పండుగ - పెదపూడి వెంకట ప్రభాకరమూర్తి

Panduga

ఒరే! పిల్లలూ అమ్మమ్మగారి దగ్గరనుండి, తాతగారి దగ్గరనుండి దసరాకి రమ్మని సెల్లు పిలుపు వచ్చేసింది, చిరిగిపోయిన బట్టలు ఏమన్నా ఉంటే సర్దుకోండి, మీ అమ్మనుకూడా నాలుగు పాతచీరలు సర్దుకోమనండి” కంగారు పెట్టేస్తున్నాడు సుబ్బారావు. “ఇదిగో సీతా! నావి రెండు పాత చొక్కాలు అవేనే కాలరుదగ్గర చిరిగిపోయాయి చూడు అవి సర్దు, పొట్టి పంట్లాము ఒకటి చాలు” అన్నాడు వంటింట్లోకి వచ్చి. ఇదిగో సుబ్బడూ! నీకు సిగ్గు అనేది లేదు, ఈ జన్మలో రాదు, చిరిగిపోయిన బట్టలు వేసుకెడితే జాలిపడి కొత్త బట్టలు అందరికీ పెడతారనే కాన్సెప్ట్ పరమ నీచంగా ఉంది, పండక్కి మీకూడా రావాలంటే సిగ్గుతో చితికిపోతున్నాను” కోపంతో మధ్యమధ్యలో ఏడుస్తూ అంది సీత. “సర్లే పిలిస్తే పలుకుతుంది ఏడుపు, పండక్కి వచ్చిన అల్లుడికి బట్టలు పెడితేనే కొండలు కరిగిపోతాయా! అక్కడికి వెళ్ళడం మనకు లేకా ఏమిటీ! ఐనా నువ్వేలా అంటే నేనలా. ఏడుపు ఆపి మొహం కడుక్కో చూడలేక చస్తున్నాను” అన్నాడు సుబ్బారావు. “ఇదిగో సుబ్బారావ్! నా అంద చందాలకి పేరు పెట్టక్కరలేదు, అద్దంలో నీ మొహం చూసుకుంటే గజమ్మేల బట్టతల కనిపిస్తుంది, తర్వాతే నువ్వు కనిపిస్తావు” సీత భర్త మొహంవాచేలా చీవాట్లు పెట్టింది. అక్కడ ఉండటం మంచిది కాదు అనుకున్నాడో ఏమో, సుబ్బారావు అక్కడనుండి చల్లగా జారుకున్నాడు.

మర్నాడు మంచి బట్టలు సర్దుకుని అత్తారింటికి కుటుంబంతో బయలుదేరాడు సుబ్బారావు. బస్సు మండపేటలో ఆగింది. “నాన్నా చేగోడీలు కొను” పిల్లలు అడిగారు. “ఇదిగో గతుకులరోడ్డు మీద వెళ్ళేటప్పుడు చేగోడీలు తింటే గొంతుకకు అడ్డుపడతాయి, నోరుమూసుకుని కిటికీలోంచి ఫ్రీగా అవ్వీ ఇవ్వీ చూడండి” గట్టిగా అన్నాడు సుబ్బారావు. “ఛీఛీ మీరు ఈ జన్మకి మారరు” అంది సీత. “పిల్లలు నోరు తెరిచి అడిగారు కొనిపెట్టచ్చుకదా నాయనా” అంది పక్క సీటులో కూర్చున్న ముసలావిడ. “కొనే మొహమేనా అది” సీత నెమ్మదిగా అంది. బస్సు ఆలమూరులో ఆగింది. “నాన్నా పిప్పరమెంట్లు కొను చప్పరిస్తాం ” పిల్లలు మళ్ళీ అడిగారు. “ఒరే! దద్దమ్మల్లారా! అమ్మమ్మగారి పెరట్లో రేక్కాయల చెట్టు ఉంది కదా! అది విరగకాస్తుంది, వెళ్ళినవెంటనే కాయలు దులిపించి మీ పిన్నిచేత వడియాలు పెట్టించే బాధ్యత నాది, నోరుమూసుకుని బస్సు కిటికీలోంచి ఫ్రీగా అవ్వీ ఇవ్వీ చూడండి” అన్నాడు గట్టిగా సుబ్బారావు. భర్త మాటలువిని పళ్లు పటపటమని నూరింది సీత. పిల్లలు కాసేపు ఏడ్చి ఊరుకున్నారు.

బస్సు తణుకు బస్టాండులో ఆగింది. “ఏమండీ! బస్సు ఇక్కడ పావుగంట ఆగుతుంది ఆకలిగా ఉంది, పొట్టలో ఎలుకలు పరుగులు పెడుతున్నాయి, తణుకులో పుణుకులు చాలా రుచిగా ఉంటాయని మా నాన్న అనేవాడు, కొని తీసుకురండీ” గారంగా భుజమ్మీద గోకుతూ అడిగింది సీత. సీత భుజమ్మీద గోకేసరికి లొంగిపోయాడు సుబ్బారావు. “సరే! అంటూ బస్సుదిగి కేంటినుకి వెళ్ళి మూడు ప్లేట్ల పుణుకులు తెచ్చి, అందరికీ ఇచ్చాడు. బస్సు కదిలింది. ఉన్నట్లుండి పిల్లలు గట్టిగా ఏడ్వటం మొదలుపెట్టారు. “ఏమర్రా! పుణుకులు అప్పుడే లోపలికి తోశేశారా! ఏడుస్తున్నారు” అన్నాడు సుబ్బారావు విసుగ్గా. “అక్క పుణుకుల పోట్లాము విప్పుతూ కిందపడేసింది, అన్నీ డ్రైవరు సీటుకిందకి దొర్లిపోయాయి” పెద్దగా ఏడుస్తూ చెప్పాడు చిన్నాడు. “ఇదిగో! సీతా దానివి నీలాగే లూజు చేతులు పుణుకులన్నీ కిందపడేసింది, నీ పోట్లాంలోవి రెండు తీసి వాళ్ళిద్దరికీ చెరోటీ ఇవ్వు” అన్నాడు సుబ్బారావు. “ఆర్డర్లు బానే వేస్తారు మీరు ఇవ్వచ్చుగా” సీత సాగదీసింది. “తిండిపోతు పెళ్ళాం దొరికిందిరా బాబూ” అనుకుంటూ పిల్లలకి చెరోటీ ఇచ్చాడు భార్యవైపు కొరకొరా చూస్తూ సుబ్బారావు. పిల్లలు తినేసి “చేతులు ఎక్కడ కడుక్కోవాలి” అన్నారు. “నానెత్తిమీద కడుక్కోండర్రా” గట్టిగా అన్నాడు సుబ్బారావు. “నెత్తిమీద కడుక్కోవడమేమిటీ! పాడు అలవాట్లూ మీరూను, మీ ఆవిడని కిటికీలోంచి కడగమను” అంది పక్క సీటులో కూర్చున్న ముసలావిడ. సుబ్బర్రావుకి ముసలావిడని చూసి వళ్లు మండింది “మీరెక్కడ దిగుతారూ” ప్రతీ విషయంలోనూ ముసలావిడ తలదూర్చటం నచ్చని సుబ్బారావు అడిగాడు. “రావులపాలెంలో నాయనా, కొంపతీసి ముందే దింపేస్తావా ఏమిటీ” సాగదీసింది ముసలావిడ. “అంత అదృస్టంకూడానా, రావులపాలెంలోనే దిగుదురుగాని” అన్నాడు సుబ్బారావు. “ఇదిగో సీతా చూడముచ్చటగా ఉన్నావు, మీదేఊరు, మీరేమిట్లూ” అడిగింది ముసలావిడ. ఆవిడ ప్రశ్నకి సీతకి కోపం వచ్చింది. “మీరేకాలంలో ఉన్నారూ అటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు” సీత కిటికీవేపు చూస్తూ అంది. “పోయేకాలమమ్మా పోయేకాలం” విసుగ్గా అంది ముసలావిడ. ఇంతలో రావులపాలెం వచ్చేసింది. ముసలావిడ కంగారుగా ఓచేత్తో గుడ్డసంచీ, మరోచేత్తో ఆనపకాయ పట్టుకుని పడుతూ లేస్తూ దిగేసింది. “హమ్మయ్య వెళ్లిదమ్మా వెళ్లింది” అనుకున్నాడు సుబ్బారావు.

“సీతా! సామాన్లు ఎక్కువగా ఉన్నాయి బస్టాండుకి మీ నాన్న వస్తాడా” జోకేసాడు సుబ్బారావు. “పెద్దా చిన్నా లేకుండా లోకువగా మాట్లాడకండి, నెత్తిమీద ఒక్కటిచ్చానంటే బొప్పి వారంరోజులైనా తగ్గదు, ఈ నాలుగురోజులూ జాగ్రత్తగా ఉండండి నోరుతెరిచి గొప్పకి పోయి అందరిఎదురుగా నామీద జోకులు వేశారంటే, పిక్కవాశాలతో తొడలు వాచిపోతాయి” వార్నింగ్ ఇచ్చింది సీత. “సర్లేవో! భార్యామణీ మీ ఊరు దగ్గర అయ్యేకొద్దీ నీకు బలం పెరిగిపోతోంది” సీతని మోచేత్తో పొడుస్తూ అన్నాడు సుబ్బారావు. భర్త మాటలకి కాసేపు గర్వంగా ఫీలైంది సీత.

బస్టాండుకి సీత తమ్ముడు సుందరం వచ్చాడు. సుందరం రాజమండ్రిలో రెవెన్యూ డెపార్టుమెంటులో పనిచేస్తాడు, సుబ్బారావుని చూడగానే “బావగారూ! బాగున్నారా” అంటూ పలకరించాడు. పిల్లలిద్దరూ “మావయ్యా” అంటూ సుందరాన్ని చూడగానే దగ్గరచేరారు. సీత “ఏరా! తమ్ముడూ ఎలాఉన్నావు అంది నవ్వుతూ. ఆటో ఇంటిముందు ఆగింది. ఆటో చప్పుడువిని అత్తగారూ, మావగారూ బయటకు వచ్చారు. సుబ్బారావు వాళ్ళిద్దరికీ నమస్కారం పెట్టాడు. అత్తగారు పరుగులాంటి నడకతో లోపలికివెళ్లి మంచినీళ్లు తెచ్చారు. సీతకి నీళ్ళగ్లాసు అందిస్తూ “సీతా అలా చిక్కిపోయావేమిటమ్మా” అంది తల్లి. సీత నవ్వి ఊరుకుంది.

సాయంత్రం కాలేజీనుంచి అనంత వచ్చింది. పిన్నిని చూడగానే పిల్లలు “పిన్నొచ్చింది, పిన్నొచ్చింది” అంటూ చుట్టూ చేరారు. ఇంటి వాతావరణం అంతా హడావిడిగా మారిపోయింది. అనంత ప్లేటునిండా జంతికలు, రెండు రవ్వలడ్డూలతో వచ్చి “బావగారూ! నేనే చేశాను తీసుకోండి” అని ప్లేటు అందించి మంచినీళ్ళకోసం లోపలికి వెళ్లింది. ఇంతలో సీత లోపలినుంచి వస్తూ “ఇదిగో! మా చెల్లాయి రవ్వలడ్డూలు చేసింది, రుచి చూడండి, తింటే వదలరు” అంది. “మీచెల్లాయినా, రవ్వలడ్డూనా” జోకేసి పెద్దగానవ్వాడు సుబ్బారావు. “ఇదిగో! చీపు జోకులేసి మర్యాద పోగొట్టుకోకండి” నెమ్మదిగా భర్తని హెచ్చరించింది సీత. “సర్లే ఎలా మాట్లాడాలో నీ దగ్గరే నేర్చుకోవాలి, నీతులు చెప్పావు కానీ వెళ్ళి రెండు రవ్వ లడ్డూలు పెద్దవి, పైన జీడిపప్పు ఉన్నవి పట్రా” విసుక్కున్నాడు సుబ్బారావు.

ఇంతలో మావగారు రెండు టీ గ్లాసులతో వచ్చి అల్లుడికి ఒకటి ఇచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చున్నారు. సుబ్బారావు టీ రెండు గుటకలువేసి “మావయ్యగారూ! ఏలకుల టీ అద్భుతంగా పెట్టారండీ, ఎప్పుడు నేర్చుకున్నారేమిటీ” అన్నాడు. “ఇదిగో అబ్బాయి భలే కనిపెట్టేశావయ్యా, ఇక్కడికి దగ్గరలో అంబాజీపేట ఉందికదా! అక్కడ రూపవతి అనే ఒక కుర్రపిల్ల టీ షాపు పెట్టి జోరుగా వ్యాపారం చేసేది, సాయంత్రమయ్యేసరికి టీ గ్లాసుల గలగలలూ, చేతి గాజుల రిమరిమలు, ఇక చెప్పేదేముంది. నేను నిత్యం సైకిలుమీద అంబాజీపేట వెళ్ళి ఆ కుర్రపిల్ల దగ్గర టీ తాగేవాడిని, కొన్నాళ్ళకి నామీద గురికుదిరి చక్కటి, రుచికరమైన టీ ఎలా కలపాలో ఆ కిటుకు చెప్పేసింది అంటూ టీ గ్లాసు కిందపెట్టారు. “అప్పటినుండీ మీకున్న పాతికెకరాలూ చిక్కి శెల్యమై, ఇప్పుడు ఎకరంలోకి మారాయన్నమాట” నవ్వుతూ అన్నాడు సుబ్బారావు. అల్లుడు వేసిన జోకుకి చిన్నబుచ్చుకున్నారు మావగారు.

ఇంతలో అత్తగారు “ఏంటండీ! అంబాజీపేట అంటున్నారు, వయసు ముదిరినా, లేత కబుర్లు మానరు. లోపలికి రండి అల్లుడిగారికి సమరం కధలు చెప్పకండి ” కోపంగా అన్నారు. మావగారు తలవంచుకుని అల్లుడికేసి చూసి కన్నుకొట్టి లోపలికి వెళ్ళిపోయారు. “అయ్య బాబోయి ముసలాడు మామూలోడు కాదు” సీత తెచ్చిన రవ్వలడ్డూలు అందుకుంటూ అనుకున్నాడు సుబ్బారావు.

పండుగ చివరికి వచ్చింది. సుందరం ఇంటిల్లిపాదికీ కొత్తబట్టలు తెచ్చాడు. కాకినాడ కాజాలు, తాపేశ్వరం పూతరేకులు, జీడిపప్పు అచ్చులు, జంతికలు తెచ్చి అందరికీ ప్లేట్లలో అందించాడు. ఇల్లంతా ఆనందం వెల్లివిరిసింది. అందరూ కొత్తబట్టలు కట్టుకున్నారు. సుందరం ఆఫీసుందని రాజమండ్రి వెళ్లిపోయాడు. “మావయ్యగారూ! రేపటినుండీ ఆఫీసు మొదలు, ఈ రోజు సాయంత్రం మేము బయలుదేరతాము. అందరూ ఆనందభాష్పాలతో వీడ్కోలు చెప్పుకున్నారు. సాయంత్రం వచ్చేసింది, “ఏమండీ! అలా నిలబడకపోతే అమ్మాయిని, పిల్లలని బస్టాండులో దిగబెట్టి రావచ్చుకదా!” అత్తగారు గట్టిగా అన్నారు. మావగారి చెవిలో అత్తగారు ఏదో గొణిగారు. మావగారు గబుక్కున లోపలికివెళ్ళి అమ్మాయి చేతిలో ఐదువేలు, అల్లుడి చేతిలో ఐదువేలు, పిల్లలిద్దరికీ చెరో అయిదొందలు ఇచ్చి దీవించారు. సామానులన్నీ బయటపెట్టాక సీత అరుగుమీద కూర్చుని కాసేపు కన్నీళ్లు పెట్టుకుంది. ఆఖరికి సందుచివరివరకూ చేతులు ఊపి వెళ్ళిపోయారు.

“వస్తానమ్మా సీతా! ఆరోగ్యం అదీ జాగ్రత్త, పిల్లలని జాగ్రత్తగా చదివించు. అల్లుడుగారూ ఉంటానండీ, అప్పుడప్పుడూ వస్తూ ఉండండి” చెప్పారు మావగారు కన్నీరు తుడుచుకుంటూ. బస్సు నెమ్మదిగా కదిలింది. దూరంగా మావగారు “అంబాజీపేట” బస్సు ఎక్కటం స్పస్టంగా చూశాడు సుబ్బారావు. “ఈయనకి ఇప్పుడు పండుగ మొదలైనట్లుంది” మనసులో నవ్వుకున్నాడు సుబ్బారావు. “మా నాన్న అంబాజీపేటలో ప్రైవేట్లు చెబుతారు” సుబ్బారావుతో అంది విషయం తెలియని సీత.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు