పెద్దమ్మ చూపిన మార్గం - కాశీవిశ్వనాధం పట్రాయుడు

Peddamma choopina margam

సాయంత్రం కావస్తోంది పిల్లలు ఆకాశం వైపు చూపిస్తూ "నాన్నా ఆకాశం ఏంటి ఇంత ఎర్రగా ఉంది" అని అడిగారు. " పెద్దమ్మ మిరప పళ్ళు ఎండబెట్టింది అందుకే అలా ఉంది. అని జవాబిచ్చాడు తండ్రి. కాసేపటి తర్వాత ఆకాశం తెల్లగా అయిపోయింది. "అదేంటి నాన్నా ఆకాశం తెల్లగా అయిపోయింది" అని అడిగాడు రుద్ర. " పెద్దమ్మ పిండి ఆరబోసింది అందుకే అలా ఉంది " అన్నాడు తండ్రి. " నువ్వు అన్నీ అబద్దాలు చెప్తున్నావ్ నాన్నా! అంత పైకి ఎవరైనా వెళ్లగలరా?" అని సందేహం వ్యక్తం చేశాడు రుద్ర. " పే…ద్దమ్మ కదా!! పే….ద్ద చేతులు ఉంటాయి ఇక్కడి నుంచే ఆకాశంలో ఎండబెడుతుంది" అని చెప్పాడు తండ్రి. " అబ్బా! అంత పెద్దదా ..అలా అయితే పెద్దమ్మని ఒకసారి చూపించు " అని ఆసక్తిగా అడిగారు పిల్లలు. "సరే పెద్దమ్మ దగ్గరికి వెళదాం పదండి" అని పిల్లల్ని తీసుకుని పెద్దమ్మ దగ్గరికి బయలుదేరాడు తండ్రి. పెద్దమ్మ ఎండుమిరపకాయలు, పిండి ఎందుకు ఎండబెడుతుంది నాన్నా? అని అడిగాడు రుద్ర. "నీ పొట్ట నిండా సందేహాలే..ఆకలితో వచ్చేవారందరికీ పెద్దమ్మ వండి వడ్డిస్తుంది అందుకోసం." అని జవాబిచ్చాడు తండ్రి. " ఎందుకు అలా చేస్తుంది?" అని అడిగారు పిల్లలు " మీ సందేహాలు నేను తీర్చలేను.పెద్దమ్మని అడిగి తెలుసుకోండి." అని చెప్తూ పేదరాశి పెద్దమ్మ సత్రం లోకి పిల్లల్ని తీసుకువెళ్ళాడు తండ్రి. అప్పటికే చాలామంది బాటసారులు అక్కడ ఉన్నారు. వారంతా వారి వారి రాజ్యాలలో జరిగిన వింతలు విడ్డురాల గురించి ముచ్చటించుకున్నారు. మాగాయ ముక్కలు వేసి చేసిన మజ్జిగ పులుసు వాసన వరండాలోకి వస్తోంది. పెద్దమ్మ ఎప్పుడు భోజనం పెడుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇంతలో వంట పూర్తి చేసుకుని వరండాలోకి వచ్చిన పెద్దమ్మ ని తేరిపార చూసారు పిల్లలు. తండ్రి చెవిలో ఏదో గుసగుసలాడాడు రుద్ర. అది చూసిన పెద్దమ్మ "మీకేం భయం లేదు నాకు దగ్గరగా వచ్చి కూర్చోండి" అని ఆప్యాయంగా పిలిచింది. ఆ మాట వినగానే పెద్దమ్మ చుట్టూ చేరిపోయారు పిల్లలు. "పెద్దమ్మా నేనొకటి అడుగుతాను చెప్తావా?" అన్నాడు రుద్ర. "ఓ దానికేం భాగ్యం అడుగు చెప్తాను." "అందరికీ అన్నం పెడతావెందుకు?" "ఓ ఆదా! చెప్తానులే..మీరంటే నాకు చాలా ఇష్టం. అందుకే రోజూ కథలు చెప్తాను " అంది పెద్దమ్మ. "ఔనౌను మాకూ ఇష్టమే" అన్నారు అక్కడున్న బాటసారులు. పెద్దమ్మ చుట్టూ చేరిన పిల్లలంతా కబుర్లతో కాలక్షేపం చేశారు. భోజనాలకి సమయం ఆసన్నమైంది. వడ్ఢన కి వరుసక్రమంలో ఆకులు వెయ్యడం, త్రాగడానికి నీళ్ళు పెట్టడం లాంటి పనులన్నీ పిల్లలకు చెప్పి చేయించింది. పిల్లలంతా ఉత్సాహంగా చేశారు. "పిల్లలూ మీరంతా ఈ వరుసలో కూర్చోండి" అంది పెద్దమ్మ. "పెద్దమ్మా నేను ఉప్పు వేస్తా" అన్నాడు రుద్ర. "నేను చారు వేస్తా" అన్నాడు పెద్దాడు. చేసింది చాలు. "బుద్ధిగా వచ్చి కూర్చుని తినండి" అంది పెద్దమ్మ. ఎలాంటి పేచీలు పెట్టకుండా కడుపునిండా సుబ్బరంగా అన్నం తిన్నారు పిల్లలు. పని ముగించుకుని అందరినీ వాకిట్లో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పసాగింది. "పిల్లలూ రోజూ కంటే బుద్ధిగా భోజనం చేసారని మీ నాన్న చెప్పారు నిజమేనా? అని అడిగింది పెద్దమ్మ."ఔను అని ఠక్కున సమాధానమిచ్చారు పిల్లలు. రోజూ కంటే భోజనాలు అలస్యమయ్యాయి. అయినా మీరు ఆకులు వేసి, నీళ్లు పోసి, సాయం చేశారు మీకు ఆకలి వెయ్యలేదా పిల్లలూ అని దీర్ఘం తీస్తూ అడిగింది పెద్దమ్మ. "ఊహు" అన్నారు పిల్లలు. ఆకలితో ఉన్నవారు అవురావురు మంటూ తింటూ ఉంటే మన ఆకలిని కూడా మరచి చాలు అనే వరకు వారికి అన్నం పెడతాం. ఆకలి తీర్చడం లో ఉన్న ఆనందమే వేరు. మానవునికి ఏది ఇచ్చినా చాలు, వద్దు అని అనడు. కడుపు నిండగానే తృప్తిగా చాలు అంటాడు. అన్నదానానికి మించిన దానం లేదు అని వివరించింది పెద్దమ్మ. ఆకలి తో ఉన్న వారికి పెద్దమ్మ ఎందుకు వండి వడ్డిస్తుందో పిల్లలకు అర్ధమయ్యింది. సేవాభావం అలవడటం కోసం పిల్లలచేత ఆ పనులు చేయించిందని బాటసారులకు అర్ధమయ్యింది. పెద్దమ్మ చెప్తూ ఉండగానే రుద్ర నిద్రలోకి జారుకున్నాడు. పెద్దమ్మ ఆకాశం లో ఎలా ఎండబెడుతుందో ఇప్పటికీ వాడికి అర్ధం కాలేదు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు