అవి నేను గుజరాత్ లో షిప్ యార్డులో పని చేస్తున్న రోజులు. ఏదో ముఖ్యమైన పని మీద వైజాగ్ వెళ్లవలసి వచ్చి Make My Trip ద్వారా ఇండిగో విమానంలో సీటు బుక్ చేసుకున్నాను. మా కంపెనీ నుండి నాలుగు రోజులు శలవు తీసుకున్నాను. మా బాస్ దత్తా ఏ మూడ్ లో ఉన్నాడో గాని వెంటనే అనుమతించారు.
ఆ రోజు రానే వచ్చింది. బ్యాగు సర్దుకుని రైలెక్కి ముంబాయి వెళ్లి విమానాశ్రయం చేరుకున్నాను. ఫార్మాలిటీలు పూర్తి చేసుకుని నా సీటు చేరుకునేసరికి అప్పటికే ఆ విండో సీట్లో ఎవరో కూర్చుని ఉన్నారు.
దగ్గరగా వెళ్లి చూస్తే అతను మరెవరో కాదు. నాతోనే 30 సంవత్సరాలు వైజాగ్ లో షిప్ యార్డులో పని చేసినవాడే. ఇప్పుడు గుజరాత్ లోనే పని చేస్తున్నాడు. నన్ను చూసి వెంటనే లేచిపోతాడేమో. అనుకున్నా. అబ్బే, చలనం లేదు. మొండి ఘటం.
వెళ్లి అతని పక్కన కూర్పుని పలకరించాను. నన్ను అప్పుడే చూసినట్టు చూసి ఓ వంకర నవ్వు నవ్వాడు.
నాకు ఒళ్లు మండింది. నన్ను చూశాక కనీసం ఓ సారీ చెప్పినా నాకు మనశ్శాంతిగా అనిపించేది. అతను ఓ పెద్ద అహంకారి అని నాకు తెలుసు. నేను తలచుకుంటే ఎయిర్ హోస్టెస్ తో చెప్పి వాడిని వెంటనే ఖాళీ చేయించేవాడిని. కాని స్నేహానికి విలువనిచ్చి ఊరుకున్నాను.
ఇలాంటివాళ్లు ఒక రకం బ్రీడ్. అన్నీ వాళ్లకే ముందు కావాలి. కంపెనీలో ప్రమోషన్ల ప్రక్రియలో కూడా పైరవీలు చేసి మా డివిజన్ కు అడ్డు పడి, పక్కకు తోసి అన్నీ వాళ్లే తీసేసుకున్నారు. ఫారిన్ ట్రిప్పులు కూడా ముందు వారికే. అన్నిటికీ విస్తళ్లు వేసుకుని సిద్ధంగా కూర్చుని ఉంటారు. మా జూనియర్లు కూడా ఈ టెక్నిక్ ఉపయోగించి ఛీఫ్ మేనేజర్లు కూడా అయిపోయారు. మేము మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే..
ఇదివరకు ఒకసారి నాశ్రీమతి తో విమానం ఎక్కినప్పుడు కూడా ఇదే జరిగింది. నా శ్రీమతి ఎంతో ఇష్టపడే విండో సీట్లో ఎవరో కూర్చుని ఉన్నాడు. లేవమన్నా లేవలేదు. నేను ఊరుకోలేదు. స్టాఫ్ కి కంప్లయింట్ ఇచ్చి ఖాళీ చేయించాను. నా శ్రీమతి సంతోషమే నాకు ముఖ్యం.
అయితే ఇలాంటివాళ్లకి ఎదురుదెబ్బలు తప్పవు. ఇలాగే విండో సీటు ఆక్రమించినవాడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ లో విమానం ఓ ప్రక్కకు ఒరిగి ప్రాణాలు కోల్పోయాడు. అక్కడ కూర్చోవలసినవాడు వీడి ధర్మమా అని బతికి బట్ట కట్టాడు.
తనది కానిదానిని ఆశించేవారికి చివరికి జరిగేది అదే మరి…..