కుబేరుడి పూర్వజన్మ. (పురాణగాథ) - కందుల నాగేశ్వరరావు

Kuberudi poorvajanma

కుబేరుడి పూర్వజన్మ

(పురాణగాథ)

పూర్వం కాంపిల్య నగరంలో ‘యజ్ఞదత్తుడు’ అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. సదాచారపరాయణుడైన ఆ పండితునికి చాలాకాలానికి ఒక కొడుకు పుట్టాడు. లేకలేక పుట్టిన ఆ బాలుడికి తల్లితండ్రులు ‘గుణనిధి’ అని పేరుపెట్టి ఎంతో ప్రేమగా పెంచసాగారు. ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి పంపారు.

రాచకార్యాల్లో నిమగ్నమైన తండ్రి ఆ తరువాత కుమారుని చదువు ఎలా సాగుతుందో పట్టించుకోలేదు. దానితో గుణనిధి దుష్టసహవాసం చేసి వ్యసనాలకు బానిస అయ్యాడు. స్నాన సంధ్యాదులు వదిలిపెట్టాడు. తల్లికి మాయమాటలు చెప్పి ఆమె నుండి సంపాదించిన డబ్బుతో జూదం ఆడేవాడు. తరువాత వేశ్యాలోలుడయ్యాడు. పనుల్లో మునిగిపోయిన యజ్ఞదత్తుడికి ఈ విషయాలేమీ తెలియవు.

యజ్ఞదత్తుడు తీరికవేళల్లో ఎప్పుడైనా కొడుకు గురించి భార్యనడిగితే, బాగా చదువుకొంటున్నాడని కొడుకు మీద ప్రేమతో ఆమె అబద్దం చెప్పేది. తండ్రి పట్టించుకోకపోవడం వలన, తల్లి గారాం చేయడం వలన గుణనిధి పూర్తిగా చెడిపోయాడు. ఇది తెలియని యజ్ఞదత్తుడు కుమారుడికి పదునెనిమిది సంవత్సరాలు నిండిన వెంటనే ఒక మంచి కుటుంబం నుండి వచ్చిన కన్యతో వివాహం జరిపించాడు. పెళ్ళయినా గుణనిధికి బుద్ది రాలేదు. తల్లి ధనం ఇవ్వడం మానేసింది. దానితో గుణనిధి తన ఇంటిలో ధనాన్ని దొంగిలించడం, విలువైన పట్టువస్త్రాలు, వెండి పాత్రలు, ఖరీదైన వస్తువులు ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళి జూదంలో ఓడిపోయినప్పుడు జూదగృహంలో గెలిచినవారికివ్వడం అలవాటు చేసుకున్నాడు. తల్లి ఎంత భోధించినా గుణనిధి ప్రవర్తన మార్చుకోలేదు.

ఒకరోజు యజ్ఞదత్తుడు స్నానానికి వెళ్తూ తన చేతి రత్నాల ఉంగరం జాగ్రత్త చేయమని భార్యకు ఇచ్చాడు. ఆమె దానిని పడకగదిలో పెట్టింది. భార్యాభర్తలు ఉంగరం సంగతి మరచిపోయారు. గుణనిధి దానిని దొంగిలించి జూదంలో ఓడిపోయి గెలిచినవాడికి సమర్పించుకున్నాడు. కొద్దిరోజుల తరువాత యజ్ఞదత్తుడు వీధిలో వస్తుండగా ఒక వ్యక్తి చేతికి తన ఉంగరం ఉండడం చూసాడు. వాడిని ‘ఈ ఉంగరం నీకెక్కడిది’ అని గద్దించి అడిగాడు.

ఆ వ్యక్తి గుణనిధి వ్వవహారమంతా చెప్పి తను ఆ ఉంగరాన్ని జూదంలో గెలుచుకున్నట్లుగా చెప్పాడు. “మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోండి, లేకపోతే మీ ఇంట్లో బిందెలు, గిన్నెలు కూడా మిగలవు” అని హేళన చేసాడు.

మొదటి సారిగా తన కుమారుని చెడు ప్రవర్తన గురించి విన్న యజ్ఞదత్తుడు అవమానంతో ఇంటికి వచ్చి భార్యను ఉంగరం గురించి అడిగాడు. ఆమె కంగారుపడి ‘ఎక్కడో పెట్టాను. తరువాత వెదికి ఇస్తాను’ అని సమాధానం ఇచ్చింది.

‘గుణనిధి ఎక్కడ’ అని అడిగితే ‘చదువుకోవడానికి వెళ్లాడు’ అని అబద్దం ఆడింది. కొడుకు ప్రవర్తన తనకు చెప్పకుండా దాచి వాడిని పాడుచేయడమే కాకుండా ఇప్పటికీ నిజం దాస్తున్నదని యజ్ఞదత్తుడు భార్యను నిందించాడు. భార్యను ఇంటి నుండి గెంటివేసాడు. తన ప్రవర్తన తెలిసి తండ్రి శిక్షిస్తాడని బయపడిన గుణనిధి ఊరు వదలి పారిపోయాడు.

మరునాడు గుణనిధి ఆకలిబాధతో ఒక చెట్టు క్రింద కూర్చొని ఏమిటి చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. “ఇంత మంచి కుటుంబంలో పుట్టిన నేను వ్యసనాలకు ఎందుకు బానిసయ్యాను? నా వద్ద ధనం లేదు. విద్యకూడా లేని నేను దేశాంతరానికి వెళ్ళి ఎలా బ్రతకగలను?” అని తనలో తానే మదనపడ్డాడు. కొద్దిరోజులు నడిచి ఇంకొక గ్రామపొలిమేరలు చేరారు. దూరంగా ఒక శివాలయ గోపురం కనపడుతోంది. అక్కడ ఉన్న చెరువు గట్టుపై నిద్రపోయాడు.

మెలకువ వచ్చేసరికి ‘హరహర మహదేవ శంభో’ అంటూ నినాదాలు వినబడుతున్నాయి. ఆ సమయంలో కొందరు శివభక్తులు రకరకాల మధుర భక్ష్యాలను శివునికి నైవేద్యం కొరకు తీసుకొని శివాలయానికి వెళ్తున్నారు. వీరిని చూసిన గుణనిధికి ప్రాణం లేచి వచ్చింది. వీరితో వెళ్తే పూజ తరువాత ప్రసాదం పెడతారని తలిచాడు. చీకటి వేళకు వారి వెంట శివాలయం చేరాడు. శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర భక్తునిగా శివనామస్మరణ చేస్తూ కూర్చొన్నాడు. ఆ శివభక్తులు శివాలయంలో శివారాధన చేసి, తెచ్చిన వంటకాలు శివుడికి నివేదించి, నృత్యగీతాలతో నటరాజుని సేవించి, అలసిపోయి అక్కడే శయనించారు.

గుణనిధి అంతవరకు ద్వారం వద్దనే ఉండి శివభక్తులు చేసిన శివారాధన అంతా చూసాడు. అంతా నిదురించాక నైవేద్యం పెట్టిన ప్రసాదాలు తినడానికి గర్భగుడిలోకి వచ్చాడు. లోపల దీపం వత్తి కాలిపోయి వెలుగు తగ్గింది. భక్ష్యాలు సరిగ్గా కనపడ లేదు. అందుకని గుణనిధి తన ఉత్తరీయాన్ని చించి వత్తిగా చేసి ప్రమిదలో పెట్టి వెలిగించాడు. గర్భగుడి అంతా వెలుగు వ్యాపించింది. అక్కడ నైవేద్యం పెట్టిన ప్రసాదాలను కొద్దిగా తిని మిగిలినవన్నీ మూటకట్టుకొని బయలుదేరాడు. తొందరలో నిద్రిస్తున్న ఒక శివభక్తుడి కాలు తొక్కాడు. నిద్రలేచిన భక్తుడు ‘దొంగ, దొంగ’ అని అరిచాడు. ఆ అరుపుకు అందరూ లేచి గట్టిగా మొత్తేసరికి, ఆ దెబ్బలకు ఓర్వలేక గుణనిధి ప్రాణాలు వదిలాడు.

యమదూతలు వచ్చి గుణనిధి ఆత్మను యమపాశంతో బంధించి యమలోకానికా తీసుకొని వెళ్ళసాగారు. ఇంతలో చేతిలో త్రిశూలంతో శివగణాలు వచ్చి యమదూతలను ఆపి గుణనిధి ఆత్మను తమకు అప్పగించమని ఆజ్ఞాపించారు. యమదూతలు ఆశ్చర్యంతో “శివదూతలారా! ఈ గుణనిధి పాపాత్ముడు. ఆచారవ్యవహారాలు పాటించలేదు. తల్లితండ్రులకు కష్టం కలిగించాడు. జూదరి, దొంగ అయిన ఇటువంటి వానితో మీకేమి పని” అన్నారు.

శివదూతలు నవ్వుతూ “యమకింకరులారా! మీరు చెప్పినదంతా నిజమే. కాని ఈరోజు బహుళ చతుర్దశి. ఇది శివుని కిష్టమైన మాస శివరాత్రి. తెలియకపోయినా వీడు రోజంతా ఉపవాసంతో గడిపాడు. రాత్రికి శివాలయం చేరాడు. శివనామస్మరణ చేసాడు. శివభక్తులు పాడిన శివకీర్తనలు విన్నాడు. గర్భగుడిలో దీపం వెలిగించాడు. శివలింగాన్ని దర్శించాడు. శివునికి నైవేద్యం పెట్టిన ప్రసాదం స్వీకరించాడు. దీని వలన వీడు చేసిన పాపాలన్నీ పటాపంచలయ్యాయి. వీనికి కైలాసప్రాప్తి లభించింది” అని చెప్పి గుణనిధి ఆత్మను తమతో కైలాసానికి తీసుకుపోయారు.

యమదూతలు యమపురు వెళ్ళి యమధర్మరాజుకు జరిగినదంతా వివరించారు. అప్పుడు యముడు యమకింకరులతో ఇలా చెప్పాడు. “భటులారా! మీకు ధర్మసూక్ష్మం వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. మీరు శివభక్తుల జోలికి పోకండి. చితాభస్మాన్ని నుదుట మూడు నామాలుగా ధరించినవారిని, నిలువెల్లా విభూతి పూసుకున్నవానినీ, రుద్రాక్షధారులనీ, జటాధారులనీ, చివరకు పొట్టకూటికోసం శివునివేషం వేసేవారినీ యమలోకానికి తీసుకురాకండి” అని హెచ్చరించాడు.

యమదూతల నుండి పొందిన గుణనిధి సూక్ష్మశరీరాన్ని శివదూతలు కైలాసం చేర్చారు. కొంతకాలం గడిచాక గుణనిధి ‘అరిందముడు’ అనే కళింగరాజుకు ‘దమనుడు’ అనే కుమారుడిగా జన్మించాడు. పూర్వజన్మ సుకృతం చేత చిన్నతనం నుండే శివభక్తి అలవడింది. దమనుడు అరిందముని తరువాత ఆ దేశానికి రాజయ్యాడు. పూర్వజన్మలో శివరాత్రినాడు శివుని ముందు దీపం వెలిగించడం వలన అతనికి పూర్వజన్మ సంగతులు గుర్తున్నాయి. ఆ సంస్కారం వల్ల దమనుడు మహాశివభక్తుడై నిత్యం శివపూజలు చేసేవాడు. ప్రతీ మాసశివరాత్రి నాడు, మహాశివరాత్రినాడు శివాలయాలన్నింటిలో దీపాలు వెలిగించా ఏర్పాట్లు చేయడం, దీపదానాలు చేయడం, శివపూజలు జరిపించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసేవాడు. చాలా కాలం ప్రజారంజకంగా దేశాన్ని పాలించి పూర్ణజీవితాన్ని అనుభవించి స్వర్గస్తుడయ్యాడు.

