శాస్త్రజ్ఞులే దేవుళ్ళు? - డా.దార్ల బుజ్జిబాబు

Sastragjule devullu

'భూగోళం అంతం ' ఈవార్త అన్ని పత్రికలలో పతాక శీర్షికన ప్రచురించబడింది. ఈ ప్రమాదం వందరోజులలో జరగనుంది. భూమి కన్నా పెద్దదైన ఓ గ్రహం భూమిని ఢీకొననుంది. ఈ గ్రహం అకశ్మత్తుగా శాస్త్రజ్ఞుల కళ్ళలో పడింది. ఇంతవరకు దాని ఆనవాలు ఎవరికి తెలియదు. ఎంతో వేగంగా భూమి మీదకు దూసుకు వస్తుంది. అది ఢీకొన్న మరుక్షణం భూమి తునాతునకలై పోతుంది. భూ శకలాలు చెల్లాచెదురై విశ్వములో కలిసి పోతాయి. భూమి పైనఉండే జీవరాసులన్నీ రెప్పపాటులో కనుమరుగైపోతాయి. ఈ ఉపద్రవం గురించి పదేళ్లక్రితమే భారతీయశాస్త్రజ్ఞుడు హెచ్చరించాడు. ఏవేవో లెక్కలేసి చెప్పాడు. అప్పట్లో అయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. అదొక ఊహ మాత్రమే అని కొట్టిపారేశారు. ఆ గ్రహం లేనేలేదని విదేశీ శాస్త్రజ్ఞులు వాదించారు. అప్పట్లో అదో హాస్యచర్చ. ఆ భారతీయ శాస్త్రవేత్త పేరు రామారావు. మన తెలుగు వాడే. రామారావుదంతా రూమర్ అంటూ హేళన చేశారు. ఆ రోజు దినపత్రికలో వచ్చిన వార్తతో ప్రపంచం ఉలిక్కి పడింది. ఇక ఈ భూగోళం ఆయుస్సు వంద రోజులు మాత్రమే . మిలియన్ సంవత్సరాలపాటు జీవ జాతులకు ఆశ్రయం ఇచ్చిన భూమి ఇక ఓ కల కాబోతుంది. మానవులకు వూపిరి ఆగినంత పనైంది. "గుండెను గుప్పిట్లో పెట్టుకున్నారు. కొందరి గుండెలు ఆగిపోయాయి కూడా. "వారంతా అదృష్టవంతులు రాబోయే ఉపద్రం పాలు కాకుండా హాయిగా కన్నుమూశారు" అనుకున్నారు. ఈ వార్త వెలువడిన క్షణం నుండి ప్రపంచమంతా ఒకటే చర్చ. "పాపం పండుతుంది. మానవుని ఆగడాలకు కళ్లెం పడింది. విచ్చల విడిగా జీవించాడు. అనుభవించక తప్పదు" అని తెల్చి చెప్పారు హిందూ మత పీఠాధిపతులు. "దేవుడు ఎప్పుడో చెప్పాడు రెండోవ రాకడ గురించి. అకస్మాత్తుగా మేఘారూడుడై వస్తానన్నాడు. వస్తున్నాడు. అంతే. ఇందులో వింతేముంది" అన్నారు క్రైస్తవ బిషప్పులు. అల్లా కరుణతో చెప్పిన వాటిని ఆచరించక పోవడం కారణంగానే ఈ విధ్వంసం" అన్నారు ఇస్లామ్ పండితులు. ఇలా అన్ని మతాల వారు, వారి వారి అభిప్రాయాలను ముక్త కంఠంతో వెల్లడించారు. దేవుని ఉగ్రత వల్లనే ఈ ఉపద్రం అని తేల్చి పారేశారు. ప్రత్యమ్నాయ ఏర్పాట్లకై పథక రచన చేసుకుంటున్నారు. ఇక మానవులను రక్షించే వారే లేరా? రక్షించాల్సిన దేవుడే కారకుడైనపుడు ఇక ఎవరు కాపాడతారు? ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకున్నారు. వారి వారి దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు. పాపాలను పోగొట్టమని, పవిత్రులుగా చేయమని, మోక్షము ప్రసాదించమని వారి ప్రార్ధన . దూసుకు వస్తున్న ఆ పెద్ద గ్రహాన్ని శాస్త్రజ్ఞులు స్పష్టంగా చూస్తున్నారు. భూమికి లంబంగా, గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో వస్తుందది. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. చేతులెత్తేశారు శాస్త్రజ్ఞులు. విచిత్రమేమిటంటే నాస్తికులు కూడా దేవుని మీదనే ఆధారపడ్డారు. ప్రాణాలు కాపాడమని ప్రార్ధనలలో లీనమయ్యారు. భయంతో చాలా మంది ఆహార పానీయాలు మానేశారు. మరి కొంతమంది ఉపవాస ప్రార్ధనలు చేపట్టారు. కొందరు విపరీతంగా తినటం మొదలు పెట్టారు. కొందరు వింతగా ప్రవర్తిస్తున్నారు. పెంచుకునే కోళ్లు, మేకలను దానం చేస్తున్నారు. దాచుకున్న ధనాన్ని పేదలకు పంచు తున్నారు. ఆస్తుల పత్రాలు తగలబెట్టారు. ధనిక పేదా భేదం లేకుండా అందరూ సమానమయ్యారు. రోజులు వేగంగా కదులు తున్నాయి. మరో మూడు రోజుల్లో భూమి బద్దలు కానుందనగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. సూర్య చంద్రుల గమనం లయ తప్పింది. సూర్యుడు రక్త వర్ణంలోకి మారాడు. చంద్రుడు నల్లగా మారి మెరుస్తున్నాడు. భారతీయ శాస్త్రజ్ఞుడు రామారావు ఎవరి మాటా పట్టించుకోలేదు. తాను నమ్మిన దానికే కట్టుబడి వున్నాడు. ఈ పదేళ్ల నుండి పలు ప్రయోగాలు చేశాడు. ప్రపంచం నవ్వినా, ఎగతాళి చేసినా తన ప్రయత్నం ఆపలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రేయంబవుళ్లు శ్రమించాడు. తన ప్రయోగ ఫలితంగా భూమి పైకి వస్తున్న గ్రహ దిశను మార్చాడు. తొంభై డిగ్రీల కోణంలో లంబంగా వస్తున్న గ్రహాన్ని అరవై డిగ్రీల కోణంలోకి మార్చాడు. అది మరో కక్షలోకి వెళ్ళింది. వెంటనే సూర్యుడు, చంద్రుడు మామూలు రంగులోకి మారారు. భూగోళాన్ని పెను ప్రమాదం నుంచి కాపాడిన రామారావును ప్రపంచం కీర్తించింది. ప్రపంచానికి ఓ అద్భుతం చేసి చూపిన రామారావు దేవుడయ్యాడు. దురదృష్టం ఏమిటంటే మన దేశంలో మాత్రం భూగోళాన్ని కాపాడింది తమ దేవుడే అంటూ ఎవరికి వారు చెప్పుకున్నారు. కానీ మన దేవుడు రామారావే అని మనమైనా గుర్తిద్దాం. శాస్త్రజ్ఞులే దేవుళ్లు.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు