మిస్టర్ వినాయక్ - యిరువంటి శ్రీనివాస్

Mister Vinayak

వినాయక్ కి తన పేరంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే తన పేరు వినాయకుడి దేవుడి పేరు. చాలా మంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు దేవుడి పేర్లు పెడతారు. వాళ్లందరికీ ఆ పేర్లు ఇష్టం ఉండదు. అవును చాలా మంది ఫ్రెండ్స్ వినాయక్ తో చెప్పారు కూడా. కానీ వినాయక్ కి తన పేరంటే మహా ఇష్టం. ఎందుకంటే, అమ్మ చెప్పింది ఎప్పుడు పూజ చేసినా వినాయకుడికి మొదట పూజ చెయ్యాలని. వినాయక్ కూడా వినాయకుడి దేవుడి పేరు పెట్టటంవల్లనేమో, తాను కూడా దేవుడనే అనుకుంటాడు. తమాషాగా వినాయక్ నాన్న పేరు శంకర్, అమ్మ పేరు పార్వతి. అందుకేనట తనకి వినాయక్ అని పెట్టారు. వినాయక్ కి ఒక అన్న కూడా వున్నాడు. అవును మీరనుకుంది నిజమే. వినాయక్ అన్న పేరు కుమార్. ఇదంతా వినాయక్ కి భలే విచిత్రంగా ఉంటుంది. అసలు శంకర్ పేరున్న నాన్న, పార్వతి పేరున్న అమ్మని పెళ్లి చేసుకోవటం, అన్న కి కుమార్ అని పేరు పెట్టటం, తనకి వినాయక్ అని పేరు పెట్టడం.

అమ్మ ఎప్పుడూ చెబుతుండేది, తొండం తప్ప తాను వినాయకుడి దేవుడి లాగానే ఉండేవాడినని. వినాయకుడి లాగానే చిన్న పొట్ట ఉండేది. ఫ్రెండ్స్ అందరు నవ్వే వాళ్ళు, అయినా తనకి కోపం వచ్చేది కాదు. ఎందుకంటే అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది.

వినాయకుడికి పెద్ద పొట్ట వున్నా పూజ చేస్తున్నాము కదా! నువ్వు చిన్న పిల్లవాడివే, అందుకని పొట్ట ఉంటే బాధ పడకూడదని. వినాయక్ కి వినాయకుడి పేరు పెట్టడం వల్లనో ఏమో, అన్ని పండగల కంటే వినాయకచవితి పండగంటే చాలా చాలా ఇష్టం. వినాయకుడి బొమ్మ పక్కన తనని కూడా కూర్చో పెట్టి, ఇంట్లో అందరూ తనకి కూడా పూజ చేయాలనీ గోల పెడతాడు. కానీ అమ్మ చెప్పేది, అలాచేస్తే వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు, తనని కూడా నిమజ్జనం చెయ్యాలని. ఆమ్మో, అందుకే అమ్మ చెప్పినట్లు వినేవాడు.

అయినా వినాయక్ కి ఒక సందేహం ఎప్పుడూ ఉండేది. వినాయకుడికి ఎప్పుడు పూజ చేసిన ఎదగకుండా అంతే ఉండేవాడు. కానీ తనేమో పెరుగుతున్నాడు. పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ఏడో తరగతి లో వున్నాడు. వినాయకుడేమో అంతే ఉంటాడు. అమ్మ చెప్పేది, ఎవరి తల్లి దండ్రులకి వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలుగానే ఉంటారుట. అయినా బయట మండపాలలో వుండే వినాయకులు పెద్ద వాళ్ళు, ఇంట్లో వినాయకులు చిన్న వాళ్ళు. అమ్మ చెప్పేది కొంచెం అర్థం అయ్యేది కొంచెం అర్థం అయ్యేది కాదు, అయినా అంతా అర్థం అయినట్లు తల ఊపే వాడు వినాయక్.

వినాయకుడి లాగానే తనకి ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు అంటే చాల ఇష్టం.

కానీ అమ్మ ఎక్కువ తిననివ్వదు. అమ్మ చెబుతుండేది, ఎక్కువ తిన్న వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వితే వినాయకుడి పొట్ట పగిలిందిట. మన దగ్గరకూడా అలాంటి నవ్వే చంద్రుళ్లు వుంటారు, అందుకే జాగ్రత్తగా వుండాలని.

వినాయకుడి వాహనం ఎలుక లాగానే వినాయక్ కి వాళ్ళ నాన్న సైకిల్ కొనిపెట్టాడు. ఎలుక లాగానే వినాయక్ సైకిల్ కూడా చిన్నది. ఆ సైకిల్ మీద రోజు సాయంత్రం వినాయక్ చక్కర్లు కొడుతుంటే, ఫ్రెండ్స్ గేలి చేసేవాళ్ళు. "ఒరేయ్! అటు చూడండిరా! మన వినాయక్ పొట్టేసుకుని వాడి ఎలుక సైకిల్ మీద ఎలా వెళుతున్నాడో" అని. అయినా వినీ విననట్లు ఉండేవాడు. ఎందుకంటే అమ్మ చెప్పింది, ఎవరు ఎమన్నా పట్టించుకోవద్దని. అయినా రోజు రాత్రి పడుకునే ముందు అమ్మ వినాయక్ కి దిష్టి తీసేది. అందుకే వినాయక్ కి తనకేం కాదని గొప్ప నమ్మకం.

వినాయక చవితి వచ్చిందంటే, రోజు సాయంత్రం జరిగే ఊరేగింపులో వినాయక్ ప్రత్యేక ఆకర్షణ. అమ్మ, నాన్న చెప్పిన వినకుండా ఆ ఊరేగింపులో డాన్స్ వేయటం తనకి ఇష్టం.

వినాయకుడి మీద వచ్చే సినిమా పాటలు లౌడ్ స్పీకర్ లో వింటూ, వచ్చీ రాని పిచ్చి డాన్స్ వేస్తుంటే అందరూ కళ్లప్పగించి వినాయక్ ని చూసే వాళ్ళు. "ఒరేయ్! అటు చూడండిరా అసలు వినాయకుడు వీడేరా! వీడినే మనం వూరేగించాలి అంటూ జోకులు వేసుకునేవాళ్ళు చూసే వాళ్లలో కొంతమంది. అసలు వినాయకుడికి హారతిచ్చి, పనిలో పని అనుకుంటూ వినాయక్ కి కూడా హారతి తిప్పి నవ్వుకుంటూ వెళ్లేవాళ్ళు అమ్మలక్కలు.

వినాయక్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. కాలేజీ లో చదువుతున్నాడు. చిన్నప్పుడు బొజ్జ మాత్రమే అనుకున్నాడు. కానీ ఇప్పుడు బొజ్జ తో పాటు ఊబకాయం వచ్చింది. తనకిప్పడు తెలిసింది ఎందుకు తల్లి తండ్రులు అప్పుడపుడు డాక్టర్ కి చూపించేవాళ్ళో. చిన్నపుడు బొద్దుగా ఉంటే ముద్దుగా వున్నానని అనుకున్నారు. కానీ అదే వయసుతో పాటు పెరిగింది. వంశ పారంపర్యం గా వచ్చిన ఊబకాయం కాదు. వందమందిలోనో, వెయ్యిమందిలోనో ఒకళ్ళకి వచ్చే ఒబేసిటీ. వయసుతోపాటు పెరిగేదే కానీ ఎన్ని మందులు వాడినా తగ్గేది కాదు. చిన్నప్పటి లాగానే ఇప్పుడు కూడా దగ్గరనుంచో దూరం నుంచో "ఒరేయ్! అదిగోరా మన బొజ్జగణపయ్య వస్తున్నాడురా!" అంటూ హేళన చేసేవాళ్ళు. అమ్మాయిలైతే మరీను, విచిత్రంగా చూసే వాళ్ళు. కాలేజీలో క్లాస్ లో, కాంటీన్ లో కూచోవాలంటే మాములుగా ఇద్దరు కూచునే చోటు కావాలి తనకి. కొంతమంది జాలి చూపించే వాళ్ళు. అయినా తనేం బాధ పడలేదు. తన సంగతి ఇప్పుడు పూర్తిగా తనకి తెలుసు. అలాగని దాని గురించే ఆలోచిస్తూ చదువులో వెనకపడలేదు. కాలేజీ లో బాగా చదివేవాళ్ళలో మొదటి పది మందిలో తాను వున్నాడు. జీవితంలో తన శరీర బరువును ఒక సమస్యగా తీసుకోలేదు. బహుశా చిన్నప్పటి నుంచి తల్లి దండ్రులు వినాయకుడితో పోలుస్తూ దాన్ని ఒక సమస్య గా తనకి చెప్పలేదు. అందుకోనేమో చిన్నపటినుంచి దాన్ని తనకి సానుకూలంగా చూసాడే గాని ప్రతికూలంగా తీసుకోలేదు. వినాయకచవితి వచ్చిందంటే అదే హడావుడి ఏ మాత్రం తగ్గలేదు.

వినాయక్ కి ఇప్పుడు అమెరికాలో మంచి ఉద్యోగం, పెళ్లి అయింది. భారీ శరీరం ఉద్యోగానికి, పెళ్ళికి అడ్డంకి అవ్వలేదు. ఇద్దరు పిల్లలు. అదృష్టవశాత్తు చిన్నపుడు తనలాగా తన పిల్లలు ఎవరూ లేరు. తన చిన్నపుడు అమ్మ చెప్పినట్లు, తను ఇప్పుడు తనని ఉదాహరణగా తీసుకొని తన పిల్లలకి వినాయకుడి గురించి చెప్పేవాడు. డాడీ, నువ్వే మా వినాయకుడు, అని పిల్లలంటుంటే తను చిన్నపుడు చేసే అల్లరి గుర్తుకొచ్చి నవ్వుకునేవాడు. అమెరికాలో తనలాంటి వాళ్ళు ఎక్కువగా కనబడటం ఆశ్చర్యమేసేది. ఆ తర్వాత కొంచెం రీసెర్చ్ చేసి అమెరికా ప్రపంచంలో ఒబేసిటీ లో 12 వస్థానంలో ఉండటం తెలిసింది. మొదటి 10 దేశాల పేర్లు ఎక్కువగా పరిచయం లేనివి. కువైట్ 11 ఆ తర్వాత అమెరికా వరుసగా ఆక్రమించాయి. అమెరికాలో 36.2 శాతం ఊబకాయం ఉన్న వయోజన జనాభా. అయితే అమెరికాల లో భారీ కాయులు పెరగటానికి వంశ్యపారంపర్యం, వాళ్ళు తినే తిండి ఇలా రకరకాల కారణాలు కనపడ్డాయి. అలా చూస్తే భారతదేశం చాలా నయం 187 వ స్థానంలో ౩.9 శాతంతో ఆగిపోయింది.

వినాయక్ కి ఇప్పుడు 60 ఏళ్ల పైనే. పిల్లలకి పెళ్లిళ్లు అయ్యాయి, వాళ్లకి పిల్లలు పుట్టారు. మనవలు, మనవరాళ్లతో సంతోషంగా వున్నాడు. ప్రతి సంవత్సరం వినాయకచవితి కి అదే హడావుడి ఏ మాత్రం తగ్గ లేదు. మనవలు, మనవరాళ్లు, తాతయ్య నువ్వే మా వినాయకుడు అంటే మాత్రం గర్వంతో పొంగిపోయేవాడు. అమెరికాలో ఊబకాయులకిచ్చే ప్రత్యేక గౌరవం చూసి ముచ్చటేసింది. వాళ్ళని ఎవరూ తక్కువగా చూసేవాళ్ళు కాదు. ఎక్కడికి వెళ్లినా వాళ్లకి ప్రత్యేక సౌకర్యాలు. Fat Men's క్లబ్ లో చేరాడు. వాళ్లకి ప్రత్యేకంగా నిర్వహించే ఆటలు ఆడేవాడు.

వినాయక్ ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. నాలాగా ఎందరో, నాలాంటి వినాయకులు ఎందరో. చిరునవ్వు నవ్వుకున్నాడు వినాయక్.

సమాప్తం

ఈ కథ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఊబకాయం ఉన్న వ్యక్తులందరికీ అంకితం చేయబడింది.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు