నేను ప్రతిరోజూ ఆర్టీసీ కాంప్లెక్స్ కు అనుసంధానమైయున్న ఓ ఫ్లైవోవర్ కిందినండి ఆఫీస్ కు పోతూ ఉంటాను. ఆ సొరంగ మార్గంలో చీకటి రాజ్యమేలుతున్నట్టుట్టుంది. విద్యుత్ దీపాలు ఆ చీకటి వైశాల్యాన్ని ఆక్రమించ లేక వెలవెల పోతున్నట్టుంటాయి. పగటి వెలుగు ఇరువైపుల నుండి వస్తున్నా నడి మధ్యలోని ప్రదేశం మాత్రం ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది. పగలైన,రేయైనా ఎడారిలో ఒకటేలే అని ఓ కవి అన్నట్టు చీకటి రాజ్యమేలే ఆ ఫ్లైవోవర్ క్రింద చీకటి వెలుగుల చింతే లేని నల్లటి రాయిలా కదలకుండా కాలు చాపుకు కూచొని ఉండే ఓ ఆకారం వచ్చిపోయిన వారిని నిర్లప్తంగా చూస్తూ ఉంటుంది, కొన్నిసార్లు పిచ్చికేకలతో భయపెడ్తుంది. ఆ దారిన పోయిన ప్రతిసారి ఆ ఆకారం నా కళ్లకు కనిపిస్తునే ఉంటుంది.పాపం ఇక్కడ ఉన్న తనకు అన్నం ఎలా దొరుకుతుందో అని అనుకునే వాడిని. అయినా ఈ సమాజం అంత దయలేనిది కాదులే ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు అని సమాధాన పడే వాడిని. అప్పుడప్పుడే కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బయటకి పోయే పరిస్థితి లేదు. బహుశా ఓ నాలుగైదు నెలలు నేను అటు వైపే కాదు ఎటువైపు వెళ్లలేదు. మొదటిసారొచ్చిన కరోనా విలయం నెమ్మదించింది. అందరిలానే నేను మళ్లీ కార్యాలయోన్నుఖుడనైనాను. మళ్లీ అదే పాత దారి లో ప్రయాణం. ఈ ఐదు నెలల కాలంలో ఆ ఆకారం గురించి మరిచి పోయాననే చెప్ప వచ్చు. మళ్లీ ఓరోజు ఆ సొరంగ మార్గం దాటుతున్నప్పుడు ఆ ఆకారం గుర్తుకు వచ్చింది. ఔను ఇక్కడ ఓ మనిషి ఉండాలికదా, ఏమయ్యిందో అని చుట్టూ పరికించి చూసాను. వాహనాలపై వచ్చిపోయే వారే తప్ప కనుచూపు మేరలో ఆ ఆకారం కనిపించలేదు. బహుషా కరోనాకి బలైపోయిందేమో అనుకున్నాను. రోజూ ఆఫీసు కు అదే దారిలో పోతూ వస్తున్నాను. యదాలాపంగా ఓ సారి నడక దారివైపు చూసాను. ఆమె అక్కడే కూచొని ఉంది. ఆమె అక్కడ ఉన్నందుకు నాకాశ్చర్యం కలగలేదు,ఇంకా బ్రతికున్నందుకు నేను ఆశ్చర్యపోయాను. అంటే! మాస్కూ పెట్టకోకపోయినా,పౌష్టికాహారం తినకపోయినా భయంకర కరోనా ఆ ప్రాణిని ఏమీ చేయలేక పోయింది. కొండమీది కోతినైనా కొనితేగలిగే కోటీశ్వరులను,అత్యంత ప్రతిభావంతులను, ఒంటి స్థంబాల మేడలలో దాగున్న పరిక్షితులనూ తక్షకుడై కాటేసింది, మరి ఈ అర్భక జీవిని,ప్రతి దినం ఆకలితో అలమటించే నిత్య దరిద్రాన్ని ఎందుకు ఉపేక్షించిందో. ఇదేం మర్మమో? లేక !జీవుల కర్మ ఫలానుసారము మరణం నిర్ణయించుబడుతుందేమో!? అని అనుకుని సమాధాన పడ్డాను. తొలి కరోనా విళయ కెరటపు తాకిడికి తట్టుకొని ఇంకా బ్రతికే ఉన్నందుకు అభినందనగానో ,ఏమూలో మనసులో జాలి కలిగినందుకో,ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు అల్పాహారమో,భోజనమో ఓ నీటి సీసాతో సహా ఇచ్చే వాడిని. బహుషా అలా ఓ నెల రోజులు గడిచుంటాయి, ఓ రోజు రాత్రి పదకొండు గంటలప్పుడు నేను బైక్ మీద వస్తుండగా దారికి మధ్యలో అడ్డంగా ఆమె నిలుచొని ఉంది. .నాకు లోపల చిన్న భయమనిపించినా బండి ఆపి అడిగాను ఏం కావాలి అని. తన భాష ఏమిటో నాకు తెలియదు, నాభాషలో నేనడిగాను. తన నుండి ఎటువంటి సమాధానం లేదు. ఒకటీ అరా వాహనాలు మమ్మల్ని గమనిస్తూ ముందుకు సాగిపోతున్నాయి. ఆమె దగ్గరగా ఉందేమో ఆమె ఏదో అభ్యర్థన కనిపిస్తుంది. చేతిలో ఓ చిన్నమూట ఉంది, ఆ మూట చాలా మురికిగా ఉంది. దాన్ని నాకివ్వడానికి ముందుకు చాపింది.ఇందులో ఏముంది అని అడిగాను.నా భాష తనకు అర్థమైనట్టులేదు. మూటని నాముందు పెట్టేసి ఆమె ఫుట్ పాత్ పైన కూచుంది. ఆ మూటలో ఏ ముంటింది,అసలే తన కి మతిస్థిమితం కూడా ఉన్నట్టులేదు. ఏమైనా రాళ్లు రప్పలు కట్టుంచి నన్ను ఆట పట్టిస్తుందేమో అనుకొని మూట విప్పి చూసాను. ఆశ్చర్యం!అందులో కొన్ని చిల్లర నాణాలు,నోట్లు, ఓ బంగారు చైను,చెవి దుద్దులు,రెండు ఉంగారాలు ఇంకా కొన్ని వెండి వస్తువులు ఉన్నాయి. అయినా ఈ మూట నాకెందుకిచ్చింది అనుకుని నాకొచ్చిన రెండు,మూడు భాషలలో అడిగాను,కానీ ప్రయోజనం శూన్యం.శూన్యంలోనికి చూసి నవ్వుకుంటోంది. బహుషా తన మానసిక పరిస్థితి బాగులేనందు వలన ఈమెనెవరో వదిలించుకుని ఉంటారా లేక ఈ వస్తువులన్ని ఎక్కడైనా దొంగలించి ఉంటుందా! డబ్బులంటే ఎవరో దానంగా ఇచ్చి ఉంటారు అనుకున్నా నగల సంగతేంటి అని మదన పడుతున్న సమయంలో తీసుకుపో అన్నట్టు చేయి ఊపింది. నాకు ఆశ్చర్యంతో కూడిన భయం కలిగింది, నాకే ఎందుకు ఈమె వీటినిస్తుంది. కారణం ఏమైయుంటింది? తనకు అప్పడప్పడు ఆహరం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఇచ్చిందా,లేక ఇంకేదైనా కారణమా! కారణం ఏదైనా ఆ వస్తువుల పైన ఆమెకి ఆశక్తిలేదు. నాకంతా అయోమయంగా ఉంది.ఆ క్షణం ఏం చేయలో పాలు పోలేదు. ఓ అబల పైగా అనాధ నుండి అవి తీసుకోవటం నామోషిగా అనిపించింది. కానీ వాటిని ఆమె దగ్గర వదిలేస్తే ఏవరైనా తీసుకు పోవచ్చు. ఎవరో తీసుకునే బదులు నేనే తీసుకుంటే అనే ఆలోచన నాలో కలిగింది. కానీ అది తప్పు అనిపించింది. ఆప్పుడే బుర్రలో ఓ మంచి ఆలోచన మెరిసింది. ఆమెని ఓ అనాధాశ్రమంలో చేరిస్తే బాగుంటుందని. తన వస్తువులని అదే అనాధాశ్రమానికి డబ్బురూపంలో ఇచ్చేస్తే బాగుంటుందని నిర్ణాయనికొచ్చి ఇంటికి వచ్చేసాను. ఆరోజు నాకు శెలవు అవటం వలన కొంచెం ఆలస్యంగా లేచాను. నిజానికి ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదనే చెప్పాలి,ఏదో ఆపరాద భావన మనసులో వెంటాడుతోంది. ఏదేమైనా ఆమెని ఓ అనధాశ్రమానికి చేర్చాలనుకొని నగరానికి దూరంగా ఉన్న ఓ అనాధాశ్రమాన్ని సంప్రదిద్దామని బయలుదేరి,దారిలోఆమెకి ఏదైనా ఆహారమిచ్చి పోదామనుకుని టిఫిన్ ప్యాక్ చేయించి అక్కడికి చేరుకున్నాను. అక్కడ కొందరు గుమిగూడి ఉండటం చూసి ఏమైందబ్బా అనుకుంటూ చూస్తే అక్కడ ఆమె నిద్రపోతున్నట్టుంది. ఎవరో అంటున్నారు "పాపం అనాధ శవం"అని, అప్పుడర్థమయ్యింది నాకు ఆమె చనిపోయిందని . కార్పోరేషన్ వారొచ్చి శవాన్ని తీసుకుపోయారు.నా మనసు భారమయ్యింది.ఏజన్మ సంబంధమో కదా ఇది, లేక పోతే తన దగ్గర ఉన్నదంతా నాకు ఇచ్చి మరునాడే చనిపోవటం,ఆమెని చూస్తే నాకు జాలి కలగి భోజనం పెట్టడం అంతా ఓ కధలా ఉంది. ఆమె మరణం ఇంకా నా బాధ్యత తీరలేదని గుర్తు చేసింది.ఆమె ఇచ్చిన దానినే మూలధనంగా ఓ అనాధ శరణాలయం ప్రారంభించాను. ఇప్పుడా శరణాలయం ఎందరో అనాధలకు అక్కున చేర్చుకుని సేద తీరుస్తోంది.