మయూరి!! - Baalaraamam

Mayuri

అప్పుడే ఆసుపత్రికి వెళ్ళి చూపించుకుని రాజమండ్రి బస్టాండులో బస్సు ఎక్కాను మోరంపూడి లో ఒకతను ఎక్కాడు. చూడటానికి ఒడ్డూ పొడవూ అచ్చం మా మనవడి లాగానే ఉన్నాడు. ఒక ఇరవై ఎనిమిదేళ్లు ఉండచ్చు బహుశా. కానీ ఏదో బాధ అనుకుంటా తనలో తాను తెగ మధన పడిపోతున్నాడు మాటిమాటికి ఫోను చూస్తున్నాడు. నేనా ముసలొడినైపోయాను పోనీలే కుర్రాడికి నా వంతు సహాయం చేద్దామని ఏం బాబు ఏమయింది ఎవరైనా ఫోన్ చేయాలా? మాటిమాటికి ఫోన్ చూసుకుంటున్నావు అని అడిగాను. అయ్యో ఏం లేదు తాతగారు ఏదో ఊరికే అంతే అన్నాడు. సరే అని నేను ఇంక అడగలేదు. పదినిమిషాలయ్యింది ఆ పదినిమిషాల్లో ఒక ఇరవై సార్లు చూసుకుని ఉంటాడు. “చూడు బాబు ఇలా అడుగుతున్నానని తప్పు గా అనుకోకు సమస్య ఏమైనా ఉంటే చెప్పు న్నా వంతు సహాయం చేస్తాను” అని అన్నాను. “అయ్యో తాతగారు సహాయం ఏం వద్దులేండి చెప్తాను మా తాతగారిలా నన్ను ఆశీర్వదించండి.” అన్నాడు ఎంతో నమ్రతతో. తప్పకుండా! ముందు నీ కథ చెప్పు.. నా కథా... కాదు ఇది నా కథ కాదు ఇది నా జీవితం లోకి ఇప్పుడే అడుగుపెట్టిన తన కథ! తనా ఎవరు తను? తను... తను... మయూరి తానో నాట్యమయూరి అందరిలా తాను తనలో నాట్యాన్ని చూసుకోలేదు నాట్యంలోనే తనని చూసుకుంది హరివిల్లు హావభావాల ముఖకవళకలతో ఆ రవిబింబమే నుదుట సింధూరమై సూర్యోదయాస్తమయాలు పారణులై అబ్బురపరిచే అంబరమే అంగవస్త్రమై తారాలతళకులే ఆభరణాలై తరువుల తోరణాలే తన అందెలై అంగభంగిమలే అలంకారాలుగా అని తన గురించి వర్ణిస్తున్న నా కవిమిత్రుడి కవిత పూర్తికాకుండానే ఆ సభలోకి అడుగుపెట్టాను నేను. అదో కళాక్షేత్రం అక్కడ క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ లు జరుగుతాయట నా మిత్రుడు చెప్పి తీసుకెళ్తూ ఆ అమ్మాయి గురించి వర్ణిస్తున్నాడు. నేను భార్గవ్. అమ్మ మంచి క్లాసికల్ డాన్సర్. అక్కకి నాలుగేళ్ళునపుడు అక్కని క్లాసికల్ డాన్స్ లో చేర్పించి నేర్పిస్తునప్పుడు అమ్మ కి నేర్చుకోవాలనిపించి. నేర్చుకుంది. చాలా ఇష్టపడి నేర్చుకుంది. ఒక ప్రోగ్రామ్ కూడా ఇచ్చింది. ఒక ఏడాదికి నేను కడుపులో పడ్డాను. అప్పుడు అమ్మ సాధన చేస్తుండగా నొప్పులోచ్చి నేను నెల ముందే పుట్టేసాను. నేను పుడుతూనే అమ్మ చనిపోయింది. దానితో అక్క ఆపేసింది. ఇంక ఇంట్లో ఎవరికీ ఆ అభిరుచి లేదు, ఇష్టం అంతకన్నా లేదు. నేను రెండో క్లాసులో ఉన్నపుడనుకుంటా అమ్మ ఆల్బమ్ చూసి ఆ ప్రోగ్రామ్ చూసి క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం ఏర్పడింది. కానీ అబ్బాయినయిపోయాను, ఇంకా ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోవటంతో నా ఇష్టానికి పెద్దగా విలువ లేకుండా పోయింది. తరువాత మేము కోల్కతా వెళ్లిపోయాము. నేను CA చదువుకున్నాను. ఇపుడు అక్కడే ఉద్యోగం. ఖాళీ సమయాల్లో ఏవో ఒక ప్రోగ్రాములు చూసేవాన్ని. ఇపుడు సెలవలైతే నా స్నేహితుడు మోహన్ వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ వీధిలో ఉండే ఒక అమ్మాయి క్లాసికల్ డాన్స్ బాగా చేస్తుందని అవి నాకు ఇష్టమని తెలిసి తీసుకువచ్చాడు వాడు కవిలేండి ఆ అమ్మాయి నృత్యలని చాలా విధాలుగా వర్ణించాడు కానీ ఆ సభ లోకి వెళ్ళేటప్పటికి అంతా చాలా వేరేగా ఉంది..... అప్పటి వరకు కట్టలు తెంచుకు ప్రవహిస్తున్న గోదావరిలా ఉన్న తన మాటల ప్రవాహం ఒక్కసారిగా కంచె కట్టినట్టు ఆగిపోయింది. తన ముఖంలో హావభావాలు ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని పరిచయం చేశాయి. ఏదో ఒక అద్భుతాన్ని చూసినట్టు తన కళ్ళలోని ఆ మెరుపు చెబుతోంది. ఆ ఆతృత ని ఆపుకోలేక వేరేగా అంటే? అని అడిగాను నేను ఊహించినదానికి భిన్నంగా ఉంది ఆ అమ్మాయి..... భిన్నంగానా ? అనుకున్నట్టు లేదా మరి ?ఎలా ఉంది బాబు ఆ అమ్మాయి ? ఆ అబ్బాయిలోని హావభావాలు ఆశ్చర్యం నుండి అద్భుతం నుండి భక్తి గా మారుతున్న కొద్ది నాలో ఆసక్తి మరింత పెరగసాగింది. అప్పుడు ఆ అబ్బాయి చెప్పటం ఆరంభించాడు... ఆ అమ్మాయి....... ఆ అమ్మాయి...... అమావాస్య రేయిలోని అంధకారమంతటి నల్లని మేని ఛాయ నెత్తుటేరులు పొంగినటువంటి ఎర్రటి కళ్లు అమావాస్యన సాగరతరంగాల వలె విజృంభించిన కురులతో మెడన కాపాలమాలాధారినియై ఒక చేత మొండాన్ని వీడి కొట్టుకుంటున్న తల మరోచేత త్రిశూలం తో పులిచర్మధారినియై కాలి క్రింద ఒకరక్కసున్ని తొక్కిపెడుతూ ఆ విరజిమ్మిన రక్తాన్నే తననుదుటి కుంకుమగా మల్చుకుని కోపాన్నే అంగభంగిమలుగా క్రోధాన్నే అలంకారంగా ఆక్రోశాన్నే ఆభరణంగా ధరించి అటూ ఇటూ విజృంభిస్తుంటే మళ్ళీ నిజంగా ఆ అపరకాళికాదేవి ఉద్భవించిందేమో అన్నట్టు నోళ్ళు వెళ్లబెట్టుకుని చూస్తున్నారు. ఆ తన్మయత్వం తో అలా నడుచుకుంటూ స్టేజ్ దగ్గర దాకా వెళ్లిపోతున్న నన్ను నా స్నేహితుడు ఆపాడు. చెప్పట్ల హోరుతో మళ్ళీ ఈలోకంలోకి వచ్చాను. ఆ నిమిషం కనిపించిన ఆ అమ్మాయి మళ్ళీ మరో నిమిషం కనబడలేదు. ఆ సభ అంతా తనకోసమే వెతుకుతున్నాను. ఎక్కడా కనిపించలేదు. బహుశా బట్టలు మార్చుకోడానికి వెళ్లిందేమో అని అలా కూర్చుని తన కోసం ఎదురుచూస్తున్నాను. అరగంటయ్యింది రాలేదు, గంటయ్యింది రాలేదు, రెండుగంటలయ్యింది రాలేదు. ఇంక ప్రోగ్రామ్ పూర్తయ్యింది. ఇంక కనబడదులే అని ఆశలు వదిలేసుకున్న సమయంలో మళ్ళీ కనిపించింది. సిల్కు చుడీదార వేసుకుని కష్టపడి వదిలించుకున్నా పోనీ నలుపు రంగు అక్కడక్కడా ఉన్నా కూడా నవ్వునే అలంకారంగా చేసుకుని, ప్రశంసిస్తున్న వాళ్ళని ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ల అభిమానానికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్న తనని చూసి ఒక్క నిమిషం కూడా ఆగాలనిపించలేదు. ఏం మాట్లాడాలో కూడా తెలీదు, ముందు తనని కలవాలనుకున్నాను. అంతే సరాసరి వెళ్లిపోయాను. బాగా చేసారండి అని చెప్పాను అందరికీ చెప్పినట్టే నాక్కూడా థాంక్స్ చెప్పింది. ఆ జనాల మధ్య ఇంకా ఏం మాట్లాడాలో తెలియక దూరంగా నిలుచుండిపోయాను, ఆ కళామతల్లి కళను దూరం నుండి అభిమానిస్తున్న ఒక భక్తుడిలా. అందరి మన్ననల తరువాత తను బయటకి నడిచింది కార్ ఎక్కబోతోంది. అప్పుడు వెళ్ళాను. సరాసరి ఆమె కార్ డోర్ తీస్తుంటే ఆ కార్ డోర్ పట్టుకుని మాట్లాడాలి అన్నాను. చెప్పండి అన్న తన మాట పూర్తికాకుండానే “ఇందాక మీ నాట్యం నిజంగానే భయం వేసిందండి ఆ కాళిక దేవి దిగివచ్చినట్టనిపించింది. ఒక్క క్షణం శివునిలాగా ఈ కాళికాదేవి పాదలకింద ఒదిగిపోయి మిమ్మల్ని శాంతపరచాలనిపించింది.’’ నా పేరు భార్గవ్. కోల్కతా లో సెటిల్ అయిన తెలుగు కుటుంబం మాది. నేను అక్కడే ఒక ఫైనాన్స్ కంపెనీ లో ఆడిటర్ గా పనిచేస్తున్నాను. జీతం నెలకి ఎనభై వేలు. మీకు ఇష్టమైతే ఈ కళామతల్లి కళ ని ఓ మూల కూర్చుని చూసే ప్రేక్షకుడిలాగా కాకుండా వెంటుండి ప్రోత్సాహించే ఒక ప్రేమికుడిలాగా జీవితాంతం ఉండాలనుంది.” మాట్లాడుతున్నంత సేపు నా కళ్ళు తన కాళ్ళని చూస్తున్నాయి తప్ప తన కళ్ళని చూసే ధైర్యం చేయలేదు. నా నెంబర్ రాసిన కాగితాన్ని తన చేతికి అందించి ఇంక వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాను. తాను చేస్తుందో లేదో అన్న ఆలోచనలతోనే ఇందాకన్నుంచి ఇలా.. అర్థమైంది క్షణికాల్లో పుట్టే ప్రేమలు నిజాలయి నిత్య నృత్యాలుగా మారటానికి కాస్త సమయం పట్టినా నిజమైన ప్రేమ అయితే కచ్చితంగా ఫలిస్తుంది అని చెప్పే లోపు అతను దిగాల్సిన స్టాపు వచ్చిందని గమనించి సరేనండి తాతగారు నేను వెళ్లొస్తాను నన్ను ఆశీర్వదించండి అన్నాడు. మనోవాంచః ఫల సిద్ధిరస్తు! అని దీవించి.. నీ ప్రేమలో నిజముంటే నీ నిరీక్షణలోనూ ఆనందముంటుంది. all the very best !!! అని చెప్పాను.... అడగటం మర్చిపోయాను ఇంతకీ ఆ అమ్మాయి పేరెమిటబ్బా ?? ఆ అబ్బాయి దిగాక గుర్తొచ్చింది ఈ ప్రశ్న నాకు. పేరు తెలియక పోతే ఏముంది కానీ ఆ అబ్బాయి వర్ణిస్తున్నంత సేపు ఎక్కడో ఉన్న ఆ అమ్మాయి, ఇక్కడ లేని ఆ అమ్మాయి నా కళ్ళముందే కాళికా దేవిలా ప్రత్యక్షమైనట్టనిపించింది. బహుశా ఆ అబ్బాయి హృదయాన్ని తాను ఎంత పెనవేసుకుపోయుంటేనో అంతా చక్కగా వర్ణించలేడనిపించింది.  

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు