రాము, రవి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. ప్రభుత్వ వసతి గృహంలో వుంటూ బడికి వెళుతున్నారు. బడికి వసతి గృహానికి మధ్య కిలోమీటరు దూరం ఉంటుంది. ప్రతిరోజు కాలి నడకనే వెళతారు. ఆడుతూ పాడుతూ నడిస్తే 20 నిముషాలలో చేరుకుంటారు. వేగంగా నడిస్తే పావుగంట. పరుగులాంటి నడకైతే 10 నిముషాలలో చేరుకోవచ్చు. ఉదయం అల్పాహారం తిని అరగంట ముందు వసతి గృహం నుండి బయలుదేరి 10 నిముషాలు ముందే బడికి చేరుకుంటారు. మద్యహాన భోజనం బడిలోనే తిని సాయంత్రం బడి వదిలాక కాలినడకతో గృహం చేరతారు. ఇది వారి దినచర్య. ఓ రోజు బడికి వెళ్ళటానికి ఆలస్యం అయింది. వసతి గృహంలో అల్పాహారం తయారు కావటం ఆలస్యం అవ్వటం వల్లనే ఈ ఆలస్యం. ముందు తిన్న పిల్లలు ముందుగానే వెళ్లిపోయారు. రాము, రవి వెనకబడి పోయారు. ఇద్దరూ పుస్తకాలు సర్దుకుని రోడ్డెక్కారు. ఇంకా ఐదు నిముషాలు మాత్రమే ఉంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. చండశాసనుడు. ఒక్క నిముషం ఆలస్యమైనా వూరుకోడు. నిర్ధాక్షన్యంగా ఇంటికి పంపుతాడు. ఇద్దరూ రోడ్డుపక్కన నిలబడ్డారు. బడి వైపు వెళ్లే మోటారు సైకిళ్ళు వస్తే లిఫ్ట్ అడిగి వెళ్లాలని నిలుచున్నారు. ఎంత సేపటికి ఒక్క వాహనం రాలేదు. ఒకటి రెండూ వచ్చినా వీరిని ఎక్కించుకోలేదు. ఆపకుండా వెళ్లిపోయారు. కాలం మీరి పోతుంది. రాము వెనక ముందు ఆలోచించకుండా, వాహనం కోసం ఎదురు చూడకుండా పరుగు తీస్తూ వెళ్ళిపోయాడు. రవి మాత్రం లిఫ్ట్ కోసం చూస్తున్నాడు. ఇంతలో ఓ వాహనం వచ్చింది. రవి దర్జాగా ఎక్కి కూర్చున్నాడు. ఎలాగైతేనేం ఐదు నిముషాలు లేటుగా పాఠశాల ముందు దిగాడు. పరిగెత్తుతూ వెళ్లిన రాము కూడా అదే సమయానికి పాఠశాల ప్రధాన ద్వారం వద్దకు గసపెడుతూ చేరాడు. అప్పటికే ప్రధానోపాధ్యాయుడు ద్వారం తలుపు వేసేందుకు సిద్ధమయ్యాడు. రాము, రవి ఇద్దరూ ఒకేసారి గేటు వద్దకు చేరారు. రాము ఆయాసపడుతున్నాడు. రొప్పుతున్నాడు. నోట్లో నుండి మాటకూడా సరిగా రాలేదు. రవి మాత్రం "నేను రావచ్చునా సార్" అన్నాడు మాములుగా. ప్రధానోపాధ్యాయుడు రాము,రవి వంక తేరపార చూసి రామును లోపలికి పంపాడు. రవిని వెనక్కు పంపి తలుపులు మూసేసాడు. పిల్లలూ! ఇప్పుడు తెలిసింది కదా? కష్టపడేవారి వైపే విజయం ఉంటుందని. మన ప్రయత్నం మనం చేసినప్పుడే ప్రధానోపాధ్యాయుడులాగా దేవుడు కూడా సాయం చేస్తాడు. మన ప్రయత్నమే లేకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు