కన్న వాళ్ళు - VEMPARALA DURGA PRASAD

Kannavaallu

సుభద్ర గారు కాకినాడ లో తమ్ముడు రాఘవ ఇంటికి వచ్చేరు. తమ్ముడి భార్య సుకన్య చాలా కలుపుగోరు మనిషి. వాళ్ళ ఇల్లు 4 portions వుండే పెద్ద ఇల్లు. సుకన్య వాళ్ళ ఎదురు ఇంట్లో శారద వాళ్ళు వుంటారు. ఈ రోజు వాళ్ళ ఇల్లు చాల సందడిగా వుంది. శారద కూతురు అపర్ణ కి పెళ్లి కుదిరిందిట. ఆ రోజు నిశ్చితార్ధం వేడుక . సుకన్యని, రాఘవ ని కూడా నిశ్చితార్ధం వేడుక చూడడానికీ, వాళ్ళ ఇంటికి పిలిచేరు వాళ్ళు. మధ్యాహ్నం భోజనాలు వాళ్ళ ఇంట్లోనే .

పొద్దున్నే వచ్చిన సుభద్ర గారిని, శారద మళ్ళీ వచ్చి పిలిచింది.

పిన్ని గారూ, సమయానికి వచ్చేరు.. మీరు కూడా నిశ్చితార్ధం కార్యక్రం లో పెద్దవారిగా మా తరఫున కూర్చుంటే బావుంటుంది" అంది. కాదన లేక సుభద్ర కూడా సుకన్య తో వెళ్ళింది.

10 గంటలకి పెళ్లి వారు వచ్చేరు. పెళ్లి కొడుకు ని చూసిన సుభద్ర ఆశ్చర్య పోయింది. పెళ్లి కొడుకు తనకి బాగా తెలిసిన అబ్బాయి లా వున్నాడు. అదే మాట సుకన్య తో ముందు అంది.

“అబ్బాయి వాళ్ళది విశాఖపట్నమా? ఈ అబ్బాయి పేరు అజయ్ కదా.. మా పక్క వీధి లో వుండే శంకరం మాస్టారి అబ్బాయి లా వున్నాడు”. అంది.

“కాదు అతని పేరు అభయ్ దేశముఖ్. వాళ్ళు హిందీ వాళ్ళు. ఇది ఇది లవ్ మ్యారేజ్ వదిన గారు. అపర్ణ, ఆ అబ్బాయి ఒకే కంపెనీ లో పని చేస్తారు… శారద, ఆమె భర్త రాజశేఖర్ ఒక్కగా నొక్క కూతురు అని, ఆ అమ్మాయి ఎవరిని కోరుకుంటే వాడినే ఇచ్చి చేస్తామని ఆ అమ్మాయికి స్వేచ్ఛ ఇచ్చేరు ”. అంది.

సుకన్య అన్నట్లే, ఆ అబ్బాయి కొద్దిగా వచ్చీ రాని తెలుగు లో మాట్లాడుతుంటే..పాపం అతని అమ్మ, నాన్న హిందీ లో మాత్రమే మాట్లాడుతున్నారు. వాళ్లకి తెలుగు రాదు. అతనికి తెలుగు అర్ధం అవుతోంది.

సుభద్ర గారు నమ్మలేనట్లు చూసింది. ప్రపంచం లో మనిషిని పోలిన మనుషులు 7 గురు వుంటారు అంటే ఇదే కాబోలు అనుకుంది. నిశ్చితార్ధం కార్యక్రమం మన సాంప్రదాయం ప్రకారమే చేసేరు. తర్వాత భోజనాలు అయ్యేయి. అందరూ సరదాగా గడిపేరు.

పెళ్లి కొడుకు చాలా మర్యాదస్తుడు. పెద్దలు అంటే గౌరవం. వాళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. పెళ్లి కొడుకు సుభద్ర గారికి కూడా కాళ్ళకి నమస్కారం పెట్టేడు.

ఇంక ఆపుకో లేక పోయింది సుభద్ర.

“ ఏమీ అనుకోక పొతే, ఒక మాట చెపుతాను..నిన్ను చూస్తూంటే..మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి అజయ్ లా వున్నావు. మేము వైజాగ్ లో ఉంటాము..". అంది.

అతని మొహం వెలిగి పోయింది. ఆశ్చర్యం, ఆనందం కలగలిసిన చూపుతో సుభద్ర గారి వైపు తిరిగేడు. తప్పిపోయిన పిల్లవాడికి అమ్మ కనపడినప్పుడు వుండే ఆనందం అతని మోహంలో కనిపిస్తోంది. ఎడారిలో నీటి చెలమ దొరికినంత సంతోషంగా వుంది అతని పరిస్థితి.

" ఆంటీ.. యెంత మంచి వార్త చెప్పేరు. నేను 20 సంవత్సరాలుగా వెతుకుతున్నాను.

వీళ్ళు నా స్వంత అమ్మ, నాన్న లు కారు. నన్ను పెంచుకున్నారు. నా మూలాలు తెలుగు నేల మీద వున్నాయి అని తెలుసు కానీ..ఎక్కడో తెలియదు.

మీకు నా కథ వివరంగా మా డాడీ చెపుతారు.. అని ఆసక్తి గా వాళ్ళ అమ్మ, నాన్న ల వైపు తిరిగి, “ఆవిడకి తనలాంటి పిల్లవాడు తెలుసు అని అంటున్నారు..నేను ఎక్కడినుండి వచ్చి ఉంటానో ఆవిడకి తెలియచ్చు, డాడీ, ఆవిడకి నా వివరాలు చెప్పండి..” అని వాళ్ళ డాడీ వైపు చూసేడు.

అతని తల్లి వైదేహి మరియు నాన్న అంకిత్ దేశముఖ్ లు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు.

అప్పుడు అంకిత్ దేశముఖ్ ముందుకు వచ్చి, సుభద్రమ్మ గారి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాక, అభయ్ కథ వివరంగా చెపుతాను వినండి ” అన్నాడు.

నవ్వుతూ అభయ్ కూడా కుర్చీ లో కూర్చున్నాడు. అపర్ణ నిర్ఘాంతపోయి చూస్తోంది .

ఆ హాల్ లో నిశ్శబ్దం ఆవరించింది. అందరూ చెవులు రిక్కించి వింటున్నారు. అందరికీ అదొక వింత అనుభవం…నమ్మలేనట్లు వుంది.

ఆయన మాటల్లో ఇలా వివరించాడు :

“ 22 సంవత్సరాల కి పూర్వం మాకు అభయ్ నాగపూర్ లో చైల్డ్ కేర్ ఆశ్రమం లో దొరికేడు . పిల్లలు లేని మేము ఒక పిల్లవాడిని దత్తత తీసుకోవాలని ఉబలాట పడ్డాము. ఆ ఆశ్రమాన్ని సంప్రదిస్తే..ఈ పిల్లవాడిని అప్పగించేరు. మాకు అబ్బాయి వివరాలు వాళ్ళు చెప్పలేదు. అది నిబంధన. మేము అభయ్ కి తాను మా దగ్గరకు ఎలా వచ్చిందీ దాచకుండా చెప్పేము. పెద్దవాడు అవుతున్న కొద్దీ, అతను తన మూలాలు వెతుక్కోవడం మొదలు పెట్టేడు. ఎలాగో ఆ ఆశ్రమం లో వాడి వివరాలు కొన్ని మాత్రం సంపాదించగలిగేడు.

ఆ ఆశ్రమం లో తెలిసిన విషయాల ప్రకారం, ఇతన్ని నాగపూర్ RPF ఇన్స్పెక్టర్ తీసుకుని వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేసి చేర్చినట్లు వాళ్ళు చెప్పేరు. 3 సంవత్సరాల వయసులో TRAIN లో ఆ ఇన్స్పెక్టర్ కి దొరికేడుట. TRAIN లో ఒక ముఠా సభ్యుడు అనుమానాస్పదం గా తిరుగు తూ ఉంటే, పట్టుకో బోయినప్పుడు, వాడు TRAIN నుండి దూకి పారిపోయేడుట. TRAIN నాగపూర్ లో ఆగినప్పుడు.. ఒక LOWER బెర్త్ కింద మత్తు గా పడి వున్న ఈ పిల్ల వాడు దొరికేడుట. వివరాలు చెప్పలేక పోతున్నాడు… “అమ్మ " అన్న మాట తప్ప ఏమీ చెప్పలేకపోతున్నాడుట.

ఈ ముఠా సభ్యులు చిన్న పిల్లల్ని ఎత్తుకుని వచ్చేసి, train లో ప్రయాణించి మత్తు మందు ఇచ్చి వాళ్ళు ఏడవ కుండా చూసుకుని, మహారాష్ట్ర తీసుకుని వచ్చి, అమ్మేస్తూ వుంటారు.

మహారాష్ట్ర లో పిల్లల్ని రక రకాలుగా వాడుకుంటూ వుంటారు. ఈ పిల్ల వాడు అదృష్ట వశాత్తూ, ఆ ఇన్స్పెక్టర్ కంట పడడం తో, చైల్డ్ కేర్ ఆశ్రమం లో చేర్చ బడ్డాడు. మాకు నచ్చి ఈ పిల్ల వాడిని తెచ్చుకోవడం జరిగింది.

చిన్నప్పుడు జ్ఞాపకాలు అప్పుడప్పుడు మా అభయ్ కి గుర్తుకు వస్తూ ఉంటాయి. పెద్దవాడు అయ్యేక, చాలా సార్లు ఆంధ్ర ప్రదేశ్ వైపు వచ్చేడు కానీ... అతను ఏ నగరానికి చెందిన వాడో అతనికి తెలియదు.

యాదృచ్చికంగా...అతనికి తెలుగు అమ్మాయి నచ్చింది.

మేము కూడా అభయ్ ని మా కన్నకొడుకులా చూసుకుని బతుకుతున్నాం. అతని ఇష్టం కాదనలేము. అందుకే అతను కోరు కున్న అమ్మాయి తో పెళ్లి జరిపించాలి అని అనుకున్నాం.

చిన్నప్పటి నుండీ, అతను తనని కన్న వాళ్ళని కలుసు కోవాలని తహ తహ లాడుతున్నాడు. తెలుగు సంబంధం చేసుకుంటే..ఎప్పటికయినా అతని ఆశ నెరవేరచ్చు అని మేము కూడా అనుకున్నాము ” అన్నాడు అతను హిందీ భాష లో. తర్జుమా చేసి చెప్పింది సుకన్య సుభద్ర గారికి .

సుభద్ర గారి ఉత్సాహం రెట్టింపు అయ్యింది. మరో 10 నిముషాల్లో శంకరం మాస్టారి ఇంటికి ఫోన్ చేసింది.

శంకరం మాస్టారి భార్య మీనాక్షి ఫోన్ తీసింది.

" మీనాక్షీ..నీ కొడుకు లాంటి మరో అబ్బాయి ని ఇక్కడ చూసేను..అచ్చు మీ అజయ్ లాగే వున్నాడు.." అంది సుభద్ర .

" మీనాక్షి దిగ్భ్రాంతికి లోనయ్యింది. వీడియో కాల్ లో అభయ్ ని చూసేసరికి ఆమె నమ్మలేక పోయింది. మీనాక్షి కి అభయ్ వాళ్ళ నాన్న చెప్పిన విషయాలు వివరంగా చెప్పింది సుభద్ర గారు.

ఆమెకి రూఢి అయిపోయింది...ఆ అభయ్ అనబడే అబ్బాయి ఎవరో కాదు.. తన కొడుకు విజయ్.

మీనాక్షి కంట్లో నీళ్లు.. ఆమె ఇలా అంటోంది:

"అజయ్, విజయ్ లు కవల పిల్లలు పిన్ని గారు. 22 సంవత్సరాల కి పూర్వం ఒక సారి స్టేషన్ దగ్గర సర్కస్ చూపిద్దామని నేను, ఆయన పిల్లలని తీసుకుని వెళ్ళేము. టిక్కట్ల లైను లో ఆయన నుంచున్నారు. చీకటి పడింది. ఓ పక్కగా పిల్లలని పెట్టుకుని నేను నించున్నాను.. ఇంతలో కరెంట్ పోయింది. 10 నిముషాలు చీకటి.. మళ్ళీ కరెంట్ వచ్చేసరికి, విజయ్ కనపడ లేదు.

ఇంతలో టిక్కట్లు తీసుకుని వచ్చేరు ఆయన. పిల్లవాడు కనపడక పోవడం తో మాకు పిచ్చెక్కినట్లు అయి పోయింది. అక్కడ అంతా వెతికేము. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చేము. వాడి కోసం కొన్ని సంవత్సరాలు ఏడ్చేము.

మాకు దొరకక పోయినా, ఎక్కడ వున్నా వాడు బావుంటే చాలని వెయ్యి దేముళ్ళకి మొక్కుకున్నాము. వాడు ఇక దొరకడని నిరాశ ఏర్పడి, గత 5 సంవత్సరాల నుండీ మాకు ఇంకో కొడుకు ఉండేవాడని చెప్పడం కూడా మానేసేం. ఇన్నాళ్ళకి నా బిడ్డ నా కంట పడుతున్నాడు..” అని అంది మీనాక్షి ఉద్వేగంగా.

ఆ రోజుకి అభయ్ వాళ్ళు కాకినాడ లో ఉండి పోయేరు. మీనాక్షి, శంకరం గారు చీకటి పడ్డాక కాకినాడ చేరుకున్నారు.

22 ఏళ్ళకి పూర్వం తప్పిపోయిన కొడుకుని కలుసుకున్నారు శంకరం మాస్టారి దంపతులు. వాళ్ళ ఆనందం వర్ణనాతీతం.

అభయ్ తనను కన్న వాళ్ళని ఇన్ని సంవత్సరాలకి కలుసుకోవడం కలలో లా వుంది. ఇరువురి కుటుంబాలలో సంతోషాలు వెల్లి విరిశాయి. సుభద్ర గారికి మరీ మరీ థాంక్స్ చెప్పుకున్నాడు.

మళ్ళీ నెలలో, అభయ్ అనబడే విజయ్ పెళ్లి ఘనంగా జరిగింది. కన్న వాళ్ళు, పెంచిన వాళ్ళు మాత్రమే కాక విజయ్ ని మళ్ళీ ఆ కుటుంబానికి దగ్గర చేసిన సుభద్ర గారు కూడా ఇప్పుడు ఆ కుటుంబ సభ్యురాలు అయి పోయారు.

-సమాప్తం-

మరిన్ని కథలు

REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ
Perugu diddina kapuram
పెరుగు దిద్దిన కాపురం
- జి.ఆర్.భాస్కర బాబు
Margadarshakudu
మార్గదర్శకుడు
- చెన్నూరిసుదర్శన్