అవి నేను విశాఖలో పార్టీ టైం ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్న రోజులు. రోజంతా కంపెనీలోను, రాత్రి తొమ్మిది వరకు కాలేజిలోను గడిచేది. అందువల్ల ఒక స్కూటరు అవసరమయింది. కాని ఆర్థిక సమస్యల వల్ల ఓ విక్కీ మోపెడ్ తీసుకోగలిగాను.దాని ఎలక్ట్రిక్ కోయిల్ చాలా వీక్ గా ఉండడం వల్ల ఓ స్ట్రాంగ్ కోయిల్ వేయించాను. అప్పుడది అనుభవం గల గుర్రంలా నమ్మకంగా సేవ చేసేది. అది బ్లూ కలర్ బాడీతో నిగనిగలాడేది. అందువల్ల దానికి బ్లూ హార్స్ అని పేరు పెట్టుకున్నాను. అదంటే నాకు ప్రాణం. ఎప్పుడూ ఎవరికీ ఇచ్చేవాడిని కాదు. సాయంత్రం దానిమీద కాలేజికి వెళ్లాక అక్కడ వేడి వేడి టమాటా బాత్ తిని కాస్త టీ త్రాగితే ప్రాణం లేచి వచ్చేది.
అప్పటికి నాకు పెళ్లయి ఎన్నాళ్లో కాలేదు. కాని సరదాలు, షికార్లు ఏమీ లేవు. మాది ఉమ్మడి కుటుంబం. ఇంట్లో స్వతంత్రం ఉండేది కాదు. అక్కడ అందరూ బాసులే. అందువల్ల ఆదివారాలు నా శ్రీమతితో బ్లూ హార్స్ మీద ఉదయం వేళ చల్లగాలిలో నేషనల్ హైవే మీద కొంత దూరం వెళ్లి ఓ చోట కూర్చుని నాలుగు కబుర్లు చెప్పుకుని కాస్త రిలాక్స్ అయ్యేవాళ్లం.
ఇలా ఉండగా ఒక రోజు మా కాలేజీ వాళ్లు ఓ మంచి డ్యాన్స్ ప్రోగ్రాం ఏదో సందర్భంగా ఏర్పాటు చేసి మా అందరినీ పిలిచారు. ఇంజనీరింగ్ కాలేజీ డౌనులో ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్లో అన్ని ఏర్పాట్లూ చేశారు. ఆదివారం రాత్రి ప్రోగ్రాం ప్రారంభం అయింది. ఇంట్లో పనుల ఒత్తిడి వల్ల శ్రీమతి రాలేదు. నేనొక్కడినే బ్లూ హార్స్ మీద వెళ్లి అటెండ్ అయ్యాను.
ఇలా ఉండగా ఒక రోజు మా కాలేజీ వాళ్లు ఓ మంచి డ్యాన్స్ ప్రోగ్రాం ఏదో సందర్భంగా ఏర్పాటు చేసి మా అందరినీ పిలిచారు. ఇంజనీరింగ్ కాలేజీ డౌనులో ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్లో అన్ని ఏర్పాట్లూ చేశారు. ఆదివారం రాత్రి ప్రోగ్రాం ప్రారంభం అయింది. ఇంట్లో పనుల ఒత్తిడి వల్ల శ్రీమతి రాలేదు. నేనొక్కడినే బ్లూ హార్స్ మీద వెళ్లి అటెండ్ అయ్యాను.
ప్రోగ్రాం మధ్యలో వెంకట్ అనే కొలీగ్ వచ్చి స్కూటర్ తాళాలు అడిగాడు. ప్రోగ్రాంలో లీనమైన నేను సరేనని ఇంకేమీ ప్రశ్నలు వేయకుండా అతనికి తాళాలు ఇచ్చాను. అతను ప్రోగ్రాం పూర్తి కావడానికి అరగంట ముందు తాళాలు తిరిగి తెచ్చి ఇచ్చేసి వెళ్లిపోయాడు.
కొంతసేపటికి ప్రోగ్రాం అయిపోయింది. అందరం బయటికి వచ్చేశాం. నేను నా విక్కీ దగ్గరకు చేరుకుని చూస్తూనే అలా దిగ్భ్రమలో నిలబడిపోయాను. దాని వైర్లు అన్నీ తెగిపోయి ఉన్నాయి. బ్రేక్ వైరు, క్లచ్ వైరు, గేర్ వైరు, ఏక్సిలరేటర్ వైరు, ఏ ఒక్కటీ వదల్లేదు. అది కాక దాని బాడీ నిండా స్క్రాచెస్ ఉన్నాయి. ఇదంతా చూస్తే కావాలనే దాన్ని అన్ని రకాలుగా నాశనం చేశాడా అనిపించింది. అసలది నా బండేనా అని అనుమానం వచ్చి నంబరు చూసుకున్నాను. వెంకట్ ఎలా బండి నడిపాడో గాని ఇంత స్వల్ప వ్యవధిలో ఇన్ని డామేజ్ లు చేయగలగడం నిజంగా నమ్మశక్యంగా అనిపించలేదు. పోనీ ఇదంతా కనీసం నాకు చెప్పనైనా చెప్పకుండా ఎలా వెళ్లిపోయాడో తలచుకుంటే రక్తం సలసలా మరిగిపోయింది. ఇప్పుడు బండి తోసుకుని వెళ్దామన్నా కదలడం లేదు. నా అవస్థ చూసి ఒక స్టూడెంటు క్లచ్ వైరు పైకి లాగి, దాన్ని అలా పట్టుకుని నడిపించుకుని వెళ్లిపోమని సలహా ఇచ్చాడు. ఆ ట్రిక్కు పని చేసింది. నెమ్మదిగా నడిపించుకుని, ఎక్కడైనా డౌను కనబడితే సీటు మీద కూర్చుని, ఎలాగైతేనేం న్యూకోలనీ లోని మా ఇంటికి చేరుకున్నాను. అప్పటికి రాత్రి 12 దాటింది. నా శ్రీమతితో సహా అందరూ కంగారు పడుతున్నారు. నన్ను చూసి సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు. భోజనాలు అయి పక్కమీద చేరేసరికి అర్థరాత్రి ఒంటిగంట దాటింది.
ఉదయం లేవగానే. బండి తీసుకెళ్లి మెకానిక్ చేత అన్నీ రిపేరు చేయించి ఓ గంట ఆలస్యంగా ఆఫీసుకి వెళ్లాను. అప్పటికే వెంకట్ ఆఫీసులో ఉన్నాడు. నా వైపు మిడుతూ మిడుతూ చూస్తున్నాడు. నేను కోపంగా వెళ్లి ఎందుకిలా చేశారని అడిగాను. జవాబు లేదు. పోనీ ఏమయిందో చెప్పు అన్నాను. కనీసం నాకు ముందుగా ఎందుకు చెప్పలేదని నిలదీశాను. నాతో ఉండి నాకు సాయం చేయాలని అనిపించలేదా అని అడిగాను. దేనికీ జవాబు లేదు. ఇక నేను చేసేది చేయగలిగేది ఏమీ లేదని ఊరుకున్నాను. నా మిత్రులతో చెప్తే ‘వాడంతే, వాడి కాలూ చెయ్యి రెండూ మంచివి కావు’ అని అందరూ చెప్పారు.
తర్వాత కొన్నాళ్లకి ఒక స్కూటర్ ఏక్సిడెంటు లో అతని వెన్నెముక కదిలిపోయింది. అసలు బ్రతుకుతాడని ఎవరూ అనుకోలేదు. లేచాడు గాని శరీరం అతని మాట వినడం పూర్తిగా మానేసింది. అతని నడక మారిపోయింది. ఒక కాలు ఈడుస్తూ అతి కష్టం మీద నడిచేవాడు. ఎందరో డాక్టర్లకి చూపించుకున్నాడు. ఎవ్వరూ ఏమీ చెయ్యలేకపోయారు. ఫిజియో థెరపీతో చేతులు కొంచెం స్వాధీనం లోకి వచ్చి కాస్త గ్రిప్ దక్కింది. తర్వాత జీవితమంతా అలాగే గడపవలసి వచ్చింది. అతను చేసిన పనులకి ఫలితం ఇలా అనుభవిస్తున్నాడు అని అందరూ అనుకునేవారు. అతన్ని చూసినప్పుడల్లా అతని పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అని అనిపించేది. ఒకింత జాలిగా కూడా అనిపించకపోలేదు.
మనం ప్రాణప్రదంగా చూసుకునే స్కూటరు గాని, కారు గాని ఎవరికీ ఇవ్వకపోవడమే మంచిది. ఇచ్చాక మళ్లీ అలాగే భద్రంగా తిరిగి వస్తుందని చెప్పలేము..ఎందుకంటే మనం నడిపినంత జాగ్రత్తగా మరొకరు నడపడం అనేది జరగదు.
ఆ సంఘటన ఇప్పటికీ గుర్తుకి వచ్చినప్పుడల్లా నా మనస్సు చివుక్కుమంటూ ఉంటుంది.