స్వంత ఇల్లు - మద్దూరి నరసింహమూర్తి

Swantha illu

స్నేహితుడి గృహ ప్రవేశానికి వెళ్లి వచ్చిన రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు భార్య కళ్యాణి మౌనంగా వడ్డిస్తూ కొంచెం ముభావంగా ఉండడం చూసిన గిరి --

"కల్యాణీ అలా మౌనంగా ముభావంగా అదోలా ఉన్నావేం"

"ఏంలేదులెండి"

"ఏమీ లేకపోతే మరి అలా ఉన్నావెందుకు"

"ముందు మీరు భోజనం చేయండి"

"ఏం నువ్వు ఇవాళ తినవా"

"నాకు ఆకలిగాలేదు లెండి"

"అంటే, రాక్షసి ఆకలి నాకేనా, నేనూ తిననైతే"

"చిన్నపిల్లాడిలాగా అలక ఏమిటి ఈరోజు కొత్తగా"

"అలగడం నీ ఒక్కర్తికే వచ్చా లేక అలక నీ స్వంతమా"

"ఏమిటైంది మీకివాళ"

"నీకేమైందో నాకూ అదే అనుకో"

"నాకేమవలేదు, ఆకలిగాలేదు అంతే"

"నాకూ అంతే. ఏమవలేదు, ఆకలిగాలేదు అనుకో"

"మీతో సాల్లేను బాబూ, ఉండండి నేను కంచం తెచ్చుకుంటున్నాను" అని కంచం తెచ్చుకొని వడ్డించుకుని "ఊ ఇప్పుడు తినండి"

"లేదు, నువ్వెందుకు అలా ఉన్నావో చెప్తేగానీ నేను తినను కాక తినను"

"ఏమీ లేదు. అందరూ స్వంత ఇల్లు కట్టుకొని గృహప్రవేశాలు చేసుకుంటూంటే చూడడమే కానీ, మనం ఒక ఇల్లు కట్టుకోవడం లేదు అని విచారంగా ఉంది"

"అంతే కదా, ముందు భోజనం చేద్దాం. తరువాత హాల్లో కూర్చొని సావకాశంగా దాని గురించి మాట్లాడుకుందాం" అని గిరి భోజనం చేయడం ఆరంచించేడు.

కల్యాణి వంటింటిలో పనులన్నీ ముగించుకొని హాల్లో కూర్చున్న గిరి పక్కన కూర్చుంది.

"చూడు కల్యాణీ, ఈ నెల నుంచీ మనం బియ్యం 15 కేజీలు బదులుగా బస్తా, పప్పులు ఇతర సామానులు 10 కేజీల చొప్పున్న కొందామనుకుంటున్నాను."

"మీకేమైనా పిచ్చి పట్టిందా, మన ఇద్దరికి ఎందుకు అవన్నీ, ఏమి చేసుకుంటాం"

“మనం ఉండడానికి రెండు గదుల అద్దెఇల్లు సరిపోవడం లేదా, స్వంత ఇల్లైతేనే ఉండడానికి బాగుంటుందా”

-2-

"అనవసరంగా ఎక్కువ సామానులు కొనడం, స్వంతానికి ఇల్లు కొనడం ఒకటే అన్నట్టు మాట్లడతారేమిటి"

"నా జీవితం నా ఆర్జన నీ దగ్గర వడ్డించిన విస్తరి. నేనేమీ దాచడం లేదు అని నీకు నామీద నమ్మకం ఉందా"

"ఎందుకు అలా అడుగుతున్నారు, మిమ్మల్ని కాకపొతే నేను ఎవరిని నమ్మగలను, నా మనసులో ఉన్నది మిమ్మల్ని కాకపొతే ఎవరిని అడగగలను"

"నువ్వు అడిగేవని నేను బాధపడడం లేదు, అన్నీ తెలిసి అడుగుతావేమిటి అని బాధగా ఉంది"

"ఎందుకు అలా అనుకుంటున్నారు. మిమ్మల్ని బాధపెట్టాలని నాకు ఏ కోశానా లేదు. నా మాటలు మీకు బాధకలిగిస్తే నన్ను క్షమించండి, లేదా తిట్టండి కొట్టండి"

"మనలో మనకి క్షమాపణలేమిటి కల్యాణీ, ఈ రోజు వరకూ లేనిది ఇప్పుడు నేను నిన్ను తిట్టడం కొట్టడం చేయనా, నిన్ను తిట్టినా కొట్టినా నన్ను నేను క్షమించుకోగలనా. ఇప్పుడు నీకు కష్టం అనిపించి అలా మాట్లాడినా, మరెప్పుడూ అలా మాట్లాడకు"

"సరే, ఆ టాపిక్ అలా వదిలేసి మనము ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామో చెప్పండి" అంది నవ్వుతూ కల్యాణి.

హరి కూడా నవ్వుతూ "నేను కూడా అక్కడకే వస్తున్నాను".

"ఎక్కడికి బియ్యం పప్పుపుల దగ్గరకా" అంది కళ్యాణి మరలా నవ్వుతూ.

గిరి కూడా చిరు నవ్వుతూ "నాకు జీతం తప్పించి గీతం లేదు అని నీకు తెలుసు కదా"

"ఎందుకు తెలీదు, అందుకు గర్వంగా కూడా ఉంటుంది నాకెప్పుడూ"

"మావాళ్ళ తరఫునుంచి కానీ మీవాళ్ళ తరఫునుంచి కానీ మనకు వచ్చిన ఆస్తులు పాస్తులు ఏమీ లేవుకదా"

"అవును"

"ఇప్పుడు నా వయసెంత"

"క్రిందటి నెలే మీ నలభై ఐదో పుట్టినరోజు చేసుకున్నాము కదా"

"అలాటప్పుడు నేను రిటైర్ అవడానికి ఇంకా ఎన్నేళ్లు ఉన్నాయి"

"ఏమో నాకేమి తెలుసు"

"అరవై ఏళ్ళకి నేను రిటైర్ అవుతానంటే, ఇంకా పదిహేనేళ్ళు మాత్రమే నేను ఉద్యోగం చేయగలను కదా"

"ఆ తరువాత"

"జీతం బదులు పెన్షన్ వస్తుంది"

"ఇప్పుడు నా జీతం 75 వేలు మాత్రమే కదా"

"అవును"

"రిటైరైన తరువాత 50 వేలు మాత్రమే పెన్షన్ వస్తుంది, అది నీకు తెలీదని నాకు తెలుసు"

"ఇవన్నీ నాకు ఇప్పుడు ఎందుకు చెపుతున్నారు"

"ఇప్పుడు అప్పుచేసి ఇల్లు కొనుక్కోవడం చేస్తే పదిహేను సంవత్సరాల లోపల ఆ అప్పు తీర్చేయాలి"

-3-

"తీర్చేద్దాం, ఈ అద్దె గొడవ ఉండదు కదా. అప్పో సప్పో చేసి స్వంత ఇల్లు అంటూ కొనుక్కుంటే, చారు అన్నం తినేనా రోజులు వెళ్లతీద్దాం"

భార్య అమాయకత్వంకి జాలితో కూడిన నవ్వు వచ్చిన గిరి "సరే, నేను చెప్పింది సావధానంగా విను. అడిగేవాటికి జవాబులిస్తూండు. రెండు గదుల ఫ్లాట్ కొంటే ఎంతవుతుందంటావు"

"ఏమో"

"ఊరుకొసకి తీసుకుంటేనే, తక్కువలో 50 లక్షలవుతుంది"

"అమ్మో అంతే"

"50 లక్షలు పూర్తిగా ఏ బ్యాంకు వారు అప్పుగా ఇవ్వరు. కనీసం అందులో పదోవంతేనా మన చేతినుంచి పెట్టగలిగే స్తొమత చూపిస్తే, మిగతాది అప్పుగా ఇస్తారు"

"అంటే 5 లక్షలు మన దగ్గర ఉన్నట్టుగా బ్యాంకు వారికి ముందు చూపించాలా?"

"ఇంకా విను. లక్ష రూపాయలు అప్పు చేస్తే అది తీరడానికి నెలవారీ బ్యాంకు వారికి వెయ్యి రూపాయలకి తక్కువ కాకుండా కట్టాలి"

"అంటే, 45 లక్షలు అప్పు చేస్తే 45 వేలు నెల నెలా కట్టాలా"

"అంతే కాదు. ఇప్పుడు మన దగ్గర 5 లక్షలు లేవు కాబట్టి అది కూడా ఏదో విధంగా అప్పు చేసి తెచ్చుకోవాలి, ఆ అప్పు తీరడానికి కూడా నెలకింత అని కట్టాలి"

"మనం ఇప్పుడు కట్టే అద్దె మిగులుతుంది కదా"

"ఇంటి యజమానికి అద్దె నెలనెలా ఎంత కడుతున్నాము"

"పదిహేనువేలు"

"నువ్వన్నట్టు ఆ పదిహేనువేలు మిగిలితే, ఇంటికి చేసే అప్పులో నెలకి ఎంత కట్టాలంటావు"

"ఏమో, ఇన్ని లెక్కలు వింటూనే నా బుర్ర పనిచేయడం లేదు, మీరే చెప్పండి"

బ్యాంకు వారికి ప్రతీ నెలా కట్టవలసిన 45 వేలలో అద్దె సొమ్ము 15 వేలు మినహాయిస్తే, మిగతా 30 వేలు మనకి ప్రతీ నెలా జీతంలోంచి బ్యాంకు అప్పుకి పోతుంది. పైగా బ్యాంకు వారికి మనది అని చూపించే 5 లక్షల అప్పుకి ఎంతో కొంత జీతంలోంచి కట్."

"అంటే మీ జీతంలోంచి మనకి మిగిలేదు అటూ ఇటుగా 44 వేలే అన్నమాట"

"బ్యాంకు లోన్ శాంక్షన్ అయే ముందర వారి ప్రాసెసింగ్ చార్జెస్ కి, ఇంటి రిజిస్ట్రేషన్ అప్పుడు ఇవ్వవలసిన తప్పనిసరి లంచాలకి, గృహప్రవేశం పూజలకి, వచ్చే బంధువులకి భోజనాలు బట్టలు పెట్టడం కలిపి వేరుగా లక్షన్నరకి తక్కువవకుండా అయే ఖర్చు కూడా సమకూర్చుకోవాలి. ఇప్పుడు ఆఫీస్ కి మార్కెట్ కి వెళ్లి రావడానికి 15 నిమిషాలు సరిపోతుంది, పైగా నెలకి స్కూటరుకి 200 దాటకుండా పెట్రోల్ కి సరిపోతుంది. అదే ఊరుకొసకి ఇల్లయితే, ఆఫీస్ కి మార్కెట్ కి పట్టే సమయం బాగా పెరగడమే కాక, స్కూటర్ కి పెట్రోల్ ఖర్చు నాలుగు రెట్లు పెరుగుతుంది. ఇంకా ఎన్ని సాధకబాధకాలున్నాయో అనుభవంలోకి వస్తేగానీ తెలీదు”

-4-

కొన్ని నిమిషాలు మౌనంగా ఉన్న తరువాత కల్యాణి --

"మన అబ్బాయికి కొంత సహాయం చేయమంటే సరి. మన తరువాత ఆ ఇల్లు వాడికే కదా"

"మన తరువాత మనకున్న ఆస్తులంటూ ఏమేనా ఉంటే, అబ్బాయితో పాటూ అమ్మాయి కూడా సమాన హక్కుదారు, నీకు తెలీదా. పైగా, అబ్బాయికి చేయగలిగితే మనం ఏమేనా సహాయం చేయాలి కానీ వాడి దగ్గర మనం చేయి చాచడమేమిటి?"

"తిన్నగా అడగకుండా, అప్పు చేసి ఇల్లు కొనాలనుకుంటున్నారా అని వాడితో చెప్తే, వాడంతట వాడే ఎంతో కొంత సహాయం చేస్తానంటాడేమో"

"ఒకప్పుడు వాడు అలా సహాయం చేసే ప్రసక్తి చేయక, ఆ తరువాత ఇల్లు కొన్నారా ఎప్పుడు కొంటున్నారు ఎక్కడ కొంటున్నారు అని అడిగితే ఏమని చెప్పాలి"

"అయితే ఇంతకీ ఏమంటారు"

"ఇన్ని అప్పులు చేసి స్వంత ఇల్లు కొని జీవితమంతా చారు అన్నం తిని బతకగలమా"

"మరేమి చేద్దాం, మీరు రిటైర్ అయిన తరువాత ఒక స్వంత ఇల్లు లేక పొతే కష్టం కదా"

"ఏమీ కష్టం లేదు. మన ఇద్దరం ఏదో వృద్ధాశ్రమంలో చేరిపోతే, మనకొచ్చే పెన్షన్ లో సగం వారి దగ్గర ఉండడానికి తినడానికి ఖర్చు అయిపోయినా, మిగతా సగంలో మన జీవితం ప్రశాంతంగా గడచిపోతుంది"

"అదేమిటి మనకి ఉన్న ఒకే ఒక అబ్బాయి దగ్గర కూడా ఉండమా"

"వాడు రండి అంటే వెళ్లడం. అక్కడ ఉండగలుగుతే సరి. ఉండలేకపోయినా, వాడు మనల్ని వాడితో ఉండమని పిలవకపోయినా - ఇప్పుడు నేను చెప్పినట్టు చేయడమే ఉత్తమం. అందుకే, నేను రిటైర్ అయిన వరకూ ఈ అద్దె ఇంట్లో గడుపుతూ ఎటువంటి ఆలోచనలు విచారం అప్పులు లేకుండా హాయిగా ఉంటే సరి"

"అంతే అంటారా"

"మనకి ఏమీ లేవంటే, అన్నీ ఉన్నా ఏమీ లేన్నట్టే. మనకి ఏమి లేదు? అని తృప్తిగా ప్రశ్నించుకుంటే అన్నీ ఉన్నట్టే. వ్యత్యాసమంతా మన మనసులో దాచుకొనే తృప్తిలో ఉంది."

"బాగా చెప్పేరు, తృప్తిగా పడుకుందాం పదండి"

"అలా అన్నావు బాగుంది, నీదే ఆలస్యం పద హాయిగా పడుకుందాం"

*****

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి