“ఒరేయ్.. ఉపాయం..!” అంటూ ఎంతో ప్రేమగా పిలిచాడు తన బావమర్దిని కథలయ్య.
వాస్తవానికి వారి ఇద్దరి పేర్లూ అవి కావు. బావమర్ది ఉపాయం అసలు పేరు ఉపేంద్రం. ఎంత కష్టమైన పని అయినా.. ఉపాయంతో గట్టెక్కడం అతనికి వెన్నతో బెట్టిన విద్య. అందుకే అంతా ‘ఉపాయం’ అని పిలుస్తుంటారు. ఇక కథలయ్య నిజమైన పేరు కాంతయ్య. పదవీ విరమణ చేసాక బుర్ర ఖాళీగా ఉంటే దయ్యాలు దూరుతాయనే భయం.. అతనికి సాహిత్యం పైన మక్కువ కనుక కథలు రాయడంలో దూర్చింది. కథలు రాసే కాంతయ్య పేరు కాస్తా.. ‘కథలయ్య’ గా మారిపోయింది.
“ఏంటి బావా..! అలా గావుకేక పెట్టావు. పీడ కలేమైనా వచ్చిందా!” అని పళ్లికిలిస్తూ.. వచ్చాడు ఉపాయం.
“కేకలు పెట్టానా..! ఎంతో ప్రేమగా పిలిచాను. నీకలా వినిపించిందారా! లేక తమాషా చేస్తున్నావా!.. నేనంటే పిల్లకాయల కచ్చకాయల ఆటలా కనబడ్తున్నానా!” కళ్ళు నొసటికెక్కించుకొని చూశాడు కథలయ్య.
“సరేలే బావా..! ఇంతమాత్రానికే గంత గరమై పొతే ఎలా! నీతో గాకుంటే మరెవ్వరితో పరాచికాలాడాలి..” అనుకుంటూ.. తల కాసింత ఓరగా తిప్పి కిసుక్కున నవ్వాడు ఉపాయం.
“సరే గాని.. నీవు చాలా ఉపాయమంతుడివే గదా.. మరి నా సంగతి చూడక పోతివి” అనుకుంటూ ఎడం చేత్తో తల వెనుకాల సుతారంగా గోక్కోసాగాడు కథలయ్య.
“బావా..! ఏమి నీ కోరిక?” అలనాటి సినిమాలో పాతాళభైరవి.. ‘నరుడా.. ఏమి నీ కోరిక?’ అన్న లెవల్లో ఫోజు పెట్టి.. అడిగాడు ఉపాయం.
“ఇదేమి విచిత్రమోగాని.. నాకిది ఏమాత్రమూ అర్థంకావడం లేదురా”
“ఏంటి బావా? అది” కళ్ళు సైకిలు చక్రాలంత చేసుకొని అడిగాడు ఉపాయం.
“నేను పదవీ నుండి విశ్రాంతి పొందాక అవిశ్రాంతంగా కథలు రాస్తున్నానా!. పత్రికలలో సైతం అచ్చవుతున్నాయి కదా! నీకు తెలియందేమున్నది?. ఇంత వరకు దాదాపు పది గ్రంథాలు అచ్చువేయించాను. అందులో చిన్నపిల్లల కథలు మూడు. అయినా నేనింకా ఎవరి కంట్లో పడక పోవడం ఆశ్చర్యంగా ఉంది”
“కంట్లో పడకపోవుడేమిటి బావా!” నువ్వేమైన నలుసువా! అన్నట్టు.. దేబె ముఖం పెట్టి అడిగిండు ఉపాయం.
“అదేరా!.. సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు అంటారు చూడు. అటువంటివి నాకెవ్వరూ ప్రకటించడం లేదు”
“ఓ..! అదా సంగతి”.. ‘ఓ’ ను మూతి మూరెడంత సాగదీసి పలికాడు ఉపాయం.
లిప్తకాలం ఆలోచించి.. “ఈ మధ్య దినపత్రికలలో కొన్ని వార్తలు చదివాను బావా.. నాకో ఉపాయం తట్టింది. దాంతో నిన్ను సాహిత్య పురస్కారం వరించడం ఖాయం” మరి డబ్బులు పెట్టుకుంటావా..! అన్నట్టు చేతి పెద్ద వ్రేలును, చూపుడు వ్రేలుతో చిట్కరించుకుంటూ సైగజేసాడు.
“ఆ!.. పురస్కారానికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా!. అవేమైనా అంగట్లో అమ్ముతున్నారా!” నోరు నీటి గోలెమంతచేసుకొని బావురుమన్నాడు కథలయ్య.
“అవును మరి.. ఏమనుకుంటున్నారు? మన డబ్బులు మళ్ళీ మనకు తిరిగి రావాలంటే దానికీ ఒక ఉపాయ మున్నది. అదంతా నేను చూసుకుంటాను. ముందు నువ్వు సరే.. అను బావా..!”
బిరుదుల మీద, పురస్కారాల మీద యావ ఉన్నవాడు ‘ఊ..!’ అనక ఏమంటాడు?..
“సరే కానివ్వు.. అంతా నీ జిమ్మేదారి. కిందమీదయ్యిందనుకో!.. నీ తోలు తీసి పెద్దదర్వాజకు తోరణం కడతా..”అని కనుగుడ్లు తాటికాయంతలా తెరచి బెదిరించాడు కథలయ్య.
***
‘దోచే వారెవరురా..!’ అనే బాగా పేరున్న సాహిత్య సంస్థ వాళ్ళు ఆ సంవత్సరం ‘సాహితీ సంస్కారమూర్తి’ సాహిత్య పురస్కారానికి ఎన్నిక చేసిన సాహితీ వేత్తల పేర్లలో కథలయ్య పేరు గూడా ఉంది. జ్ఞాపిక, శాలువా, సత్కారంతో బాటు పదివేల నూట పదహార్లు నగదు బహుమతి అని వివిధ దినపత్రికల్లో ప్రకటనలు వచ్చాయి.
కథలయ్య కప్పలా గంతులు వేసాడు. ‘ఇది కలనా! నిజమా!! అని తొడ గిల్లి నిర్థారించు కున్నాడు. బావమరిది ఉపాయం చిన్నపిల్లవాడైతే ముద్దులతో ముంచెత్తేవాడే!.
అయినా అంత పని చేస్తాడేమోనన్న భయంతో కాస్త దూరంగా చేతులు కట్టుకొని ‘రాముడు మంచి బాలుడు’ అన్న రీతిలో నిల్చుని చూస్తున్నాడు ఉపాయం.
“నువ్వు నిజంగ మనిషివి గాదు బామ్మర్దీ!” అని ఉపాయంను ఎత్తుకోబోయినట్టు ఆక్షన్ చేస్తూ.. నడుం కలుక్కుమనే సరికి కట్టెసర్సుకు పోయాడు కథలయ్య.
“ఏంటి బావా! అలా అనేసావు. నేను మనిషిని కానా..! నీ కంటికి రాక్షసునిలా కనబడుతున్నానా?” ముఖం ఆముదం తాగినట్టు పెట్టాడు ఉపాయం.
“ఆగరా..! నడుంలో పట్టుకున్నది” అని ముక్కిర్సి.. నడుంను అటూ, ఇటూ అలనాటి సినీ నటి జ్యోతిలక్ష్మిలా తిప్పి సర్దుకున్నాడు.
“నువ్వు నాపాలిటి దేవునివిరా. వరం అడిగానో! లేదో..! నాకు అనే బిరుదు తెప్పిస్తున్నావు. నా డబ్బులు నాకు తిరిగి ఇప్పిస్తున్నావు. పైపెచ్చు శాలువా.. మేమోంటో.. అంటే మాటలా!” అని కండ్లెగరేసుకుంట..“ఏ..మ్మాయ చేసావు బామ్మర్దీ!” అంటూ ఆత్మీయంగా హత్తుకున్నాడు కథలయ్య.
“బావా ముందు సన్మానమైతే కానియ్యి. ఆ తరువాత చెప్తా..” అని కన్ను గీటాడు ఉపాయం.
***
‘దోచే వారెవరురా..!’ అనే సంస్థ నిన్ను బ్రోచేవారమురా..! అన్నట్టు కథలయ్యకు ‘ న భూతో న భవిష్యత్’ రీతిలో సన్మానం జరిపింది. చేతిలో చెక్కు పెట్టి చేతులు దులుపుకుంది. ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య ‘రాజు వెడలె.. బసకు’ అన్నట్టు హావభావాలు ప్రదర్శించుకుంటూ.. ఉపాయం అంగరక్షకుడిలా వెన్నంటిరాగా.. కథలయ్య ఇంటికి చేరుకున్నాడు.
అలా ఇంట్లో కాలు పెట్టాడో లేదో..! ఇలా “బామ్మర్దీ..!” అని ఉద్వేగంగా.. గాలిలో తేలిపోతున్నట్టు కేక వేసాడు కథలయ్య.
“ఏమయ్యింది బావా!” అని ఉపాయం కంగుతిన్నాడు. ఇంకా ఏమైనా తక్కువ చేసానా అన్నట్టు కనుగుడ్లు తేలేసి మిడుకసాగాడు.
“ఉపాయం..! నువ్వు పన్నిన ఉపాయమేమీటో త్వరగా చెప్పు. నా కడుపు ఉబ్బిపోతోంది.. చెప్పకుంటే పగిలి పోయేట్టుగా ఉంది”
“బావా.. చెప్తాను గాని ముందు మెడలున్న ఆ దండలు, శాలువ తీసి టేబులు మీద పెట్టి నింపాదిగా కూర్చో..” అని కుర్చీ దగ్గరకు లాగాడు ఉపాయం.
“నువ్వు చెప్పేదాక తీయనంటే తీయను.. కూర్చోను గాక కూర్చోను” అని మొండి పట్టు పట్టాడు కథలయ్య.
ఇక తప్పదన్నట్టు నోరు విప్పాడు ఉపాయం.
“బావా.. పత్రికలలో నీ పేరుకు ముందు ఏంరాసారో చదువ లేదా!”
ఉపాయమేంటో చెప్పురా అంటే మళ్ళీ, మళ్ళీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడని సుర్రు, సుర్రున చూసాడు కథలయ్య. ఆచూపును అర్థం చేసుకున్న ఉపాయం ముసి, ముసి నవ్వులు నవ్వుతూ..
“కీ.శే. జ్ఞానేశ్వరమ్మ జ్ఞాపకార్థం.. శ్రీ సదానందం గారికి మా సంస్థ తరఫున ‘సాహిత్య సంస్కారమూర్తి’ సాహిత్య పురస్కారం ప్రదానం” అని రాసారు. ‘చూడలేదా!’ అన్నట్టు చేతిలో ఉన్న కరపత్రం చూపించాడు.
“ఔనురా.!. అమితమైన ఆనందంలో నా బుర్ర పని చెయ్యలేదు. అవునూ.. జ్ఞానేశ్వరమ్మ అంటే మా అమ్మమ్మ పేరు గూడా అదే.. చిన్నప్పుడు నాకు కథలు చెప్పేది” అని నిర్ఘాంతపోయాడు.
“అదే బావా! నేను చెప్పేది పూర్తిగా విను. మన జ్ఞానేశ్వరమ్మ పేరు మీద.. నువ్విచ్చిన పదివేల నూటపదహార్లు పోను మరో మూడు వేలు తదితర ఖర్చులు, కమీషను కింద సమర్పించాను. నువ్వు రాసిన పుస్తకాలు మూడేసి కాపీలు చొప్పున తీసుకున్నారు. మనిద్దరి మధ్య చుట్టరికం ఉన్నట్టు చెప్పలేదు. కాని చెప్పినా ఇచ్చే వారే అనుకుంటాను.. వారికి కావాల్సింది కమీషను. సభకు అయ్యే ఖర్చులలో వాటా. అలా పురస్కార గ్రహీతల అందరి వద్ద వసూలో చేసి.. ఏ తలకాయె మాసినోనికి పురస్కారం ఇమ్మన్నా.. ” అని నాలుక కర్సుకున్నాడు ఉపాయం. ‘తప్పయ్యింది బావా!’ అన్నట్టు లెంపలేసుకుని.. రెండు చేతులా దండం పెట్టాడు.
“తలకాయె మాసినా..! మాయకున్నా..! ఫరకు పడదు. పురస్కారమైతే దక్కిందని.. తెల్లవారి పత్రికల్లో తన పేరు మారు మ్రోగి పోతుందని.. భుజాలెగిరేసాడు కథలయ్య. *