విష్ణుమూర్తి ఆశీస్సులందుకొని తీర్ధయాత్ర చెయ్యటానికి బయల్దేరాడు నారదుడు.