"పిలిచేవా కనకం"
“ఏం చేస్తున్నారు?"
"రాత్రి వంట చేయడానికి కూరలేమేమి ఉన్నాయో చూస్తున్నాను"
“నేను మా మహిళా సమాజం సమావేశంకి వెళ్తున్నాను. వచ్చేసరికి రాత్రి తొమ్మిది దాటుతుంది"
"నువ్వొచ్చేసరికి అన్నీ వేడిగా ఉండేటట్టు చూసుకుంటానులే"
"అది సరే. మిమ్మల్ని ఎందుకు పిలిచేనంటే"
"చెప్పు" అని, కనకమహాలక్ష్మి గారి భర్త (ఆయన పేరు ఆయనే మరచి పోయేరు, ఇక మనకేం తెలుసు) కొంచెం వంగి ఆమె ఏమి చెప్తుందా అని చెవులు రెండూ అప్పగించేడు.
"నా స్నేహితులు నలుగురు మన ఇంటికి రేపు ఉదయం తొమ్మిదో గంటకి వచ్చి ఫలహారం చేసి, మధ్యాహ్నం లంచ్ చేసి, సాయంత్రం స్నాక్స్ తిని, రాత్రి డిన్నర్ చేసి వెళ్తారు."
"అయితే నేను ఏమి చేయాలి? ఆ సమయంలో ఇంట్లో ఉండకుండా ఎటేనా వెళ్లి రాత్రి పది తరువాత రావాలా ఇంటికి"
"మీకీ మధ్య హాస్యం ఎక్కువైపోతోంది. ఆ వంటకాలన్నీ ఎవరు చేస్తారు, మీరే కదా. బజారుకి వెళ్లి సామానులు కూరలు వగైరా ఏమేమి కావాలో తెచ్చుకోండి."
"ఇంతకీ, ఏమేమి వండాలి రేపు"
"మా ఆయన వండితే నలుడు భీముడు కూడా సిగ్గుతో తలలు వంచుకోవలసిందే అని చెప్పేను వాళ్లకి. మీ వంటలు రుచి చూడడానికే వస్తున్నారు వాళ్ళు. ఏం చేస్తారో ఎలా చేస్తారో మీ ఇష్టం."
"అలాగే. ఏమేమి చేయాలో నేనే ఆలోచించి సామానులు తెచ్చుకుంటానులే"
"నాకు తెలుసు మీరు చాలా మంచివారని, నేనంటే చాలా చాలా ప్రేమ అని. వంట అయిపోతే నాకోసం చూడక మీరు తినేయండి. రాత్రి ఆలస్యంగా తింటే మీకు పడదు కదా" అని, కనకమహాలక్ష్మి నవ్వుతూ మహిళా సమాజానికి బయలు దేరితే –
ఆమె భర్త రేపటి వంటకాల గురించిన ఆలోచనలో పడ్డాడు.