గుణనిధి దమనుడనే కళింగరాజుగా పుట్టి నిత్యం శివారాధన చేయడం, శివాలయాల్లో లెక్కపెట్టలేనన్ని దీపాలను వెలిగించడం, దీపదానాలు చేయడం వలన మరుజన్మలో బ్రహ్మదేవుని మనుమడైన విశ్రవసువుకు కుమారుడిగా జన్మించాడు. విశ్రవసుడి కుమారుడు కాబట్టి ‘వైశ్రవణుడు’ అనే పేరుతో పిలిచేవారు. పూర్వజన్మలలో చేసిన పుణ్యం వలన అతనికి పూర్వజన్మ స్మృతి ఉంది. దానితో అతడు ఈ జన్మలో కూడా గొప్ప శివభక్తి అలవడింది. పవిత్రమైన కాశీనగరం వెళ్ళి గంగానది ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్టించాడు. అక్కడ శివదీక్షతో కఠినమైన తపస్సు చేసాడు. ఆ కారణంగా అతడు చిక్కి శల్యమై అస్థిపంజరంలా తయారయ్యాడు. అతని తపస్సుకు సంతోషించిన శివుడు సతీసమేతంగా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. శంకరుని స్పర్శతో వైశ్రవణునికి పూర్వరూపం వచ్చింది.

వైశ్రవణుడు కళ్ళు తెరిచి చూసాడు. ఎదురుగా శివుడు, శివునికి దగ్గరగా సతీదేవి కనపడ్డారు. “నేనెంత తపస్సు చేస్తే మాత్రం ఏమి లాభం? నా స్వామికి ఎల్వప్పుడూ దగ్గరగా ఉండే ఈమె ఇంకెంత గొప్ప తపస్సు చేసిందో” అని తలుస్తూ ఆమె వైపు రెప్ప వేయకుండా చూడసాగాడు. ఇలా పార్వతీదేవిని చూసి అసూయ పడడం వలన అతని కన్ను ఒకటి పగిలిపోయింది. వైశ్రవణుని తీరు నచ్చని సతీదేవి స్వామికి ఏదో చెప్పబోయింది. శంకరుడు నవ్వి దాక్షాయణితో “ఈ వైశ్రవణుడు నా భక్తుడు. మన పుత్రునివంటి వాడు. కేవలం నీ తపస్సు యొక్క గొప్పతనం తలచుకొని అసూయ పడుతున్నాడు. అంతే తప్ప వేరే కారణంతో కాదు” అని ఆమెకు చెప్పాడు.

తరువాత వైశ్రవణునితో “కుమారా! నీతపస్సుకు ఆనందించాను. నిన్ను నవనిధులకు అధిపతిగా నియమిస్తున్నాను. యక్ష కిన్నెర కింపురుషులకు నాయకుడివవుతావు. అలకాపురి నీ రాజధాని అవుతుంది. నీతో నేనెప్పుడూ స్నేహభావంతో ఉంటాను. నేను కూడా నీ రాజధానికి దగ్గరలో నివసిస్తాను. ఈ సతీదేవి నీకు తల్లివంటిది. ఈమె ఆశీస్సులు కూడా తీసుకో” అని చెప్పాడు.

వైశ్రవణుడు పార్వతీదేవికి సాష్టాంగ ప్రమాణం చేసాడు. “నాయనా! నీ శివభక్తి నిర్మలమైన దినదినాభివృద్ధి పొందుగాక. అసూయతో నన్ను చూసిన నీ మిగిలిన కన్ను ఎరుపు రంగుతో అందరినీ ఆకర్షిస్తుంది. నాయందు అసూయ పొందిన కారణంగా నీవు ‘కుబేర’ నామంతో పిలువబడతావు” అని ఆశీర్వదించింది.

తన భక్తుడికి ఇచ్చిన వరం ప్రకారం అలకాపురి సమీపంలో కైలాస శిఖరంపై తమ నివాసం ఏర్పరచుకొని శివపార్వతులు రుద్రగణాలతో సహా తరలివచ్చారు.

*శుభం*

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు