మనిషి కి చాలా అవసరమయిన నిద్ర ని ప్రభావితం చేసేదే ' జోల పాట '. జోల పాట లో కూడా రక రకాలు. కొంత మంది కి టి. వి చూస్తూ పడుకునే అలవాటు, కొంత మంది కి మెలోడీ పాటలు, కొంత మంది కి మాటలు లేని సంగీత వాయిద్యము , మరి కొందరికి ఫేన్ శబ్ధం ...ఇలా..ఆ నిద్ర ని ప్రభావితం చేసే " జోల పాట " మన కధాంశం.
******************
మన జాన్ అనబడే జనార్ధన్ కి, వారం నుండి నిద్ర సరిగా పట్టడం లేదు. శుక్ర వారం పని ముగించుకొని, ఆఫీసు నుంచి వచ్చేటప్పుడే బీరు లు తెచ్చి ఫ్రిడ్జి లో పెట్టాడు. తన స్నేహితుడు ఫుడ్ తెస్తా అన్నాడు. చల్లగా బీరు ఏసి, వేడి గా బిర్యాని తిని, హాయి గా పడుకుందాం అని అతని కోరిక. రంగం సిద్దం చేసాడు, తన అపార్టుమెంట్ కొంచెం శుభ్రం చేసి, హాల్ లో టేబుల్ మీద కారం పల్లీలు రెడీ గా పెట్టి, వేచి చూస్తుంటే ' ట్రింగ్ ట్రింగ్ ' మోగనే మోగింది కాలింగు బెల్.
జాన్ తలుపు తీసి ఆహ్వానించాడు. తన స్నేహితుడు సురేష్ ఒక్కాడే కాకుండా , రవి ని కూడా వెంట తీసుకొచ్చాడు, "వీడే రా రవి, ఫోను లో చెప్పాను గా" పరిచయం చేసాడు సురేష్. బీరు లాగిస్తూ పిచ్చా పాటి మాట్లాడు కున్నారు.
"పెళ్ళాం ఊరు వెళ్ళిందని మమ్మల్ని పిలిచి బీరు పార్టీ చేస్తున్నావ్..అది సరే కానీ , పెళ్ళాం ఊరెళితే వుండే ఆ హుషారు లేదేంటి రా..చాలా నీరసం గా కనిపిస్తున్నావ్, ఆఫీసు లో పని దొబ్బుడా..వేర్ ఈజ్ ద జోష్" సురేష్, కాళీ అయిపోయిన బీరు బాటిల్స్ వంట ఇంట్లో పెట్టి, కొత్త వి ఫ్రిడ్జి లోంచి తేవడానికి లేచాడు.
" ఒరేయ్ సూరి గా కాళీ బాటిల్స్ అన్నీ ఒక పక్క గా పెట్టు, మూడో కంటి వాడికి తెలియకుండా పారెయ్యాలి...జానకి కి తెలిస్తే పెద్ద గోల"
సురేష్ బీరు తెచ్చి ఓపెన్ చేసి ముగ్గురి గ్లాసుల్లో సర్వ్ చేసాడు
"ఆ ...వర్క్ ఏం కాదు రా, ఎందుకో నిద్ర పట్టడం లేదు రా వారం రోజులు గా" వాపోయాడు జాన్
"నిజమా.." అలోచిస్తూ " అవును..వారం..అంటే నీ పెళ్ళాం ఊరు వెళ్ళినప్పటి నించీ నీకు నిద్ర పట్టడం లేదు...మరేం లేదు రా , పెళ్ళాం పక్క లో పడుకొని అలవాటు అయింది గా.. తను లేక పొయే సరికి..విరహం రా విరహ తాపం" సురేష్ ఎగతాళి
ఇద్దరూ నువ్వు కున్నారు. రవి మాత్రం ఒక్క ఉలుకు పలుకు లేకుండా కేవలం కూర్చొని తాగుతున్నాడు. జాన్ కొంచెం బ్లష్ అయ్యాడు.. "ఆ సరేలే అంత లేదు"
సురేష్ " పని అంటే కేవలము ఆఫీసు పనే అని కాదు, ఎదన్నా.. ఆరోగ్యం కానీ, ఈ అపార్ట్ మెంటు లో ఎదన్న ఇబ్బంది..ఎనీతింగ్ బాదరింగ్ యు ? " స్నేహితుడి బుజం మీద చెయ్యి వేసి. "ఎదన్నా కుటుంబ సమస్య, డబ్బు సమస్య ..అలా ఎదన్నా మన బుర్రని బోజనం చేస్తుంటే , మనకి నిద్ర పట్టదు.. అందుకే అడిగా" బుజం మీద చేయి తీసి.
"లేదు రా బాబు. అస్సలు ఏ సమస్యా లేదు. హాయిగా గడుస్తుంది జీవితం"
రవి పక్కకి తిరిగి సురేష్ " బాబూ డాటేర్ బాబు తగులుకో బాబు ఇంక " రెండు చేతులూ జోడించి వందనం చేస్తూ.
"జాను గారు నా దగ్గర నిద్ర పట్టదానికి మంచి చిట్కాలు వున్నాయండీ..నాచురోపతీ" ఆ రాత్రి రవి మాట్లాడిన మొదటి మాట అదే.
" మా వాడు సీతాపతీ, వెబ్ ఎం.డి డాక్టరు లే" నవ్వుతూ సురేష్
"కామెడీ లు వొద్దు " రవి తన కుర్చీ కొంచెం జాని కి దగ్గరగా జరుపుకున్నాడు. "నేను చెప్పేవి పురాతనం గా అనిపించొచ్చు, మీరు నవ్వను , ఎగతాళి చెయ్యను అంటేనే నేను మొదలు పెడతాను"
సురేష్ జాను ఇద్దరూ తల ఆడించారు సరే అన్నట్టు.
రవి లేచి నించున్నాడు. మిగతా ఇద్దరూ కురుక్షేత్రం లో అరుజునుల్లా వుంటే , తను ఉపదేశానికి పూనుకున్న నల్లనయ్య లా వెలిగి పోయాడు.
లేచిన రవి, హాలు లో అటు ఇటు నడుస్తూ, గాల్లో వెళ్ళు తిప్పి, కళ్ళు మూసుకొని ఎవో లెక్కలేసుకొని అర్జునుల వద్దకొచ్చి ఆగాడు "మీరు పూర్తి నగ్నం గా పడుకోవాలి, పూర్తి గా... ఒంటి మీద నూలి పోగు కూడా లేకుండా... పడుకొని, వామ నాసారంద్ర బంధనం చెయ్యాలి, అంటే మూసుకోవాలి"
సురేష్ " మూసుకోవడం వరకు సరే.. ఆ ముందర ఎదో కూసావు..ఏం మూసుకోవాలి బాబూ" జాన్ మొహం చూస్తూ..
రవి " వామ నాసారంద్ర నిర్బధ మర్మం ... ఎడమ వైపు ముక్కు రంద్రం మూసుకోవాలి"
"ముక్కు రంధ్రమా .. అయితే ఒకే " జాన్ గట్టి గా శ్వాస తీసుకున్నాడు రెండు ముక్కు పుటాల లోంచి.
"అంటే... " సురేషు ఎదో అడగబోతుంటే రవి కట్ చేసాడు.
"అదే వొద్దు, కొన్ని కొన్ని కట్ ఔట్ లేక పోయినా నమ్మాలి.. నా దగ్గర నిద్ర కి చాలా సూచనలు వున్నాయి. ఈ ఇంటి వాస్తు , మీ వంటి తత్వాన్నీ బాగా గమనించాను...మీకు వాతా దోషం వుంది. మీకు సరిపడే నాలుగు చిట్కాలు చెప్తాను , విని పాటిస్తే మంచిది , లేకపోతే వొదిలేయండి.. అంతే గాని.. ఎందుకు ఏమిటి ఎలా అనే వెర్రి ప్రశ్నలు వెయ్యొద్దు...ఆరాలు తీయొద్దు, క్యామెడీ లు చెయ్యొద్దు. ". సురేషు జాను ముఖ ముఖాలు చూసుకొని, తల ఊపారు, ' సరే ' అన్నట్టు
"రెండోది, మూషిక చమురు పాదాకృతం ..ఎలక కొవ్వు.. అంటే , బాగా బలిసిన పందికొక్కు అనుకోండి.. దాని ఫాట్ తో చేసిన నూనె.. మీరు గల్లీ లు తిరిగి ఎలకల వేట చెయ్యక్కర లేదు. నాకు తెలిస సప్లయర్ వున్నాడు, మీకు కావాలంటే నేను తెస్తా.. బాటల్ కేవలము 2000 రుపాయలే"
జాన్ " అది తాగాలా " మొహం అదోలా పెట్టి.
"చి చ్చి ..ఆ తైలం పాదాల అడుగున రాసుకోవాలి, పడుకునే ముందు... అది మీ దుప్పటికి , పక్కలకి అంటుకోకుండా వుండాలంటే, పాదాలకి సాక్సు వేసుకోవచ్చు.. ఎందుకంటే శాస్త్రం లో దాని గురించి ఎమీ లేదు"
జాను తన బీరు తాగ బోతుంటే " ఆ పైన నురగ ఎంట్రా ఎలక కొవ్వు లా వుంది" అన్నాడు సురేష్. ఒక్క దెబ్బకి తన గ్లాసు కింద పెట్టేసాడు జాను.
రవి హుషారు రెట్టింపు అయ్యింది . జాన్ కిందపెట్టిన గ్లాసు లో వున్న బీరు అంతా ఒక్క గుటకలో ముగించాడు ఎంగిలి కూడ ఖాతరు చెయ్యక.
"ఇక మూడవది...మెంతులు గ్రైండ్ చెయ్యండి, దానిలో కల బంద , ఆముదం , మరియు కొంచెం సబ్బు, నురుగు వచ్చేలా.. సబ్బు అంటే .. మార్కెట్ లోది కాదు, వాటిలో సవా లక్ష కెమికల్స్ వుంటాయి.. నేను ఆయుర్వేద సబ్బు తెస్తా, ఒకటి కేవలం వంద రుపాయలే...కల బంద ఎంటే ఏమిటో కాదు.. ఇప్పుడు అలొ విరా అని వెర్రి గా అమ్ముతున్నారు గా అదే. ఆ మిశ్రమము తల చుగుళ్ళ లో పట్టించి నిద్ర కి ఉపక్రమించాలి. పొద్దు పొయ్యేదాకా అసలు తెలివి రాదు. ఆ చల్ల దనానికి నిద్ర ఆవహిస్తుంది. "
జాను " మరి ఆ నురగ అంతా దిండు కి "
రవి కట్ చేస్తూ "చుసారా.. మీ సమస్య ఎంటో అర్ధం అవుతుందా మీకు.. అస్సలు అర్ధం అవుతుందా అని, అందుకే మీ లాంటి పేషంట్లు ని అసలు టేకప్ చెయ్యను"
సురేష్ , జాను అర్ధం కాలేదు అన్నట్టు తల అడ్డం గా ఊపారు "పేషంటా...టేకప్ ఆ" అని మనసులో అనుకుంటూ
"అసలు సమస్య నిద్ర.. నిద్ర పట్టడం లేదు మొర్రో అని మీరు మొత్తుకుంటే కదా , నేను మన శాస్త్రాల లోంచి, ఆయుర్వేదం లోంచి, కొన్ని చిట్కాలు వివరిస్తుంటే... మీ దృష్టి ఎక్కడుంది.. దిండు కవరు మీద వుంది.. చుసారా.. అది మీ అసలు సమస్య"
అప్పటి దాకా నిల్చొని ఉపదేసించిన రవి, కూర్చున్నాడు. " తల కి ఎదన్నా కట్టుకొని తగలడి పడుకొండి, అప్పుడు మీ తలగడ సేఫ్. ఉదయం లేచాక తల స్నానం చెయ్యండి.. అది కూడా చెప్పాలా" శిష్యుల మీద నిరాస గా నిట్టూరుస్తూ
ఇక నాల్గవది " మీకు మీరు ఒక కథ చెప్పుకోవడం.. చిన్నప్పుడు మన తాతలు మామ్మలు కథ చెప్తే నిద్ర పట్టేది గా, అలాగే.. ఇది ఆ పైన మూడు చిట్కాలతో కూడా చెయ్యొచ్చు.. ఎదన్నా చిన్నప్పటి కథనో, లేక కొత్త దో , లేక మీరు మీకు సృష్టించుకున్న సరి కొత్త కథ అయినా సరే.. అలా ఆ లోకం లోకి జారుకుంటే నిద్ర పడుతుంది.. ఇది చాలా బేల గా , శరళం గా అనిపిస్తుంది.. కానీ చాలా ప్రభావ వంతం. ఒక రకం గా చూస్తే మిమ్మల్ని మీరే హిప్నటైజు చేసుకోవడం.. ఉ ఆర్ బి ఇంగ్ యువర్ ఓన్ ష్రింక్"
రవి తన వైద్యోపదేశం ముగించాడు. శిష్యులు ఇద్దరికీ బుర్ర వేడెక్కింది..తాగింది దిగి పోయింది..ఇంకో బీర్ ఓపెన్ చేసి దమ్ము వెలిగించారు ఇద్దరూ. సరేలే ప్రయత్నిస్తే పొలా , పెళ్ళాం రావడానికి ఇంకా పది రోజులు వుంది గా అనుకున్నాడు జాన్
******************
జానకి ని రైల్ స్టేషన్ లో పిక్ చేసుకొని, అలాగే బయట తినడానికి వెళ్ళి, డిన్నర్ చేసాక జాన్ జానకి ఇంటి తిరిగి వచ్చారు . స్నానాలు ముగించి పక్క పైకి ఎక్కారు.
"నువ్వు వర్రీ అవుతావని చెప్పలేదు గానీ, అసలు నువ్వు లేనన్ని రొజులూ నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు తెలుసా" అన్నాడు గోముగా , జానకి ని గట్టిగా పట్టుకొని తన పక్కకి లాగి, ముద్దు పెట్టి.
"అబ్బా నిజమే నమ్మేయాలి నేను, పక్క ఎక్కిన పది నిమషాల్లో పడుకుంటారు, పని ముగిసిన పది సెకండులలో కునుకేస్తారు" పకపకా నవ్వింది జానకి
"సరే నీ ట్రిప్ వివరాలు చెప్పు, క్లైంట్ మీట్ ఎలా అయింది, హోటల్ సదుపాయం, సౌకర్యాలు, ట్రావెల్ , తిండి.. ఇంతకీ ఆ కొంట్రాక్టు మీ కంపనీకే వచ్చిందా ?.. చెప్పు మొదటి నుంచి అన్నీ చెప్పు" జాన్
"ఏమండి ..ఎదో ఎలక చచ్చిన వాసన వస్తుంది. మీకు కూడా" జానకి అటు ఇటు చూస్తూ ముక్కు పుటాలు ఎగ పీలుస్తూ.
"అబ్బా అదేం లేదులే, నువ్వు చెప్పు"
జానకి తన ట్రిప్ గురించి వివరాలు మొదలు పెట్టిన పది నిమషాలకే కన్నుమూసాడు మన జానుడు. అంటే నిద్ర పొయ్యాడని, పాటకులు ఆఘాయిత్యం జరిగిందని ఊహించకండి.
*********
మరుసటి రోజు లేచాడు జాన్. ఆశ్చర్యం, సమయం ఉదయం ఎనిమిది. అలా ఎనిమిది వరకూ హాయిగా నిద్ర పోయి చాలా రోజులయ్యింది. డాటేరు బాబు రవి చిట్కాలు కూడా ఇంత బాగా పనిచెయ్యలేదు. బద్ధకం విరుచుకొని పడక గది లోంచి హాలు లోకి వచ్చేటప్పటికి అతనికి విషయం అర్ధం అయింది. భార్యామణి కస్సు బుస్సు లాడుతుంది. జాన్ మీద కోపం, పని మనిషి మీద, గిన్నెల మీద ప్రదర్శన జరుపుతుంది.
"మా కస్టమర్ తో మేము వెళ్ళిన రెస్టారెంటు పేరు చెప్పండి" వంట ఇంట్లోంచి అరా, అరుపు రూపం లో వచ్చింది. తెల్ల మొహం వేసాడు జాన్
" ఇంతకీ ఆ కాంట్రాక్టు మాకు వచ్చిందా లేదా".. జానకి కాఫీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది, కాని మొహం మీద కొట్టినట్టు అనిపించిది జాన్ కి
"సిగ్గు వుండాలి , టూరు కెళ్ళింది నేనా, అలసి పోయి వచ్చింది నేనా.. పది నిమషాల్లో పడుకుంటారా.. అసలు మనసు ఎలా వచ్చిందండి మీకు, మీరు వింటున్నారు అనుకొని గంట సేపు పిచ్చి దానిలా వాగాను తెలుసా"
"పడుకోవడానికి మనసు ఎందుకు , నిద్ర కదా రావాలి" అనుకున్నాడు, కానీ బయటకి అనలేదు.... "అంటే.." అని కాఫీ నీళ్ళు నమిలాడు.
"పైగా నువ్వు లేనప్పుడు నిద్ర పట్టలేదు అని పెద్ద బడాయి బుకాయింపులు... అబద్దాల కోరు" విసుగ్గా వంట ఇంట్లొకి వెళ్ళింది జానకి
ఆమె అలా అనగానే జాన్ కి ఎదో షాక్ కొట్టినట్టు , మెరుపు తీగ తగిలినట్టు గట్టిగా "యురేకా" అని అరిచాడు..ఆ తిక మక లో, సకా మికా మింగేసి " యురేకా " మాత్రం బయటకి వచ్చింది. వంట ఇంట్లో వున్న జానకి కి " సురేఖా" అని వినపడింది.
హుషారు గా తయారయి స్నానం చేసి , " నువ్వు ఈ రోజు ఇంట్లోంచే గా పని.. సరే బై" అని ఆఫీసుకి వెళ్ళిపొయ్యాడు.
తను ఇంత కోపం లో వుంటే, జాన్ అంత ఆనందం గా ఎమీ పట్టనట్టు, ఆఫీసు కి వెళ్ళిపోవడం తో మరింత ఒళ్ళు మండింది. టూర్ నించి నిన్ననే వచ్చిన కారణంగా తను ఆరోజు వర్కు ఫ్రం హోము.
***********************
మోగిన ఫోన్ వెంటనే ఎత్తింది జానకి. "నీ ఎంకమ్మా నీ ఫోను కోసమే ఎదురు చూస్తున్నా.. ఎంటే పెద్ద బిజి కట్టింగు ఇస్తున్నావ్. రెండు వారాలయిందే నీకు మెసేజి పెట్టి"
"సోరీ నే.. ప్రోజెక్టు లైవ్ లో వుంది.. .. చుసాను నీ మెసేజులు, కానీ ఇదోదే వివరం గా సమయం కేటాయించి చర్చించాల్సిన అంశం లా అనిపించి, నా పని పూర్తి అయ్యాక, ఇదిగో ఇప్పుడు చేస్తున్నా... ఇప్పుడు ఎన్ని గంటలయినా నేను నీదాన్నే, నన్ను ఏమన్నా చేసుకో....ఈ వారం రోజులు నిద్ర లేదు ఎవ్వ్వరికీ ఆఫీసు లో" అంది జానకి స్నేహితురాలు సంధ్య
"ఇదిగో నిద్ర లేదు, నిద్ర పట్టడం లేదు అని మాత్రం అనకు .. నాకు మండి పోతుంది" తన భర్త నిద్ర పురాణం అంతా వివరించిది...
"ఆ రోజు తర్వాత, ఇంట్లో చాలా వింత వింత విషయాలు బయట పడుతున్నాయి..వంట గది లో వెనకాల ఒక బీరు బాటల్ , దానిలో సిగరెట్టు పీకలు"
"ఆ ఏముంది లే, నువ్వు లేవు కదా అని బాయ్స్ బీర్ వేసి పార్టీ చేసుకూన్నారేమో"
"అది పెద్ద విషయం కాదు లే, అయినా జాన్ తాగేది రెండు బీర్లు.. మహా అయితే ఒక ధమ్ము ..అది కాదు నా బాధ.. ఇంతకు ముందు ఇలా పార్టీ లు అయితే నాకు చెప్పి చేసేవాడు.. ఈ దాపరికం ఎంటి ? "
"ఆ అవును ఏంటి .. వై ?"
"నేను అతని మీద అంత కోపం గా వుంటే " సురేఖా " అని అరచి ఆనందం గా ఆఫీసు కి వెళ్ళిపొయ్యాడు, అసలు ఎమీ జరగనట్టు.. పైగా .. నన్ను ఐసు చెయ్యడానికి ఆ తర్వత రెండు రోజులు తనే వంట చెయ్యడం.. నువ్వు రెస్టు తీసుకో అనడం.. "
"కవర్ అప్ లా వుంది..ఇంతకీ ఈ సదరు సురేఖా ఎవరు..అఫైర్ ఆ" సంధ్య
"సురేఖా నో సూర్ఫణకో ..దాని మొహం..ఎప్పుడూ లేని కొత్త కొత్త అలవాట్లు.. ఫోను అసలు బెడ్ రూం లోకి ఎప్పుడూ తేడు.. రేడియేషన్ బ్లూ లైట్, అనేవాడు..అలాంటిది ఇప్పుడు ఆ ఫోను పక్కలోనే పెట్టుకుంటున్నాడు...మొన్న బట్టల మద్య లో ఎదో ఆయుర్వేద సబ్బు ముక్క కనపడింది."
"తన స్నేహితులు ఎవరయినా , బాబా రాం దేవ్ భక్తులు, సాంపిల్ గా ఇచ్చి వుంటారు" సంధ్య
"అక్కడే కదా చిక్కు.. నువ్వు అన్నట్టు అయితే అసలు విషయం ఇంత పెద్దది అవ్వదు...మాములు సమాధానం తో పొయ్యే వాటికి చాలా అనుమానాస్పదమయిన సంభందం లేని , నోటికి వచ్చిన పిచ్చి పిచ్చి రెస్పొన్సెస్ ఇస్తున్నాడు.. మొన్న ఒక మూల ఎదో చిన్న మందు సీసా లా కనపడింది.. ఎంటి అంటే ? ఎలక నూనె అంటాడు.."
"ఎలకలు కనపడ్డాయేమొనే.. వాటి నివారణకి" సంధ్య సమర్ధించ బోయింది
"అదే కదా.. అలా కాదుట.. నిద్ర పట్టక పొతే, కాళ్ళకి ఎలక ఫాట్ రాసుకొని పడుకోవాలంట"
"అమ్మో.. ఇదేదో తేడా గానే వుందే"
"అదేగా..చాలా వింత వింత గా మారిపోయాడు..జాన్ హాపి గా వుంటే నాకేం బాధ లేదు.... కాని ".. కొంత సంశయం గా " కానీ , మరీ అతి గా హాపీ గా వుంటున్నాడు...వుండాల్సిన దాని కంటే చాలా ఎక్కువ మొతాదులో"
"కొంపదీసి కొకైన్... డ్రగ్స్"
"హహ....అంత సినిమా లేదులే"
"ఒకే అయితే ఈ సురేఖా అఫైర్ కోణం ..కొంత పరిశోదించాలి.. రాత్రి కూడా కలవరిస్తున్నాడా సురేఖా అని"
"లేదు..ఆ ఒక్క సారే.. ఎదో పెద్ద శాత్రవేత్త ఫార్ములా సాధించినట్టు గట్టి గా ' సురేఖా ' అని అరిచి వెళ్ళిపొయ్యాడు.. అప్పటి నుంచే ఈ బిహేవియర్ మార్పులు కూడా"
"సరే నాకు ఇంకో పది రోజుల్లో ప్రాజెక్టు ఫినిష్ . నువ్వు కస్టమర్ ట్రిప్ అని చెప్పి నా రూం కి వచ్చేయి ఒక వారం.. మనం మీ జాన్ ని అబ్ సెర్వ్ చేద్దాం.. ఫాలో అవుదాం.. అమీ తుమీ తేల్చేద్దాం ? ఎమంటావ్"
"థాంక్స్ సంధ్య "
"ఈ పది రోజులు ఎమీ అనుమానం రాకుండా ప్రవర్తించు.. నీకు కోపం వచ్చిందని అస్సలు తెలియనివ్వకు".... గాప్ తర్వాత .. "ఇంకో అతి ముఖ్యమయిన విషయం , మన డిటెక్టివ్ ఏజెన్సీ కి ఏం పేరు బాగుంటుందే " సంధ్య కి చాలా థ్రిల్లింగ్ గా వుంది " జానకి ప్లస్ సంధ్య.. సో ? జంధ్యం లేదా సాకి ..ఎలా వుంది"
**** **********
******************
నకిలీ ఆఫీసు ట్రిప్ కస్టమర్ సైట్ నుంచి ఒకసారి జానకి ఫోను చేసింది జాన్ కి.. క్షేమ సమాచారాలు ముగిసాక " ఏంటి నేను లేక పోతే నిద్ర పట్టడం లేదా, ఇంతక ముందు ట్రిప్ లాగా " అంది మాటల్లోనే అనురాగం ఒలకబోస్తూ..
"ఆ అదేం లేదు, హాయిగా నిద్ర పడుతుంది... ఇంకొలా తీసుకోకు.. నిన్ను మాత్రం మిస్స్ అవుతున్నా, కానీ నిద్ర కి ఏం డోకా లేదు..అమ్మో పది అయిపోయిందా.. మాటల్లో తెలియలేదు" అని ఆవులించాడు జాన్.
"సరే పడుకో .. గుడ్ నైట్"
అలా ఊరిలో లేనట్టు బ్రమ పెట్టి, ఒక వారం పాటు జాన్ ని ఫాలో అయ్యారు వీరిద్దరూ లేడీ డిటెక్టివ్ ల లాగా , వంతులు వేసుకొని మరీ. పెద్దగా ఏ విషయమూ తేలలేదు.. ఈ సారి పెళ్ళాం ఊరెళితే శీర్షిక లో , జాన్ ఇంట్లో బీరు పార్టీ కూడా ఇవ్వలేదు. ఒక్క సారి మాత్రం సురేష్ , తదితర స్నేహితుల తో బార్ కి వెళ్ళాడు, అంతే , అది కూడ రెండు గంటలు మాత్రమే. జాన్ ఎక్కడా దొరకడం లేదు. బుద్దిగా అఫీసు, ఇల్లు, ఎదో వండుకుంటున్నాడు లేదా బయట నుంచి తెచ్చుకుంటున్నాడు, టి.వి చూసుకొని, రాత్రి పది కి పడక. జానకి కి ఒళ్ళు మండి పోతుంది.
"అది కాదే మీ అయాన కి అఫైర్ లేదని తెలిసి సంభర పడాలి కదా, ఎదో మనం నిజం డిటెక్టివ్ లు అయినట్టు కేసు ఓడిపోతున్నట్టు.. ఎందుకు నీకు ఈ నిరాశ ?" ఓదార్చింది సంధ్య
సమయం రాత్రి ఎనిమిది దాటింది, ఇద్దరూ జాన్ జానకి ల అపార్టు మెంట్ కి రోడ్డు చివర కారు లో కూర్చున్నారు.
నిట్టూర్చింది జానకి..ఈ అనుమానం పెనుభూతం, ఆ బీజం పడ్డాక దాన్ని పెంచి, పోషించి , ఆ మొక్క కి పూలు పూస్తే చూసి ఆనందించాలని తన కోరిక.
"ఈ రోజే ఆఖరు , రేపే నేను తిరిగి వచ్చేయాలి కస్టమర్ ట్రిప్ నుంచి.. ఈ రోజు అమీ తుమీ తేలవలసిందే" జానకి
వీళ్ళు అలా అనుకున్నంతలో , ఎవరో ఒక ఆమె చక్కగా ముస్తాబయి వాళ్ళ అపార్ట్ మెంటు లోపకలి వెళ్ళడం చూసారు. వాచ్ మేన్ తో ఎదో వివరం అడిగి..లిఫ్టు లో పైకి వెళ్ళింది.
"ఎవత్తే ఇది , ఎప్పుడూ చూడలేదే " జానకి ఊపందుకుంది
"ఆ.. మీ అపార్ట్ మెంటు లో గెస్టు లిస్టు అంతా నీకు తెలుసు మరి" వెటకారం గా సంధ్య
"అలా కాదే , ఇది చాలా చిన్న గ్రూప్ హవుస్.. ఇక్కడ వుంది కేవలం తొమ్మిదే ఇళ్ళు... మాకు చాలా మట్టుకు తెలుసు ఒకరి విషయాలు ఒకరికి.. ఈవిడని మాత్రం ఎప్పుడూ చూడలేదు..నాకు అనుమానం ఇంకా పెరిగింది"
"ఇంతకీ ఇప్పుడు ఎంటి.. ఈవిడ కాల్ గర్ల్ అంటావా... లేక జాన్ అఫైర్ ఆ.. వాళ్ళు కార్యం లో వున్నప్పుడు, మనం మీ ఇంట్లొకి హటాత్తు గా చొరబడి , రెడ్ హండెడ్ గా జాన్ ని పట్టుకోవాలి అంతేగా " సంధ్య
" యెస్స్ ..కానీ చిన్న మార్పు.. రెడ్ హండెడ్ గా పట్టుకోడానికి వాళ్ళు కార్యం చేస్తున్నప్పుడే ఎమీ వెళ్ళక్కరలేదు. ఇలాంటి బేరాలు వచ్చిన గంట రెండు గంటల్లో వెళ్ళరు. అలా వెళ్తే కింద వున్న వాచ్ మేన్ కి అనుమానం వస్తుంది.. నా అంచనా ప్రకారం కచ్చితం గా.. ఉదయన్నే ఏ నాలుగు కో ఐదు కో చడి చప్పుడు కాకుండా జారుకుంటుంది ఆ నంగనాచి.. సో మనం కొంత రాత్రి కానిచ్చి ఇంట్లో చొరబడదాం.."
***********
సమయం అర్ధరాత్రి పన్నెండు దాటింది.. ఇద్దరూ దొంగల్లా జానకి అపార్ట్ మెంటు మెట్లు ఎక్కారు, వాచ్ మేను కళ్ళు కప్పి..
"ఎంటో నీ సొంత ఇంట్లోకి దొంగల్లా, భలే థ్రిల్ల్ గా" సంధ్య నోరు మూసింది జానకి తన చేత్తో.. "ష్"
తన తాళం గుత్తి తో మెల్లగా డోరు తీసింది జానకి..ఇద్దరూ లోపలకి వచ్చారు. అంతా చీకటి..జానకి తన సెల్ ఫోను లో లైట్ వేసి సంధ్య కి దారి చూపిస్తుంది, తనకి ఎలాగూ హోం గ్రౌండ్.
ఇద్దరూ మెల్లగా అడుగులో అడుగు వేసుకొని , బెడ్ రూం దాకా వెళ్ళారు.. ఆశ్చర్యం ముఖ ముఖాలు చూసుకున్నారు. వాళ్ళ పడక గది లోంచి మాటలు వినబడుతున్నాయి
"నాతో ఎప్పుడూ పిల్లో టాక్ చెయ్యడు తెలుసా " జానకి ఏడ్చినంత పని చేసింది..ఈసారి సంధ్య "ష్"
అంతే , తన భర్త కి అఫైర్ వుందని కంఫర్మ్ అయిపోయి, వెళ్ళి తన హాలు సోఫా లో చతికిల పడింది జానకి. సంధ్య కి ఇంకా ఎదో తేడా గా వుంది. ఆ బెడ్ రూం లోంచి వచ్చే వాయిసు బాగా తెలిసిన గొంతు లా వుంది.
"ఏదన్నా వుంటే పొద్దున్న మాట్లాదుకుందాం..ఇప్పుడు ఎందుకు..అనేవాడు... ఈ కులుకు లాడి తో మాత్రం ముచ్చట్లు పెడుతున్నడే.. సచ్చినోడు" జానకి హాల్ లోంచి
సంధ్య , తన చెవి బెడ్ రూము డోరు కి దగ్గరగా పెట్టి మాటలు వినే ప్రయత్నం చేసింది... తనకి ఇంకా తేడా గానే వుంది , అమ్మాయి గొంతు మాత్రమే వస్తుంది, పక్క నుంచి ఒక పెద్ద గురక కూడ స్పష్టము గా వినిపించింది సమకాలికంగా.
"ఎటూ ఇంత వరకూ వచ్చాము, ఇంక దాపరికం ఎందుకే, రెడ్ హండెడ్ గా పట్టుకొని కేసు క్లోస్ చేసేద్దాం" అని సోఫా లో వున్న జానకి కి మెల్ల గా చెప్పి, బెడ్ రూం డోరు తెరిచింది శబ్ధం చెయ్యకుండా..
ఇప్పుడు రెట్టింపు ఆశ్చర్యం.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది సంధ్య కి.. జాన్ కుంభ కర్ణుడి లా నిద్ర పోతున్నాడు, ఒళ్ళు తెలియకుండా.. పక్కన అమ్మాయి వాయిస్ , జాన్ ఫోను లొంచే, అది జానకి గొంతే.
"నేను అన్నదాంట్లో ఎం తప్పు వుంది చెప్పు జాన్..దానికి ఆవిడ అలా అంత కోపం గా సమధానం చెప్పలా ?అసలు నేను మాములు గా అడిగాను అంతే గా " ఫోను లో జానకి గొంతు
మెల్లగా బెడ్ దగ్గరకి వెళ్ళి, జానకి గొంతు నొక్కింది సంధ్య.. అంటే, అదే ఆ ఫోను దగ్గరకి వెళ్ళి, ఆ ప్లేయర్ లో స్టాప్ బట్టన్ నొక్కింది. ఫోను మూగబోయింది.
బెడ్ మీద జాన్ కొంచెం మెదిలాడు... అటు గా తిరిగి, లారీ ఇంజెను గేరు మార్చినట్టు, గురక సౌండ్ మార్చి మళ్ళి నిద్ర లోకి పయనించాడు..
సంధ్య ఫోను పట్టుకొని, నెమ్మదిగా, బెడ్ రూము తలుపు మూసి, హాలొ లోకి వచ్చింది.
"ఎవత్తే అది , ఫొటు లు గట్రా తీయి, రేపు .. ఎమీ జరగలేదు అని బుకాయిస్తాడేమో.. అయినా కోర్టు లో ఆధారాలు కావాలంటారు.. ఇందాక కింద చూసిన వగలాడేనా అది ?"
"లోపల వున్నది నువ్వే నే " షాకయిన సంధ్య , సొఫా మీద వున్న జానకి పక్కన కూచుంటూ..
"నేనా.. నీకు పిచ్చా.. ఇదేమన్నా గంగ మంగ డబల్ ఫొటో సినేమా అనుకుంటున్నవా " జానకి నొరు పెద్దది చేసింది, ఎవరు లేచినా పరవలేదు.. గొడవ పెట్టుకోడానికి తను సిద్ధం
" జాన్ ఫోను అన్ లాక్ కొడ్ నీకు తెలుసా.. లోపల ఎవరూ లేరే.. "
"పిచ్చి పిచ్చి గా వుందా..అవును మాటలు రావడం లేదేంటి.. రొమాంటిక్ పిల్లో టాక్ ముగిసిందా.. నిద్ర పొయ్యారా ఇద్దరూ.. ఇంతకీ ఫొటొలు తీసావా లేదా" ఏడుపు ఆపి ముక్కు చీదుకుంటూ
సంధ్య తన చేతిలో వున్న జాన్ ఫోను జానకి ఇచ్చింది " ఇది జాన్ ఫోను, కోడ్ చెప్పు" జానకి ఫోను లాక్కొని కోడ్ పెట్టి ఫోను అన్ లాక్ చేసింది..
"వాడి ఫోను ఎందుకు తెచ్చావే, సెక్స్ టేపు గాని చేస్తున్నారా ఇద్దరూ సిగ్గు లేకుండా"
ఆ ఫోను అన్ లాక్ చెయ్యగానే ప్లే అవుతున్న మ్యూజిక్ ఫోల్డెర్ తెరుచుకుంది.. ఆ ఆల్బుం పేరు "జోల పాట"
దాని లొ పాటలు
* మా చిన్నాన్న కూతురు * నా ఫ్రెండ్ సంధ్య
* నీ ఫ్రెండ్ సురేష్ * మా కంపనీ వాడి ఆగడాలు
* మీ అమ్మ నాన్న * మన కింద అపార్ట్ మెంట్ పంకజం
* వాచ్ మేన్ వ్యవహారం
ఇంకా ఇలా చాలా ట్రాకులు వున్నాయి... జానకి కి విషయం అర్ధం అయింది..
"సురేఖా కాదేమో నే" సంధ్య " అది యురేకా అనుకుంటా".
"నువ్వేం వివరించక్కర లేదు..మొత్తం అర్ధం అయింది..ఆ యురేకా మొమెంట్ నుంచి, నా మాటలన్నీ రికార్డు చేసాడు. నేను లేనప్పుడు అవే జోల పాట ... అమ్మో అమ్మో ..అఫైర్ లేదని ఆనదించాలా ? ఈ అవమానానికి బాధ పడాలా." ఒక ఊరట తో కూడుకున్న నిట్టూర్పు తో సోఫా లో కింద కి జారి చతికిల పడింది జానకి
సంధ్య ఆ ఫోను లో * నా ఫ్రెండ్ సంధ్య ట్రాక్ ఆన్ చెయ్యబోయింది.
"డిప్ప పగులుద్ది, పద పద" జానకి ఫోను ఆఫ్ చేసి..హాలు లో టేబల్ మేద గిరాటు వేసింది "ఇక్కడే వుండనీ ఫోను, ఉదయం లేచి కొంచెం కంగారు పడనీ"
ఇద్దరు గూఢచారులూ కాళ్ళు ఈడ్చుకుంటూ బయట పడ్డారు
***** సమాప్తం ***********************
Dedicated to all the husbands who shamelessly fall asleep , while their partner is still talking