ప్రమాణాలే ముఖ్యం!(బాలల కథ!) - కొత్తపల్లి ఉదయబాబు

Pramanale mukhyam

మండు వేసవికాలం. ఉదయం 9 గంటల సమయం దాటేటప్పటికీ సూర్యుడు తన ప్రతాపం చూపించ సాగాడు. సెలవులకు వచ్చిన మనవలందరూ టిఫిన్లు తిన్నాక తాతయ్య చుట్టూ చేరారు. " తాతయ్య! బ్రతుకుతెరువుకు పనికొచ్చే నాకు మంచి మాటలు చెప్పండి తాతయ్య " మనవళ్లందరిలోనూ పెద్దవాడు సుధీర్ అడిగాడు. ''దానికన్నా...మీరు పిల్లలు కదా...అప్పుడప్పుడు బయటకి వెళ్ళినప్పుడో, బజారుకి వెళినప్పుడో అతి తెలివితేటలూ ప్రదర్శిస్తుంటారు కదా.. అలాంటి అనుభవాలు చెప్పండి. ఇక్కడ మిగతావాళ్లకి కూడా తెలుస్తుంది. తద్వారా రేపు వాళ్ళు ఎలా బయట తప్పుగా ప్రవర్తించకూడదో తెలుస్తుంది. మీరూ వినండర్రా పిల్లలూ ''...అన్నాడు తాతయ్య. ''ఓ . నేను చెబుతాను తాతయ్య... స్నేహితుడు ఒకసారి వాళ్ళ ఇంటికి నన్ను భోజనానికి పిలిచాడు. ఆరోజు వాళ్ళ అమ్మ నాన్నగారు వూరు వెళ్లారు. వాళ్ళ బామ్మగారు మాకు అన్నం పెట్టారు. చివరగా పెరుగు పోశారు. పుల్లగా ఉంది , అందులోకి ఉప్పు వేయమని తిన్నగా అడగకుండా, ఇంట్లో అమ్మని అడిగినట్లు ''కాస్త సోడియం క్లోరైడ్ వేయండి బామ్మగారూ..'' అని అడిగాను. ఆవిడ వేసుకునే కాల్షియం మందుబిళ్ల ఒకటి తెచ్చి అన్నంలో వేసింది. ''సోడియం క్లోరైడు అంటే ఉప్పు బామ్మగారు... ''అన్నాను ఆవిడతో నవ్వుతూ ''నాకేం తెలుసురా భడవా...నేనేమన్నా చదువుకున్నానా...పాడా..పెరుగు పుల్లగా ఉంటేతెలుపు వెయ్యండి' అని తిన్నగా అడగవచ్చు.నీ చదువు పరిజ్ఞానం ఇక్కడ చూపిస్తే నాకెలా తెలుస్తుందయ్యా..'' అని మందలించారు. ''సోడియం క్లోరైడ్ వేయమంటే మా మమ్మీ వేస్తుందండీ..'' అన్నాను. ''మీ అమ్మ చదువుకుని ఉంటుంది. పైగా నీ తెలివితేటలకు సంబరపడిపోయి వేసుంటుంది.'' నేను మాట్లాడకుండా భోజనం చేసి బయట పడ్డాను.''అన్నాడు సుధీర్. తాతయ్య బోసినోరుతో పకపకా నవ్వాడు. ''బాగుందిరా నీ అనుభవం. ఇంకెవరైనా చెబుతారా?'' అడిగాడు తాతయ్య మిగతావాళ్ళని . ''నేను చెబుతాను తాతయ్యా...వద్దులే ...అందరూ నవ్వుతారు.'' అంది మనవరాలు సుప్రియ. ''ఇందులో నవ్వుకునేదేముందమ్మా.. ఒక పొరపాటు జరిగినపుడు దాన్ని సరిదిద్దుకుని మళ్ళీ జీవితంలో అలా చేయకూడదని హెచ్చరించే అనుభవాలు ఇవి. చెప్పు పరవాలేదు.'' అన్నాడు తాతయ్య. ''ఒకరోజు ఇంట్లో మాస్టారి ఇంటి పనిగా ఇచ్చిన మాప్ పాయింటింగ్ చేద్దామని కూర్చున్నాను తాతయ్య. మ్యాప్స్ కొనాలని అపుడు గుర్తు వచ్చింది. అమ్మనడిగి డబ్బులు తీసుకుని పుస్తకాల షాపుకు వెళ్లాను. ''కొట్లో ఒక అన్నయ్య ఉన్నాడు. నాలుగు ఇవ్వవా అని అడిగాను డబ్బులు ఇచ్చి . అతను అటూ ఇటూ చూసి నా చెయ్యి పుచ్చుకుని లోపలకి లాగబోయాడు. ఎక్కడకి అన్నాను ...నాలుగు అడిగావు కదా...''అన్నాడు. నాకు ఒక్కసారి భయమేసింది ''నేను అడిగినది మ్యాప్స్ కావాలని.'' అన్నాను. ''నువ్వు మ్యాప్స్ కావాలి అని అడగలేదు. నాలుగు కావాలని అడిగావు. ఆడపిల్ల మగపిల్లవాడిని నాలుగు కావాలి అని అడిగితే ఏమని అర్థంచేసుకోవాలి? ఏదైనా అడిగేటప్పుడు వాటి పేరు ముందు చెప్పి అపుడు ఎన్ని కావాలో అడగాలి. నువ్వు తప్పుగా అడిగి నన్ను తప్పు పడతావేంటి?'' అని అడిగాడు. నేను మ్యాప్స్ కొనుక్కుని ఇంటికి వచ్చేసి ఏడుస్తూ అమ్మకి చెప్పాను. అమ్మ నన్ను తిట్టింది. ''ఆ అబ్బాయి చెప్పింది నిజమే.అడిగే విధానం తెలుసుకోవద్దూ ?తొమ్మిదో తరగతి చదువుతున్నావ్. నాలుగు కావాలి అంటే వయసులో ఉన్న కుర్రాడు ఇంకేదో అనుకుని ఉంటాడు. ఉదాహరణకి నేనే ఫ్రిడ్జ్ లోంచి నాలుగు తీసుకురామ్మా..అని అడిగాననుకో. వంకాయలా, బెండకాయలా, పచ్చిమిరపకాయలా అని అడుగుతావు కదా.'' అని చెప్పింది . అపుడు నేను చేసిన పొరపాటు నాకు తెలిసింది. '' అంది సుప్రియ. ''చూసారా..దీనిని బట్టి మీకు ఏమి అర్ధమైంది?''అడిగాడు తాతయ్య. ''మీరు మా అందరికీ అర్ధమయ్యేలా వివరంగా చెప్పండి తాతయ్య.''పిల్లలు కోరస్ లా అడిగారు. ''పాఠశాలకు వెళ్ళినపుడు యూనిఫామ్ వేసుకుంటాం. ఇంటికి వచ్చాకా బట్టలు మార్చుకుని మనకు సౌకర్యంగా ఉండే బట్టలు వేసుకుంటాం. మీరు చదువుకునే ప్రతీ సబ్జెక్టులోను ఆ సబ్జెక్టుకు సంబంధించిన పదజాలం ఉంటుంది . అది ఆ సబ్జెక్టుకు మాత్రమే పరిమితం. పాఠశాలలో వాడాల్సిన పదాలు ఇళ్లల్లో వాడితే ఎలా? ఎక్కడి పదజాలం అక్కడ వాడాలి. ఇంట్లో ఉప్పు అని అంటాం కానీ సోడియం క్లోరైడ్ అనము కదా. అది సైన్స్ సబ్జెక్టులో వచ్చే పదజాలం . అలాగే 'నాలుగు కావాలి' అంటే ఏమిటవి? ఆ నాలుగు పక్కన మనం అడిగే వాటినే గణితంలో 'ప్రమాణాలు' అంటారు. డబ్బు అయితే ఆ నాలుగు పక్కన రూపాయలు అని రాస్తాము. త్రిభుజం గీయమన్నపుడు నాలుగు సెంటీమీటర్లు అని రాస్తాము. ద్రవపదార్ధాలకైతే లీటర్లు అని రాస్తాము. కాబట్టి మనం ఏ వాతావరణంలో ఉన్నామో ఆ వాతావరణానికి తగ్గ పదజాలం ముందు తెలుసుకోవాలి ...అపుడు మాట్లాడాలి. ఇది విద్యార్థి దశలో పిల్లలు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం.అర్థమైందా ?'' అన్నాడు తాతయ్య. ''అలా ప్రమాణాలు రాయలేదని మా మాస్టారు అర మార్కు తీసేసారు తాతయ్య. అలా నాకు నాలుగు లెక్కల్లో రెండు మార్కులు పోయి తొంభై ఎనిమిది మార్కులే వచ్చాయి.''చెప్పాడు సుధీర్. ''అర్ధమైందిగా మరి ప్రమాణాలు చదువులో ఎంత ముఖ్యమో?'' అడిగాడు తాతయ్య, ''ఎక్కడి పదజాలం అక్కడ వాడాలని, లెక్కలో ప్రమాణాలు తప్పకుండా రాయాలని అర్ధమైంది తాతయ్య,''అన్నారు పిల్లలు. ''రేపు మళ్ళీ కొన్ని అనుభవాలు చెప్పుకుందాం. వెళ్లి ఆడుకోదుకోండిఅన్న తాతయ్య మాటలకు బయటకు పరుగు తీశారు మనవలంతా ! సమాప్తం.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు