రంగారావుగారిది జమీందారీ వంశం. వారి ముత్తాతగారి హయాంలో ఆ పరగణాలో వెలసిన ఒకే ఒక ఆలయం -- వారి కులదైవమైన శ్రీ సత్యనారాయణ స్వామి మందిరం. ఆ ఆలయానికి రోజూవారీ ధూప దీప నైవేద్యాలకై ఆయన 5ఎకరాల మాగాణీ 2ఎకరాల పళ్ళపూల తోట స్వామిపేరున వ్రాసి, ఆకాగితాలని రిజిస్ట్రీ కూడా చేయించేరు. ఆమాగాణీ ఆతోటల సర్వహక్కులు - క్రయవిక్రయాలు తప్పించి - ఆలయ పూజారికి వంశపారంపర్యంగా చెందేటట్టుగా వ్రాసి, ఆకాగితాలని కూడా రిజిస్ట్రీ చేయించేరు. ఆవిధంగా ఆయన హయాంలో వెలసిన ఆ ఆలయానికి, స్వామివారి దైనిక అవసరాలకి కావలసినవి అన్నీ కూడా అప్పటి పూజారిగారే చూసేవారు. వారి తరువాత, వారి వంశస్తులే ఆలయపూజారులుగా ఉంటూ ఆపనులన్నీ ధార్మికంగా నిర్వహిస్తూ వచ్చేరు.
ప్రస్తుతం రంగారావుగారి హయాం నడుస్తూంది. ఆయనకి తొలి సంతానం అబ్బాయయితే, మలి సంతానం ఆడబిడ్డ, ముద్దుల గారాలబట్టి - మాధవి.
ఆలయంలో ప్రస్తుతం నారాయణస్వామి గారు పూజారిగా ఉన్నారు. ఆయనకు ఒకే ఒక కొడుకు, గోపాలస్వామి.
ఆలయంలో సంధ్యాహారతి జరిపించిన పిమ్మట, నారాయణస్వామిగారు ఆలయ ప్రాంగణంలోనే పౌరాణిక ప్రవచనాలు చేస్తూంటారు. ఆయన వాగ్ధాటికి పౌరాణిక సన్నివేశాలు ఆయన వివరించి అర్ధం చెప్పే తీరుకి ముగ్దులయే శ్రోతలు చాలామంది ఆయన చేసే ప్రవచనాలు వినడానికి ప్రతీరోజు వస్తూంటారు. నాలుగు నెలలై, ఆ ప్రక్రియలో ఆయనకి గోపాలస్వామి సహకారం అందిస్తూ శ్రోతల మన్ననలు అందుకుంటున్నాడు. మరో రెండు నెలలు పొతే గోపాలస్వామియే పూర్తిగా ప్రవచనాలు చేస్తారు అని జనం అనుకుంటున్నారు.
తల్లి ప్రోద్బలంతో చిన్నప్పటినుంచి మాధవికి ప్రతీరోజూ రెండు పూటలా ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకొని రావడం అలవాటైంది.
గోపాలస్వామి కూడా చిన్నప్పటినుంచి తండ్రితో ప్రతీరోజూ ఆలయానికి వెళ్లి తండ్రికి భగవత్సేవలో సహకారం అందించడం అలవాటైంది.
గోపాలస్వామికి, మాధవికి చిన్నప్పటినుంచి ప్రతీరోజూ ఆలయంలో కలుసుకోవడం, పక్కపక్కన కూర్చొని స్వామి ప్రసాదం తినడం అలవాటైంది.
గోపాలస్వామి కంటే మాధవి ఏడాది మాత్రమే చిన్నది.
-2-
కాలంతో బాటూ పిల్లలిద్దరూ చిన్నప్పటి అలవాటుని దూరం చేసుకోకుండానే పెరగడంతో, వయసుకి వచ్చిన వారిద్దరి మధ్యలో ఒకరిపట్ల మరొకరికి ప్రేమ అంకురించింది.
ప్రవచనాలు చక్కగా చెపుతూ అందరి మెప్పు పొందుతున్న గోపాలస్వామి, మాధవి మదిలో ఉన్నత స్థానం ఆక్రమించుకొని ఆమెకు మరీ దగ్గరయేడు.
వయసు వచ్చిన పిల్లల ప్రేమ వ్యవహారాలు సాధారణంగా ఊళ్ళో వారికి ముందు తెలిసి, తరువాతే ఇంట్లోవారికి తెలుస్తుంది. ఆవిధంగా, రంగారావుగారి చెవిన పడిన తన కూతురి ప్రేమ కథ - స్వతహాగా ఆయనకి చాలా కోపం తెప్పించింది.
ఆలయంలో ఉదయం పూట దైనందిక విధులు గడిచి మరో గంటకు ఆ పూటకు కోవెల తలుపులు మూసేయ వచ్చు అన్న సమయంలో, రంగారావుగారు పంపిన మనిషి ఆలయానికి వచ్చి --
"అయ్యా పూజారిగారూ, జమీందారుగారు తమరిని ఎంటనే రమ్మన్నారు" అని సందేశం వినిపించేడు.
"సరే, నువ్వెళ్లు. ఆలయం మూసిన తరువాత నేను వచ్చి కనిపిస్తానని చెప్పు" అని ఆ మనిషిని పంపించిన గంట తరువాత, రంగారావుగారిని కలవడానికి వెళ్ళేరు పూజారిగారు.
పూజారిగారు రంగారావుగారిని కలవడానికి వెళ్లేసరికి, ముందరింటి గదిలో రంగారావుగారు నలుగురితో సమావేశంలో ఉండి, వారు వెళ్లిన తరువాత పూజారిగారిని లోపలి పిలిచేసరికి మరో పది నిమిషాలైంది.
"నమస్కారం" అంటూ ప్రవేశించిన పూజారిగారిని చూసి రంగారావుగారు --
"రండి పూజారిగారూ, ఇలా కూర్చోండి"
"పిలిపించేరట"
"నిజమే. కానీ సుమారు గంట పైనే అయిందనుకుంటా మిమ్మల్ని పిలిపించి"
"అవును. ఆలయం మూసే వేళ అయిన తరువాత కానీ రాలేను కదా. అలా కాకుండా, మీరు పిలిచేరని ముందుగా ఆలయం మూసేస్తే భక్తులు మీకే నా మీద పిర్యాదు చేస్తారు"
"మిమ్మల్ని మీరు బాగానే సమర్ధించుకుంటున్నారు"
"దొరవారు ఈరోజు ఏలనో నామీద కించిత్ కోపంగా ఉన్నట్టు అనిపిస్తోంది. నామీద ఎవరేనా పిర్యాదు చేయలేదు కదా"
"అదేమీ లేదు. ఆలయంలో అన్నీ చక్కగానే నిర్వహింబడుతున్నాయా"
"ఏదో సత్యదేవుని ఆశీర్వాదం, మీ అండదండలతో ఇప్పటివరకూ ఆలయంలో అన్నీ చక్కగానే జరిగిపోతున్నాయి"
-3-
"ఆలయప్రాంగణంలో ప్రేమ కలాపాలు కూడా ఈ మధ్యన చక్కగానే సాగుతున్నాయి అని మాకు తెలిసింది” అని అసలు ప్రస్తావనలోకి వచ్చేరు జమీందారుగారు.
"పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో అలాటివి ఉండే అవకాశం లేనేలేదయ్యగారూ"
"సూటిగా అసలు విషయంలోకి వస్తున్నాను. మా అమ్మాయి మాధవి మీ అబ్బాయి ఆలయ ప్రాంగణంలోనే ప్రేమ కలాపాలు సాగిస్తున్నారని మా చెవిని పడింది. అది నిజం కాకూడదన్నదే మా అభిమతం. ఒకవేళ అదే నిజమైతే పర్యవసానాలు వేరుగా ఉండవచ్చు. అవసరమైతే మీరు మీ అబ్బాయితో మాట్లాడండి, మేము మా అమ్మాయితో మాట్లాడతాము"
"వారిద్దరూ చిన్నప్పటినుంచి ఒకరినొకరు ఎరిగిన కారణాన ఇప్పటికీ చనువుగా ఉన్నారు, అంతే"
"కానీ ఇప్పుడు ఇద్దరికీ వయసు వచ్చింది కదా"
"అంతమాత్రాన ఒకరినొకరు ఎరిగిన వ్యక్తులు తారసపడితే మాట్లాడుకోవడం మానరు కదా"
"మాటల వరకూ సరే. చేతుల్లోకి వస్తేనే మేము కలగచేసుకోవలసి వస్తుంది"
"రామ రామ. ఎంతమాట. పవిత్రమైన ఆలయప్రాంగణంలో ప్రేమచేష్టలా. అలా ఎన్నటికీ జరగదు"
"ఆ విషయంలోనే మీరు మా మనసు గ్రహిస్తారని పిలిపించేను"
"నేను అబ్బాయితో మాట్లాడతాను, మరి నాకు సెలవా"
"ఊఁ. రేపు ఇదే సమయానికి వచ్చి మీరు మీ అబ్బాయితో మాట్లాడిన చర్యకు ప్రతిచర్య ఎలా ఉందో మాకు తెలియచేయండి"
"సెలవు"
పూజారిగారు వెళ్లిన తరువాత రంగారావుగారు మాధవిని పిలిచి –
"అమ్మాయీ, నేను పూజారిగారు మాట్లాడిన మాటలు నువ్వు పక్క గదిలోంచి విన్నావని నాకు తెలుసు. మన అంతస్తు ఎరిగి నువ్వు మసలుకుంటావని నమ్ముతున్నాను. నీ యెడల నా మృదు వైఖరి మారకుండా చూసుకోవలసిన బాధ్యత నీదే" అని గట్టిగానూ కాక నెమ్మదిగానూ కాక హెచ్చరించేరు.
తండ్రి దగ్గర ఉన్న చనువుతో మాధవి "నాన్నగారూ, నేను పూజారిగారి అబ్బాయి ఒకరంటే ఒకరం ఇష్టపడ్డాం. ఆ ఇష్టాన్ని వయసుతో వచ్చిన ఆకర్షణగానే కాక మా ఇద్దరి మధ్యలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమగా మీరు గుర్తించి మా ఇద్దరికి పెళ్లి జరిపిస్తే సరి. లేదా, జీవితాంతం మేమిద్దరం పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాము" అని ముక్కు సూటిగా తన అభిప్రాయం చెప్పి లోనికి వెళ్ళిపోయింది.
పూజారిగారు వారి అబ్బాయితో ఆయనకీ తనకు మధ్యన జరిగిన సంభాషణలు చెప్పి మాట్లాడిన తరువాత వారి అబ్బాయి ఈ ప్రేమ విషయంలో వెనుకకు తగ్గితే సమస్యే ఉండదు అనుకొని, ప్రస్తుతం అమ్మాయి మీద ఆగ్రహించడం ఎందుకు అని, అప్పటికి ఆయన మౌనంగానే ఉండడానికి నిర్ణయించుకున్నారు.
-4-
ఇంటికి వెళ్లిన పూజారిగారు గోపాలస్వామిని పిలిచి తనకు జమీందారుగారికి మధ్యన జరిగిన సంభాషణ వివరించి "నువ్వేమంటావు గోపాలా" అని నెమ్మదిగానే అడిగేరు.
"నేను మాధవి ఒకరినొకరు ఇష్టపడుతున్న మాట నిజమే నాన్నగారూ. మా ఇద్దరి మధ్యన ఉన్నది వయసుకి తగిన ఆకర్షణ మాత్రమే కాదు, ఒకరంటే మరొకరికి ఉన్న స్వచ్ఛమైన ప్రేమ. మా ఇద్దరికీ పెళ్లైందా సరే. లేదా, ఇద్దరం అవివాహితులుగానే మిగిలిపోతాం. మా ఇద్దరి అభిప్రాయం ఇదే" అని స్పష్టంగా చెప్పేడు గోపాలస్వామి.
మరునాడు ఉదయం పది గంటల ప్రాంతంలో - తనని రమ్మని జమీందారుగారే స్వయంగా ఆలయానికి రావడం చూసిన పూజారిగారే ఎదురు వెళ్లి - "ఎన్ని రోజుల తరువాతో మీరు ఆలయానికి వచ్చేరు. ముందు స్వామి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు సేవించి నిమ్మళించండి. తరువాత నేను మీతో మాట్లాడతాను" అని చెప్పి రంగారావుగారు స్వామి దర్శనం చేసుకున్న తదుపరి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆయన కాస్తా నెమ్మదిగా కూర్చున్న తరువాత అబ్బాయి గోపాలస్వామిని పిలిచి - "వీడే మా అబ్బాయి, పేరు గోపాలస్వామి" అని పరిచయం చేసి --
"గోపాలా, నువ్వు గర్భగుడిలో ఉండు. భక్తులెవరేనా రావొచ్చు. నేను జమీందారిగారితో మాట్లాడి వస్తాను" అని చెప్పేరు.
గోపాలస్వామి రంగారావుగారికి నమస్కారం చేసి వెళ్ళిపోయేడు.
రంగారావుగారు మండపం మెట్లు దిగి గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూంటే వెనకనే ఉన్న పూజారిగారు "అయ్యా నిన్ననే నేను అబ్బాయితో మాట్లాడేను. 'మా ఇద్దరిది స్వచ్ఛమైన ప్రేమ, మాకు పెళ్లి చేయకపోతే ఇద్దరం అవివాహితులుగా మిగిలిపోతామని నిర్ణయించుకున్నాము' అని తన అభిప్రాయం ఏమాత్రమూ తొణకకుండా చెప్పేడు. మీరు అమ్మాయితో ఏమేనా మాట్లాడారా" అని అడిగేడు.
"మా అమ్మాయి కూడా అదే మాట చెప్పింది పూజారిగారూ"
"మీరు నెమ్మదిగా వింటానంటే చిన్న మాట చెప్తాను బాబుగారూ"
"చెప్పండి"
"భాగవతంలో రుక్మిణి కళ్యాణం గురించి మీకు నేను వేరుగా చెప్పనక్కరలేదు. మహారాజు కూతురైన రుక్మిణి గోపాలుడైన కృష్ణుడిని ప్రేమించడమే కాక, ‘నువ్వు వచ్చి నన్ను తీసుకొని పో’ అని కబురంపలేదా? దానికి స్పందించిన స్వామి వచ్చి అమ్మగారిని తీసుకొని వెళ్లి వివాహం చేసుకోలేదా? - ఇద్దరి మధ్యలో అంతస్తు బేధం ఉండి వారు అలా వ్యవహిరించినా, వారి వివాహం మనం ప్రవచనంగా చెప్పుకొని విని తరిస్తున్నామా లేదా? అంతేకాక, కన్యామణులకి ‘రుక్మిణి శ్రీకృష్ణుల కళ్యాణం చదువుకోండి లేదా వినండి మీకు మంచి భర్త లభిస్తాడు’ అని మనమే ప్రోత్సాహిస్తున్నాం. అలాంటిది మన పిల్లలు హద్దు మీరక వారిద్దరికీ పెళ్లి కాకపొతే
-5-
అవివాహితులగా ఉండిపోవడానికే నిర్ణయించుకున్నారు అంటే వారిది ఎంత స్వచ్ఛమైన ప్రేమో, వారికి మనమంటే ఉన్న గౌరవం ఏంటో తెలుస్తోంది కదా. కాబట్టి మీరు తొందరపడి ఏ నిర్ణయానికి రాకుండా, నిదానంగా ఆలోచించి ఈ సమస్యకి పరిష్కారం చూడండి"
"అంతేకాక ..." అని పూజారిగారు జమీందారిగారి స్పందనకు ఎదురు చూస్తూ ఆగిపోయేరు.
"చెప్పండి"
"మనుషులు చేసే కర్మలలో దేనికైనా ఈశ్వర సంకల్పం ఉండే ఉంటుంది. అందుకే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. జరిగేది అంతా ఈశ్వరేచ్ఛ మనం నిమిత్తమాత్రులమే అని నాదే కాదు పెద్దల అభిప్రాయం కూడా. అన్నీ తెలిసిన మీకు నేను ఇవన్నీ చెప్పడం కాస్తా హాస్యాస్పదంగానే ఉంటుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకూ మా గోపాలానికి శిరోధార్యమే"
రెండు నిమిషాలు మౌనంగా ఆలోచించిన రంగారావుగారు - కూతురి దృష్టిలో తాను చెడ్డవాడిగా నిలబడడానికి ఇష్టపడక, అలాగని అమ్మాయి కోరిన పెళ్ళికి పూర్తిగా ఒప్పుకోనూలేక - చాకచక్యంగా తాను కోరే విధంగా కార్యం నెట్టుకొని రావాలన్న ఆలోచనతో --
"పూజారిగారూ, ఈరోజు ప్రవచనంలో ముఖ్య ఘట్టం ఏమిటి"
"ప్రవచనం ప్రారంభించిన ఒక గంట లోపల రుక్మిణి శ్రీకృష్ణుల వివాహ ఘట్టం చెప్పడం అవుతుంది అనుకుంటున్నాను. తరువాత రుక్మిణి శ్రీకృష్ణుల కళ్యాణం జరుగుతుంది."
"ప్రవచనంలో మీ అబ్బాయి కూడా మీకు సహకరిస్తున్నాడని వింటున్నాను, నిజమేనా"
"అవునండీ"
"ఈరోజు పూర్తిగా ప్రవచనం పూర్తిగా మీరే చెప్పండి"
"అలాగే, కానీ ఈ ఆలోచనకి ఇప్పటి సమస్యకి ఏమిటి సంబంధం"
"అక్కడికే వస్తున్నాను. సత్యనారాయణస్వామి మా కులదైవం అని మీకు తెలుసుకదా"
"అందుకే కదా, మీ ముత్తాతగారు స్వామికి ఈ ఆలయం కట్టించేరు"
"మీరు ప్రవచనం ఎక్కడ చెపుతుంటారు"
"ఆలయమండపంలో స్వామి ఎదురుగా భక్తులు కూర్చొని ఉంటే నేను స్వామి ముందర నిలబడి చెప్తుంటాను"
"ఈరోజు సాయంత్రం ప్రవచనానికి నేను సకుటుంబంతో వచ్చి ఈ సమస్యకి అక్కడే సమాధానం చెప్తాను"
"అలాగే, మీరు ఇప్పుడు చెప్పినవాటికి, అడిగినవాటికి, ప్రస్తుత సమస్యకి, మీకు దొరికే సమాధానానికి సంబంధం ఎలా కుదురుతున్నదో నాకు అంతుపట్టడం లేదు"
"సాయంత్రం మీరే చూస్తారుగా, వస్తాను" అని అదోలా నవ్వుతూ నిష్క్రమించిన రంగారావుగారిని చూస్తూ కొంతసేపు స్తబ్దుగా నిలబడిపోయేరు పూజారిగారు.
-6-
ఆరోజు సాయంత్రం రంగారావుగారు, ఆయన భార్య, కొడుకు, కూతురు ప్రవచనం వినేవారి ముందు వరుసలో కూర్చున్నారు.
పూజారిగారు ప్రవచనం ప్రారంభిస్తారనగా -- రంగారావుగారు లేచి నిలబడ్డారు.
జమీందారుగారు నిలబడడంతో శ్రోతలందరూ లేచి నిలబడ్డారు.
రంగారావుగారు అందరినీ కూర్చోమని చెప్పడంతో అందరూ కూర్చున్నారు.
అప్పుడు, ఆయన -
"మీరంతా మా వంశం గురించి బాగా తెలిసినవారు, అలాగే, మాటకి మేము ఎంత కట్టుబడి ఉంటామో తెలియనివారు కాదు. నేను ఈరోజు సత్యదేవుని సాక్షిగా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలని సకుటుంబంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చేను. మన పూజారిగారి అబ్బాయి మా అమ్మాయి చిన్నప్పటినుంచి కలిసి తిరుగుతూ పెరిగి పెద్దవారయేరు. ఈ మధ్యనే వారిద్దరూ ఒకరంటే మరొకరు ఇష్టపడి వివాహబంధంలో ఇమడాలని అనుకొని మా నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. వారి ఆ సంకల్పానికి సత్యదేవుడు ఇష్టపడితే ఎవరూ అభ్యంతరం పెట్టలేరు, పెట్టినా చెల్లదు. మాకు కూడా నమ్మకం ఏమిటంటే, ఈ సత్యదేవుడు ఇష్టపడందే ఎవరు ఎంతగా ఇష్టపడ్డా అనుకున్నది జరగదు. అయితే ఆయన ఇష్టపడ్డారా లేదా అన్నది మనకి ఎలా తెలుస్తుంది. అందుకు ఈరోజు మీ సమ్మతితో మీ అందరి సమక్షంలో నేను ఒక పని చేయాలనుకుంటున్నాను. మా అమ్మాయి చేతికి పూజారిగారి అబ్బాయి చేతికి నేను చెరో అరటిపండు ఇస్తాను. వాటిని వారిద్దరి దగ్గరనుంచి స్వీకరించి పూజారిగారు సత్యనారాయణ స్వామి పాదాల దగ్గర పెడతారు. తరువాత, ముఖ్య ద్వారం కాక స్వామి కనిపిస్తూండే ఇనప గజాల తలుపులకి తాళం వేసి, ఈరోజు ప్రవచనం ప్రారంభిస్తారు. ప్రవచనం చెప్పడం పూర్తయిన తరువాత ఇనప గజాల తలుపుల తాళం తీసి చూస్తాము. అప్పుడు స్వామి పాదాల కింద ఉన్న పళ్లెంలో రెండు అరటి పళ్ళు పడితే, చిన్నారుల పెళ్ళికి స్వామి సమ్మతించినట్టుగా స్వీకరించి పిల్లలిద్దరూ మనందరి సమక్షంలో పూదండలు మార్చుకొని పెళ్లైనట్టుగా పరిగణింపబడతారు. వీలైతే, మంగళసూత్రధారణ కూడా కానిచ్చేద్దాం. ఆ పళ్లెంలో ఒకే ఒక అరటిపండు పడినా లేక ఏ అరటి పండు కూడా పడకపోయినా పిల్లలిద్దరి పెళ్లికి సత్యదేవుని సమ్మతి లేదు అని భావించడమౌతుంది. మీరేమంటారు, అలా చేద్దామా"
ఒక్క నిమిషం నిశ్శబ్దం ఉన్న అందరూ మరు నిమిషానికి చప్పట్లు కొట్టి వారి సమ్మతి తెలియచేసేరు.
"పూజారిగారూ మీకూ సమ్మతమేనా"
"తప్పకుండా భగవదంగీకారం అన్నివిధాలా శ్రేయస్కరం"
దాంతో - ఆ విధంగా ఏర్పాట్లు జరిగి, ప్రవచనం అయిన తదుపరి తలుపులు తీసి చూస్తే అందరూ ఆశ్చర్యపడేటట్టుగా రెండు అరటి పళ్ళు స్వామి పాదాల కింద ఉన్న పళ్లెంలో పడి ఉన్నాయి.
అది చూసిన జనమంతా ఒక్కసారిగా "జై శ్రీ సత్యనారాయణ స్వామికి జై" అని నినాదాలు చేసేరు.
-7-
అవాక్కయిన రంగారావుగారు చేసేదిలేక మాధవి చేత గోపాలస్వామి చేత సత్యనారాయణస్వామి సమక్షంలో జనం అంతా చూస్తూండగా పూదండలు మార్పించేరు. తదుపరి రుక్మిణి శ్రీక్తిష్ణుల వివాహం ఆ చిన్నారుల చేతుల మీదుగా జరిగింపించిన పూజారిగారు - రుక్మిణీదేవికి అని ఉంచిన రెండు మంగళసూత్రాలలో ఒక దానిని గోపాలస్వామికి ఇచ్చి మాధవి మెడలో కట్టింపించేరు.
ప్రవచనానికి వచ్చిన జనసందోహమంతా సత్యనారాయణ స్వామి మహిమను జమీందారిగారి గొప్ప మనసును పొగుడుతూ వెళుతూంటే –
రంగారావుగారు మనసులో ఆశ్చర్యపడుతూనే తనకాళ్ళకి నమస్కరిస్తున్న కూతురిని అల్లుడిని లేవదీసి చెమర్చిన కళ్ళతో అక్కున చేర్చుకున్నారు.
జమీందారు గారికి, వారి కుటుంబానికి, పూజారిగారికి, వారి కుటుంబానికి, అక్కడకి వచ్చిన జనానికి, నూతన దంపతులకి సత్యనారాయణస్వామి పాదాల దగ్గర ఉంచిన రెండు అరటిపళ్ళు స్వామి పాదాల కింద ఉన్న పళ్లెంలోకి ఎలా పడ్డాయి అన్నది అర్ధం కాక ‘ఈశ్వరేచ్ఛ’ అని అనుకున్నారు..
ఈ సన్నివేశమంతా తన చిద్విలాసమే అన్నట్టుగా సత్యనారాయణస్వామి వారు చిరునవ్వులు చిందిస్తూ అభయ హస్తంతో నూతన దంపతులతో సహా అందరినీ దీవిస్తూ నిలబడి ఉన్నారు.
*****