పేపర్ చదువుతున్న శేఖర్ కొడుకు చింటూ అడిగిన ప్రశ్నకి పేపర్లోంచి బయటికి వచ్చేడు.
" అపాత్ర దానం" అంటే ఏమిటి నాన్న?
"ఎందుకు అంత పెద్ద ప్రశ్న వేశావురా" ఆశ్చర్యంగా అడిగేడు శేఖర్ కొడుకు కేసి చూస్తూ.
చింటూ గాడు 4త్ క్లాస్ చదువుతున్నాడు. వాడికి తెలుగు పదాల మీద ఆసక్తి ఎక్కువ. అదీ కాక చదువులో చురుకుగా ఉంటాడు. రేపటి పాఠాలు ఈరోజే నేర్చుకునే రకం.
"నిన్న క్లాస్ లో తెలుగు సర్ వెళ్తూ వెళ్తూ రేపటి పాఠం... " అపాత్ర దానం" "అన్నారు...అర్ధం కాలేదు." అన్నాడు.
అదా సంగతీ.. అని వాడి తల నిమిరి, “మనం ఎవరికయినా డబ్బో, వస్తువో ఇచ్చేము అనుకో, వాళ్ళు అది సరిగా ఉపయోగించుకోకుండా, పాడుచేసుకుంటే, లేదా అశ్రద్దగా ఎక్కడో పారేసుకుంటే, అలాంటి సహాయాన్ని(దానాన్ని) " అపాత్ర దానం" అంటారు " అన్నాడు.
ఏదో అర్ధం అయినట్లు వెళ్ళిపోయాడు చింటూ గాడు.
కాఫీ తీసుకుని వచ్చి పక్కన కూర్చుంది అతని భార్య కవిత. రోజూ కాఫీ తాగుతూ ఓ అరగంట బాతాఖానీ వేస్తారు వాళ్ళు. తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ.
ఏదో గుర్తుకు వచ్చినట్లు చెప్పడం మొదలు పెట్టింది.
" ఏమండీ మన కస్తూరి మనం బాల్కనీ లో పడేసిన గాస్ సిలిండర్లు మాకు ఇవ్వకూడదా అమ్మగారూ అంది నిన్న."
కస్తూరి అంటే వాళ్ళింట్లో పనులు చేసే అమ్మాయి.
కవిత నాన్నగారు పెళ్ళికి ముందే చనిపోయాడు. ఆమె తల్లి సరోజమ్మ కూతురు, అల్లుడు దగ్గరే ఉండేది. ఆమె పేరు మీద వున్న గ్యాస్ కనెక్షన్ శేఖర్ తన అడ్రస్ కి మార్పించుకున్నాడు. శేఖర్ కి అప్పటికే ఒక గ్యాస్ కనెక్షన్ వుంది. తనకు వున్న కనెక్షన్ కి వచ్చే గ్యాస్ సిలిండర్లే చాలు వాళ్లకి.
సరెండర్ చేసేద్దాం అంటే, కవిత.. ”పోనీలెండి అమ్మది ఇండేన్ గ్యాస్ కనెక్షన్ కదా, HP గ్యాస్ రానప్పుడు ఇండేన్ తెప్పించుకోవచ్చు” అని చాదస్తం గా, ఆ గ్యాస్ కనెక్షన్ కూడా వాళ్ళ అడ్రస్ కి మార్పించింది. కవిత కొన్ని సార్లు అతి జాగ్రత్త గా ఆలోచిస్తూంటుంది. సరోజమ్మ గారి గ్యాస్ కనెక్షన్ తో గ్యాస్ ఎప్పుడో గానీ బుక్ చేసే వారు కాదు.
కిందటి ఏడాది సరోజమ్మ చనిపోయింది. అప్పటినుండీ, ఆ సిలిండర్లు వాడడం లేదు..బాల్కనీ లో పడేసి ఉంచేరు.
ఇప్పుడయినా కనెక్షన్ సరెండర్ చేసేద్దాం అంటే.. కవిత వద్దంది. పైగా, అదొక పెద్ద ప్రహసనం, ఆవిడ డెత్ సర్టిఫికెట్ పట్టుకెళ్లి, ఒరిజినల్ కనెక్షన్ వోచర్ తో బాటు, సీలిండర్లు ఆటోలో వేసుకుని డీలర్ దగ్గర్కి వెళ్లి అప్లై చేయాలి.
“అదంతా మనకిప్పుడు అవసరమా.. పోనీలెండి అది సరెండర్ చేస్తే వచ్చేది ఓ 1000 రూపాయలు... ఇప్పుడు అవేమి మనకి అడ్డం, ఉంచండి అని ఉంచేసింది.
ఈ మధ్య, ఇల్లు దులుపు తున్నప్పడు అవే అడ్డంగా భావిస్తోంది కవిత. ఆ సిలిండర్లు ఎవరికయినా అమ్మేస్తే, 2౦౦౦ రూపాయల దాకా వస్తాయని పొరుగింటి కాంతం చెప్పిందిట. అప్పటి నుండీ వాటిని అమ్మేద్దామని చూస్తోంది.
నిన్న కస్తూరి అడగడం తో ఆ ప్రస్తావన తెచ్చింది భర్త దగ్గర.
కవిత ఉద్దేశ్యం అర్ధం అయ్యి, “ కస్తూరి దగ్గర డబ్బు తీసుకోనక్కర్లేదు..ఆ మాత్రం మనం సాయం చేయచ్చు ఆ అమ్మాయికి. చింటూ గాడి చిన్నప్పటి నుండీ, మన ఇంట్లో అన్ని పనులూ చేస్తోంది, మంచి అమ్మాయి.. పోనీ ఊరికే ఇచ్చెయ్యి.. " అని, ఒక్క క్షణం ఆగి...
“అయినా.. సిలిండర్లు పట్టుకెళ్తే, గ్యాస్ కనెక్షన్ ఉండాలి కదా” అన్నాడు శేఖర్.
“ గ్యాస్ పొయ్యి కొనుక్కుంటారు, వాళ్లకి తెలిసిన గ్యాస్ బాయ్ కనెక్షన్ లేకపోయినా, పాత సిలిండర్ ఇస్తే, కొత్త సిలిండర్ తెచ్చి ఇస్తాడట..గ్యాస్ డబ్బులు కట్టుకుంటే చాలుట" అంది.
“ మళ్ళ్లీ గ్యాస్ పొయ్యి అయినా కొనుక్కోవాలి కదా, పాపం కట్టెల పొయ్యి మీద వండుకుంటోందేమో, బీరువాలోంచి ఓ వెయ్యి రూపాయలు కూడా ఇయ్యి ఆ అమ్మాయికి. బోనస్ ఇచ్చినట్లు సంతోషపడు తుంది” అన్నాడు శేఖర్. శేఖర్ కి పేదవాళ్ళు అంటే చాలా జాలి.
భర్త మాట కాదనలేక సరే అని.. “అయితే ఈ రోజు పట్టుకుపొమ్మంటాను” అంది.
ఆ సాయంత్రం 2 సిలిండర్లు, వెయ్యి రూపాయలు పట్టుకు పోయింది కస్తూరి.
రెండు రోజుల తర్వాత సాయంత్రం భర్త ఇంటికి వచ్చేసరికి, భార్య మొహం సీరియస్ గా వుంది. శేఖర్ కి అర్ధం కాలేదు. “ఏమిటోయ్ , చాలా సీరియస్ గా వున్నావు..వంట్లో బాలేదా?” అన్నాడు.
“ ఇది విన్నారా.. మనం కస్తూరికి మన సిలిండర్లు వూరికే ఇచ్చేసేం కానీ, పక్కింటి కాంతం గారి దగ్గర కూడా ఒక సిలిండర్ పట్టుకెళ్ళిందిట, వెనక వీధి లో వనజ దగ్గర కూడా 2 సిలిండర్లు పట్టుకెళ్ళిందిట..వాళ్ళు 1500 కి అమ్మేసేరుట దానికి. మనలా వూరికే ఎవ్వరూ ఇవ్వలేదు” అంది కవిత.
కవిత ఉద్దేశ్యం లో "మనమే అనవసరంగా వచ్చే డబ్బులు పోగొట్టుకున్నాం" అనే బాధ కనిపిస్తోంది.
"పోనీలే పేద అమ్మాయి కదా అని మనం సహాయం చేసేం. అందరూ అలా వుండరు కదా... అయినా, అన్ని సిలిండర్లు ఆ అమ్మాయి ఏం చేసుకుంటుంది. ముందు అది ఆలోచించాల్సిన విషయం ” అన్నాడు శేఖర్.
కవిత మర్నాడు అదే విషయం కస్తూరిని అడిగేసింది.
ఒక్క క్షణం నిర్ఘాంత పోయింది కస్తూరి.. వెంటనే తమాయించుకుని, కస్తూరి ఇలా చెప్పింది:
“మాది పెద్ద కుటుంబం అమ్మా. నేను మీ కాడ తెచ్చుకున్న సిలిండర్లు చూసి, మా ముగ్గురు తోడికోడళ్లు, ఎక్కడయినా వాళ్లకి కూడా చూసి పెట్టమంటే చూసేను.” అంది.
ఆమె మాటల్లో నిజాయితీ ధ్వనిస్తోంది. ఇంకేం మాట్లాడ లేదు కవిత.
ఓ 4 రోజులు గడిచేయి.. ఆరోజు ఆదివారం.
కస్తూరి పనికి రాలేదు. కవితకి పనులు అన్నీ పెండింగ్ లో పడిపోయేయి. ఎలాగో ఆ రోజుకి గడుపుకుంది.
సోమవారం కూడా కస్తూరి రాలేదు. గిన్నెలన్నీ తోముకోవడం కష్టం గా వుంది కవితకి.
"ఈ రోజు మీరు మీ ఆఫీస్ కాంటీన్ లో తినెయ్యండి..నాకు వంట చేసి క్యారేజ్ పెట్టడానికి టైం సరిపోదు. ఈ కస్తూరి నిన్నటి నుండీ, పనిలోకి రాలేదు. చింటూకి కూడా ఈ రోజు నేనే వెళ్లి స్కూల్లో మధ్యాహ్నం క్యారేజ్ ఇచ్చి రావాలి " అంది.
పేపర్ చూస్తున్న శేఖర్ సరే అని తల ఊపేడు. ఇంతలో పేపర్ లో ఓ వార్త చూసి ..నిర్ఘాంత పోయేడు.
" గ్యాస్ అక్రమాలపై విజిలెన్సు దాడులు" అదీ దాని హెడ్డింగ్.
దాని సారాంశం ఏమిటంటే..
“ గృహ వినియోగ సిలిండర్ల నుండి వాణిజ్య సిలిండర్లకు గ్యాస్ ఎక్కిస్తున్న వారి పై విజిలెన్సు అధికారులు దాడి చేసేరు. వారి నుండి 18 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. గాంధీ నగర్ సెక్టార్ 4 లో వున్న మిల్క్ ఫుడ్స్ దుకాణం లో ఈ భాగోతం నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న విజిలెన్సు అదనపు SP ఆదివారం తన సిబ్బంది తో దాడి చేసి నిందితులని పట్టుకున్నారు. రఘు, సోమరాజు మరియు కస్తూరి అనే మహిళ ను అదుపులోకి తీసుకుని, గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. తక్కువ ధరకి దొరికే గృహ వినియోగ గ్యాస్ ని వాణిజ్య సిలిండర్ల లోకి ఎక్కించడం అక్రమమే కాకుండా, ప్రమాద జాగ్రత్తలు లేని ఇలాంటి పనులవల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తే, మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది. అలాగే, భారీగా ధన, ఆస్థి నష్టాలు కూడా ఏర్పడతాయి.
ఎవరయినా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లుసమాచారం తెలిస్తే.. తమకు తెలియపరచాలని అదనపు SP ప్రజలను కోరారు ”..అని వుంది.
శేఖర్ కి గుండె ఝల్లు మంది. కవితని పిలిచి ఈ వార్త చూపించేడు..
“యెంత పని చేసింది కస్తూరి”..అన్నాడు. కవిత బిక్క చచ్చిపోయింది.
చింటూ గాడు మాస్టారు చెప్పిన పాఠం " అపాత్ర దానం " బిగ్గరగా చదువుతున్నాడు.
ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు కస్తూరి, శేఖర్.
-END-