శ్రీ దత్తాత్రేయ జననం
పూర్వకాలంలో ఒకప్పుడు ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. పూర్వజన్మలో చేసిన పాపఫలితంగా అతనికి కుష్టురోగం వచ్చింది. ఆ బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ దుర్మార్గపు ఆలోచనలతో ఉండేవాడు. భార్యను తిడుతూ మాటలతో హింసించేవాడు. అతని భార్య సుమతి గుణవంతురాలు. ఆమె అతడిపై ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా, ఎంతో ప్రేమతో, విసుగు లేకుండా అన్ని సపర్యలు చేస్తూ ఉండేది. భర్తను దైవంగా భావించి పూజించేది.
కౌశికుడు ఒకనాడు తన గది కిటికీ నుండి రాజమార్గంలో వెళ్తున్న ఒక అందమైన వేశ్యను చూసాడు. భార్యను పిలిచి “నేను బయట వెళ్తున్న ఒక వేశ్యను చూసాను. నాకు ఆమె మీద మనసు కలిగింది. ఈ రాత్రికి నన్ను ఆమె వద్దకు తీసుకొని వెళ్ళు. లేకపోతే నేను జీవించను” అని ఆమెను ఆజ్ఞాపించాడు. రాత్రి అయ్యింది. వేశ్యకు ఈయడానికి ధనం మూటకట్టుకొని, తన భర్తను భుజాలమీద ఎక్కించుకొని బ్రాహ్మణుడి భార్య సుమతి వేశ్యవాటికకు బయలుదేరింది. ఆ రాత్రి ఆకాశంలో గాఢమైన మబ్బులు కమ్ముకున్నాయి. నాలుగు పక్కలా చీకటి అలుముకుంది. వర్షం కూడా మొదలైంది. అయినా ఆమె నిలకడగా నడిచి వెళ్తూనే ఉంది.
మాండవ్యుడు అనే మహర్షి తపోనిష్టలో ఉండగా, కొందరు దొంగలు రాజుగారి ఖజానాలో దొంగతనం చేసి ఆ సొమ్మును మహర్షి ఆశ్రమంలో దాచారు. రాజుగారు ఆ మహర్షికి కూడా దొంగతనంలో పాత్ర ఉందని తలచి మునిని శూలంపై గుచ్చి వేలాడదీసాడు. కర్మవశాత్తు భార్య భజంపై కూర్చొని వస్తున్న కౌశికుడి కాళ్ళు శూలం మీద నున్న మాండవ్య మహర్షికి తగిలాయి.
ఆ కదలిక వలన వచ్చిన బాధను ఓర్చుకోలేక మహర్షి “నాకు ఈ బాధను కలిగించినవాడు తెల్లవారేసరికి ప్రాణాలు విడిచుగాక” అని శపించాడు. కౌశికుడి భార్య వెంటనే “నేను గనుక పతివ్రత నయితే రేపు సూర్యుడు ఉదయించకుండు గాక” అని శపించింది. దానితో మరునాడు సూర్యోదయం కాలేదు. యజ్ఞయాగాదులు ఆగిపోయాయి. దేవతలకు హవిస్సులు అందలేదు. వారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమ బాధని చెప్పుకొని ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్థించారు.
బ్రహ్మదేవుడు “దేవతలారా, మీరందరూ అత్రిమహాముని భార్య అనసూయాదేవి దగ్గరకు వెళ్లండి. ఆమె మహా పతివ్రత. కర్దమ ప్రజాపతి, దేవహూతిల పుత్రిక. స్వాయంభువ మనువు మనుమరాలు. ఆమె పతిసేవకు మెచ్చిన అత్రిమహర్షి ఆమెకు అష్టాక్షరీ మంత్రోపదేశం చేశాడు. దాని ఉపాసనతో ఆమె యోగస్థితిని, పూజ్యనీయమైన మహోన్నత స్థానాన్ని పొందింది. ఆమె మాత్రమే మీ బాధలను పోగొట్టగలదు” అని చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారం దేవతలు వెళ్ళి తమ బాధలు చెప్పుకున్నారు. అనసూయ వారికి అభయమిచ్చి “దేవతలారా, మహాపతివ్రతల శాపాలకు తిరుగుండదు. అయినా సరే నేను వెళ్ళి కౌశికుడు భార్య సుమతికి నచ్చజెప్పి , ఆమె భర్త మరణించకుండా చేసి తిరిగి సూర్యోదయం అయ్యేలా చేస్తాను” అని వారికి చెప్పింది. ఆ మాటలకు దేవతలు సంతోషంతో తిరిగి వెళ్లారు.
అనసూయాదేవి కౌశికుడి ఇంటికి వెళ్లింది. సుమతిని కుశలప్రశ్నలు వేసి సముదాయించింది. ఆమెకు మానవుడు ఆచరించాల్సిన ధర్మాలు, సతీపతులలో ఎవరు ఏవిధమైన కార్యాలు చేయాలి అనే ధర్మసూత్రాలు విశదీకరించింది. సుమతి అనసూయాదేవి బోధన విని ఎంతో ఆనందించింది. “అమ్మా, నీ రాకతో నేను ధన్యురాలినయ్యాను. నాకు ఎంతో విలువైన ధర్మసూత్రాలు బోధించావు. నీవు చెప్పినట్లే పతిసేవలోనే స్త్రీలు ఈ లోకంలోన, పరలోకంలోన సుఖాల్ని అనుభవిస్తారు. మీరు వచ్చిన కారణం, నేను చేయాల్సిన కార్యం ఉంటే చెప్పండి, తప్పక చేస్తాను” అని చెప్పింది.
ఆమె మాటలు విన్న అనసూయాదేవి “నీ మాట వల్ల సూర్యోదయం కావడం లేదు. అన్ని ధర్మకార్యాలు ఆగిపోయాయి. దీనితో ఇంద్రాది దేవతలు దుఃఖిస్తూ నా దగ్గరకు వచ్చారు. నేను వారికి సూర్యోదయం అయ్యేలా చేస్తానని మాటిచ్చాను. నువ్వు నీ మాటను ఉపసంహరించుకుంటే మరల సూర్యుడు ఉదయిస్తాడు. లోకాలు శాంతిస్తాయి” అన్నది.
అనసూయ మాటలు విన్న సుమతి “అమ్మా నువ్వు అన్నట్లు నేను నా మాట ఉపసంహరించుకుంటే, ముని శాపం వలన నా భర్త మరణిస్తాడు కదా. నా భర్త లేని సూర్యోదయం నాకెందుకు. నేనేంచేయాలి” అని అడిగింది. అనసూయ ఆమెతో “నువ్వు చింతించ వద్దు. నీ భర్తను నేను తిరిగి బ్రతికిస్తాను” అని అభయమిచ్చింది.
అప్పుడు సుమతి తన మాట ఉపసంహరించుకుంది. అప్పటికి తొమ్మిది రోజుల నుండి సూర్యుడు ఉదయించడం లేదు. అది పదవరోజు ఉదయం. అనసూయ పదిరోజులను ఒకరోజులా చేసి, చేతిలో అర్ఘ్యం తీసుకొని సూర్యుణ్ణి ఆవాహన చేసింది. ఎర్రని కాంతితో సూర్యుడు ఉదయించసాగాడు. మాండవ్యముని శాపకారణంగా కౌశికుడు ప్రాణాలు కోల్పోయి నేల మీద పడబోతున్నాడు. మహాతపస్వి అయిన అనసూయ ఆయనను చేతితో పట్టుకుంది. “నేను గనుక రూప, శీల, బుద్ధి లాంటి సద్గుణాలలో నా భర్త ఇతరులందరికన్నా గొప్పవాడని నమ్మిన దానినైతే, నేను నిజమైన పతివ్రతనైతే ఈ కౌశికుడు వ్యాధి నుండి విముక్తి పొంది తిరిగి జీవించుగాక!” అని పలికింది. మహాపతివ్రత అనసూయ పాతివ్రత్య మహిమతో కౌశికుడు పూర్ణ ఆరోగ్యంతో పునర్జీవితుడయ్యాడు. ఆకాశం నుండి పూలవర్షం కురిసింది. లోకాలు శాంతించాయి.
మరల సూర్యోదయమై లోకాలు శాంతించినందుకు దేవతలందరూ ఎంతో సంతోషించి అనసూయాదేవి వద్దకు వచ్చి కృతజ్ఞతాభావంతో ఏదైనా వరం కోరుకోమన్నారు. అందుకు ఆమె “త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నాకు పుత్రులుగా జన్మించాలని కోరుకుంటున్నాను. వీలైతే అలా వరం ప్రసాదించండి” అని తన కోరిక తెలిపింది. దేవతలు తథాస్తు అని పలికి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు.
నారద మహర్షి అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి, ఆమె మహాత్యం గురించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ధర్మపత్నులైన సరస్వతీ లక్ష్మి పార్వతుల ముందు చాలా గొప్పగా ప్రసంశించాడు. లోకంలో ఎవరు గొప్ప పతివ్రత అనే ప్రశ్న లేవనెత్తాడు. త్రిమూర్తుల భార్యల దగ్గరకు గులకరాళ్ళు మూట కట్టుకొని విడివిడిగా వెళ్ళి శనగలు ఉడికించి ఇమ్మన్నాడు. వారు వాటిని ఉడికించడంలో విఫలమయ్యారు. చివరగా అనసూయ దగ్గరకు వెళ్ళి రాళ్ళిచ్చి శనగలు వండి ఇమ్మన్నాడు. అనసూయ నవ్వుకొని, తన భర్తను తలచి ఆయన కమండలంలోని నీళ్ళుపోసి ఉడక పెట్టింది. రాళ్ళు శనగలుగా మారి చక్కగా ఉడికాయి. వాటితో ఆయన ఆకలిని తీర్చింది. ఈ విషయం నారదుడు మరల వెళ్ళి సరస్వతీ లక్ష్మి పార్వతులకు తెలిపాడు. అనసూయ పాతివ్రత్యాన్ని గొప్పగా పొగిడాడు. అది విన్న ముగ్గురికీ అనసూయను పరీక్షించాలనే కోరిక కలిగింది. తమ భర్తలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో అనసూయను పరీక్షించమని కోరారు.
అత్రి మహర్షి ఇంటిలో లేని సమయంలో త్రిమూర్తులు ముగ్గురూ మారు వేషంలో అనసూయ వద్దకు ఆమెను పరీక్షించడానికి వెళ్లారు. అనుకోకుండా వచ్చిన అతిథులను ఆమె తన ఇంట భోజనం చేసి వెళ్ళమని కోరింది. ఆమె దుస్తులు దరించకుండా వడ్డిస్తే భోజనం చేస్తామని, లేకుంటే లేదని వారు చెప్పారు.
అనసూయ సంగ్ధంలో పడింది. నగ్నంగా వడ్డన చేస్తే తన పాతివ్రత్యానికి భంగం వస్తుంది. తన భర్త అత్రిమహర్షి తపోశక్తి తగ్గిపోతుంది. వడ్డించని పక్షంలో అతిథులను అగౌరవపరచి నట్లవుతుంది. కొద్దిసేపు ఆలోచించి తర్కించుకొని తన మనస్సులో ఏ విధమైన చెడు భావన లేనప్పుడు తప్పులేదని నిర్ణయించుకొని నగ్నంగా వడ్డన చేయడానికి ఒప్పుకుంది.
భోజనానికి కూర్చున్న ముగ్గురు అతిధులూ “భవతి బిక్షాందేహి, మాతా” అన్నారు. మాతా అనగానే ఆమె వారిని పిల్లలుగా భావించి వడ్డన చేయడానికి వచ్చింది. ఆమె ఆలోచనల ప్రభావం కారణంగా ఆమె వడ్డన చేయడానికి వచ్చేసరికి వారు ముగ్గురు చంటి పిల్లలుగా మారిపోయారు. ఆమె వక్షోజాల నుండి పాలు ధారగా వచ్చాయి. ఆమె ముగ్గురికీ పాలు పట్టి ఉయ్యాలలో పరుండ పెట్టి నిద్రపుచ్చింది. తరువాత ఇంటికి వచ్చిన భర్త అత్రిమహర్షికి జరిగినదంతా చెప్పింది. ఆయన సంతోషించాడు.
నారదుడు జరిగింది చెప్పడంతో సరస్వతి లక్ష్మి పార్వతులు అత్రిమహాముని ఆశ్రమానికి వచ్చి తమ భర్తలను మామూలు రూపాలతో తిరిగి అప్పగించమని కోరారు. అత్రి మహర్షి తన తపోబలంతో త్రిమూర్తులని స్తుతించాడు. త్రిమూర్తులు నిజరూపాలు ధరించి ఆ దంపతుల ముందు ప్రత్యక్షమయ్యారు. అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి వరం కోరుకోమన్నారు. అనసూయ త్రిమూర్తులను వారి వారి అంశలతో తనకు పుత్రులుగా పుట్టాలని కోరింది.
కొంతకాలం గడిచిన తరువాత వరప్రభావంతో అనసూయాదేవి తన భర్త అత్రిమహాముని ద్వారా గర్భం ధరించింది. ఆ దంపతులకు బ్రహ్మ తేజస్సుతో రజోగుణం కలిగిన తెల్లని “చంద్రుడు” జన్మించాడు. తరువాత సత్త్వగుణ ప్రధానుడు, సమస్త తత్త్వాలకు ఆధారుడూ అయిన విష్ణుభగవానుడు తన అంశతో “దత్తాత్రేయుడు”గా జన్మించాడు. ‘దత్త’ అంటే సమర్పించబడ్డవాడు. విష్ణుఅంశతో సమర్పించబడ్డ దైవస్వరూపుడు, అత్రిమహర్షి పుత్రుడు కాబట్టి ‘ఆత్రేయుడు’ –అందువలన ‘దత్తాత్రాయుడు’ అనే పేరువచ్చింది. శివుడు తన అంశతో ఆమె గర్భంలో ప్రవేశించి తమోగుణంతో నిండిన “దూర్వాసమహర్షి” గా అవతరించాడు.
చంద్రుడు తన చల్లని కిరణాలతో లతల్ని, ఔషధుల్ని, మానవులను రక్షిస్తూ ఉంటాడు. వైష్ణవాంశలో పుట్టిన దత్తాత్రేయుడు యోగనిష్టాగరిష్టుడై, సిద్ధశక్తులను సాధించి, శిష్యులతో కలిసి అవధూతగా సంచరిస్తూ యోగమార్గాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. రుద్రాంశలో పుట్టిన దూర్వాసుడు ముని వృత్తిని అవలంబించి లోకసంచారం చేస్తూ తనను అవమానించిన వారిని శపించి లోకకల్యాణం చేస్తూ ఉంటాడు.
రామాయణ కాలంలో సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ అత్రిమహాముని ఆశ్రమాన్ని దర్శిస్తారు. అనసూయ వారికి అతిథి మర్యాదలు చేసి సీతకు తన నగలూ సుగంధద్రవ్యాలతో అలంకరిస్తుంది. సర్వమంగళమైన ఎప్పటికీ మాసిపోని చీరను ఇస్తుంది. పతివ్రతగా ధర్మాలను బోధిస్తుంది.
అనసూయాదేవి ఆలయం ఉత్తరాఖండ్ లోని అలకనందా నదికి ఉపనదియైన అమృతగంగకు ఎగువన ఉంది. సతీ అనసూయ ఆశ్రమం మద్యప్రదేశ్ లోని చిత్రకూట్ పట్టణం దగ్గరలో దట్టమైన అడవుల మధ్య మందాకినీ నది ఎగువన ఉంది. రామాయణ కాలంలో చిత్రకూటంలో పది సంవత్సరాలు వర్షాలు కురవకుండా తీవ్రమైన కరువు వచ్చింది. సతీ అనసూయ తీవ్రమైన తపస్సు చేసి మందాకినీ నదిని భూమిపైకి తెచ్చింది.
*శుభం*