శాపగ్రస్తులు - రాము కోలా.దెందుకూరు.

Shapagrastulu

"ఏ స్త్రీ తనకు తానుగా మలినం కావాలని కోరుకోదు,కొందరి స్వార్థానికి శాపగ్రస్థురాలిగా మిగిలిపోతుంది. సమాజం అనే మేడిపండులో ఇమడలేని మేలిమి గింజలా". విపత్కర పరిస్థితుల్లోనూ మారని జుగుత్సాకరమైన చూపులు.అవి మనిషివే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు .అది అందరికీ తెలిసినవే కనుక. లేడి పిల్లలను వేటాడే చిరుత చూపువంటి చూపులు, శూలంతో శరీరంను చిత్రవధ చేస్తున్నట్లుగా కామంతో చూసే చూపుల్లో మార్పులేదు. వెకిలిగా నువ్వే నవ్వుల్లో మార్పురాలేదు. ఆశగా పెదవులను తడుముకునే మగ బుద్దిలో మార్పు రాలేదు. మనిషి కదా! మార్పును అంత త్వరగా ఆహ్వానించలేడు "మీకు లాగా నలుగురు మధ్యన హుందాగా తల ఎత్తుకొని జీవించే బ్రతుకులు కావు మావి." "అలాగని ఎదుటి వారిని దోచుకునే కుచ్చితమైన మనస్తత్వం కాదు మాది." "మా శరీరాన్నే పెట్టుబడిగా పెట్టి, అందరూ వెలుగులు కోసం ఎదురుచూస్తున్న సమయంలో , మేము మాత్రమే వెలుగులను దూరం చేసుకుంటూ, కనిపించీ కనిపించని వెలుగుల్లో, సాంప్రదాయ కుటుంబాలకు దూరంగా బ్రతికే బ్రతుకులు మావి." "అందరూ శ్రమను మరచి ఆదమరిచి నిదురించాలి అనుకునే సమయంలో, మా ఆశలను, ఆలోచనలను ,ప్రక్కన పెట్టి,క్షణక్షణం నరకం అనుభవిస్తూ కొందరిని సంతోషపెడుతు జీవం ఉన్నా ,నిర్జీవంగా రాత్రిని గడిపే పడుపు వృత్తిలోని అభాగ్యులం." "ఏది చేసినా! మా పిల్లల కోసమేనని మాకు తెలుసు." "దిగజారిన తనం అనుకోవడం మాత్రమే మీకు తెలుసు." "ఇలా శరీరం అమ్ముకు బ్రతికే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదా?" అని మీరు ఆనుకోవచ్చు. తరతరాలుగా ఇదే వృత్తిలో కోనసాగే జీవనం మాది.ఇష్టం ఉన్నా లేకున్నా! చస్తూ బ్రతుకుతూ! "మాకు మేముగా ఎంచుకున్న జీవితం కాదు ఇది! కొందరు నమ్మించి వంచించి,మా నుదుటిపై వ్రాసిన కొత్త జీవన రేఖ ఫలితం ఇది. బ్రతుకుతూ చస్తూ!జీవిస్తున్నామని మీకు వివరించలేని నిస్సహాయులం." "మేము మారినా! ఈ సమాజం అంత త్వరగా మమ్మల్ని అక్కున చేర్చుకునే అంత ఔదార్యం చూపదని తెలుసు." "ఉద్దరిస్తాం ఆనే మాటల్తో వలలు విసిరే పురుష పుంగవులు మా చుట్టూ ఉన్నారని మీకూ తెలుసు!" "ఆడది అంటే!ఆంగట్లో సరుకు అనుకునే ఉత్తములు మన చుట్టూ ఉన్న సమాజంలో మేము నిత్యం వాడి పోతున్న మల్లెలం." "నిత్యం వన్నె తగ్గని ప్లాస్టిక్ పువ్వులం" లాక్ డౌన్ విధించి నాలుగు రోజు లౌతుంది. సాయంత్రం పూట ముఖానికి ముసుగులు కట్టుకుని, పెద్దమనుషుల్లా చెలామణి అవుతున్న ఎందరో !, గుట్టు చప్పుడు కాకుండా వచ్చి వెళ్ళేవారి సంఖ్య రోజు రోజుకు తగ్గి పోతుంది. మామూలుగా సాయంత్రం పూట జనంతో రద్దీగా ఉండే మా వీధి ఇప్పుడు ఆకులు రాలి,మోడు వారిన వృక్షంలా ఉంది. ఓర చూపులు,విజిల్స్ శబ్దాలు లేక పవిత్రంగా మారింది మా వీధి. నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు పెట్రోలింగ్ డ్యూటీలో రౌండ్స్ తిరిగే పోలీస్ జీపు తప్పు మరేది కనిపించడంలేదు , ఉదయం నిద్రలేచి కన్నులు నులుము కుంటూ! గుడిసె నుండి బయటకు వచ్చిన నాకు , కొత్తగా ఏదో గవర్నమెంట్ వారి బండి కనిపించింది. *** "గుడిసెల్లోని అందరిని పిలిచి వరుసలుగా నాలుగైదు బస్సుల్లో ఎక్కించుకుని తీసుకుపోయి, ఏవేవో పరిక్షలు జరిపించి కొందరిని అక్కడే ఉంచేసుకుని, కొందరిని తిరిగి మా గుడిసెల దగ్గర దించేసిండ్రు." "అదేదో క్వారంటైం అంట.!అక్కడ కొన్ని రోజులు ఉంచుకుని పంపిస్తారట." "లాక్ డౌన్ మరో నెలగు రోజులు ఉంటుందని , ఎవ్వరూ బయటతిరగ రాదంటూ చెప్పి , మా పనులను కొన్ని రోజులు నిలిపివేయాలని , ఎవ్వరినీ దగ్గరికి రానీయవద్దని , ఏదో వైరస్ వ్యాపిస్తుందని చెప్పి, గుడిసె గుడిసెకు కొద్దిగా బియ్యం,కొద్దిగా డబ్బులు,కూరగాయలు. ఇచ్చి వెళ్ళి పోయిండ్రు. *** "చేసేది తప్పే అని తెలిసినా ఈ కూపం లోనుండి బయట పడలేక ! రాజీ పడుతూ బ్రతుకుతున్న బ్రతుకులు మావి" అని గుర్తించే మానవ హృదయాలు ఎక్కడో అప్పుడప్పుడు మా ఎదుట నిలుస్తుంటాయ్." "అప్పుడే కోల్పోయామో మాకు తెలుస్తుంది." "హృదయం ద్రవిస్తుంది." ఒక్కక్షణంలో నూరెళ్ళ జీవితంలోని నరకం అనుభవిస్తాం" "మా పిల్లలనైనా చదివించుకుని ఈ నరక కూపంకు దూరంగా పెంచుకోవాలని. దుర్భరమైన జీవితంను భరిస్తూనే కాలం వెళ్ళబుచ్చుతున్న నిస్సహాయులం మేము." "ఎవ్వరో చేసిన పాపాలకు రూపాలం, ఎవ్వరిని నిగ్గదీసి అడగలేని అణగారిన వర్గాల చీకటి దివ్వెలం" "లాక్ డౌన్ కారణంగా ,తొలిసారిగా పస్తులు ఉండడం అంటే ఏమిటో తెలిసింది." ఆకలిని గుర్తుచేసుకోలేక ,మంచి నీళ్ళతో కడుపు నింపుకుంటూ, "ఇంటికే కూరగాయలు బియ్యం తెచ్చి ఇస్తారంటే నిజమే అనుకున్నాం." అది ఆచరణలో కాస్త కనుమరుగైంది. రోజులు గడుస్తున్న కొద్ది ఆకలి అనేది ఒకటి భయంకరంగా మనిషి పైన దాడి చేస్తూంటుందని అనుభవం తెలియచేసింది.. వారం గడిచి పొయింది. తినడానికి ఏమీ లేని పరిస్థితుల్లో పిల్లలకు పాలు పట్టలేని స్థితి."ఏదైనా తింటే కదా శరీరం నుండి పాలు రావడానికి. పసివాళ్ళ ఆకలి తీర్చడానికి" *** "ఉదయమే అందురూ పంచాయితీరాజ్ ఆఫీసు దగ్గరకు రండి !.అందరూ తప్పక మాస్కులు ధరించి రావాలి." "అందరికీ నిత్యావసరాల సరుకులు ఇవ్వడం జరుగుతుంది" అనే వార్త మా గుడిసెల దాకా వచ్చేసింది కొన ఊపిరితో ఉన్న వాడికి ఆయుష్షు ప్రసాదించినట్లు. ఉదయమే లేచే సత్తువ లేకున్నా! శరీరంలో కొత్తగా ఊపిరిని నింపుకుంటూ, వెళ్ళి లైన్లో నిలబడితే! పది గంటలకు వచ్చారు ఇచ్చేవారు." "కాస్త త్వరగా ఇస్తే,నాలుగు ముద్దలు వండుకుతిని పిల్లలకు ఈ పూటనైనా కడుపు నిండుగా పాలు పట్టాలనే మా అశలపై నీళ్ళు జల్లుతూ,వార్డు కౌన్సిలర్ గారు పన్నెండున్నరకు వచ్చారు , తరువాత వారి ఉపన్యాసం కోసం కొద్ది సమయం కేటాయించక తప్పలేదు" "కానీ ఉదయం నుండి, కొన్ని వందల కన్నులు మా శరీరాన్ని చూపుల్తో ఆరగించేస్తూ.. వెకిలి నువ్వుల్తో వినోధం పంచుకుంటూ, తాము ఎన్ని సార్లు మా గుడిసెల దగ్గరకు వచ్చి వెళ్ళింది గొప్పగా చెప్పుకుంటూ." "కావాలనే తాకుతూ, అటూ ఇటూ తిరుగుతున్న కొందరిని చూసి అని పించింది ." "సాటి మనుషులు ప్రాణాలు పోతున్నా, ఆకలితో అలమటిస్తున్నా .. శారీరక సుఖాలు కోసం తపించే ఇటువంటి సునకానందానికి అంతం ఎప్పుడో..?" అనుకుంటూ,పంటి బిగువున బాధను ఓర్చుకుంటూ ఉంటే" మరి కొందరు" నేను పంపిస్తాను సాయంత్రం! ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళు." "కాస్తనన్ను కనిపెట్టుకుంటే చాలు" అని ఓ నయవంచన నవ్వు నవ్వుతుంటే "గట్టిగా అరవాలని అనిపిస్తుంది ." "దిగజారిన మనుషులం మేం కాదురా! "మా ముందు లోపాయకారిగా మారే మీరు, దిగజారిన వారు" అని గట్టిగా అరవాలి అని పిస్తుంది.. కానీ ఒంట్లో శక్తిలేదు. "మార్పు రావలసింది మాలో కాదు !మీరు చూసే చూపులను మార్చండి ." అని గట్టిగా అరవాలని ఉంది,అది నా తప్పుకాదేమో కదా!.. ఏ స్త్రీ తనకు తానుగా మలినం కావాలని కోరుకోదు,కొందరి స్వార్థానికి శాపగ్రస్థురాలిగా మిగిలిపోతుంది. సమాజం అనే మేడిపండులో ఇమడలేని మేలిమి గింజలా. సాహిత్య రత్న రాము కోలా..దెందుకూరు.. 9849001201

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు