ఆయువు పెంచే మంత్రం - డా.దార్ల బుజ్జిబాబు

Aayuvu penche mantram

మావూరికి ఓ యోగి వచ్చాడు. కాషాయ రంగు లుంగీ, అదేరంగు బారు చేతుల చొక్కా వేసుకున్నాడు. పొడవాటి గడ్డం ఉంది. చాలా సౌమ్యంగా, నిదానంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాటల్లో ఏదో మంత్రం ఉన్నట్టు అందరిని ఆకట్టుకుంటున్నాయి. వయసు నలభై ఏభై ఏళ్ల మధ్య ఉంటుంది. ప్రతిరోజు రచ్చబండ దగ్గర ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతున్నాడు. చాలామంది వెళుతున్నారు. ఒకరోజు తనగురించి చెబుతూ "నాపేరు నిత్యానంద యోగి. మాది నంద్యాల. బాల్యంలోనే హిమాలయాలకు వెళ్ళాను. పాతికేళ్ళు కఠోర తపస్సు చేశాను. ఆయువు పెంచే మంత్రం నేర్చుకున్నాను. దీన్ని అందరికి ఉచితంగానే నేర్పుతాను. ఏవరికి తోచింది వారు దక్షణగా ఇవ్వవచ్చు. ఎందుకంటే దక్షణలేని విద్య పనిచేయదని శాస్త్రం చెబుతోంది. బలవంతం ఏమీలేదు. కాకపోతే ధర్మాలు , దానాలు చేసేవారిపై ఈ మంత్రమహిమ ఎక్కువగా పని చేస్తోంది. ఎంత ఎక్కువ ముట్టచెబితే అంత ఎక్కువ ఫలితం ఉంటుంది. రోజుకు వందమందికి మాత్రమే నేర్పుతాను. తెల్లవారుజామున కోడి కూసే వేళలో నూతన వస్త్రాలు ధరించి రావాలి. ప్రతిరోజు తెల్లవారు జాము గంటపాటు స్థిమితంగా కూర్చుని నేను నేర్పిన మంత్రం మననం చేసుకోవాలి. నేను నేర్పిన మంత్రం మీరు మరొకరికి నేర్పినా, ఉదయం మననం చేసుకోక పోయిన మంత్రం పనిచేయదు. దీన్ని మీరు నిష్ఠతో ఆచరిస్తే మంచి ఫలితం ఉంటుంది." అన్నాడు. యోగి మాటలు కొందరు నమ్మారు. ఆయువు పెంచుకోవాలి అనుకున్నారు. మరికొందరు ఏ పుట్టలో ఏ పాముందో పోయేదేముంది నేర్చుకుందాం అనుకున్నారు. ఎలాయితేనేం యోగి ఆశ్రమం ముందు రద్దిపెరిగింది. ముందుగా వచ్చిన మొదటి వందమందికి మాత్రమే ఆయన నేర్పుతూ ఉన్నాడు. ఇలా కాలం గడిచిపోతూవుంది. చాలామంది మంత్రం నేర్చుకున్నారు. యోగి ఆదాయం బాగా పెరిగింది. ఈ విషయం చాలా విస్తృతంగా పాకింది. సుదూర ప్రాంతాలనుండి కూడా రావడం మొదలు పెట్టారు. ఎంత మంది వచ్చినా ఎక్కడి నుండి వచ్చినా విసుగు, విరామం లేకుండా నేర్పుతూనే వున్నాడు. రోజులు దొర్లి పోతువున్నాయి. నేర్చుకునేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆయన నేర్పేది వందమందికే కానీ వేల సంఖ్యలో హాజరయ్యేవారు. మొదటి వందమంది మాత్రమే అదృష్టవంతులు. మిగిలినవారు మరోమారు ప్రయత్నించేవారు. ఇలా ఉండగా ఓ రోజు ఉదయం ఆశ్రమం ముందు గుంపులు గుంపులు జనం పొగయ్యారు. రోజూ మాములే. కానీ ఈ రోజు మరీ ఎక్కువ మంది చేరారు. కారణం తెల్లవారుజామున యోగి చనిపోయాడు. "పాపం! విశ్రాంతి లేని పని వత్తిడివల్ల పోయాడు" అన్నారు చాలా మంది. "పాపం! చిన్నవయసులోనే పోయాడు" అన్నారు మరికొందరు. "ఇంకా కొంతకాలం బతికుంటే బాగుండేది. చాలా మందికి మంత్రం నేర్పివుండేవాడు" అన్నారు ఇంకొంతమంది. "ఆయన ఆయువు అంతవరకు ఉంది. ఎవరు మాత్రం ఏమిచేయగలరు?" అని నిట్టూర్పు విడిచారు చాలామంది. అంతేగానీ "ఆయనకు ఆయువు పెంచే మంత్రం తెలుసుకదా? ఆ మంత్ర మహిమతో మరికొంత కాలం జీవించి వుండవొచ్చు కదా అని ఎవరూ ఆలోచించలేదు.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు