నటన-వాస్తవం - మద్దూరి నరసింహమూర్తి

Natana-Vastavam

నటన పరంగా ‘రానా’ ని తెలియనివారుండరు అంటే అతిశయోక్తి కానే కాదు.

ఆయన అసలు పేరు రాంనారాయణ్. నాటకాల మీద మక్కువెక్కువై చదువుని నిర్లక్ష్యం చేసి నాటకాలు వేసుకొని తిరిగే రాంనారాయణ్ –

తెలుగు చిత్రసీమకి రెండుకళ్ళుగా ప్రసిద్ధి గాంచిన రామారావు నాగేశ్వరరావు గార్లు వేసిన పాత్రలని ఔపోసన పట్టి - రామారావుగారు వేసిన పౌరాణిక పాత్రల నాగేశ్వరరావుగారు వేసిన సాంఘిక పాత్రల ఏకపాత్రాభినయనంతో సంపాదించుకున్న అభిమానులు ఇచ్చిన ముద్దుపేరు ‘రానా’ (రామారావుగారి పేరులో 'రా' నాగేశ్వరరావుగారి పేరులో 'నా' జోడించి).

ఆ ప్రోత్సాహంతో, తానే ఒక నాటకసంఘాన్ని స్థాపించి ఔత్సాహిక కళాకారులను సభ్యులుగా చేరదీసి నాటకాలు వేస్తూ నాటకపరిషత్తు పోటీల్లో పాల్గొంటూ అనేకసార్లు ఉత్తమ నటుడుగా పేరు తెచ్చుకున్నాడు.

"నాటకాలరాయుడు సినిమాలో నాగభూషణం చేసినట్టు అమ్మ చనిపోయిన సన్నివేశం నటించడం చాలా కష్టం" అని కొందరు రానాని ఛాలెంజ్ చేసేరు.

దాంతో, రెండు నాటకాలు తానే వ్రాసుకొని దర్శకత్వం కూడా చేస్తూ నాటకపరిషత్తు పోటీల్లో ఆ రెండు నాటకాలు ప్రదర్శించి - ఒక దాంట్లో అమ్మ చనిపోయే సన్నివేశంలో, మరొక దాంట్లో నాన్న చనిపోయే సన్నివేశంలో అద్భుతంగా నటించి ప్రేక్షకులని కన్నీళ్ళలో ముంచెత్తేడు.

నాటక పోటీలు చూడడానికి ఆవ్హానించబడ్డ తెలుగు చిత్రసీమలో పేరున్న పెద్దాయన, శోకరసం అద్భుతంగా నటించినందుకు రానాని 'నటశేఖర్' అన్న బిరుదుతో సన్మానించి –

"నీలోని నటన నాటకాలకు మాత్రమే పరిమితం చేయక సినిమాల్లోకి వస్తే అచిరకాలంలోనే ట్రాజెడీ కింగ్ గా పెద్ద పేరు తెచ్చుకొని పైకొస్తావు, నువ్వుకానీ అలా రాదలచుకుంటే నన్ను కలు" అని తన విజిటింగ్ కార్డు ఇచ్చేరు. ఆ క్షణంలో రానాకి తనకొచ్చిన బిరుదు కంటే ఆ విజిటింగ్ కార్డు అపురూపంగా అనిపించి జాగ్రత్తగా దాచుకున్నాడు.

“పాతికేళ్ళు దాటుతున్న అబ్బాయిని ఇలాగే గాలికి వదిలేస్తే బాగుపడడు, బాధ్యత తెలియాలంటే పెళ్లి చేయాలి” అంటున్న తల్లితండ్రులతో –

‘పెళ్లి ప్రగతికి అవరోధం కనుక సినీమాల్లో చేరి అక్కడకూడా మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నవరకూ పెళ్లి ప్రస్తావనే వద్దు’ అని కరాఖండీగా చెప్పిన కొడుకుని –

‘అడ్డాల నాడు బిడ్డలు గానీ, గడ్డాల నాడు కాదు’ - అని వదిలేసేరు.

-2-

అలా వదిలేసేముందర ఆఖరిమాటగా "ఒరేయ్, అలాగైతే, నువ్వు పెళ్లి చేసుకొనే సరికి బహుశా మరో ఇరవై లేక పాతిక ఏళ్ళు పట్టొచ్చు, ఆలోచించుకో" అని చెప్పిన తల్లితండ్రులతో –

"నా లక్ష్యం నెరవేరేవరకూ నేనెవరి మాటా వినను, అవసరమైతే బ్రహ్మచారిగా ఉండిపోతాను" అని భీష్ముడిలా ప్రతిజ్ఞ చేసినంత పనిచేసేడు.

"సరే, నీ ఖర్మ" అని రానాని వారి తల్లితండ్రులు మరెప్పుడూ పెళ్లిమాటతో విసిగించక --

“కన్నాం కాబట్టి నీ కడుపుకి ఇంత తిండి పెట్టవలసిన బాధ్యత ఉంది మాకు. కాబట్టి కనీసం వేళపట్టున ఇంత తిని ఏం తిరుగుతావో తిరుగు” అని అప్పటికి వదిలేసేరు.

రానాకి పడుకున్నా మేలుకున్నా సినిమాలు గురించే ఆలోచనలు.

మరి ఆలస్యం చేయకూడదు అనుకున్న రానా, నాటకాలలో వచ్చిన కప్పులు షీల్డ్ లుకి సంబంధించిన ప్రమాణ పత్రాలు ఒక ఫైల్ లా చేసి, కప్పులు షీల్డ్ లు అమ్మితే వచ్చిన డబ్బు ఇంట్లోంచి కొంత డబ్బు తీసుకొని, ‘నాకోసం వెతకొద్దు’ అని ఒక ఉత్తరం పెట్టి, తల్లితండ్రులకు చెప్పకుండా ఒక రోజు ఇల్లు వదిలి సినిమాలలో చేరే ప్రయత్నంలో భాగ్యనగరం చేరుకున్నాడు.

దైవ లీల - ఇంటినుంచి బయలుదేరేటప్పుడు పెద్దాయన ఇచ్చిన విజిటింగ్ కార్డు తెచ్చుకోవడం మరచినట్టు భాగ్యనగరంలో కాలిడిన తరువాత గ్రహించేడు, రానా.

పేరు తెలుసు కాబట్టి ఆయనని ఎలాగేనా కలిస్తే తనకి సహాయం చేస్తారు అన్న గుడ్డి నమ్మకంతో అడుగు ముందుకేసేడు.

ఆ మహానగరంలో ‘మఠం నిద్ర సత్రం తిండి’ అన్నట్టుగా తిరుగుతూ రెండు రోజుల తరువాత పెద్దాయన చిరునామా సంపాదించి వెళ్తే, అక్కడ కాపలా లోనికి వెళ్లనివ్వలేదు. ఆయన బయటకు వెళ్ళేటప్పుడో లోపలి పోయేటప్పుడో కళ్ళబడరా అన్న ఆశతో ఆ ఇంటిగేటు దగ్గరే నాలుగు రోజులు పహారా కాసినా ఫలితం శూన్యం.

ఇలా లాభం లేదు అని - స్టూడియో గేట్లు దగ్గర చక్కర్లు కొడితే - అక్కడా చుక్కెదురే.

రానాలాగే సినీనటనా భాగ్యపరిశోధనలో తిరిగేవారు కొందరు పరిచయమైతే -- జూనియర్ నటులను సరఫరా చేసే మధ్యవర్తులలో ఎవరినేనా పట్టుకొంటే సినిమాల్లో నటించే అవకాశం దొరకవచ్చని సమాచారం అందింది.

నటన చేసే వారికంటే మధ్యవర్తులు పెద్ద నటులు అని వారితో పరిచయమైన తరువాత తెలుసుకున్నాడు, రానా.

ఎప్పుడు ఎలా గడిచేయో ఎనిమిది నెలలు కాలగర్భంలో శూన్యంగా గడిచిపోయేయి. ఒక పూట ఏదో ఇంత తింటే, మరిన్ని పూటలు పస్తుగా గడుస్తున్నాయి.

తల్లితండ్రుల నీడ గొప్పదనం పోగుట్టుకుంటే కానీ తెలిసి రాదు, తర్వాత పశ్చాత్తాపం పడితే లాభం లేదు.

-3-

ఆశ మనిషికి పెద్ద ఆయుధం. తిన్నా మానినా ఎలాగేనా సినీమాల్లో నటించాలి అన్న నిశ్చయంతో తిరిగి తిరిగి - అతి కష్టం మీద నాట్యబృందంలో ఒకడిగా అవకాశం దొరికిన ఒకప్పటి ‘నటశేఖర్’ రానా - సుమారుగా ఆరునెలల కాలం అలాగే స్థిరపడిపోయేడు. గుడ్డిలో మెల్ల ఏమిటంటే, అలా నటించే రోజులలో ఆమాత్రం నటనకు కూడా అభ్యాసం నెపంతో ఏదో కొంత తినడానికి దొరికేది.

దైవ లీల - ఒకరోజు రానా తాపీగా స్టూడియోలోకి వెళ్తుంటే ఎదురుగుండా వస్తున్నాయన్ని చూసి "సర్, నమస్కారం" అన్నాడు ఆశ్చర్యానందాలతో.

"ఎవరు బాబూ నువ్వు"

"ఏడాది కిందట నాటకపరిషత్తు పోటీలలో మీరు నా నటనని మెచ్చుకొని సన్మానించేరు"

"ఏడాది కిందట అంటున్నావు కదా, హఠాత్తుగా గుర్తుకు రావడం లేదు"

"నా పేరు రానా. రాజమండ్రీలో జరిగిన నాటకపరిషత్తు పోటీల్లో ఒక నాటకంలో అమ్మ చనిపోయే సన్నివేశంలో మరొక నాటకంలో నాన్న చనిపోయే సన్నివేశంలో చేసిన నా నటనకు మెచ్చుకొని మీరు 'నటశేఖర్' బిరుదు కూడా ఇచ్చేరు, గుర్తొచ్చేనా సర్"

రెండు నిమిషాల తరువాత - "గుర్తొచ్చింది. నీకు నా విజిటింగ్ కార్డు కూడా ఇచ్చేను కదూ"

"అవును సర్. దురదృష్టం, నేను ఇక్కడకి వస్తూ మీరిచ్చిన ఆ కార్డు ఇంట్లోనే వదలి వచ్చేసేను. ఎంత కష్టం మీద మీ అడ్రస్ సంపాదించి మీ ఇంటికి వచ్చినా మిమ్మల్ని కలుసుకోలేకపోయేను"

"ఏమిటి చేస్తున్నావిప్పుడు"

"నాట్యబృందంలో ఒకడిగా ఉన్నాను, సర్"

"అయ్యో పాపం. నువ్విప్పుడు నాతో రాగలవా"

"మీరొక ఐదు నిమిషాలు టైమిస్తే, లోపలికి వెళ్లి ఈరోజు ప్రాక్టీస్ కి రావడం అవదు అని చెప్పేసి వచ్చేస్తాను, సర్. చెప్పకుండా ఉండిపోతే మరి నన్ను పిలవకపోవొచ్చు"

"అంతే కదా. ముందు నాతో పద నువ్వు" అని –

తన కారులో రానాని ఎక్కించుకొని ఒక పేరుపడిన దర్శకుడి దగ్గరకి తీసుకొనివెళ్ళి --

"ఇగో నాయుడూ, నీతో పని పడిందోయ్"

"ఆ మాత్రంకి మీరు రావాలా సర్, కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా" అని పెద్దాయన కాళ్ళకి నమస్కారం చేసేడు బిజీ దర్శకుడైన నాయుడు.

"ఈ అబ్బాయి పేరు రానా. మంచి నటుడు. నీ చేతిలో ఇప్పుడెన్ని సినిమాలున్నాయి"

"నాలుగున్నయి సర్. అందులో రెండింటికి ఇంకా కాస్టింగ్ నిర్ణయం అవలేదు"

-4-

"నా మాట మీద గురి ఉంది కదా"

"ఎంత మాట సర్"

"అయితే, ఆ రెండు సినిమాల్లో ఇతన్ని హీరోగా తీసుకో. ఇతని చేత అగ్రిమెంట్ సంతకం పెట్టించుకుని కొంత భారీ సొమ్ము అడ్వాన్స్ ఇప్పించి, ఇతను ఊరికి వెళ్లి రావడానికి కొంత సమయం ఇయ్యి"

"తప్పకుండా సర్, ఇప్పుడే ఆడిషన్ చేయిస్తాను."

"అక్కరలేదయ్యా, కిందటి ఏడాది ఈ అబ్బాయి నటనకి మెచ్చుకొని 'నటశేఖర్' అనే బిరుదు నేనే ఇచ్చేను"

"అలాగా సర్, చాలా సంతోషం. మీరు మెచ్చుకున్నారంటే మరి ఇతనికి తిరుగు లేదన్నమాట. ఈ అబ్బాయి గురించి మీరు మరచిపోండి. నేను చూసుకుంటాను. ఇకనుంచి, ఈ అబ్బాయి నా మనిషి"

"సంతోషం మరి నేను వెళ్లి రానా"

"పదండి మీతో గేటు వరకూ వస్తాను"

పెద్దాయన కదిలేలోగా - కళ్ళ వెంట ఆనందభాష్పాలు రాల్చుకుంటూ రానా ఆయన కాళ్ళకి నమస్కారం చేసి "మీ మేలు నా జన్మలో మరచిపోలేను సర్. మీకు నాయుడు గారికి ఏవిధమైన చెడ్డమాట రాకుండా నడుచుకుంటానని నా తల్లితండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను"

"సరే, నాయుడు దగ్గర డబ్బు తీసుకున్న తరువాత ముందుగా వెళ్లి నీ తల్లితండ్రులను కలిసి రా. వాళ్ళని ఎప్పుడూ కష్టపెట్టకు"

ముగ్గురూ కలిసి గేటు వరకూ వచ్చిన తరువాత "రానా ఇక నేను వస్తాను. నాయుడికి మాట రాకుండా అతను చెప్పినట్టు నడచుకొని అభివృద్ధిలోకి రా. నాయుడూ వస్తాను. అబ్బాయిని జాగ్రత్తగా చూసుకో" అని చెప్పి పెద్దాయన వెళ్ళిపోయేరు.

మంచి మనసుతో పెద్దాయన చేసిన సహాయం రానాకీ బాగా కలిసివచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఒక సంవత్సరం తిరిగే సరికి మంచి నటుడుగా పేరు పొంది నిర్మాతలు దర్శకులు అతనిని తమ తమ సినీమాల్లో నటించమని అడిగేందుకు వరస కట్టే స్థితికి ఎదిగేడు.

మధ్య మధ్యలో దర్శకుడు నాయుడికి పరిచయం చేసిన పెద్దాయన దగ్గరకి వెళ్లి ఆయన ఆశీర్వాదం అందుకుంటూ సంస్కారవంతుడు అని కూడా పేరు పొందేడు.

రానా తల్లితండ్రులుని తన దగ్గరకి వచ్చి ఉండమని కోరితే, వారు -

"ఒరే ఇలా అంటున్నామని చిన్నబుచ్చుకోకు. నీ అదృష్టం బాగుండి నటనలో నీ పేరు ఉచ్చ స్థితిలో ఉన్నంత వరకూ అన్నీ బాగానే ఉంటాయి. ఎప్పుడేనా నీదశ మారిందనుకో అక్కడుండి నెట్టుకొని రావడం నీకే కష్టం.

-5-

అలాంటప్పుడు నిన్ను చూసి మేము అసలు భరించలేము. అందుకని, మమ్మల్ని ఇక్కడే ఉండనీ. పెళ్లి చేసుకొని నీతోనే ఉండవలసిన నీభార్య నీతో అక్కడ ఉంటుంది" అని రానాకి పెళ్లి చేసి తగు జాగ్రత్తలు కోడలికి చెప్పి నూతన దంపతులని సంతోషంగా భాగ్యనగరంకి సాగనంపేరు.

నాయుడు దర్శకత్వంలోనే వచ్చిన ఒక సినిమాలో -- తల్లి చనిపోయిన తరువాత విదేశం నుంచి వచ్చిన హీరో ఆఖరి చూపులు కూడా దక్కని తల్లి చావుని తట్టుకోలేక దుఃఖంతో విలపించే -- సన్నివేశంలో నటించవలసి వచ్చింది రానాకు.

నాటకాలు వేసేటప్పుడు అలాంటి సన్నివేశంలోనే నటించి 'నటశేఖర్' అన్న బిరుదు అందుకున్నవాడు కాబట్టి - ఆత్మవిశ్వాసంతో ఆ సన్నివేశంలో రానా చేసిన నటనని ప్రత్యక్షంగా చూసిన నాయుడు "రానా ఈ నటనకి నీకు 'ఉత్తమ నటుడు' బిరుదు లభించడం ఖాయం. నీతో బాటూ నాకు కూడా 'ఉత్తమ దర్శకుడు' బిరుదు వస్తుందేమో అని ఆశగా ఉంది" అని అతన్ని ఆనందంతో కౌగలించుకున్నాడు.

అందరూ ఆ ఆనందాన్ని అనుభవిస్తుంటే - అక్కడకి వచ్చిన రానా కారు డ్రైవర్ రానా దగ్గరకి వచ్చి "సర్, ఇంటినుంచి మాడం గారు ఫోన్ చేసేరు, మీ అమ్మగారు అరగంట క్రిందట గుండెపోటుతో మరణించేరట. మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు"

ఆ వార్త విన్న రానా, నటనాలోకం నుంచి వాస్తవంలోకి వచ్చి -- "ఈ సినిమా వ్యామోహంలో పడి ఎంతో పొరపాటు చేసేను, నాటకాలు వేసుకుంటూ ఇంటి దగ్గరే ఉండి ఉంటే అమ్మ ఆఖరి క్షణాలప్పుడు కనీసం దగ్గరైనా ఉండేవాడిని. " అంటూ అలవికాని దుఃఖంతో రోదించసాగేడు.

వాస్తవంగా దుఃఖిస్తున్న రానాని చూస్తూ –

చుట్టూ ఉన్నవారిలో కొందరు రానాది నిజమైన దుఃఖమా లేక –

'గొప్ప నటుడు' కాబట్టి నటిస్తున్నాడా –

అంటూ గుసగుసలాడుకోసాగేరు.

*****

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు