సూర్యభగవానుడు ఇంత కరుణారహితుడా అని సందేహం వచ్చేటట్టుగా నిప్పులు కురిపిస్తున్న 'రోహిణీ కర్తరి' రోజులు.
ఇల్లంతా ‘కేంద్ర శీతలీకరం’ చేయించుకొని, అందుకు తగినట్లుగా ‘జనరేటర్’ కూడా పెట్టించుకుని, విద్యుత్ బిల్లు ఎంతైతే మనకేమిటి – ‘వేసవి వేడికి మనం దూరంగా ఉన్నామా లేదా అన్నది ముఖ్యం’ అనుకున్న ఎగువ తరగతికి చెందిన జనం - సూర్యుడిని కానీ వేసవివేడిని కానీ ఇంటి లోపలకి తొంగి చూడనివ్వడంలేదు.
ఎగువ మధ్యతరగతికి చెందిన కొంతమంది జనం -- వారి పడకగదులు మాత్రం ‘శీతలీకరం’ చేయించుకొని, విద్యుత్ బిల్లు కూడా చూసుకుంటూ ఉండాలన్న నెపంతో ఒకటి రెండు గంటలు శీతలీకరం వాడుకొని, తరువాత విద్యుత్ సరఫరా ఆపివేసి, మరలా గది వేడెక్కిన తరువాత విద్యుత్ మీటని నొక్కి ‘శీతలీకరం’ అందేటట్టుగా చూసుకుంటున్నారు.
ఇలా ఎక్కడ పడితే అక్కడ వెలుస్తున్న ‘శీతలీకరణ యంత్రాలు’ ఇళ్ల వెలుపల ఆరుబయలులో వేడిని ఇంకా పెంచడానికి సూర్యునికి ఉడతా భక్తితో తోడ్పడుతున్నాయి.
మధ్యతరగతికి చెందిన జనం -- పంఖా వేసుకొని ' వెధవది ఈ పంఖా లోంచి ఇంకా వేడిగాలి అధికంగా వస్తున్నట్టుందే ' అని విసుక్కుంటూ ఉంటే, జాలిపడిన సర్కారు వారు ఆ ఇళ్ళకి విద్యుత్ సరఫరా అప్పుడప్పుడు నిలిపివేస్తూ సహాయపడుతున్నారు.
మిగతా జనం – ‘ఎంత ఎండ అయితే మాత్రం మన తిప్పలు, శ్రమ, కష్టాలు తప్పవుకదా’ అనుకుంటూ తుండుగుడ్డ తలకి చుట్టుకొని నిప్పులు చెరిగే ఆ ఎండలోనే పనులు చేసుకుంటూ, మధ్యమధ్యలో ఆ తుండుగుడ్డతోనే శరీరానికి పట్టిన చెమటని తుడుచుకుంటూ, దాన్నే ఒక పంఖాలాగా అటూ ఇటూ తిప్పుతూ శరీరానికి గాలిని అందచేసుకుంటున్నారు.
ఇంత వేసవి ఎండలోనూ --
ఎవరు ఏమేమి తెప్పించుకొని తినాలనుకుంటున్నారో అవన్నీ – వేసవి వేడిని అసలు పట్టించుకోకుండా, సమయాభావం కాకుండా, వారికి అందచేస్తూ అదే పనిగా తిరుగుతున్నాడు -- జొమోటో తరఫున అవన్నీ అందించే ఉద్యోగి.
-2-
అంత ఎండలో అతగాడు ఎందుకంతగా తిరుగుతున్నాడా అంటే – ఎన్నిసార్లు అలా తిరగగలిగితే అంత ఆదాయం దొరుకుతుంది అతనికి. అలా సంపాదించే ఆదాయం మాత్రమే ఆయన సంసారానికి ఆసరా.
అలా తిరుగుతూ –
ఒక ఇంటికి వెళ్లి, వారిని పిలవడానికి ఉన్న గంట మీద ఉన్న మీట నొక్కిన రెండు నిమిషాలకు -- తలుపు తీయకుండానే "ఎవరదీ" అన్న కేక గంభీరంగా వినిపించింది.
" జొమోటో డెలివరీ సర్ "
తలుపు తెరవ బడిన కొద్ది సెకండ్లలో - ఆ ఇంటి తలుపు నిర్దాక్షిణ్యంగా అతని ముఖము మీద మూసుకు పడేలోపల, చల్లటి గాలి అతని శరీరంకి తగిలి ప్రాణానికి కాస్త హాయినిచ్చింది.
నిర్లిప్తంగా, కొంతసేపటికి మరో ఇంటికి వెళ్లి వారిని పిలవడానికి ఉన్న గంటమీద ఉన్న మీట నొక్కిన ఐదు నిమిషాలవరకూ ఎవరూ తలుపు తీయకపోతే, ఎండ వేడి బాధింపసాగింది. మరో ఇంటికి కూడా త్వరగా వెళ్ళాలి కదా అని మరొకసారి మీట నొక్కిన నిమిషానికి తాపీగా తలుపు తెరిచిన ఒక పండు ముదుసలి –
"నాకు మోకాళ్ళ నొప్పులు నాయనా, త్వరగా నడిచి రాలేకపోయేను. నీకు ఆలస్యం అయిందా" అనగానే -- శరీరానికి తగిలిన చల్లటి గాలిని మించిన ఆమె సంస్కారం మనసుని చల్లపరచడంతో "ఫరవాలేదండీ, ఇగో మీ ఆర్డర్. మీకు ఆలస్యం అవలేదు కదా"
"అయితే అవనీ నాయనా, ఎండన పడి వచ్చేవు. లోపలికి రా. కాస్త మజ్జిగ త్రాగి వెళ్దువు గాని"
"థాంక్స్ అమ్మా. నేను ఇంకా నాలుగు ఇళ్ళకి వెళ్ళాలి, క్షమించండి. వారికి ఆలస్యం అయిపోతుంది" అని ఆమెకి నమస్కారం చేసి మళ్ళా వేసవి వేడి మధ్యలోకి చేరుకున్నాడు.
మరో ఇంటికి వెళ్లి వారిని పిలవడానికి ఉన్న గంటమీద ఉన్న మీట నొక్కిన ఐదు నిమిషాలవరకూ తలుపు తీయకపోతే మరో ఇంటికి కూడా త్వరగా వెళ్ళాలి కదా అని మరొకసారి మీట నొక్కిన రెండు నిమిషాలకు తాపీగా తలుపు తెరిచిన ఒక యువతి "ఇంత ఆలస్యం చేసేవేమిటి, కంప్లైన్ చెయ్యాలా ఏమిటి, మరోసారి ఇలా ఆలస్యం అయితే నీ ఎదురుగానే కంప్లైన్ చేస్తాను, టేక్ కేర్" అని కేకలు వేస్తూ అతని ముఖము మీద తలుపు ధభీ మని వేసింది.
ఇలాటి విభిన్న మనుషుల మధ్యలో – వేసవి వేడిని మించి కడుపులో మెలి తిరుగుతున్న ఆకలిని పట్టించుకుందుకి కూడా సమయం లేక - ఇతరుల ఆకలిని తీర్చడానికి అతను పాపం అలా తిరుగుతూనే ఉన్నాడు.
అదేమి చిత్రమో -- డబ్బవసరం ఆకలిని పట్టించుకోనివ్వదు, వేసవి వేడికి వెరవదు.
*****