గొప్ప మనసు - VEMPARALA DURGA PRASAD

GoppaManasu

బలరాం కి THROAT కాన్సర్ వచ్చి తగ్గింది. కీమో తెరపీ చేయించుకున్నాడు ఒంగోలు లోని HCG మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో.. ఇప్పుడు చాల మటుకు బాగానే వుంది.

బలరాం ఉండేది బండ్లమిట్ట అనే చిన్న ఊరులో. అక్కడి నుండి ఒంగోలు 10 కిలోమీటర్స్. ఆ వూరికి బస్సు సౌకర్యం వుంది గానీ, అది రోజుకి 2 సార్లే వస్తుంది. బస్సు కోసం ఎదురుచూస్తూ ఎవరూ కూర్చోరు. ఆ సమయానికి బస్సు వస్తే ఎక్కడం, లేకుంటే ఆటో లో వెళ్లిపోవడమే. ఆ వూళ్ళో ఒకటే ఆటో స్టాండ్. అందులో 3 ఆటోలు ఉంటాయి. మూడూ బయటికి వెళ్తే, మళ్ళీ ఏదో ఒకటి వచ్చే దాకా ఎదురు చూడడమే. లేదా, ఊళ్లోకి వచ్చిన ఆటో తిరిగివెళ్ళేటప్పుడు వెళ్లిపోవడమే. ఒక్కో సారి, “నేను ముందు పిలిచేను అంటే నేను ముందు పిలిచేను” అని కొట్టుకోవడాలు కూడా మామూలే అక్కడ.

ఆ రోజు 2వ శని వారం. సన్నగా చినుకులు పడుతున్నాయి. బలరాం ఆ రోజు చెక్ అప్ కి వెళ్ళాలి. ఉదయం నుండీ నాగరాజు కి ఫోన్ చేస్తున్నాడు. కానీ, ఎన్ని సార్లు ఫోన్ చేసినా తియ్యట్లేదు. తర్వాత అది స్విచ్ ఆఫ్ కూడా వచ్చింది. ఆయనకి నాగరాజు మీద చాలా కోపం వస్తోంది. విసుగ్గా వుంది. బయటకి వచ్చి ఆటో స్టాండ్ సమీపించేడు.

నాగరాజు కి బలరాం గారు బ్యాంకు మేనేజర్ గా వున్నప్పుడు ఆటో కొనుక్కోవడానికి తన అధికారం వుపయోగించి లోన్ ఇప్పించేడు. ఆ లోన్ సరిపోక పొతే, ఓ 10 వేలు సర్దేడు అప్పుగా. తర్వాత ఆ అప్పు నెమ్మదిగా తీర్చేసేడు నాగరాజు. అదీ ఆతను చేసిన సహాయం. గత ఏడాది రిటైర్ అయి పోయాడు ఆయన. కానీ, నాగరాజు ఆయన మీద అభిమానం తో ఆయన ఎప్పుడు కావాలన్నా, ఆటో తీసుకుని వస్తాడు. పైగా, బేరం అక్కర్లేదు, ఆయన తోచినది ఇచ్చినా తీసుకుంటాడు.. పాపం ఎప్పుడూ విశ్వాసం చూపిస్తాడు. నాగరాజు అమాయకుడు, మంచితనానికి చొక్కా ప్యాంటు వేసినట్లు ఉంటాడు. ఈ రోజు నాగరాజు ఫోన్ చేసినా తీయక పోవడం ఆయన కోపానికి, విసుగు కి కారణం.

కొంత మంది చిన్న సాయానికి ఎంతో ఆశించేస్తుంటారు. ఇదిగో ఆయన ఆ కోవకి చెందిన వాడే.

ఆటో స్టాండ్ లో ఒకటే ఆటో వుంది. అది కూడా కదల బోతోంది.

"బాబూ ఆటో" అంటూ పరిగెత్తేడు బలరాం.

అది కూర్మా రావు ఆటో. కూర్మా రావు ఆటో కి వెనుక బోర్డు ఉంటుంది. "గర్భిణీ స్త్రీలకి ఉచితం గా ఆటో ప్రయాణం" అని. గర్భిణీ స్త్రీలు వస్తే, ముందు వాళ్ళకే PREFERENCE ఇస్తాడు ఆతను. అందువల్ల వూళ్ళో అందరికీ ఆతను తెలుసు.

ఆటో లో వున్న వ్యక్తి తల బయటికి పెట్టి చూసి, ఆటో ఆపించేడు.

బలరాం ఆటో ని సమీపించేడు. ఆటో లో వున్న వ్యక్తి, “ఒంగోలు కే కదా, రండి” అన్నాడు.

“నేను కాన్సర్ హాస్పిటల్ కి వెళ్ళాలి” అన్నాడు బలరాం.

“అది గవర్నమెంట్ ITI జంక్షన్ లోనే కదా వుంది. నేనూ ఆ పక్క బిల్డింగ్ లోనే వున్న MB హాస్పిటల్ కి వెళ్ళాలి”.. అన్నాడు ఆయన.

బలరాం ఆటో ఎక్కేసేడు. ఆటో ముందుకు కదిలింది

దార్లో పరిచయాలు అయ్యేయి. ఆ వ్యక్తి పేరు భాస్కర్ రావు. కొద్దిసేపు రాజకీయాలు మాట్లాడుకున్నారు.

తర్వాత, భాస్కర్ రావు బండ్లమిట్ట ఎందుకు వచ్చేరు అని అడిగేడు బలరాం.

అతను వూళ్ళో చిన్నారావు గారి ఇంటికి వచ్చి, వెళ్తున్నాడుట. చిన్నారావు కిరాణా వ్యాపారి.

"ఈ చిన్నా రావు కి లక్ష రూపాయలకి సరుకు ఇచ్చేనండీ.. 15 రోజుల్లో తిరిగి కట్టెయ్యాలి. నెల్లాళ్లయినా, కట్టక పొతే, అడుగుదామని వచ్చేను. ఇంట్లో లేడుట. ఎవరికో బావులేదుట, రక్తం ఇవ్వడానికి ఒంగోలు లో MB హాస్పిటల్ కి వెళ్ళేడుట. నేను సరుకు అరువుగా ఎవరికీ ఇవ్వను, ఒక్క చిన్నారావు కి మాత్రమే ఇస్తాను. కొద్దిగా నిజాయితీ గా ఉంటాడని. కానీ, ఏమయిందో, ఈ మధ్య మారిపోయాడు..

వాళ్ళ ఆవిడ నంగనాచి కబుర్లు చెప్తోంది. ఈవాళ ఎలాగయినా చిన్నారావు ని పట్టుకోవాలి . అక్కడే బయట కాపలా కాస్తాను” అన్నాడు భాస్కర్ రావు.

“నేను TREATMENT లో భాగంగా చెక్ అప్ చేయించుకోవడానికి 15 రోజులకి ఒక సారి కాన్సర్ హాస్పిటల్ కి వెళ్తాను. నాగరాజు అని ఆటో DRIVER ఉంటాడు. నేను ఇదివరకు అతనికి ఆటోకొనుక్కోడానికి బ్యాంకు లోన్ ఇప్పించేను లెండి.. నేను బ్యాంకు మేనేజర్ గా చేసి ఈ మధ్యే రిటైర్ అయ్యేను.. అని మధ్యలో తన గొప్ప చెప్పుకున్నాడు బలరాం .

మళ్ళీ ఇలా అంటున్నాడు. “ ఎప్పుడూ పిలిచినా, వచ్చే వాడు. ఇవాళ ఫోన్ తీయలేదు, పైగా మళ్ళీ తిరిగి కాల్ కూడా చెయ్యలేదు.. వీళ్ళకి విశ్వాసం వుండదండి” అన్నాడు బలరాం .

ఇంతలో M.B. హాస్పిటల్ వచ్చింది. ఆటో ఆపిన , కూర్మారావు వాళ్ళిద్దరినీ ఏహ్య భావం తో చూసేడు.

ఇద్దరూ చెరో వంద రూపాయలు ఇచ్చేరు. డబ్బులు తీసుకుని, ఓ వంద హాస్పిటల్ ముందు కూర్చున్న ముసలావిడ కి ఇచ్చేడు అతను . “ బావున్నావా అమ్మ” అని పలకరించేడు.

భాస్కర్ రావు, బలరాం ఆశ్చర్యంగా చూసేరు.

వెనక్కి తిరిగి ఇలా అన్నాడు..” రోజూ నేను సంపాదించే మొదటి సంపాదన లో ఓ 100 రూపాయలు ఆ ముసలావిడకి ఇస్తాను. ఆవిడ నాకు బంధువు కాదు. కన్న కొడుకు వదిలేసి వెళ్లి పొతే, ఇక్కడ అడుక్కుంటోంది.

మళ్ళీ ఇలా అన్నాడు:

“ఏమీ అనుకోకండి సార్.. ఒక మాట చెప్తాను. ఇందాక మీ మాటలు విన్నాను. వాళ్ళేం బాధల్లో వున్నారో తెలుసుకోకుండా యెంత మాటలు అనేసారు సర్”.

“ కస్టాలు అన్నవి అందరికీ వస్తాయి. కష్టాల్లో సాయం చేస్తేనే సాటి మనిషిని దేవుడు అంటారు.

నాగరాజు కి రాత్రి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఈ హాస్పిటల్ లో జాయిన్ చేసేరు. బ్లడ్ ఇవ్వడానికే చిన్నారావు గారు ఇక్కడికి వచ్చేరు. మా ఆటో వాళ్ళు మరో ముగ్గురు కూడా బ్లడ్ ఇస్తున్నారు.

మేమేమీ డబ్బున్న వాళ్ళం కాదు బాబూ. కానీ మనసు వున్న వాళ్ళం.

ఇంక సహాయం అనే మాటకి అర్ధం ఏమిటో తెలుసా సార్!

“ సాయం అంటే జేబులో డబ్బు మాత్రమే తగ్గాలి. గుండెలో అభిమానం తగ్గ కూడదు. మనసులో పుణ్య భావనే పెరగాలి, గర్వం పెరగకూడదు.”

“ఇంకో విషయం చెప్పాలి మీకు... నేను గర్భిణీ స్త్రీలకి సాయం చేస్తాను. కొంతమంది నాకు తెలియదు అనుకుని పొట్టకి గుడ్డలు చుట్టుకుని గర్భిణీల్లా నటించి,నా ఆటో ఎక్కి FREE గా వెళ్లి పోతుంటారు. నేను ఆడమనిషిని గౌరవించి, మాట్లాడకుండా వూరుకుంటాను”.

భగవంతుడి కంటే గొప్పవాళ్ళం కాదు సార్ మనం...."అయినా...మా పేదోళ్లే సాటి మనిషిని మనిషి గా చూస్తారు. మీ పెద్ద వాళ్ళు సాయం లో కూడా స్థాయి, సౌఖ్యం చూసుకుంటారు.. తప్పు కదా బాబూ ...“నాగరాజు బతికి బయట పడాలని, చిన్నా రావు మరింత మందికి సాయం చేయాలనీ, కోరుకోండి బాబు." అన్నాడు.

భాస్కర్ రావు, బలరాం సిగ్గుతో తల దించుకున్నారు.

-END-

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు