బహుమతి - నారంశెట్టి   ఉమామహేశ్వరరావు

Bahumathi

తొమ్మిదవ తరగతిలో సైన్సు మాష్టారు పాఠం చెబుతుంటే విద్యార్ధులంతా శ్రద్ధగా వింటున్నారు. పావుగంటలో బెల్ మొగుతుందనగా నోటీసు రిజిస్టర్ తీసుకుని అటెండర్ వచ్చాడు. అటెండరుని పంపించేసి పిల్లల వైపు మాష్టారు చూసేసరికి వెనుక బల్ల మీద కూర్చున్న రాము, గోపి మాట్లాడుకోవడం కనబడింది.

“పిల్లలూ! వింటున్నారా?” అని ఒకసారి అందరికీ వినబడేలా అడిగారు మాష్టారు. రాము, గోపి తప్ప మిగతావాళ్లు అవునన్నట్టు చేతులెత్తారు.

వాళ్ళు తన మాటలు వినకుండా ఇంకేదో మాట్లాడుతున్నారని అనుకున్నారు మాష్టారు. అంత ముఖ్యమైన విషయమేమిటో తేల్చుకోవాలని చప్పుడు చేయకుండా వారి ప్రక్కకు వెళ్ళి నిల్చున్నారు మాష్టారు.

సరిగ్గా అప్పుడే “మోహన్ ఇచ్చిన బహుమతి మాత్రం మా ఇంట్లో నచ్చలేదు” అన్నాడు రాము.

“అదేమిటి? ఎవరూ ఇవ్వనంత విలువైన బహుమతి ఇస్తానని నాతో చెప్పినప్పుడు, ఇంట్లో పెద్దలను అడిగి బహుమతి కొని ఇచ్చాడనుకున్నా” బదులిచ్చాడు గోపి.

“మా కొత్త ఇల్లు గృహ ప్రవేశానికి రాకపోవడం వలన నీకు తెలియదు. ఆ విషయం మాట్లాడాలంటే సిగ్గుగా వుంది” అన్నాడు రాము బాధగా.

వారి మాటల్లో మోహన్ ప్రసక్తి రావడంతో ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అని భావించిన మాష్టారు అప్పుడు వారిని పిలిచారు. దేని గురించి వాళ్లిద్దరూ మాట్లాడుతున్నారో చెప్పమని అడిగారు.

మోహన్ తెలివైన విద్యార్ధి కావడంతో తప్పు చేయడన్న నమ్మకం మాష్టారుకి ఉంది.

“వాళ్ళ గృహ ప్రవేశానికి మొన్న స్నేహితుల్ని ఆహ్వానించాడు రాము. నేను వెళ్ళలేదు. మోహన్ ఇచ్చిన బహుమతి బాగాలేదని చెబుతుండగా మీరు వచ్చారు”అన్నాడు గోపి.

“అలాగా .. మరి మిగతా పిల్లలు ఏయే బహుమతులిచ్చారు?” అడిగారు మాష్టారు.

“వాళ్లంతా ఇంట్లోకి పనికొచ్చే వస్తువులు ఇచ్చారు ”చెప్పాడు రాము.

మోహన్ ఇచ్చిన బహుమతి ఏమిటో చెప్పమని అడిగారు మాష్టారు .

“మామిడి మొక్క” అనేసి నవ్వాడు రాము.

రాము మాటలు విన్న తరగతి పిల్లలందరూ ఫక్కున నవ్వారు. మోహన్ వైపు చూసారు మాష్టారు.

అవమానం జరిగినట్టు తల దించుకున్నాడు మోహన్. అప్పటికీ నవ్వుతున్న పిల్లల్ని మందలించి “మొక్క ఇవ్వడం మంచి బహుమతి కాదని ఎలా చెప్పగలరు” అని అడిగారు మాష్టారు.

“మొక్క నాటడానికి స్థలం కావాలి. రోజూ నీరు పోయాలి. మొక్క పెరిగి చెట్టయితే రోజూ ఆకులు రాలుతాయి. వూడ్చడం శ్రమ, శుభ్రపరచడం కష్టం. మొక్క బదులు ఏదైనా మరొక వస్తువు అయితే బాగుండేది”. చెప్పాడు రాము.

“మొక్కల గురించి నీకు తెలిసింది అంతేనా?” అని అడిగారు మాష్టారు.

“ఇంకేముంది? మొక్కను పెంచి పెద్ద చేయడం చాలా కష్టం” మళ్ళీ చెప్పాడు రాము.

విద్యార్ధుల వైపు చూసి “రాము చెప్పింది నిజమేనా?” అని అడిగారు మాష్టారు. అవునన్నట్టు తలూపారు పిల్లలు.

మోహన్ ని నిల్చోమని చెప్పి “విలువైన బహుమతి ఇస్తానని చెప్పి మొక్కను ఇవ్వడంలో నీ ఉద్దేశమేమిటి?” అని అడిగారు మాష్టారు.

“మిగతా వారిచ్చిన బహుమతులు కొన్నాళ్ళకు పాడవుతాయి. మొక్క విషయంలో అలా జరగదు కదా సార్ ” చెప్పాడు మోహన్.

అయితే అదేమిటో మరింత వివరంగా చెప్పమని మాష్టారు అడగడంతో మోహన్ చెప్పడం ప్రారంభించాడు.

“మొక్క ఎదిగి చెట్టుగా మారితే ఎన్నో లాభాలున్నాయి. మనుషులు విడిచిన కార్బన్ డయాక్సైడును తీసుకుంటూ అందుకు బదులుగా ఆక్సిజను ఇస్తుంది. ప్రాణ వాయువు ధారపోసే గొప్పదనం చెట్టుకుంది. చుట్టూ కొమ్మలు, ఆకులు విస్తరించడం వలన నీడను ఇస్తుంది. చల్లదనం కోసం జనం చెట్ల క్రిందకు వెళ్లి సేద తీరుతారు. అందుకే చెట్లని పెంచాలి. నేను ఇచ్చిన మామిడి మొక్క పెద్దగా మారి చెట్టు అయితే చాలా లాభాలున్నాయి. “ చెప్పాడు .

“ అయితే అవేమిటో కూడ చెప్పు” మాష్టారు మధ్యలో అడిగారు.

“ఆ చెట్టు వలన వచ్చే మామిడి కాయల్ని ఆవకాయగా చేయొచ్చు. అనేక రకాల ఆహారపదార్ధాలలో వాడవచ్చు. కాయలను మగ్గ బెడితే పండ్లవుతాయి. ఒక చెట్టు జీవితకాలంలో ఇచ్చే పండ్లకు వెల నిర్ణయిస్తే ఎన్నో వేల రూపాయలు అవుతుంది. ఇంట్లో చెట్టుకి కాసిన పండ్లను తినడమే కాకుండా బంధువులకు పంపవచ్చు. చెట్టు కొమ్మలు, కాండము కలపగా వాడొచ్చు. ఎండిన కొమ్మలు, ఆకులు వంట చెరుకుగా వాడొచ్చు. ఇన్ని లాభాలున్నాయి. అందుకే ఇచ్చాను. నా మాటలు వింటే రాము ఉద్దేశం మారుతుందేమో ” అని చెప్పాడు మోహన్.

“అంతేనా? అది మామూలు జనాలకు కూడ తెలిసిన విషయాలే కదా. మొక్కల గురించి సైన్సులో ఉన్నది కూడా చెప్పు” అని ప్రోత్సహించారు మాష్టారు.

“మొక్కలు నరకడం వలన అడవులు తగ్గిపోయాయి. వర్షాలు సకాలంలో కురవడం లేదు. కాలుష్యం పెరిగి ఓజోన్ పొరకు రంధ్రం పడడం వలన భూతాపం పెరిగి తట్టుకోలేనంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొక్కలు బహుమతిగా ఇచ్చి నాటించడం వలన సమాజానికి ప్రయోజనం ఉంది. పౌరులందరూ ఆ దిశగా అడుగేస్తే పచ్చని ప్రకృతి మన సొంతం అవుతుంది. వాహనాలు పెరగడం వలన కలిగిన వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం తగ్గుతాయి. ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది” చెప్పాడు మోహన్.

“శభాష్. చక్కని వివరణ ఇచ్చి నా విద్యార్ధి అనిపించుకున్నావు” అని చప్పట్లు కొట్టారు మాష్టారు.

అంతే!. పిల్లల చప్పట్లతో క్లాసు మారు మోగింది.

రాము వైపు చూసి “ఇప్పుడు చెప్పు. మోహన్ ఇచ్చిన బహుమతి మంచిదేనా” అని అడిగారు మాష్టారు.

“మోహన్ ఇచ్చిన బహుమతి చాలా విలువైనదని తెలుసుకోలేకపోయాను. చాలా తప్పుగా ప్రవర్తించాను” ఒప్పుకున్నాడు రాము.

మాష్టారు “పిల్లలూ మీరు తెలివిగా ప్రవర్తించండి. ఎవరికైనా బహుమతి ఇవ్వాల్సి వస్తే పుస్తకమైనా ఇవ్వండి. లేదా మొక్కలన్నా ఇవ్వండి” అన్నారు. ‘

“అలాగే మాష్టారూ। “ అన్నారు పిల్లలు ముక్త కంఠంతో. అంతలో క్లాసు బెల్ టంగ్ మని మ్రోగింది

.***

మరిన్ని కథలు

REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ
Perugu diddina kapuram
పెరుగు దిద్దిన కాపురం
- జి.ఆర్.భాస్కర బాబు
Margadarshakudu
మార్గదర్శకుడు
- చెన్నూరిసుదర్శన్