ఇంద్రద్యుమ్నుడు - కందుల నాగేశ్వరరావు

Indradyumnudu

ంద్రద్యుమ్నుడు

1

పూర్వం పద్మకల్పంలో మహావిష్ణువు వరాహరూపంలో భూమిని ఉద్ధరించి, భూమిపైనున్న పర్వతాలను సరిచేసాడు. అలా రూపు దిద్దుకున్న భూమి మీద సృష్టికార్యం మొదలు పెట్టాలని తలచిన బ్రహ్మదేవుడు, కావలసిన శక్తి సామర్థ్యాలు ప్రసాదించమని శ్రీహరిని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడి స్తుతికి సంతృప్తిచెందిన లక్ష్మీపతి శంఖ చక్ర గదాయుధాల్ని ధరించి ప్రత్యక్షమయ్యాడు.

“కుమారా! ఈ కల్పంలో తిరిగి జీవుల్ని సృష్టించాలని భావించి నన్నుప్రార్థించావు. తూర్పున ఉన్న లవణసముద్ర తీరంలో, మహానదికి దక్షిణ భాగంలో నీలాచలం అనే పర్వతం ఉంది. అ పర్వతం మధ్యభాగంలో కల్పవృక్షం ఉంటుంది. దానికి పడమర భాగంలో “రోహిణి కుండం” ఉంటుంది. ఆ కుండం ఒడ్డున నా రహస్య స్థానం ఉంది. ఆ దివ్యప్రదేశంలో నివసించేవారు పూర్వజన్మ పుణ్యఫలాన్ని పొందుతూ నాశనం లేకుండా ఉన్నారు. నేనక్కడ స్వయంగా నివసిస్తూ ఉన్నాను. ఆ దివ్యక్షేత్రం సృష్టి స్థితి లయాలకు అతీతమైనది. ఇప్పుడు ఇక్కడ నన్ను ఏవిధంగా దర్శిస్తున్నావో ఆ క్షేత్రంలో కూడా నన్ను అదే రూపంలో చూడగలవు. ఎన్నోయజ్ఞాలు చేస్తే వచ్చే ఫలితం నన్ను స్తుతిస్తూ కేవలం ఒక్క రోజు అక్కడ నివసిస్తే వస్తుంది. నీవు వెంటనే అక్కడకు వెళ్ళి నన్ను దర్శించి సృష్టి కార్యాన్ని ప్రారంభించు” అని చెప్పాడు.

లక్ష్మీదేవి బ్రహ్మతో “కుమారా! నీలాచలం మధ్యన ఉన్న పురుషోత్తమ క్షేత్రం శంఖు ఆకారంలో ఉంటుంది. ఆ క్షేత్రాన్ని పరమశివుడు ఎల్లప్పుడూ వీక్షిస్తూ ఉంటాడు. దానికి దగ్గరలో ‘కపాలమోక్షం’ అనే పేరుతో ప్రసిద్ధమైన శివలింగం ఉంటుంది. పురుషోత్తమ క్షేత్రం అతి పవిత్రమైన తీర్థరాజంగా విలసిల్లుతోంది. పురుషోత్తమ క్షేత్రాన్ని మంగళ, లంబ, కాళరాత్రి, మరీచిక, విమల, సర్వమంగళ, అర్థాసిని, చంద్రూప నామాలతో రుద్రాణి కాపాడుతూ ఉంటుంది. అలాగే కపాలమోక్షణ, క్షేత్రపాల, యమేశ్వర, మార్కండేయేశ్వర, ఈశాన, భిల్వేశ్వర, నీలకంఠ, వటేశ్వర నామాలతో రుద్రుడు కాపాడుతూ ఉంటాడు. ఇలా బ్రహ్మకు ఉపదేశించి లక్ష్మీనారాయణులు అంతర్ధానమయ్యారు.

శ్రీహరి ఆదేశం ప్రకారం బ్రహ్మదేవుడు నీలాచలం పైనున్న ఆ దివ్యక్షేత్రానికి వెళ్లి భక్తితో కమలనాభుణ్ణి స్మరించాడు. తాను పూర్వం చూసిన విధంగానే స్వామి చతుర్భుజుడై కనిపించాడు. పురుషోత్తముని దర్శనంతో చతుర్ముఖుడు తన్మయత్వంలో మునిగిపోయాడు. ఇంతలో అక్కడకు ఒక కాకి వచ్చింది. బ్రహ్మ చూస్తుండగానే రోహిణి కుండంలో స్నానం చేసి, తీరంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకుంది. ఆ కాకి కొద్ది క్షణాల్లో ప్రాణాలు వదలుతూ క్రింద పడిపోయింది. వెంటనే పురుషోత్తముడు తన దివ్యమంగళ విగ్రహంతో దాని ముందు నిలిచాడు. ఆ దృశ్యం చూసిన బ్రహ్మ ఈ క్షేత్రంలో విష్ణుభక్తులకు దుర్లభమైనది ఏదీ లేదని గ్రహించాడు.

అప్పుడు కాకి ప్రాణం పట్టుకొని వెళ్లడానికి తన యమదండంతో యమధర్మరాజు అక్కడకు వచ్చాడు. అడ్డుగా ఉన్న శ్రీహరిని చూసిన యముడు భక్తితో ఆయన్ను స్తుతించాడు. అప్పుడు లక్ష్మీపతి “యమధర్మరాజా! నీకు, మిగిలిన దిక్పాలకులకు ఇక్కడఅధికారం లేదు. నాకు లక్ష్మీదేవికి ఇదే నివాస స్థానం. ఇక్కడ నన్ను సేవించిన వారికి కర్మబంధాల నుండి విముక్తి లభిస్తుంది” అని చెప్పాడు.

అప్పుడు యమధర్మరాజు పురుషోత్తముని ప్రార్థించాడు. “మీరు ఇలా ఒక్కరోజు మీ విగ్రహాన్ని దర్శించిన మాత్రాన మోక్షం ఇస్తూ ఉంటే నేను ఎవరినీ శిక్షించ లేను, నా కర్తవ్యం నేను నెరవేర్చలేను. మీరు నాకు ఏదైనా ఉపాయంచెప్పి నన్ను కరుణించండి” అని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు కూడా యమధర్మరాజు కోరికను మన్నించమని శ్రీహరిని ప్రార్థించాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు తన మాయతో విగ్రహాన్ని కనపడకుండా ఇసుకతో కప్పివేశి అక్కడ నుండి నిష్క్రమించాడు. యమ బ్రహ్మలు స్వామి ఆజ్ఞను పాలించి తమ లోకాలకు వెళ్ళిపోయారు.

2

ఇప్పుడు జరుగుతున్న శ్వేతవరాహకల్పంలో కొన్ని మన్వంతరాల క్రితం ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు ఎన్నో యజ్ఞాలు చేశాడు. ఆయన యజ్జములలో ఉపయోగించిన ధర్భలతో భూమి రెండు అంగుళముల యెత్తు పెరిగింది. అగ్నిహోత్రాల వేడికి భూమి ఉడికిపోయి, భూగర్భం నుండి నీరు ధారగా బయటకు వచ్చి మహానది అనే పేరుతో భూతలంపై ప్రవహించింది. ఇంద్రద్యుమ్నుడు తను చేసిన పుణ్యకార్యాల వలన దేహం చాలించిన తరువాత స్వర్గం లోకం చేరాడు..

ఒకనాడు బ్రహ్మదేవుడు ఇంద్రద్యుమ్నుడితో “నీ పుణ్యం పూర్తయింది. ఇక నీవు ఈ స్వర్గంలో నివసించ లేవు. నీవు భూలోకానికి వెళ్ళి మరల పుణ్యం సంపాదించుకుంటేనే తిరిగి ఇక్కడకు రాగలవు” అని చెప్పాడు. అందువలన ఆ మహారాజుకు మానవజన్మ ఎత్తడం తప్పలేదు.

3

ఇంద్రద్యుమ్నుడు సత్యయుగంలో తిరిగి భూలోకంలో జన్మించాడు. పూర్వజన్మ సుకృతంవల్ల మరల రాజకుటుంబంలో జన్మించాడు. అవంతీ నగరం రాజధానిగా చేసుకొని మాళవరాజ్యానికి శక్తివంతమైన మహారాజుగా ఎదిగాడు. ఆ రాజు ఇంద్రుడంతటి బలవంతుడు, అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించి యుద్ధం చేయడంలో నేర్పరి. సూర్యతేజంతో పోల్చగల చక్కటి రూపం, వేదశాస్త్రాలలో ప్రావీణ్యత, బుద్ధి, తెలివితేటలు కలవాడు. నిజాయితీతో ధర్మమార్గంలో ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు.

అవంతి ఒక పెద్ద ప్రాకారాలతో కూడిన అందమైన నగరం. వివిధదేశాల నుండి వర్తకులు వ్యాపారం చేయడానికి వారి వారి సరుకులతో అక్కడకు వస్తూ ఉంటారు. నగర వీధులు దుకాణాలతో బారులు తీరి ఉంటాయి. ప్రజలు ధనధాన్యాలతో సుఖసంతోషాలతో జీవిస్తూ ఉన్నారు.

అవంతీనగరంలో పరమశివుడు ‘మహాకాలుడు’ నామంతో విలసిల్లుతున్నాడు. మహాకాలుని దేవాలయాన్ని పూర్వకల్పంలో స్వయంగా బ్రహ్మదేవుడు నిర్మించాడని ప్రతీతి. ఎందరో భక్తులను ఆకర్షిస్తూ ఆ క్షేత్రం శివభక్తులకు పవిత్ర తీర్థంగా విరాజిల్లుతోంది. ఒకరోజు మహారాజు దేవాలయంలో శివదర్శనం పూర్తిచేసుకొన్నాడు. ఇంద్రద్యుమ్నుడు గొప్ప విష్ణు భక్తుడు. అక్కడి నుండి బయలుదేరి శిప్రానది ఒడ్డున ఉన్న గోవిందస్వామి, విక్రమస్వామి దేవాలయాలను దర్శించాడు. వాటితో తృప్తిపడని రాజు ఒక గొప్ప విష్ణుదేవాలయం నిర్మించాలని తలంచాడు. భారతావనిలో అన్నిటికంటే పవిత్రమైన పుణ్యతీర్థంలో ఆ దేవాలయం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.

ఒకనాడు రాజ్యసభలో విష్ణు ఆలయాన్ని నిర్మించాలనే తన ఆలోచనను ప్రకటించి, సభాసదులను భారతావనిలో అన్ని తీర్థాలలో గొప్ప తీర్థస్థలం ఎక్కడ ఉందో తెలియజేయమని అడిగాడు. సభలో ఉన్న ఒక యాత్రీకుడు “రాజా, భారతావనికి తూర్పున ఉన్న ఓడ్రదేశంలో నీలాచల పర్వతం దిగువన ఉన్న పురుషోత్తమ క్షేత్రం అత్యంత పవిత్ర ప్రదేశం. అక్కడ విష్ణువు ‘ఇంద్రనీల మణి’ రూపంలో విరాజిల్లుతూ ఉంటాడు. ఆ ప్రదేశంలో నువ్వు విష్ణు దేవాలయం నిర్మించు” అని చెప్పి అదృశ్యమయ్యాడు.

స్వయాన విష్ణుదేవుడే వచ్చి తనకు ఆదేశమిచ్చినట్లుగా భావించిన రాజు అక్కడకు వెళ్ళే మార్గం గురించి తన మంత్రులను ప్రశ్నించాడు. కాని మంత్రు లెవరికీ ఆ ప్రదేశం గురించి తెలియదు. అప్పుడు తన రాజగురువు తమ్ముడు విద్యాపతిని ఆ ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసుకొని రమ్మని పంపించాడు. విద్యాపతి అశ్వారూఢుడై కొందరు బటులను వెంటబెట్టుకొని ఆ ప్రదేశం వెదకడానికి బయలుదేరాడు. వింద్యపర్వత పంక్తులు దాటి చాలాకాలం ప్రయాణం చేసాడు. చివరకు నీలాచల పర్వతం దిగువన ఉన్న ‘ఏకామ్రవనం’ అనే అరణ్యం చేరి ఒక పెద్ద వటవృక్షం క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో వారికి పశ్చిమదిక్కు నుండి ఆకాశంలో తమను పిలుస్తున్నట్లుగా శబ్దం వినబడింది. ఆ శబ్దాన్ని అనుసరిస్తూ ప్రయాణం చేసి ‘శబరద్వీపం’ అనే ఆశ్రమం చేరాడు.

అక్కడ చాలామంది భక్తుల సమూహం ఉంది. అందులో ‘విశ్వావసు’ అనే భక్తుడు “ఎవరు మీరు? ఎక్కడ నుండి వస్తున్నారు? ఈ ప్రదేశం గురించి ఎవరికీ తెలియదు, మీరెలాగా రాగలిగారు” అని విద్యాపతిని ప్రశ్నించాడు. విద్యాపతి “నేను ఇంద్రద్యుమ్న మహారాజు గారి రాజగురువు తమ్ముడు విద్యాపతిని. మా రాజు పురుషోత్తమ క్షేత్రంలో శ్రీమహావిష్ణువుకు ఒక దేవాలయాన్ని నిర్మించాలని ఆశిస్తున్నారు. ఆ క్షేత్రానికి వెళ్ళే మార్గం దయతో వెంటనే తెలియజేయండి” అని విస్వావసుని అర్థించాడు.

విస్వావసు “ఇంద్రద్యుమ్న మహారాజు ఈ ప్రదేశం వెతుక్కుంటూ ఇక్కడకు వస్తాడని, మహారాజు దేవాలయాన్ని నిర్మించి తరువాత జీవితాంతం ఈ ప్రదేశాన్నే నివాసం చేసుకుంటాడని కూడా భవిష్యవాణి మాకు ఎప్పుడో చెప్పింది. నేను స్వామి ఉండే ప్రదేశానికి నిన్ను తీసుకు వెళ్తాను, నువ్వు ఒక్కడివీ నాతో రా” అని చెప్పాడు. విస్వావసు ఆ పర్వత పంక్తుల మధ్య నున్న కొండ దారుల్లో నడుస్తూ ఎత్తైన నీలాచల పర్వతం పైనున్న ఒక కుండం దగ్గరకు విద్యాపతిని తీసుకు వెళ్లి “ఇదిగో ఇదే రోహిణి కుండం, అదిగో తటాకానికి తూర్పున అల్లంత దూరాన ఉన్నదే పవిత్రమైన కల్పవృక్షం. జగన్నాథస్వామి దేవాలయం రెండింటికి మధ్య ఉంటుంది” అని చూపిస్తూ చెప్పాడు.

విద్యాపతి ఆనందానికి హద్దులు లేవు. వెంటనే రోహిణీకుండంలో స్నానం చేసి జగన్నాథుని దర్శనం చేసుకున్నాడు. విశ్వావసు కోరిక మేరకు విద్యాపతి ఆయన నివాసానికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరించాడు. “మిత్రమా, ఇటువంటి నిర్జన ప్రదేశంలో ఇంత గొప్ప విందు ఎలా ఏర్పాటు చేసావో తెలుసుకోవాలని ఉంది” అని విశ్వావసుని ప్రశ్నించాడు. దానికి విశ్వావసు “ ఇక్కడకు జగన్నాథుని దర్శనార్ధం దేవలోకం నుండి ఎంతో మంది దేవతలు తరచూ వస్తూ ఉంటారు. వారు స్వామి కోసం రకరకాల నైవేద్యాలు తెస్తూ ఉంటారు. స్వామి స్వీకరించగా మిగిలిన వాటిని నేను నీలాంటి అతిథుల కొరకు జాగ్రత్త చేసి ఉంచుతాను” అని సమాధానం ఇచ్చాడు.

విశ్వావసు దగ్గర శలవు తీసుకొని విద్యాపతి తిరిగి తన రాజ్యానికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు విశ్వావసు “మిత్రమా! నీకు ఒక రహస్యం చెబుతున్నాను. నీవు మీ మహరాజుతో తిరిగి ఇక్కడకు వచ్చేసరికి మీకు స్వామి దర్శనం కాదు. నీలమణిరత్నంతో చేయబడిన నీలమాధవుని విగ్రహం అదృశ్యమవుతుంది. కాని ఈ విషయం నీ రాజుకు చెప్పవద్దు. ఈ విషయం తెలిస్తే మీ రాజు గుండె పగిలి పురుషోత్తమ క్షేత్ర దర్శనం మానుకుంటాడు. మీ రాజు ద్వారా ఈ క్షేత్రంలో ఒక నూతన దేవాలయ నిర్మాణం జరగాల్సి ఉంది” అని చెప్పాడు. తనకు అప్పగించిన కార్యం నెరవేర్చిన సంతోషంతో విద్యాపతి తిరిగి వచ్చి మహారాజుకు పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళే మార్గాన్ని వివరించి చెప్పాడు. విశ్వావసు ఇచ్చిన ఎప్పటికీ వాడిపోని పూలమాలను రాజుకు సమర్పించాడు.

4

ఇంద్రద్యుమ్నుడు తన మంత్రి సామంతులతోను, ఇతర పరివారంతోను కలిసి విద్యాపతి చెప్పినట్లుగా పురుషోత్తమ క్షేత్రానికి వెళ్లడానికి అన్ని రకాల సన్నాహాలు చేసుకున్నాడు. ఆ సమయంలో నారదమహర్షి అక్కడకు వచ్చి తానుకూడా వారితో పురుషోత్తమ క్షేత్రం వస్తున్నానని చెప్పాడు. మహర్షి మాటలు విన్న రాజు ఎంతో సంతోషించాడు. మహర్షిని సత్కరించి అన్నిరకాల అతిథి మర్యాదలు చేసాడు. వారంతా ప్రయాణం చేసి మహానదికి దక్షిణాన ఉన్న ‘ఏకామరక్షేత్రం’ లో ఉన్న పురుషోత్తముణ్ణి తరువాత ‘కోటీశ్వర క్షేత్రం’ లోని త్రిభువనేశ్వరుణ్ణి దర్శించారు. త్రిభువనేశ్వరుడు “నీకు పురుషోత్తమ క్షేత్రంలో జగన్నాథుడి దర్శనం కలుగు గాక!” అని రాజుని దీవించాడు.

అక్కడ నుండి మహారాజు పరివారంతో నీలాచల పర్వతానికి దిగువన దుర్గా సమేతంగా ఈశ్వరుడు వెలసిన ‘నీలకంఠ మహాదేవ దేవాలయం’ తరువాత ఒక గంధం చెట్టు క్రింద ఉన్న ‘నరసింహస్వామి దేవాలయం’ దర్శించాడు. అక్కడ నుండి విద్యాపతి చెప్పినట్లుగా పురుషోత్తమ క్షేత్రం చేరాడు. స్వామి దర్శనం కోసం ఎంతో కుతూహలంతో అన్ని దిక్కులా వెతికాడు. కాని ఎక్కడా అత్యంత పవిత్రమైన ‘నీల మాథవ’ పేరుతో పిలువబడే ‘జగన్నాథ దేవాలయం’ కాన రాలేదు.

ఇంద్రద్యుమ్నుడు ఒక పెద్ద వటవృక్షం క్రింద కూర్చొని తన ప్రయత్నం నెరవేర నందుకు విచారిస్తున్నాడు. అప్పుడు నారద మహర్షి “రాజా! పూర్వం నీలమాథవ దేవాలయం ఈ వటవృక్షానికి, నరసింహస్వామి దేవాలయానికి ఉత్తరాన ఉండేది. అందులో స్వామి నీలమణి రూపంలో విరాజిల్లేవారు. కాని స్వామి ఇప్పుడు అదృశ్యరూపంలో ఉన్నారు. స్వామి విగ్రహం సముద్రపు ఇసుకలో కూరుకుపోయింది. నీవు ముందు అశ్వమేధ యజ్ఞం చేసి ఈ పురుషోత్తమ క్షేత్రంలో ఒక క్రొత్త దేవాలయాన్ని నిర్మించు. అప్పుడు నీకు స్వామి దర్శనమవుతుంది” అని చెప్పాడు.

ఇంద్రద్యుమ్నుడు భక్తితో ఆ పవిత్ర స్థలానికి సాష్టాంగ నమస్కారం చేసి శ్రీహరిని “స్వామీ! నాకు ఈ పవిత్ర తీర్థంలో నీ దేవాలయం నిర్మించాలని ఉంది. దయతో అదృశ్యమైన నీ పవిత్రమైన విగ్రహాన్ని మరల ప్రకటించు” అని ప్రార్థించాడు. “ఓ రాజా! అధైర్యపడకు. నీ పని మొదలు పెట్టు అతి త్వరలో నీ కోరిక నెరవేరుతుంది, నీకు నా దర్శనభాగ్యం లభిస్తుంది” అనే మాటలు ఆకాశం నుండి వినబడ్డాయి.

ఇంద్రద్యుమ్నుడు మొదట ఆ స్థలంలో నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించాడు. తరువాత అశ్వమేధయాగం పూర్తి చేసాడు. కళింగ, ఉత్కళ, కోసల రాజులకు వార్తాహరుల ద్వారా ఆహ్వానం పంపాడు. దేవాలయ నిర్మాణానికి వారి సహాయాన్ని అర్థించాడు. వారు వింద్యపర్వతం నుండి శిలలను తెప్పించారు. దేవాలయ నిర్మాణం చేయడానికి శిల్పులను రప్పించారు. ఏనుగులు, గుఱ్ఱాలు, ఆహార పదార్థాలు మొదలైన అవసరమైన అన్ని రకాల వస్తువులు సమకూర్చారు. ఒక శుభముహూర్తంలో పురుషోత్తమ క్షేత్రంలో నీలాచలానికి దిగువన సముద్రతీరానికి దగ్గరలో దేవాలయ శంకుస్థాపన చేసాడు. దేవాలయ నిర్మాణం చురుగ్గా సాగి అతిత్వరలో పూర్తయింది. కాని సముద్రపు ఒడ్డున నున్న ఇసుకలో ఎంత వెదికినా స్వామి విగ్రహం మాత్రం దొరకలేదు.

విష్ణుభక్తుడైన ఇంద్రద్యుమ్నుడు భక్తితో స్వామిని ప్రార్థించాడు. ఆ రాత్రి విష్ణుమూర్తి మహారాజు కలలో కనిపించి “రాజా! విచారించకు. నీకు ఉదయం సముద్రతీరంలో ఒక పెద్ద చెట్టు సగం సముద్రపు ఇసుకలో కూరుకొని, మిగిలిన సగభాగం నీటిలో మునిగి ఉంటుంది. దానిని నరికి తీసుకు వస్తే నా విగ్రహం చేయడానికి పనికి వస్తుంది” అని చెప్పాడు. కలలో భగవంతుడు చెప్పినట్లుగా సముద్రతీరంలో రాజుకు ఒక వృక్షం కనింది. దానికి నాలుగు కొమ్మలు ఉన్నాయి. రాజు ఆ చెట్టు నరికి తీసుకు వచ్చాడు. నారదుడు ఆ చెట్టు నుండి జగన్నాథుడు, బలరామ, సుభద్ర, సుదర్శన చక్రం అనే నాలుగు విగ్రహాలు తయారు చేయించాలని రాజుకు చెప్పాడు. బటులు ఆ చెట్టును దేవాలయం లోపల నున్న వేదికపై చేర్చారు. కాని ఈ చెట్టు మాను నుండి విగ్రహాలు ఎవరు చెక్కగలరా అని ఆలోచిస్తున్నాడు రాజు.

ఆసరిగ్గా అదే సమయంలో ఆకాశవాణి “విష్ణుమూర్తి తనకు తానుగా అవతరిస్తాడు. ఒక ముసలి వడ్రంగిని దేవాలయం లోపలికి పంపి తలుపులు మూసివేయండి. లోపలి చప్పుడు బయటకు వినపడకుండా పెద్ద పెద్ద ఢంకాలు మ్రోగించండి. లోపల జరిగేది చూడాలని గాని, వినాలని గాని ఎవరైనా ప్రయత్నిస్తే వారి కళ్ళు చెవులు పనిచేయవు” అని చెప్పింది. రాజు ఆకాశవాణి చెప్పినట్లుగా ఒక ముదుసలి వడ్రంగిని దేవాలయం లోపలికి పంపి తలుపులు వేసారు.

పదిహేను రోజుల తర్వాత గుడి తలుపులు తెరుచుకున్నాయి. బలభద్రుడు, సుభద్ర, సుదర్శన చక్ర సహితంగా జగన్నాథుడు ఆ చెట్టు శాఖల నుండి అవతరించాడు. ఆకాశవాణి చెప్పినట్లుగా బలరామునికి తెలుపు రంగు, సుభద్రకు గులాబీ రంగు, జగన్నాథునికి ముదర నీలం రంగు, సుదర్శన చక్రానికి ముదర ఎరుపురంగు వేసి పట్టువస్త్రాలు కట్టి ఆభరణాలతో సుందరంగా అలంకరించారు.

ఇంద్రద్యుమ్నుడు భక్తి పారవశ్యంతో ఆ సుందర విగ్రహాలను చూస్తూ మైమరచిపోయాడు. అప్పుడు నారదుడు “రాజా! ఇప్పుడు స్వామిని ప్రార్థించి నీ కోరికలు తెలుపుకో” అని గుర్తు చేసాడు. “ఓం నమోః భగవతే వాసుదేవాయ” అనే విష్ణు ద్వాదశ మంత్రాన్ని, పురుష సూక్తాన్ని పఠించిన రాజు “స్వామీ! నా కింకేమి కోరికలు లేవు. నన్ను నీలో ఐక్యం చేసుకో” అని స్వామిని కోరాడు. మహారాజు వెంట వచ్చిన మిత్రులు, పరివారం అందరూ ఆ విగ్రహాలకు తన్మయత్వంతో నమస్కరించి మనస్సులోనే తమ తమ కోరికలు చెప్పుకున్నారు.

విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరపాల్సి ఉంది. దానిని నిర్వర్తించగల వారెవ్వరా అని రాజు ఆలోచిస్తున్నాడు. నారదుడు ఆ కార్యక్రమానికి కావలసిన వస్తు సామగ్రి పట్టిక తయారుచేసి ఇచ్చాడు. పౌరోహిత్యం వహించడానికి బ్రహ్మదేవుడు, ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి సకల దేవతలు, మహర్షులు వస్తారు. వారందరికీ కావలసిన ఏర్పాట్లు చెయ్యమని రాజుకు చెప్పాడు. అనుకున్నట్లుగా విగ్రహ ప్రతిష్ఠ నిర్వర్తించడానికి బ్రహ్మదేవుడు దేవగణాలు అందరూ ఏతెంచారు. వైశాఖ శుద్ధ అష్టమి, పుష్యా నక్షత్రం, గురువారం నాడు అత్యంత వైభవోపేతంగా జగన్నాథుని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. కార్యక్రమం పూర్తయిన తరువాత బ్రహ్మదేవుడు ఇంద్రద్యుమ్నునితో “రాజా! నీవు తలపెట్టిన కార్యక్రమం పూర్తి కావడానికి మేమందరమూ నీకు సహకరించాము. దానికి కారణం నీ విష్ణుభక్తి. ఆ జగన్నాథుడికి నీ మీద ఉన్న కృపాకటాక్షాలు” అని చెప్పి ఆశీర్వదించాడు. తరువాత మిగిలిన దేవగణాలతో కలిసి నిష్క్రమించాడు.

నారదమహర్షి మహారాజుకి రథయాత్ర జరపాల్సిన విధివిధానాలు చెప్పాడు. “జగన్నాథ, బలరామ, సుభద్రల కొరకు మూడు రథాలు సమకూర్చాలి. జగన్నాథుని రథానికి గరుడ పతాకం, బలరాముని రథానికి హలాయుధ పతాకం, సుభద్ర రథానికి పద్మపతాకం ఉండాలి. జగన్నాథ రథానికి పదహారు, బలరాముని రథానికి పదునాలుగు, సుభద్ర రథానికి పన్నెండు అశ్వములు ఉండాలి. రథయాత్ర తొమ్మిది రోజులు జరగాలి” అని చెప్పి ఆ కార్యక్రమం కూడా జరిపించాడు. రథయాత్ర తరువాత విగ్రహాలు దేవాలయంలో తమ స్థానాలు చేరుకున్నాయి.

అప్పుడు జగన్నాథుడు నీలమాథవ రూపంలో అక్కడ ఉన్న అందరికీ దర్శనమిచ్చాడు. ఇంద్రద్యుమ్నునితో “భక్తా! నా మీద నీకున్న అచంచల భక్తి విశ్వాసాలకు ముగ్ధుడనయ్యాను. నీవు పదివేల సంవత్సరాలు ప్రజారంజకంగా రాజ్యపాలన గావించిన తరువాత నా వైకుంఠధామం చేరుకుంటావు. నీవు క్రమం తప్పక ప్రతీ సంవత్సరం నా రథయాత్ర నిర్వర్తించు” అని పలికి నారదుడితో సహా అదృశ్యమయ్యాడు.

శుభం

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు