ఉడుమూరి కన్నప్ప కథ - విద్యాధర్ మునిపల్లె

Vudumoori kannappa katha

శ్రీకాళహస్తినందలి ఉన్న చిన్న పర్వతమున ‘‘ఉడుమూరుకన్నప్ప’’ అనుపేరగల చెంచుభక్తుడుండేవాడు. అతడు శ్రీకంఠభక్తుడు. శివభక్తులలో ఘనకీర్తినొందెను. ఒకానొకరోజున అతడు ఎంతో ఉల్లాసంగా జంతువులను వేటాడుటకెళ్లెను. తనతో వచ్చిన తోటివారైన బోయవారు వేటాడుటచే అలసిపోయి డస్సినిద్రపోయిరి. అప్పుడు నిద్రావస్థలో ఉన్న కన్నప్పకు ఈశ్వరుడు తపస్వి వేషం ధరించి రుద్రచిహ్నములన్నింటిని దాల్చి ప్రశాంత స్థలములకు వచ్చి నొసటిపై విభూతిని పూసి తన కమండలమునందున్న పవిత్ర తీర్థమును తనపై చల్లి నీకెదురుగా కనిపించుచున్న మార్గములో ముందుకు పోయిన నీ కొక మహాలింగమూర్తి సాక్షాత్కరించును అని పలికినట్లు నిద్రావస్థలో గోచరిచెను. నీకు ప్రాణలింగం ఆ మహదేవుడేసుమా! అని పలికినట్లు కన్నప్పకు స్పష్టపడినది. ఇంతలో అతనికి మెలుకువ వచ్చెను. శివుడు తన కలలో ఉపదేశించినట్లు ఇంతకుముందు చూచినపుడు లేనిత్రోవ అతనికి కనిపించెను. వెంటనే సంతోషంతో తన చెలికాండ్రయిన ఎఱుకులను అక్కడే ఉంచి తను మాత్రం ఆ త్రోవనే బయలుదేరెను. అట్లు పోగాపోగా అతనికి ఒక లింగమూర్తి కనిపించెను. పరమేశ్వరుని ఉపదేశ ఫలము ఈ లింగమేమోనని మనసునతలచి సాగిలబడి మ్రొక్కెను. ఈ ప్రాణలింగమును విడిచి వెళ్లుటకు నాకు మనస్కరించుటలేదు.బ్రతిమాలైనను, ప్రాధేయపడినను ఈ లింగమును తీసుకొని వెళ్లవలెనని నిర్ణయించెను. ఆ స్వామి ఒంటరిగా ఉండుటచే అతడుపరిపరి విధముల బాధపడెను. తన పల్లెకు ఈశ్వరుడు వచ్చుటకు కలుగు ఆనందమును గూర్చి పరమేశ్వరునకు చెప్పసాగెను. రకరకముల వంటలు రకరకముల సౌఖ్యములను మీకు మా పల్లెప్రజలు అందిచెడివారు. అని పలుకుచూ చివరిగా మీకు మీ దగ్గరలో లభించు ఆహారపదార్థములను సమకూర్చుతానని వేటాడుటకు వెళ్లెను. మహానుభావులైన శివభక్తులు మహాదేవుని ప్రసన్నం చేసుకొనగా అంతట మహాదేవుడు వరములను కోరుకోమని ప్రార్థించగా మాకు ఇవ్వబోవు వరం విలక్షణంగా విశిష్ఠంగా ఉండాలని కూడా ప్రార్థించెను. అందుకని అందమైన ఈ శరీరములను మీరు భక్షించాలని మేమెంతగానో కోరుకొనుచున్నాము. అప్పుడు కరుణించిన ఆ దేవదేవుడు వారు కాళహస్తిప్రాంతములో మృగములై జన్మించెదరుగాక! మిమ్ముల్ని వేటాడి వధించి నాభక్తుడొకడు చక్కగా వండి అర్పించును. అపుడు నేను ఆరగిస్తాను. అతడిపేరు కన్నప్ప అని పరమేశ్వరుడు వారికి తెలియజెప్పెను. ఆ మృగములన్నియూ కన్నప్ప కొరకై ఎదురుజూచుచుండెడివి. అతడు ఎప్పుడు వేటాడుటకు వచ్చునో అప్పుడు వాటంతట అవే కన్నప్పకు ఎదురుపడెను. అపుడు తనవాడి బాణములతో ఆ మృగములను చంపి, ఆ మాంసమును మంచి కట్టెపుల్లలమధ్యలో ఉంచి బాగా వేగేంతటి వరకు ఆ మాంసమును కాల్చి, అందు రుచికరములగు ముక్కలను వేరుచేసి, వాటిని మరలా పక్వమయ్యే వరకు కాల్చి పైనాపక్కలా మాంసం పచ్చిలేకుండా సమపాళ్లుగా వేగాయోలేదో చూసి అవన్ని ఒక దొప్పలో పెట్టెను. బిల్వ పత్రములను కోసి తన తలపై ఉంచుకొనెను. సువర్ణముఖీనదిలోని నీటిని బుగ్గలమధ్యనుంచి ఎడమచేతిలో శరచేతంలో పట్టుకొని కుడిచేతిలో మాంసం దొప్పపట్టుకొని దివ్యలింగం దగ్గరకి వెళ్లెను. ఇదివరలో పూజారి ఉంచిన పూజాద్రవ్యమును చెప్పుకాలితో తీసివేసెను. తెచ్చిన నీటిని శివునిపైపోసి అభిషేకం చేసెను. తన తలపై ఉన్న బిల్వపత్రమును శివునిపైకి విదిల్చి ఉంచెను. చేతి దొప్పలోని మాంసమును నైవేద్యంగా అర్పించెను. ఈవిధముగా ప్రతిరోజూ శివార్చన చేయుచుండెను ఆ కన్నప్ప. ఇంతలో ఆ శివునికి పూజచేయు పూజారి శివలింగము వద్దకు వచ్చెను. శివలింగము ముందున్న ఆ ఆ మాంసపు ముక్కలను చూసి బాధపడెను. ఈ ప్రాంతము మొత్తమును అపవిత్రం చేసెనని దిగులుపడెను. పరమేశ్వర లింగమునకు మాంసమును సమర్పించుటచే పరమేశ్వరలింగం అపవిత్రం అయినదని భావించుటచే పంచామృతములు తెచ్చి అభిషేకం చేసెను. పుణ్యాహవచనం చేసి శివుని చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశములను పుణ్యాహవచన నీటిని చల్లెను. ఆ రోజు రాత్రి ఎవరు ఈ పనిచేయుచున్నారని పరిశీలించుటకై ఆ లింగం వద్దనే ఉండెను పూజారి. తెలతెల్ల వారుచున్నదోలేదో అప్పుడే కన్నప్ప తన పుక్కిలిలో పట్టితెచ్చిన నీటిని శివునిపై ఊసెను. మాంసమును నైవేద్యముగా సమర్పించెను. ఈ సన్నివేశము చూసి మనసు బాధకల్గి ఈ ఎంగిలి మంగలమేమిటో? అని పరిపరివిధముల చింతించుచూ ఈబాధను పొందలేక అతనితో విరోధము పెట్టుకొనలేక బాధపడుచుండెను. సమానుల మధ్య వైరమైనచో ఇరువురు ఢీకొనుట సాధ్యమగును. అని మనసున తలచి చింతించుచుండెను. మరలా తన మనసుకు బలం చేకూర్చునట్లు ధైర్యమును తనకు తానుగా పెంచుకొనుచుండెను. పూర్వమున ఈ ప్రాంతమునందే సాలెపురుగు, ఏనుగుతో పంతముపట్టి ఆ ఏనుగును అంతమొందించలేదా అటులనే నేనుకూడా ఎదుర్కొనుటకు సర్వవిధముల ప్రయత్నించెదనని మనసున ఆ వృత్తాంతమును ఈ విధంగా తలచుకొనెను.ఒక సాలెపురుగు ఈ శివలింగాన్ని చూసి ఎటువంటి ఆచ్ఛేదనలేదని పరిపరి విధముల బాధపడుచూ తానే ఆలయమును నిర్మించెదనని అనుకొని ఆలయ నిర్మాణంను ప్రారంభించెను. సాలెపురుగు తన దారాలచే శివునకు గుడిని పానువట్టమును ఇలా ఆలయమునకు కావలసిన అన్ని హంగులను తన దారములతో సమకూర్చెను. అప్పుడు ఒక ఏనుగు స్వర్ణముఖీనదీ తీరమునందున నివసించుచూ ప్రతిరోజూ పరమేశ్వరునకు పూజ సమర్పించుచుండెడిది. ఆ ఏనుగు స్వర్ణముఖీ నదిజలమును తన తొండమున నింపి రకరకముల పుష్పములను తొండమునాదారంగా పట్టుకొని పరమేశ్వరుని లింగం వద్దకు వచ్చెను. సాలెపురుగు దారములతో ఆ లింగం పూర్తిగాకప్పివేయబడుటచూసి దానిమనసు కలత చెంది తన తొండముతో శివునిపై ఉన్న దారములనుతొలగించెను. అపుడు తొండమున నింపబడి ఉన్న నీటిచే పరమేశ్వరునికి అభిషేకం చేసెను. తెచ్చిన పూలను పరమేశ్వర లింగముపైన ఉంచి మహదానందంతో శరీరంను కుదుపుచూ నృత్యంచేసెను. ఇట్లు పరమేశ్వరుని యందు ముగ్ధభక్తి పారవశ్యమును తెలిపి మహదానందంతో అచటినుండి వెళ్లెను. అపుడు ఆ సాలెపురుగు చాలా బాధను పొంది పరమేశ్వరునికి సంరక్షణే లేకపోయెను అని మనసున చింతించుచూ ఈ ఏనుగుకు గుణపాఠం నేర్పవలయునని ఒకరోజున ఏనుగు వచ్చు సమయమునకు ఎదురుచూచుచు వచ్చిన తర్వాత పరమేశ్వరునకు అభిషేకము చేయుసమయమున ఏనుగు ముక్కులోనికి సాలెపురుగు ప్రవేశించెను. శరీరమంతా తిరుగుచూ ఏనుగుని పరిపరి విధముల దురవస్థలకు లోనగునట్లు చేసి ఏనుగుని చంపివేసెను. అంతట పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇద్దరికీ మోక్షమొసంగెను.అట్లే నేనుకూడా ఇతనిని చేసెదనని మనసున తలచి మరుసటిరోజు వేకువరaాము అయినదోలేదో కన్నప్ప ఒకచేత మాంసమును మరొకచేత బాణం మొదలగు సాధనములను నోటిలో నీటిని తలపై బిల్వపత్రములను పరమేశ్వర లింగం వద్దకు తెచ్చి ముందు అభిషేకం చేసి శివలింగంపై బిల్వపత్రముతో పూజచేసి మాంసంను నైవేద్యముగా పెట్టుటకు ఉపక్రమించబోగా శివుని నేత్రం నుంచి ధారాప్రవాహంగా నీరు కారుచుండెను. ఆ సన్నివేశమును చూసి మనసు కలతచెంది పరమేశ్వరుడు అలా ఏడ్చుటకు గల కారణం ఏమా అని పరిపరి విధముల బాధపడుచుండెను. చివరకి తన కన్నుతీసి పరమేశ్వరుని కంటిస్థానమున అమర్చెను.అపుడు రెండవ కంటినుంచి కూడా నీరు కారుటచేతన రెండవ నేత్రంకూడా పరమేశ్వరునికి అమర్చెను. అపుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యెను. తన ప్రయోజనం నాశింపక ఈ విధముగా నేత్రదానము చేయుటచే గొప్ప ఆనందమునొంది కౌగలించుకొనెను. ఈ సన్నివేశము చూసిన పూజారి ఈ భక్తుని యొక్క ముగ్ధభక్తిని తలచుకొని మహదానందము పొందెను. పరమేశ్వరుడు కన్నప్పను వరము కోరుకోమని అడుగగా నాకు నిరంతరం నిన్ను చూచుచు ఉండటమునే కోరుకొనుచున్నాను తప్ప నాకింకా ఏ వరం వద్దని పల్కెను. అందుకే అభిమతార్థ ప్రదుడైన సాంబశివుడు అట్లే కన్నప్పకు అభిముఖంగా నిలిచి ఉండగా ఇద్దరి అన్యోన్యం కారణంచేత ఒకరినొకరు చూసుకుంటూ కాళహస్తిపురమున ఇప్పటికినీ ఉండిరి. ఇప్పటికీని పరమేశ్వరునికి చేయు అభిషేక జలం భక్త కన్నప్ప పుక్కిటినీరని భావించుచుండిరి. కాళహస్తీశ్వరుడు కన్నప్ప కళ్లలోగిళ్లలో నున్న అమృత రసానందమును చూపుడనే చంద్రకిరణకాంతిగామలచి ఆ ప్రాంతమునకొచ్చు జనులను రక్షించుచుండెను. పరమేశ్వరుడు ముగ్ధ భక్తులయెడ పరమప్రీతిని ఎల్లప్పుడును కలిగి ఉండిరి. అని బసవుడు చెన్నబసవునికి ముగ్ధభక్తుల చరిత్రలు చెప్పుచూ మహాదాపిసతంను కలిగించెను. బసవడీ కథను చెప్పినను ఆ కథల యందు వారి స్వార్థప్రయోజనంలు ఇంచుకైనను కనిపించవు. భగవంతుడు స్వచ్ఛభక్తిని మాత్రమే ఆదరించును. ఎవరు భగవత్‌ తాదాత్మ్యంను పొంది వారి సర్వస్వమైనను సమర్పించుటకు సిద్ధపడుదురో అటువంటివారిని నిరంతరం వెన్నంటి కాపాడును అని నిరూపించుచుండెను.
కన్నప్ప కథయందు భగవంతునికి మన:పూర్వకంగా సమర్పించు భక్తిభావం మనకుకానవచ్చుచున్నది. భక్తితాను పొంది ఉండుటలోగల గొప్పతనం ఇందు తెలియవచ్చుచున్నది. భక్తునకు కావలసినది భక్తిగాని ఏ ఇతర శాస్త్రార్హతలు కాదు అని ఇందు నిరూపించబడినది. భక్తిభావమనునది ఏ కొద్దిమంది వ్యక్తుల వద్ద దాచి ఉంచబడిన గుప్తధనము కాదు. సృష్టిలో ఉన్న ప్రతిదీకూడా పరమాత్మయందు అనుసంధానం లేనిదే చైతన్యం తెలియరాదు అని ఇందు నిరూపించబడెను. సమాజమునందున్న ప్రతి వ్యక్తీనిరంతర భగవధ్యానతప్తుడై ఉండినచో భగవత్కృపా కటాక్ష వీక్షణమును పొందుట అనునది అంత కష్టముకాదు అని ఈ కథాంశము నిరూపించబడినది.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు