ప్రొఫెసర్,తెలుగుశాఖ,ఆంధ్రవిశ్వకళాపరిషత్ భరత్ కి నాలుగు గంటలకు మెలకువ వచ్చింది. వెంటనే సెల్ తీసి అమ్మ కి రోజులాగే నాలుగు వాక్యాలు లేఖ రాశాడు. పక్కనే ఉన్న భార్య సుమిత్ర " ఈరోజు ఆదివారం కదా ఎందుకు అప్పుడే లేవడం. కాసేపు పడుకో.. "అన్నది ఆవలిస్తూ. "నువ్వు పడుకో. అమ్మ బాత్రూంలో ఫ్లెష్ పనిచేయట్లేదు అని చెప్పింది. ప్లంబర్ని బుక్ చేసి పడుకుంటాను.. "అనగానే రెండో పక్కకి తిరిగి సుమిత్ర పడుకుంది. ***** అంజలి కాలింగ్ బెల్ మోగితే పొద్దున్నే ఎవరు , పనిమనిషి కూడా వెళ్ళి పోయింది ,అనుకొని తలుపుతీసింది. ఒకే అపార్ట్మెంట్లో ఉండే వెన్నెల "ఆంటీ ప్లంబర్ వస్తున్నారు. అన్నయ్య మెసేజ్ పెట్టారు. అందుకనే వచ్చాను". అని చెప్పింది. ఆ మాటకి ప్రేమగా విసుక్కుంటూ "వాడికి చాదస్తంపెరిగింది. నేను ఒక్కర్తిని ఉన్నానని ఎవరేం చేస్తారో అని భయం. అందుకనే నిన్ను వెళ్ళమని ఉంటాడు. "అంది అంజలి. పక్కనే అపార్ట్మెంట్లో ఐదుగురు ఆడపిల్లలు సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తూ కలిసి ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు అంజలి దగ్గరికి వస్తూనే ఉంటారు. అందులో ఒక అమ్మాయి వెన్నెల. ఆ అమ్మాయి అంజలిని బాగా ఇష్టపడుతుంది. ఆ అమ్మాయితో కూడా భరత్ అప్పుడప్పుడు మాట్లాడుతాడు. అమెరికాలో ఉన్న భరత్ కి అమ్మ ఒక్కర్తి ఉందనే భావన. ఆమెను బాగా చూసుకోవాలని తాపత్రయం. కానీ నాన్న పోయాక అమ్మ అమెరికా వచ్చినా వాతావరణం పడక అనారోగ్యం వచ్చి" నేను ఇండియాలోనే ఉంటాను రా "అని వెనక్కి వచ్చేసింది. భరత్ ఇద్దరు పిల్లల చదువు వలన ఇండియాకు రావడం కుదరలేదు. ఏడాది రెండేళ్లులో వచ్చేస్తాను అమ్మ .. అని అస్తమానం చెబుతాడు. తన ఇంట్లో ఉన్నట్టుగానే అన్ని అవసరాలు చూస్తాడు. మామూలుగా బాత్రూంలో నీళ్లు రావడం లేదు అనగానే ప్లంబర్ని పంపించేసాడు. రెండు వారాలకు ఓసారి పళ్ళు,పూవులు కూరలు,మందులు ఆన్లైన్లో బుక్ చేసి పంపించేస్తాడు . ప్లంబర్ వచ్చి బాగు చేసి వెళ్లేదాకా వెన్నెల అక్కడే కూర్చుంది. తర్వాత అంజలి ఇచ్చిన కాఫీ తాగి ఆంటీ ఆఫీస్ కి వెళ్ళాలని వెళ్ళిపోయింది. ******** అమ్మా ఈరోజు ఏం జరిగిందో నీకు కచ్చితంగా చెప్పాలి. సుమిత్ర మామిడికాయ పప్పు చేసింది. నీలాగ చేయలేదు. నేను గబుక్కున" మా అమ్మ చాలా బాగా చేస్తుంది. మా అమ్మ చేసిన మామిడికాయ పప్పు ఊరు మిరపకాయతో తింటే ఆ రుచే వేరు" అన్నాను. నా కొడుకు వేదాంశ్ కి ఎంత కోపం వచ్చిందో. కోపంగా లేచి డైనింగ్ టేబుల్ కుర్చీ ఎక్కి" థిస్ ఇస్ వెరీ టేస్టీ. వై ఆర్ యు కామెంట్ లైక్ దట్. మై మమ్మీ ఆల్సో డూయింగ్ వెల్ అండ్ టేస్టీ. మైఅమ్మ ఇస్ ద బెస్ట్ అమ్మా…" నేను ఆఖరికి "మీ అమ్మ చేసింది చాలా బాగుంది. సారీ రా ఇంకెప్పుడు బాగోలేదు అనను అనే దాకా చిందులు తొక్కేసాడు. సుమిత్ర ముఖం మాత్రం ఒక వెలుగు వెలిగింది". ఆ క్షణం వాళ్లంతా ఒకటే నేనే పరాయి వాడిని అనిపించింది. నాకు నీ దగ్గరికి వెంటనే వచ్చేయాలి అనిపించింది అమ్మా.. కన్నా! "అమ్మ చేతి భోజనం కమ్మన అన్నారు. ఎవరి అమ్మ చేతి భోజనం వాళ్ళకి బాగుంటుంది. పుట్టిన దగ్గర నుండి అలవాటయింది కదరా. ప్లంబర్ వచ్చాడు. అతను వెళ్ళే దాకా వెన్నెల సాయం కూర్చుంది. పావుగంటలో బాగు చేసి వెళ్ళిపోయాడు. భాగవతం పారాయణం చేద్దామని మొదలెట్టాను. నేను బాగానే ఉన్నాను. నా గురించి అనవసరంగా బెంగ పెట్టుకోకు. అమ్మా! మామయ్య ఫోన్ చేసాడు. వాళ్లు అయోధ్య వెళ్తున్నారట. నిన్ను కూడా పంపమన్నాడు. అయోధ్య నిర్మాణం పూర్తయ్యాక చూడాలని అన్నావుట కదా! వెళ్తావా. నీకు ఇబ్బంది లేకపోతేనే వెళ్ళు .లేకపోతే నేను వచ్చినప్పుడు తీసుకుని వెళ్తాను. మావయ్య హడావుడిగా నడిపించేస్తాడు. నువ్వు అంతలా నడవలేవేమో. భోజనం గురించి కూడా పట్టించుకోడు. ఏదుంటే అది తినేయాలి అంటాడు. చూసుకో ఇబ్బంది ఉండదు. అనుకుంటేనే వెళ్ళు. "నువ్వు అనుమతిస్తేనే మీ అమ్మ మాతో వస్తుంది రా "అని వేళాకోళం చేస్తున్నాడు. కన్నా! మావయ్యతో అంతా కలిసి వెళతాం. పిన్ని కూడా వస్తుంది రా. మా తమ్ముడు కదరా. నేను వాడిని కావాలంటే అడగగలను ఏదైనా. నీతో ఏదో జోక్స్ వేస్తుంటాడు గాని మమ్మల్ని బాగానే చూస్తాడు రా…అయితే నువ్వు వెళ్ళమంటేనె వెళ్తానురా…వెళ్లకపోయినా ఏం పర్వాలేదు. ఇక్కడ కాల క్షేపం బాగా అవుతోంది. అమ్మా! తప్పకుండా వెళ్ళు.కానీ ఫ్లైట్ టికెట్ తీస్తానంటే ఎంతో కోపమొచ్చింది.. మావయ్య,అత్తయ్య,పద్మ వాళ్ళాయన నువ్వు …అయిదుగురే కదా..నేను తీస్తానని అన్నా.మా కంత స్టేటస్ లేదు.ఇష్టమయితే మాతోపాటు..లేకపోతే లేదు అని చాలా గట్టిగా మాట్లాడాడు. చాలా బాధ అనిపించింది.నీకు రైలు ఇష్టమంటావుకదా..వెళ్ళు. కానీ 10,000 కాష్ దగ్గర పెట్టుకో. అక్కడ చాలా వేడిగా ఉంటుంది. మీ అన్న ఏమి అన్నీ పట్టించుకోడు. వేళకు పెడతాడు అంతే. నువ్వు మొహమాట పడకుండా లస్సీల వి తాగు.. జాగ్రత్త. కన్నా! నేను బాగానే ఉంటాను.నన్నేమీ అనడు.నువ్వు వాడి కూతురు పద్మని చేసుకోలేదని వాడికి బాధ.అందుకే అలా మాట్లాడుతాడు.పట్టించుకోకు. ************""""""""" అమ్మా! ఎలా ఉన్నావ్…నేను ఏమీ చేయలేని అసమర్ధుడుని.మావయ్య ఈరోజు తిట్టిన తిట్లు నిజమే.నాకు కోపం రాలేదు.నిజమే అన్పించింది.నీ కు నీకు బాగోలేదు కదా హాస్పిటల్లో సెలైన్ పెట్టించిన ఫోటో పెట్టాడు. ఇంత ఏడుపొస్తుందో. ఏం చేయను. నేను వేరే దేశంలో ఉన్నాను. ఇక్కడ పని పూర్తి అవ్వడానికి కనీసం 15 రోజులు పడుతుంది. అప్పుడే రాగలను. ఇక్కడ సేవలకు మేమున్నాం కదరా .అక్కడ డబ్బులు సంపాదించుకుని స్టేటస్ పెంచుకో, అని చాలా వేళాకోళం గామాట్లాడాడు .ఎప్పుడు కోపం వచ్చేది కానీ ఈసారి ఎందుకో చాలా బాధనిపించింది నేను తప్పు చేస్తున్నాను .బాధ్యత ఉందని నాకు తెలుసు. ప్రతి సంవత్సరం వచ్చేద్దామనుకుని రాలేకపోతున్నాం. అమ్మ నేను వచ్చేదాకా మాత్రం జాగ్రత్తగా ఉండు .త్వరలో వచ్చేస్తా." కొడుకు రాసిన మాటలు చదివి తనకి తెలియకుండానే కన్నుల చివరి నుండి నీరు కారడం వాటిని సాయంగా కూర్చున్న వదిన చూడడం జరిగింది." అరే ఎందుకండీ వదినగారు బాధపడతారు. ఏం లేదు డిహైడ్రేషన్ మాత్రమే అని చెప్పారు కదా డాక్టర్.". "అదే నా భయం. దాని కొడుకు వచ్చాడంటే మావయ్య మంచినీళ్లు కూడా ఇప్పించలేదు అని నా మీద ఎగురుతాడేమో.."అన్న తమ్ముడి మాటలకి "అలాఎందుకంటాడు. నువ్వు పోనీ లేఅని తీసుకెళ్లావు". "పోనీలేంటే నీ మొహం డబ్బులు అన్ని నువ్వే పెట్టుకుని…అసలు చాలా ఖర్చు పెట్టేసావ్ వద్దన్నా వినలేదు." అన్నాడు మొహమాటంగా. "వాడికి ఎందుకు హాస్పిటల్ ఫోటో పెట్టావు రా బాధపడుతున్నాడు." "తెలియాలి కదా. రావాలి కదా .రెండేళ్లయింది నిన్ను చూసి. వాట్సప్ ప్రేమలూ వీళ్ళూను" "వాడి కూతురు స్కూల్ అడ్మిషన్ అది దొరకలేదు కదరా. వాళ్ల బాధలు వాళ్లకు ఉన్నాయి." "కని పెంచిన తల్లిని వదిలేస్తాడా" "ఎక్కడ వదిలాడురా. వాడు నా ఇంట్లో ఉన్నట్టే అన్ని చూస్తున్నాడు. నువ్వు ఇప్పుడు పట్టించుకోకపోతే వాడేదో చూసేవాడు." "ఏం చేస్తాడు నువ్వు పడిపోతే ఇక్కడ. కొడుకుని ఏమి అననివ్వవు." "అబ్బా ఊరుకోండి. ఇప్పుడు మాట్లాడడం ఎందుకు. ఆవిడికి విశ్రాంతి కావాలి." అన్నది భార్య. అప్పుడే కొడుకు నుండి వీడియో కాల్ వచ్చింది. తల్లిని చూసి కళ్లు చెమర్చాయి. "అమ్మా ఎలా ఉన్నావ్. పర్వాలేదు రా. కంగారు పడకు". "లేదమ్మా, మావయ్య అన్నది కరెక్టే. ఇప్పుడు నాన్నని చూడగలుగుతున్నానా. నీకు ఏమైనా అవుతుందని భయంగా ఉంది. నేను వచ్చేస్తాను అమ్మా ఇండియా. "అక్కడ కంపెనీ పెట్టే స్థాయికి ఎదిగావు రా. చక్కగా సంపాదిస్తున్నావ్. నీవల్ల చాలామంది బతుకుతున్నారు. నా ఒక్కదాని కోసం నువ్వు ఎందుకు రావడం. నిజంగానే చెబుతున్నాను. నువ్వు ఇప్పుడే కాదు రా, ముంబై ఎయిర్పోర్ట్లో లగేజ్ పడేసి కన్నీళ్ళతో పరిగెత్తుకుని వచ్చావ్ అమ్మా నేను వెళ్ళను . నేను ఇక్కడే చదువుతాను. అని ఎన్నిసార్లు అన్నావు. ఆ క్షణం నేను కూడా ఏడుస్తూ మాన్పించేద్దామనుకున్నాను. కానీ నాన్న ఒకే మాట అన్నారు. సెంటిమెంట్లు పెట్టకు. వాడు పదిమందికి పనికొచ్చేలా ఉండాలి. నీ కళ్ళ ముందు ఉండడం ఒక్కటే కాదు. అని నిన్ను బలవంతాన పంపించారు. మామయ్య అంటే నేను అదే చెబుతాను. మేమే బలవంతంగా పంపించాము రా .వాడు ఎప్పుడూ వచ్చేస్తాననే అన్నాడు. ఇప్పుడు నేను ఒంటరినైపోయానని తప్పంతా వాడిదేనంటే ఎలా. అంతే కాదు కన్నా. ఇక్కడ ఉంటే మాత్రం నువ్వు ఆఫీసులోనే ఉంటావు. నాకు ఎప్పుడో అనారోగ్యం వస్తుంది అని రోజంతా నా పక్కన కూర్చోవు కదరా. నా కొడుకు నన్ను చూడటం లేదని నేను అనుకోవట్లేదు రా. ఇక్కడే ఉన్న కొడుకులు కన్నా నువ్వు చాలా బాగా చూస్తున్నావ్. బాధ్యత పడుతున్నావ్. ఇంతకన్నా కావాల్సిందేమీ లేదులే. అమెరికా పంపింది మేమే. నువ్వెప్పుడూ మామాటే విన్నావు..కన్నా. కోడలికి నీ పిల్లలకి అక్కడే బాగుంటుంది. వాళ్లకి అలవాటైపోయింది కదా. అవకాశం ఉన్నప్పుడు రా.. చాలు. ముంబై ఎయిర్పోర్ట్ లో కన్నీళ్ళతో నేను ఇక్కడే చదువుకుంటానన్న నీ ముఖం నాకు ఎప్పుడు గుర్తుంటుంది రా. మళ్లీ చెబుతున్నా. మేమే పంపించాం. అస్సలు బాధపడకు కన్నా. నేను బాగానే ఉన్నా." "అమ్మా! థాంక్యూ. నువ్వు చాలా మంచి దానివి. ఈరోజు నాకు ఒక మంచి మేనేజర్ వచ్చాడు. చిన్న మామ్మ మనవడు హేమంత్ అమ్మా. వాడు మన కంపెనీలో చేరాడు. చాలా మంచోడు. వాడికి అప్ప చెప్పి నేను ఇండియా వస్తున్నా. ఆన్లైన్లో చూసుకోగలను. టికెట్ కూడా తీసేసుకున్న. 20 రోజుల తర్వాత నేను ఇండియాలోనే ఉంటున్నా. అప్పడి దాకా జాగ్రత్తగా ఉండమ్మా ప్లీజ్. "వద్దురా కన్నా. అంతగా నాకు ఇబ్బంది అయితే ఎన్నారై వృద్ధాశ్రమంలో ఉంటా. అది చాలా బాగుంది. అప్పుడు మావయ్యని కూడా నేను ఇబ్బంది పెట్టను." వాయిస్ టైప్ చేస్తుంది. అది విన్న నిరంజన్ గతుక్కుమన్నాడు. "నాకేం ఇబ్బంది లేదు .ఏదో వాడితో అలా అంటాను అంతే. వృద్ధాశ్రమంలో ఉండడం ఏమిటే. వద్దక్కా" అన్నాడు ఆప్యాయంగా. "అమ్మా ,నేను వస్తున్నా. మళ్లీ సంవత్సరం కోడలు పిల్లలు కూడా వచ్చేస్తారు. ఇక్కడ అంతా ఉంటారు అమ్మ. మామయ్య తిడుతున్న, దెప్పుతున్నా, మనకి ఏ అవసరం ఉన్నా పరిగెత్తుకొస్తాడు. ఒంట్లో బాగోలేదంటే పదిమంది పరిగెత్తుకొస్తారు. ఇక్కడ అలా వచ్చేవారెవ్వరూ లేరు మాకు. నేను పెద్దవాడిని అయ్యానమ్మా. నేను నీ మాట వినను ఇప్పుడు. నువ్వు వద్దన్నా ఇండియా వచ్చేస్తున్నాను.బై.. "నిరంజన్ , నా కొడుకు వచ్చేస్తున్నాడు.నాకోసం నాకోసం" అంది గర్వంగా.