ఒక అడవిలో ఒక కోతి వుండేది.అది ఎంతో ఉల్లాసంగా, చలాకీగా తిరుగుతూ వుండేది. పొద్దున లేచిన దగ్గర నుండి అడవిలో ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకు ఎగరడం, రుచికరమైన పళ్ళు తినడం, అలిసిపోయాక ఒక చెట్టెక్కి పడుకోవడం చేస్తుండేది .
ఒకరోజు అడవంతా కలియతిరుగుతూ వుండగా ఒక కుటీరం దగ్గరకు వచ్చింది.కుటీరం ముందున్న అరుగు మీద ఒక గిన్నెలో అందంగా నిగ నిగలాడుతూ మెరిసిపోతున్న ఎర్రని యాపిల్ పళ్ళు కనిపించాయి. వాటిని చూడగానే ఆ కోతికి నోట్లో నీళ్ళూరాయి. విని తిందామని వెంటనే రెండు చేతులతో రెండు పండ్లను తీసుకొని, ఎవరైనా చూస్తారేమో నన్న భయంతో అడవి లోకి పరిగెత్తింది.ఇంకా ఎవ్వరూ చూడరన్న ధైర్యంతో తీరిగ్గా ఒక చెట్టు ఎక్కి ఆ పండు వాసన చూసింది. చిత్రంగా ఆ యాపిల్ పండు నుండి ఎలాంటి వాసన రాలేదు. సరిలెమ్మని, దానిని కొరకడానికి ప్రయత్నించింది. ఆ పండు ఇప్పటి వరకు తాను తిన్న పళ్ళలా కాకుండా చాలా గట్టిగా వుండి కొరకదానికి ప్రయత్నిస్తుంటే పళ్ళు నొప్పెట్ట సాగాయి. పళ్ళు మరీ పచ్చిగా వున్నాయి. ఒకరోజు పోతే పండుగా మారి తినడానికి వీలవుతుంది అని అనుకుంది ఆ కోతి.
పక్కన వున్న చెట్లపై వున్న కోతుల మందకు ఈ రెండు పళ్ళును గర్వంగా చూపించి చూసారా, నాకు ఎంత మంచి పళ్ళు దొరికాయో అని వారికి అసూయ కలిగేలా కిచ కిచలాడింది.
ఆ మందలో ఒక కోతి, మేము ఇక్కడికి వస్తూంటే దారిలో పండిన అరటి పళ్ళ గెల వున్న ఒక అరటి చెట్టు కనిపించింది. ఇప్పుడు మేమందరం అక్కడికి వెళ్తున్నాం. నువ్వు కూడా మాతో రాకుడదా అని ఆహ్వానించింది.
ఆ కోతుల మంద ఒక అరటిచెట్టు వద్దకు వెళ్లి అందినకాడికి కమ్మగా ముగ్గిన అరటి పళ్ళను అందుకొని హాయిగా తినసాగాయి.మన కోతికి కూడా ఒకటి రెండు పళ్ళను తినాలన్న ఆశ పుట్టింది. అయితే రెండు చేతుల్లో రెండు యాపిల్ పళ్ళు వున్నాయి. అవి ఉండగా అరటి పళ్ళు కోయడం సాధ్యం కాదు, పోనీ వాటిని కింద పెడదామంటే మంద లోని ఏ కోతికైనా కోతి బుద్ధి పుట్టి వాటిని తీసుకొని పారిపోవచ్చు.
కోతి ఈ ఆలోచనలతో సతమమవుతుంటే, మిగితా కోతులన్నీ ఆకలి మేరకు అరటిపళ్ళు కోసుకొని తృప్తిగా తిన్నాయి. వాటి ఆనందం చూస్తుంటే కోతికి ఒకింత అసూయ కూడా పుట్టింది.
ఒకవైపు ఆకలి ఎక్కువౌతొంది. మరొకవైపు చేతిలో వున్న యాపిల్ పళ్ళు ఇప్పుడే తినడానికి పనికిరావు. ఏం చెయ్యాలో తోచక కోతి నీరసంగా ఆ చెట్టు మొదట్లో కూలబడింది.
ఇంతలో మందలో వున్న ఒక ముసలి కోతి ఈ పడుచు కోతి యొక్క సందిగ్ధాన్ని గమనించి దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది" నీ అవస్థలు నేను ఇందాకటి నుండి చూస్తున్నాను. మన అవసరాలు, ఆనందాలను వర్తమానం లోనే తీర్చుకోవాలి, వాటిని భవిష్యత్తు లోకి నెట్టడం వలన ఎలాంటి ఉపయోగం లేదు.
వర్తమానమే ప్రధానం. వర్తమానంలో ఎంత బాగా జీవిస్తే భవిష్యత్తు అంత బాగుంటుంది. ఇప్పుడు తినడానికి పనికిరాని పళ్ళను పక్కన పెట్టి, ముందు ఎదురుగా వున్న పళ్ళను తిని ఆకలి తీర్చుకో" అని హితబోధ చేసింది.
ఆ మాటలతో కోతికి జ్ఞానోదయం అయ్యింది. వెంటనే యాపిల్ పళ్ళను పక్కన పెట్టి, చెట్టెక్కి మిగితా కోతులతో కలిసి తృప్తిగా అరటి పళ్ళను తిని ఆకలి తీర్చుకుంది. ఎప్పటిలాగే ఆనందంగా, చింతా రహితంగా , ఉల్లాసంగా ఉండసాగింది.