అవి నేను గుజరాత్ లో ఉద్యోగం చేస్తున్న రోజులు. పగలంతా కంపెనీ సేవలో అలసి సొలసిన నాకు రాత్రి పది గంటటలకే గాఢ నిద్ర పట్టేసేది.ఒకరోజు ఎందుకో అర్థరాత్రి దాటాక హఠాత్తుగా తెలివి వచ్చింది.
ఈమధ్య కోలనీలో నిశిరాత్రివేళ దయ్యాలు కనబడ్డాయని సెక్యూరిటీ జవాన్లు చెప్పుకుంటున్నారు. అది గుర్తుకొచ్చి భయంతో ఒళ్లు జలదరించి ఒక్కసారిగా లేచి లైటు వేశాను. చుట్టూ చూస్తే నా ప్రక్కమీద మొబైల్ లైటు వెలుగుతోంది. దాని చప్పుడుకే తెలివి వచ్చింది కాబోలు అనుకున్నాను. టైము చూస్తే 2:30 దాటుతోంది. ఇంత రాత్రి ఎవరు మెసేజ్ ఇచ్చారో ఏమిటో అని కంగారుపడి మెసేజ్ చదివి ఉలిక్కిపడ్డాను. అందులో ఇలా ఉంది- ‘మీ కార్డుతో ర్యాన్ ఎయిర్ వేస్ టికెట్ బుక్ చేసినందుకు ధన్యవాదాలు. ₹6811.28 /- మీ కార్డుపై ఛార్జి చేయబడతాయి.’ ఇదీ అందులోని సారాంశం.
నేను నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాను. నేనెప్పుడు బుక్ చేశాను? మరెవరికో వెళ్లవలసిన మెసేజ్ నాకొచ్చిందా? కళ్లు నులుముకుంటూ బిక్కు బిక్కు మంటూ.ఆ ఒంటరి రాత్రి వేళ ఎటూ తెగని ఆలోచనలో పడ్డాను.
ఇంతలో మొబైల్ రెండోసారి ట్రింగుమని మ్రోగింది. తీసి చూస్తే మరో మెసేజ్ వచ్చింది. ‘మీ కార్డుతో బ్రస్సెల్స్ ఎయిర్ టికెట్ బుక్ చేసినందుకు ధవ్యవాదాలు. ₹17,863.76/ మీ కార్డుపై ఛార్జి చేయబడతాయి.’ అని దాని సారాంశం. దాంతో నా గుండెల్లో రైళ్లు పరుగెత్తసాగాయి. ఎవరో ఫ్రాడ్ స్టర్ నా కార్డు ఉపయోగించి విమానాల బుకింగులు చేస్తున్నాడని అప్పటికి నాకు అర్థమయింది. నేనింక ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగాను. కష్టమర్ సర్వీస్ కి ఎమర్జెన్సీ కాల్ చేశాను. నా కార్డుమీద ఎవరో విమానాలు బుకింగులు చేస్తున్నారని కంప్లయింట్ ఇచ్చాను. వెంటనే కార్డు బ్లాక్ చేశారు. నా కార్డు మీద బుక్ అయిన మనీ పోయినట్లేనా అని అడిగాను. ‘లేదు, మీరు వెంటనే రిపోర్టు చేశారు గనుక ఆ మనీ ఎయిర్ లైన్ వాళ్లకి పేమెంట్ చేయబడదు. మీకే వస్తుంది. అందుకు మీరు ఒక క్లెయిమ్ ఫారం పూర్తి చేసి ఈ-మెయిల్ ద్వారా పంపాలి. ఒక కాపీ రిజిష్టర్డ్ పోస్టు ద్వారా కూడా పంపించండి.’ అని చెప్పారు. హమ్మయ్య అని కాస్త కుదుట పడి రిలాక్స్ అయ్యాను. ఆ రాత్రి నాకు ఓ కాళరాత్రిలా అనిపించింది.
ఇంతలో సైబరాసురుడు మరొక ₹34,000/- లకు పైగా ఎక్స్ పెడియా ట్రాలెల్స్ వద్ద బుకింగ్ చేయబోయి బోర్లా పడ్డాడు. కేవలం ఒక రూపాయి మాత్రం నా కార్డు ఎకౌంట్లో ఛార్జి చేయబడింది. వాడికి ఆ దెబ్బతో నామీద
విపరీతమైన కోపం వచ్చి ఉంటుంది. వాడు రాత్రి అంతా పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది కదా మరి. వాడి కెంత ధైర్యమంటే నాకు వెంటనే ఫోన్ చేశాడు. బహుశా నన్ను తిట్టడానికి అయి ఉంటుంది. నేను వాడి ఫోను ఎత్తలేదు. కార్డు బ్లాక్ చేయకపోతే బుకింగ్ ఎమౌంటు పెంచుకుంటూ పోయి కార్డు బ్యాలెన్స్ జీరో అయ్యేదాకా వాడి ప్రయత్నాలు కొనసాగిస్తాడు..
ఇలాంటి చీకటి దొంగల బారిన పడకుండా ఉండాలంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఎవరికీ చెప్పకూడదు. రాత్రి తొమ్మిది దాటాక ఇంటర్నెట్ లో ఎప్పుడూ ఎలాంటి బుకింగులూ చేయరాదు. నిన్న రాత్రి నేను రైల్వే టికెట్ బుకింగ్ చేయబోయి వాడి బారిన పడ్డాను. కొందరు రాత్రివేళ ఏ డిస్ట్రబెన్సులూ లేకుండా ఉంటుందని మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటారు. అలాంటి వారికి ఉదయం లేవగానే ఓ పది ఎస్సెమ్మెస్ లకు తగ్గకుండా దర్శనమిస్తాయి. వారి కార్డు లిమిట్ పూర్తిగా ఖాళీ అయిపోయి ఉంటుంది. అందువల్ల మొబైల్ స్విచ్ ఆఫ్ చేయకూడదు అని గుర్తుంచుకోవాలి.
సైబర్ నేరస్తుల కళ్లు ఎప్పుడూ గోల్డ్ కార్డుల మీదే ఉంటాయి. గోల్డ్ కార్డు లిమిట్ ఎక్కువగా ఉంటుందని ఆ కార్డుహోల్డర్లనే ఎక్కువగా టార్గెట్ చేస్తారు. అందువల్ల క్లాసిక్ కార్డు మాత్రమే తీసుకోవాలి. కార్డు లిమిట్ 30,000 రూపాయలకు మించకుండా చూసుకుంటే మంచిది.
తెల్లవారగానే నా శ్రీమతి వచ్చేసింది. మంచి కాఫీ పెట్టి ఇచ్చింది. విశాఖ కబుర్లు ముచ్చటించడం అయ్యాక రొటీన్ పనుల్లో పడిపోయింది. అనవసరంగా శ్రీమతి మూడ్ పాడుచేయడం ఇష్టం లేక నా ఘనకార్యం ఆవిడకు చెప్పలేదు. ఆ తర్వాత నాకు బ్యాంకునుండి ₹6,782/-మాత్రమే తిరిగి క్రెడిట్ అయ్యాయి. తర్వాత నేను ఎన్ని మెయిల్స్ ఇచ్చినా మిగతా ఎనౌంటుకి సరైన జవాబు లేదు. పనుల ఒత్తిడి వల్ల నేను మళ్లీ మళ్లీ రాయడానికి వీలు కుదరలేదు. అందువల్ల రెండవ ఎమౌంటు ₹17,863.76/-ల కోసం నేను రిజర్వ్ బ్యాంకు ఇటీవల సామాన్యులకు రావలసిన మొండి బాకీల వసూలు కోసం నియమించిన బ్యాంకింగ్ ఆంబుడ్స్ మన్ ని కాంటాక్ట్ చేసే ఆలోచనలో ఉన్నాను. నాకు రావలసిన ఎమౌంట్ ఎస్ బి ఐ నుంచి ఎక్కడికీ పోదని నా దృఢ నమ్మకం. అంతవరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.
@@@@@@@@@