కుశద్వజం అనే రాజ్యాన్ని విష్ణువర్ధనుడు పరిపాలిస్తుండే ఉండేవాడు.. అతనికి శివుడంటే ఇష్టం ఉండదు. విష్ణువు తప్ప మరెవ్వరూ దేవుడు కాదని.. శ్రీ మహావిష్ణువు మాత్రమే సృష్ఠికి మూలాధారమని, శివుడు కేవలం బండరాయనీ, దానికంటే రుబ్బురోలు, తిరగలి నయమని చెప్పేవాడు.అవి ప్రజలకు ఉపయోగపడతాయి.. కానీ ఏమాత్రం పనికిరాని ఒక రుబ్బురోలుకి గుడికట్టి పూజించటాన్ని ఆయన నిరసించేవాడు. ఆ రాజ్యంలో ఎట్టిపరిస్థితుల్లోనూ శివపూజ చేయటానికి వీల్లేదని శాసనం కూాడా చేశాడు. దీంతో ప్రజలందరూ కూడా శివపూజ మానేశారు. శివాలయాల్ని శాశ్వతంగా మూసివేశాడు. దీంతో ఆరోజు శివునికి ఘోరమైన అవమానం చేశానని భావించాడు.
నిత్యం వైష్ణవాలయాల్లో ధూపదీపనైవేద్యాలతో కళకళలాడేలా చేశాడు. అంతేకాదు ప్రత్యేకంగా శివుడిని తిట్టటానికి తన ఆస్తానంలో కవులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వారు ప్రతినిత్యం శివ నిందచేస్తూ ఆ రాజుని ఆనందింపచేస్తూ అతని నుంచి ధన, కనక,వస్తు, భూ దానాలను పొందుతుండేవారు.
అదే రాజ్యంలో పినాకపాణి అనే ఒక మహా శివ భక్తుడు ఉండే వాడు.. అతను నిత్యం శివ పూజ చేయకుండా ఏ పని ప్రారంభించేవాడు కాదు. ఈ శివభక్తుని గురించి రాజుకు తెలిసింది. రహస్యంగా శివుణ్ణి పూజిస్తున్నాడని తెలుసుకున్న రాజు వెంటనే పినాకపాణిని తన ఆస్థానానికి పిలిపించాడు. సంజాయిషీ ఇవ్వవలసిందిగా కోరాడు.
‘‘ శివుడే ఆది, అంతం. సృష్ఠి యావత్తూ శివమయమై వున్నది. మనమంతా కూడా శివుని ఉదరంలో వున్నాం. అలా తన గర్భంలో పెట్టుకొని కాపాడుతున్న తండ్రి శివుడ్ని పూజించటం తప్పేంటి. ’’ అని చెప్పాడు పినాకపాణి.
దానికి ఆ రాజు కోపంతో ఊగిపోతూ ‘‘ శివుడు ఒక బిచ్చగాడు, అతని వద్ద కేవలం భిక్షాపాత్ర తప్ప మరేదీ లేదని, పైగా శివుడు వుండేది స్మశానంలో.. అలాంటి బిచ్చగాడిని పూజించే వాళ్ళందరూ కూడా బిచ్చగాళ్ళే.. నా రాజ్యంలో బిచ్చగాళ్ళు లేరు. అందరూ ధనవంతులే.. విష్ణుపూజ చెయ్యటం వల్లనే అందరూ సిరిసంపదలతో తులతూగుతున్నారు. ఇప్పటికైనా బిచ్చమెత్తుకొనే ఆ భగవంతుని వదిలి సిరిసంపదలిచ్చే శ్రీహరిని కొలువు.’’ అని నచ్చచెప్పానని అనుకున్నాడు విష్ణువర్ధనడు.
పినాకపాణి ‘‘ ప్రభూ.. మీరు చెప్పినట్లు శివుడు బిక్షగాడే.. ఆయన ఆది భిక్షువు. ప్రజల పాపాలను తను భిక్షగా తీసుకొని వారికి పుణ్యాన్ని అనుగ్రహించే భిక్షగాడు. ఆయన స్మశాన రుద్రుడు.. పుట్టిన ప్రతి జీవీ చివరకు చేరుకునేది ఆయన వాసముండే స్మశానానికే తప్ప మరెక్కడికీ కాదు.. మీరైనా నేనైనా...మీ రాజ్యంలో అందరూ ధనవంతులే అంటున్నారు. వారు ఆ ధనాన్ని సంపాదించింది కూడా శివనింద చేయటం వల్లనే కదా.. వారు ధనవంతులు అవ్వటానికి కారణం కూడా శివుడే కదా.. అంటే శివుడే వారికి సిరిసంపదలిచ్చాడు.. అలాంటి శివుడిని మీరు కూడా ప్రార్ధించండి..’’ అన్నాడు పినాకపాణి.
విష్ణువర్ధనుడు మరింతగా రెచ్చిపోయాడు..
‘‘వంటిమీద వేసుకోటానికి బట్టలు కూడా లేక దిగంబరంగా తిరిగే ఆ దరిద్రుడు.. చందన మిశ్రిత సుగంధ ద్రవ్యాలను ఒంటికి పూసుకోలేక శవాలను కాల్చిన బూడిదని ఒళ్ళంతా పులుముకునే ఆ నికృష్టుడిని ఆరాధించటం అవివేకం.. నా రాజ్యంలో అవివేకులకు స్థానంలేదు.’’ అన్నాడు విష్ణువర్ధనుడు.
‘‘ మహారాజా..! పుట్టేటప్పుడు పోయేటప్పుడు ఒంటిపై ఏమీలేకుండా పుడతాము. పోయేప్పుడు కూడా ఏమీ తీసుకుపోము.. చివరికి బూడిదకూడా అని సంకేతంగా ఒంటిపై వస్త్రాలు లేకుండా కేవలం బూడిదను తన ఒంటికి పూసుకుంటూ సంకేతాన్నిస్తాడు. పూలతోనేకాదు, పత్రాలతో నేకాదు, తన నెత్తిన చెంబు నీరు పోసినా, రాయిరప్పలు పెట్టి అర్చించినా కూడా ఆ శివుడు సమానంగా చూస్తాడు. అంతటి పరమయోగిని అవివేకునిగా భావించేవారే అవివేకులు’’ అన్నాడు పినాకపాణి.
‘‘ అయితే నేటి నుండి నీ శివుణ్ణి నువ్వు రాళ్ళతోనే పూజించు. శివుణ్ణి నువ్వు ప్రతిదినం రాళ్ళతో కొడుతూ పూజించు.. ఆ శివునివలె నువ్వు కూడా దిగంబరంగానే వుండు. భస్మాన్ని పూసుకొని తిరుగు.. ఆ శివుడు వచ్చి నిన్ను రక్షిస్తాడో లేదో చూద్దాం.. ఇదే నేను నీకు విధించే శిక్ష’’ అన్నాడు ఆవేశంగా విష్ణువర్ధనుడు.
దానికి పినాకపాణి మారుమాట్లాడకుండా ఆ శిక్షను అనుభవించేందుకు సిద్ధమయ్యాడు.
కాలం గడిచిపోయింది. వత్సరాలు దాటుతున్నాయి.
కొంతకాలానికి పినాకపాణి, మహారాజు ఇద్దరూ కూడా ఒకే ముహూర్తంలో చనిపోయారు.
విచిత్రంగా ఇద్దరూ కైలాసానికి వెళ్ళారు. ఇద్దరూ శివునిముందు నిలబడ్డారు.
ముందుగాపినాకపాణి చేతులు జోడించి ‘‘ పరమేశ్వరా.. నిన్ను నేను రాజు ఆజ్ఞ ప్రకారం రోజు రాళ్ళతో కొట్టాను అయినా నన్ను నరకానికి పంపకుండా కైలాసానికి తీసుకొచ్చారు ఎందుకు స్వామి’’ అని అడిగాడు.
అందుకు చిరునవ్వుతో శివుడు ‘‘నువు నన్ను రాళ్లతో కొట్టావా... పూవులతో పూజించావా అనేది కాదు ముఖ్యం. నా పైన భక్తితో వున్నవా లేదా అనేది ముఖ్యం. నువ్వు రోజు నన్ను కొంత సేపు పూజించే వాడివి.. రాజు రాళ్లతో కొట్టమని చెప్పినప్పటి నుంచి రోజంతా నన్ను స్మరించుకున్నావు.. కాబట్టి నీకు త్వరగా కైలసంబునకు ముక్తి మార్గం దొరికింది. ’’ అన్నాడు.
విష్ణువర్ధనుడు చేతులు జోడించి ‘‘ మహాశివా.. నేను విష్ణువుని తప్ప మరెవ్వరినీ పూజించలేదు. అలాగే నిన్ను సదా ద్వేషిస్తూ వచ్చాను. నిన్ను నావద్ద వున్న కవులతో తిట్టించాను. ఇతనిచే రాళ్ళతో కొట్టించాను. అయినా నాకు కైలాసాన్ని అనుగ్రహించావు ఎందుకు’’ అన్నాడు.
పరమేశ్వరుడు నవ్వుతూ.. ‘‘ విష్ణువర్ధనా.. శివస్యహృదయం విష్ణుః, విష్ణుస్య హృదయం శివః. అంటే నేను విష్ణువుని ధ్యానిస్తాను. విష్ణువు నన్ను ధ్యానిస్తాడు. ఈ విషయంలో నువ్వు నన్ను ద్వేషిస్తూ నిత్యం నా నామస్మరణ చేశావు. అలా నువ్వు కలలో కూడా నా గురించే ఆలోచించేవాడివి కనుకనే నా నామస్మరణతోనే నువ్వు కైలాసానికి వచ్చావు. పైగా నీ కవులు నన్నుతిడుతూ చేసిన రచనలననీ నిందాస్తుతులే.. అవి నిందాస్తుతులనే పేరుతో సాహిత్యంలో ప్రసిద్ధమౌతాయి. వాటికి కారణమైన వాడవు నీవు కనుకనే నీకు కైలాసప్రాప్తి కలిగింది.’’ అన్నాడు.
దీంతో ఇద్దరూ మహాదేవునికి నమస్మరించి కైలాసవాసమును పొందారు.
శివలీలలు ఎవ్వరికీ అర్ధంకావు.. ఆయన విడమరచి చెప్తే తప్ప.