విశ్వేశ్వర్రావుగారు అభ్యుదయవాదే గాని ఆయన పెద్ద కొడుకు రామ్మూర్తికి చచ్చే చాదస్తం.
వీధికుక్కల బారిన పడి గాయాలపాలయిన ఓ పాల రంగు కుక్క పిల్లను చూసారో రోజు విశ్వేశ్వర్రావుగారు ఆఫీసు నుంచి తిరిగొస్తూ . నెన్నుదుటి మీద కాసంత కాటుక బొట్టుతో చూడగానే ముద్దొచ్చే ఆ బుజ్జి ముండను ఇంటికి తెచ్చి గాయాలకు కట్టుకట్టి ఇన్ని పాలుపోసారాయన . ఆ పాపానికి .. పాపం, కుక్కపిల్లకు వీధి కుక్కలకు మించి రాక్షసుడు తయారయ్యాడు ఇంట్లోనే ; రామ్మూర్తి.
తండ్రి లేని సందు చూసుకొని కుక్కపిల్లని ఓ గోతంలో కుక్కి దూరంగా పారేసొచ్చాడించక్కా ఘనుడు .
కేంపు నుంచి తిరిగొచ్చిన విశ్వేశ్వర్రావుగారికి ఇంట్లో కుక్క పిల్ల కనిపించలేదు. అనుమానం వచ్చి నిలదీస్తే కొడుకు చేసిన నిర్వాకం బైటపడింది. మూగ జీవుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఏమవుతుందో తెలీనంత మూర్ఖుడు కాదు బి.వి.ఎస్ సి వరకు వెలగబెట్టిన రామ్మూర్తి . చేసేది లేక గమ్మునుండి పోయారు విశ్వేశ్వర్రావుగారు.
రామ్మూర్తి కా రోజు వెటరనేరియన్ అసిస్టెంట్ పోస్టు తాలూకు ఇంటర్వ్యూ- 'పి. ఎఫ్. ఎ ' ఆర్గనైజేషన్ సెంటర్లో . జంతుజాతుల హక్కుల కోసం పోరాడే స్వచ్ఛంద సంస్థ ఆ ‘ పీపుల్ ఫర్ ఏనిమల్స్’ సంస్థ. పదింటి కల్లా వాళ్ల మాదాపూర్ మెయిన్ బ్రాంచిలో హాజరవాలి .
ఇంట్లో తల్లి చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి , శుభ శకునంగా ఉంటుందని తనే ఎదురు వెళ్ళింది. అయినా మెహిదీపట్నం సెంటర్లో గంట పాటు ట్రాఫిక్ ఆగిపోవడంతో ఇంటర్వ్యూ సెంటరు చేరేసరికి ఆలస్యం అవనే అయింది. అప్పటికే రామ్మూర్తి వంతు వచ్చి పావుగంట దాటిపోయింది.
పదేపదే రిక్వెస్ట్ చేసిన మీదట ఆఖరి అభ్యర్థిగా ఇంటర్వ్యూబోర్డు ముందు కూర్చున్నాడు రామ్మూర్తి. రొటీన్ గా మొదలయ్యే విద్యార్హతలు వంటి వాటి మీద ప్రశ్నలు కాకుండా విచిత్రంగా ఓ చందమామ టైపు బేతాళ కథ ఎదురైంది రామ్మూర్తికి!
'తుంటరి వెధవొకడు నోరూ వాయాలేని కుక్క పిల్లను గోతంలో చుట్టి చెత్తకుప్ప మీద పడేయటం చూస్తే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? వెంటనే మీరు తీసుకొనే ఉపశమన చర్య ఏంటి ? ' అని ప్రశ్న.
నిజంగా జరిగిన ఈ సంఘటన ఓ ప్రశ్న రూపంలో ఎదురవడంతో రామ్మూర్తికి ముచ్చెమటలు పోసాయి . ఆ రోజు తను చేసిన చెత్త పనిని కళ్లారా చూసినట్లు వర్ణించాడంటే ఇంటర్వ్యూ చేసే ఈ బోర్టు ఛైర్మనుకు సర్వం తెలిసినట్లే!
కుక్క పాలిటి కిరాతకుణ్ణి అడ్డగించి మూగజీవిని రక్షిస్తానని ఇప్పుడు చెప్పటం గొప్పగానే ఉంటుంది. కాని , ఛైర్మన్ గారి ముందు తన డొల్లతనం బైటపడుతుంది ! పోనీ . . ఆ గాయపడ్డ కుక్క పట్ల రాక్షసంగా ప్రవర్తించింది తానేననీ .. ముందు ముందు ఏ జీవుల పట్లా ఎలాంటి అకృత్యాలకు పాల్పడకుండా బుద్ధిగా మసులుకుంటానని బహిరంగంగా పశ్చత్తాపం ప్రకటిస్తేనో .. ?
ఉద్యోగం పీడా పాయిరి . . ఇవాళ కాకపోతే రేపు .. ఇది కాకపోతే ఇంకోటేదో .. ఇంకెక్కడో దొరక్కపోదు ; తండ్రి మందలించినప్పట్నుంచి ముల్లులా తొలిచేస్తోన్న అపరాధ భావన మనసు నుంచి ముందు తొలగిపోతుంది ' అనిపించి, ఆ పనే చేసి తేలికపడ్డ మనసుతో బైటకొచ్చేసాడు రామ్మూర్తి .
ఇంటర్వ్యూ ముందటి రామ్మూర్తికి, ఇంటర్వ్యూ తర్వాత రామ్మూర్తికి మధ్య దానవుడికి మానవుడికి మధ్య ఉన్నంత అంతరం ఉందిప్పుడు.
ఫలితం కోసం వెయిట్ చేస్తోన్న అతగాడికి లోపల్నుంచి పిలుపొచ్చింది.
'మూగ జీవులను నిష్కారణంగ హిసించే దుర్మార్గులకు పట్టే దుర్గతేంటో తెలుసా ? ' అడిగాడు ఇందాకటి ప్రశ్న వేసిన బోర్డు ఛైర్మన్ .
'భారత శిక్షా స్మృతి , 1860 చట్టంలోని సెక్షన్ 428, 429 ప్రకారం రెండేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష , భారీ పెనాల్టీ' అన్నాడు రామ్మూర్తి వణికే గొంతుతో.
'ఆ సంగతి తెలిసీ ఓ గాయపడ్డ నిస్సహాయ జీవి పట్ల మీరెందుకు అంత అమానుషంగా ప్రవర్తించినట్లు? ' గుడ్లురిమిచూసాడాయన . సిగ్గుతో తలొంచుకొన్నాడు రామ్మూర్తి .
'నోటితో చెప్పలేవు గానీ, మూగ జీవులకూ మనకు మల్లేనే స్వేచ్ఛగా, హాయిగా జీవించే హక్కు ఉంటుంది. జంతువుల హక్కుల కోసం పోరాడేందుకే ఈ స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. వాటి పట్ల నిర్దయగా ప్రవర్తించే మనుషులను మంచి మార్గంలోకి మళ్లించడం కూడా ఈ సంస్థ విధులలో ఒకటి. మీలో ఇప్పుడు ఆ తరహా మార్పే కనిపిస్తోంది. ఫ్యూచర్లో సన్మార్గంలో నడుస్తానవి మాటిచ్చారు . ఇచ్చిన మాట నిలబెట్టుకొంటూ మీ లాంటి మరి కొంత మందిని మంచి దారికి మళ్లిస్తారన్న నమ్మకంతోనే ఈ సేవా సంస్థ మీకీ అవకాశం ఇస్తున్నది ' అన్నాడు అప్పాయింట్ మెంట్ ఆర్డర్స్ రామ్మూర్తి చేతికందిస్తూ సదరు ‘పీపుల్ ఫర్ ఏనిమల్స్ ' వెల్‌ఫేర్ ఆర్గ నైజేషన్ అధికారి.
జాబొచ్చినందుకు సంతోషపడ్డా .. తను చేసిన అకృత్యంఆ ఛైర్మన్ గారికి ఆసాంతం తెలియటమే జవాబు తెలియని ప్రశ్నగా మిగిలిపోయింది రామ్మూర్తికి ..ఆయనగారి ఇంటికి ఆఫీసు పని మీద వెళ్లిన దాకా !
కాంపాండ్ గేటు తీసుకొని లోపలికి అడుగేయగానే .. 'భౌ ! .. భౌ ! ! ' 'అంటూ ఎదురొచ్చిన .. నుదుటి మీది కాసంత కాటుక రంగు బొట్టున్న పాలరంగు కుక్క పిల్ల ఆ చిక్కు ముడిని విప్పేసింది.
తనా రోజు గోతంలో చుట్టిన ఈ కుక్క పిల్లనే ఈ ఇంటి కొచ్చే రోడ్డు పక్క చెత్త మీద పారేసొచ్చింది. ఆ దృశ్మం .. డాబా మీద నుంచి ఛైర్మన్ గారి కంటబట్టమే . . ఇంత కథకూ కారణమని తెలిసి రామ్మూర్తి మనసు చివుక్కుమంది. తోకాడిస్తూ దగ్గరికొచ్చిన బుజ్జి కుక్కపిల్లను ఆదరంగా వడిలోకి తీసుకొన్నాడు రామ్మూర్తి.
***