తాతయ్య కథ పూర్తి చేస్తూ “మనం కోడిపుంజు నుండి నాలుగు పాఠాలు నేర్చుకోవాలర్రా!” అన్నాడు.
“అవేమిటో చెప్పు తాతయ్యా!” ఆసక్తిగా అడిగాడు కిరణ్.
“సరే వినండి. తొందరగా లేవడం, ఆత్మ రక్షణకు, పోరాటానికి సిద్ధంగా ఉండడం, ప్రక్క వారికి ఉదారంగా పంచడం, ఎవరి అవసరాలకు వాళ్ళే సంపాదించుకోవడం. ఇలాంటి గొప్ప లక్షణాలు కోడిలో ఉన్నాయి” తాతయ్య చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నాడు కిరణ్.
“వింటున్నారా? నిద్ర వస్తోందా?” అడిగాడు తాతయ్య గడియారం చూస్తూ. రాత్రి పదయ్యింది. తనకు నిద్ర వస్తున్న విషయం చెప్పింది మల్లిక. చెల్లి పరిస్థితి చూసిన కిరణ్ “రేపు చెబుదువు గానీ ఇంక ఆపెయ్యి తాతయ్యా...” అన్నాడు.
“సరే.. ఇక పడుకోండి” అని అనగానే తాతయ్య పడుకునే మంచం ఎక్కారు కిరణ్, మల్లిక.
పట్టణంలో ఉద్యోగం చేసే పెద్ద కొడుకు పిల్లలు వారు. మల్లిక , కిరణ్. వారి కుటుంబం గ్రామదేవత పండుగకు తాతయ్య గారి ఊరు వచ్చారు.
కిరణ్ ఆరవ తరగతి, మల్లిక నాలుగవ తరగతి చదువుతున్నారు.
అక్కడికి వచ్చింది మొదలు పగలంతా పల్లె మొత్తం తిరిగి రావడం, రాత్రయితే తాత ఒడిలో పడుకుని మీసాలు లాగుతూ కథలు చెప్పించుకోవడం పిల్లలకు నచ్చింది. తాతయ్య చెప్పే కథలు, కబుర్లు నచ్చడంతో ఆయనను వదలడం లేదు ఇద్దరూ .
“మన కోడిపుంజుని రేపు వదలకండి. ఉదయం అమ్మవారికి మొక్కులు చూపించి బలి ఇవ్వాలి” అని తాతయ్యతో నానమ్మచెప్పిన మాటలు కిరణ్ చెవిలో పడ్డాయి.
“అలాగే లేవే. మంగయ్యని కూడా కోడి కూర చేయడానికి పిలుస్తాను” అన్నాడు తాతయ్య. ఆ మాటలూ కిరణ్ విన్నాడు.
“బలంగా, పుష్టిగా పెరిగిన కోడిపుంజుని బలి ఇస్తారా?”అనుకున్నాడు మనసులో. అంతలో నిద్ర ముంచుకు రాగా మత్తుగా వాలిపోయాడు మంచం మీద.
* **
కోడిపుంజు పరుగెడుతోంది. కోడి వెనుకే యజమాని కర్ర పట్టుకుని పరిగెడుతున్నాడు.
“ఎందుకు పరిగెడుతున్నావు?” అని అడిగింది ఎదురుగా వస్తున్న మరో కోడి.
“అమ్మ వారికి బలి ఇస్తారన్న భయంతో పరిగెడుతున్నాను” అంది కోడి పుంజు.
“నా పరిస్థితి కూడా అంతే. ఇద్దరం అడవిలోకి పారిపోయి ప్రాణం నిలుపుకుందాం” అంది రెండో కోడి.
రెండూ కలసి అడవివైపు పరిగెత్తాయి. అడవిలో బాతు, నెమలి, జింక, చిలుక, కుందేలు,పావురం ఎదురయి “ఎందుకంత ఆయాసంతో పరుగెత్తుతున్నారు?” అని అడిగాయి.
“మానవులు మమ్మల్ని దేవతకు బలి ఇస్తున్నారు. ప్రాణ భయంతో వచ్చాము” అన్నాయి రెండూ ఒకేసారి.
“అడవిలో మాత్రం రక్షణ ఉందా? ఇక్కడా పెద్ద జంతువులు తినేస్తాయి” అన్నాయి బాధగా అడవి జీవులు.
‘మన బ్రతుకులకు రక్షణ లేదు. పరిష్కారం ఆలోచించాలి’ అన్నాయి అప్పుడే అక్కడకి వచ్చిన పంది, జింక.
‘మానవుల మీద, పెద్ద జంతువుల మీద తిరుగుబాటు చేద్దామా?’ అంది కుందేలు. “ఫలితం ఉండదు” చెప్పింది జింక. ‘అది అంత సులువు కాదు’ అన్నాయి మిగతా జీవులు.
వయసులో పెద్దదయిన ఒక పొట్టేలు “మనల్ని కాపాడడానికి ఆ దేవుడే దిగి రావాలేమో!” అంది.
అది విన్న కోడిపుంజు “అయితే నేను దేవుడి కోసం తపస్సు చేసి రప్పిస్తాను” అంది. పక్షులు, జంతువులు కోడిపుంజు మాటలకు ఆశ్చర్యపోయాయి. కానీ ‘అలా జరిగితే మనకూ మంచిదే కదా” అనుకుని కోడిపుంజుని తపస్సుకి వెళ్ళమని ప్రోత్సహించాయి.
జన సంచారం లేని చోటు వెతుక్కుని తపస్సుకి కూర్చుంది కోడిపుంజు. అలా చాలా రోజులు గడిచాయి. కొన్నాళ్ల తరువాత దేవుడు ప్రత్యక్షమై కోడిపుంజు కోరికేమిటో చెప్పమని అడిగాడు.
“మానవులు మమ్మల్ని బలి ఇచ్చి ప్రాణం తీస్తున్నారు. మా మాంసం వండుకుని తింటున్నారు. అది ఆపించాలి దేవుడా!” అంది కోడిపుంజు.
“అందు కోసం తపస్సు చేసావా? నీ జన్మకి కారణమే అది” చెప్పాడు దేవుడు. “ మా జాతి ఇలా బలి కావడం అన్యాయం “ అని అరిచింది కోడిపుంజు.
“అది సృష్టి ధర్మం. పుట్టినవారు ఎవరైనా చనిపోవాల్సిందే. కాబట్టి నీ కోరిక తీర్చడం నా వల్ల కాదు” అన్నాడు దేవుడు.
కోడిపుంజు కి దేవుడి మాటలు నచ్చలేదు. “మా జాతి పట్ల మీకున్న అభిప్రాయం నచ్చలేదు స్వామీ. ఇంతవరకు జరిగినదేదో జరిగిపోయింది. ఇకనైనా ఆపకపోతే మీ లోకంపై మా కోళ్ళన్నీ దండయాత్ర చేస్తాయి” అని ఎదిరించి మాట్లాడింది.
దాంతో దేవుడికి బాగా కోపం వచ్చింది. “ఇక్కడ నుండి వెళ్ళక పోతే నిన్ను మరెవరో బలి ఇవ్వడం కాదు. నేనే చంపేస్తానేమో” అన్నాడు కోపంగా ముందుకు అడుగులు వేస్తూ .
దేవుడి ముందుకు వస్తూ కోడిని పట్టుకోబోయే సరికి కోడిపుంజు భయపడింది. దేవుడికి దొరక్కుండా ముందుకు పరుగు పెట్టింది. దాని వెనుకే దేవుడు పరుగెడుతున్నాడు.
“చంపొద్దు... చంపొద్దు...చంపొద్దు” అని వేడుకుంటోంది కోడిపుంజు.
* * *
“చంపొద్దు. చంపొద్దు” నిద్రలో గట్టిగా కలవరించాడు కిరణ్.
గాఢనిద్రలో ఉన్న తాతయ్యకు కిరణ్ అరుపులతో మెలకువ వచ్చింది. “ఏమయిందిరా ?” కిరణ్ ని తట్టిలేపుతూ అడిగాడు తాతయ్య.
గాఢనిద్రలో ఉన్న కిరణ్ కలవరింతలు ఆపి కళ్ళు తెరిచాడు. తనకు వచ్చిన కల గురించి తాతకి చెప్పాడు.
“నా కలలో కూడా ఒక కోడిపుంజు ప్రాణభయంతో పరిగెడుతోంది. మన ఇంట్లోని కోడిపుంజు పరిస్థితీ అంతేనా? పాపం కదా తాతయ్యా! మనకి ఆ కోడిపుంజు ఏమి నష్టం చేసింది?” అని బాధగా అడిగాడు కిరణ్.
కిరణ్ మాటలకు చలించిపోయాడు తాతయ్య. కాసేపు ఆలోచనలో పడ్డాడు.
“మన పెద్దలు పెట్టిన ఆచారం జంతుబలి. ఆ దురాచారం కారణంగా ఎన్నో జీవులు విలవిలలాడుతూ ప్రాణం వదులుతున్నాయి. నీ చిన్ని మనసుకి వచ్చిన ఆలోచన పెద్దవాళ్ళకి రాలేదు. ఏది ఏమయినా మనం రేపు కోడిపుంజుని బలి ఇవ్వడం లేదు. దాని బదులుగా కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లిద్దాము” అన్నాడు తాతయ్య.
అది వినగానే కిరణ్ కళ్ళలో మెరుపులు మెరిసాయి. సంతోషంగా తాతయ్యను కౌగిలించుకుని ముద్దులు పెడుతూ “ మా మంచి తాతయ్య” అన్నాడు కిరణ్.
------*****------