ధర్మకర్త - బాలు కావలిపాటి

Dharma kartha

“అవునా!” అని చిన్న గావుకేక పెట్టాడు ధర్మారావు సంభ్రమాశ్చర్యంతో కూడిన గొంతుతో. మగతనిద్రలో ఉన్న మత్తు అంతా తటాలున వదిలిపోయింది.

ఫోన్లో విన్న మాట నిజామా కాదా అని తనలో తాను అనుకుంటూ, “మరోసారి పక్కాగా రూఢి చేసుకుని చెప్పు! అలాగే ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు!” అని మరికొన్ని జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేసాడు.

ప్రతీరోజూ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావడం, సుష్టుగా తిన్నాక సెల్ ఆఫ్ చేసి ఓ గంట గుర్రుమని గురక పెట్టి పడుకోవడం, మరీ ముఖ్యమైన విషయం అయితే పర్సనల్ నెంబర్ లో మాట్లాడటం అలవాటు ఆలయ కార్యనిర్వహణ అధికారి అయిన ధర్మారావుకి. ఆ ప్రకారామే ఆ రోజు కూడా పడుకొని ఉండగా అతడి సెక్రెటరీ ఫోన్ చేసి దిమ్మతిరిగిపోయే విషయం చెప్పాడు.

అసలు విషయానికి వెళ్ళేముందు, ధర్మారావు బంగారు కుటుంబాన్ని గురించి కొంత తెలుసుకుంటే మంచిది. అతడి భార్య పేరు వైదేహి, కొడుకు సన్నీ, కూతురు సలోని.

భర్త గవర్నమెంట్ ఉద్యోగి, అందులోనూ హోదా, పరపతి ఎక్కువ అవ్వడం మూలాన వైదేహికి బయట షికార్లు, షాపింగులు, జంక్ ఫుడ్ తో రోజంతా క్షణం తీరిక లేకుండా ఉంటుంది. కొడుకు సన్నీ చిన్నప్పటి నుండి జల్సాలకి అలవాటు పడి చదువు బొత్తిగా అబ్బక ఇంజనీరింగ్ సీటు మానేజిమెంట్ కోటా లో కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కూతురు పదవ తరగతి పరీక్షలు రాసి పాస్ అవుతానని నమ్మకం లేక ఎందుకైనా మంచిదని వేసవి సెలవల్లో కూడా రివిజన్ చేస్తోంది.

పనిమనిషిని కేకేసి కాఫీ కలపమని చెప్పి ఆలోచనలో పడ్డాడు ధర్మారావు. కాఫీ తాగుతున్నంతసేపూ మనసు మనసులో లేదు. విన్న వార్త అలాంటిది మరి! జాగ్రత్తగా పధకం ప్రకారం మూడోకంటికి తెలియకుండా తను ఒక్కడే లబ్ది పొందే ప్రణాళిక రచించసాగాడు.

పర్సనల్ సెల్ మోగితే చూసాడు. మళ్ళీ సెక్రెటరీ నుంచే. గబగబా కాల్ ఆన్సర్ చేసి ఆతృతగా అడిగాడు “ఏంటయ్యా నువ్వు చెప్పింది నిజమేనా?”

అట్నుంచి సమాధానం వచ్చింది "నిజమే సర్! మళ్ళీ మళ్ళీ చూసుకుని చెప్తున్నా మనకి విరాళం ఇచ్చిన అజ్ఞాత భక్తుడి పేరు కోటేశ్వరరావు. వంద కోట్ల విరాళం చెక్ నా కళ్ళతో చూసి వేళ్ళతో తడిమి మరీ వచ్చాను".

ధర్మారావు ఆనందానికి అంతూ పొంతూ లేకుండా పోయింది! సగం తాగిన కాఫీ అలానే వదిలేసి ఆఘమేఘాల మీద ఆఫీసుకి బయల్దేరాడు.

***

ప్రసిద్ధ దేవాలయంలో అధికారిగా ఉద్యోగం చేస్తున్నాడు ధర్మారావు. దేవుని మాన్యం, నగలు, కోటానుకోట్ల భక్తుల విరాళాలు. ఈ సంపద అంతటినీ భక్తులకి మౌలికసదుపాయాల కల్పించే ప్రాజెక్టులు, ట్రస్టుల పేరుతో రకరకాల కార్యక్రమాలు చేస్తూ ప్రతీ ప్రాజెక్టులో చేతివాటం చూపిస్తూ దేవుడి కన్నా ధనవంతుడు అయ్యే పనిలో ఎల్లప్పుడూ బిజీగా ఉండటం అతడికి బాగా ఇష్టం, అలవాటు.

ఇలాంటి గొప్ప అలవాట్లతో తీరిక లేకుండా గడిపే ధర్మారావు కుటుంబం మీద ఏమాత్రం ధ్యాస లేదు. భర్త ఎప్పుడైతే డబ్బు సంపాదనకు తప్ప మానవసంబంధాలకి విలువ ఇవ్వలేదో వైదేహి కూడా భర్తకి ఉన్న పలుకుబడితో కొత్త పరిచయాలు, అలవాట్లు ఏర్పరచుకుని తనమానాన తను తన ప్రపంచంలో ఉంటుంది.

అలాగే, ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోరో వాళ్ళు కూడా వారికి తోచిన పరిచయాలు చేసుకొని స్నేహమనే ముసుగులో విలువైన కాలాన్ని మంచి నీళ్ళలా ఖర్చు చేయటమే కాక, దురలవాట్లకి బానిసలుగా బతికే లోకంలో తమకో సీటు సంపాదించుకుంటున్నారు.

కుటుంబ విషయాలేవీ తనకు పట్టనట్టుగా, ఆ రోజు విరాళంగా వచ్చిన వంద కోట్లతో ఏఏ కార్యక్రమాలు చేపట్టి ఆ ముసుగులో కనీసం ముప్పై కోట్లు మిగుల్చుకునే ప్రణాళిక సిద్ధం చేసుకోసాగాడు ధర్మారావు. ఆఫీసుకి వెళ్ళగానే యమ అర్జెంటుగా చెక్కు తెప్పించుకొని చూసి వంద పక్కన ఏడు సున్నాలు ఉన్నాయో లేదో తనిఖీ చేసాడు. ఉన్నాయి!

తన ఛాంబర్ నుండి బేంకు మేనేజర్ కి కాల్ చేసి చాలా ముఖ్యమైన పనిమీద వస్తున్నానని చెప్పి ఆ చెక్ పట్టుకుని బేంకుకి బయల్దేరాడు ధర్మారావు.

మేనేజర్ ధర్మారావుని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి విషయం తెలుసుకొని “క్లోజింగు టైమ్ సర్. ముందర చెక్ ఇచ్చేయండి. ఇప్పుడు ఇస్తే ఎల్లుండి ఉదయానికి క్లియర్ అవుతుంది” అన్నాడు. చెక్ మేనేజర్ చేతికి ఇచ్చాక కాసేపు పిచ్చాపాటి కబుర్లు చెబుతూ తనకు రాబోయే ఆదాయాన్ని తలచుకొని ఊహాలోకంలో తేలిపోయాడు. ఆఫీసుకి తిరిగి వెళ్ళాక అన్యమనస్కంగా పచార్లు చేసి, మర్నాడు రాలేనని సెలవుపెట్టి ఇంటికి వెళ్లి నేరుగా మూడవ అంతస్తులోని తన ప్రైవేట్ బార్లోకి వెళ్ళి మేటర్ స్టార్ట్ చేసాడు.

అర్ధరాత్రి బాగా మత్తులో తూలుతూ కిందకి వెళ్ళి చూస్తే ఎప్పుడొచ్చారో తెలియదు కానీ భార్యా పిల్లలు వాళ్ళ వాళ్ళ గదుల్లో పడుకొని ఉన్నారు. ముగ్గురికీ తలా పది కోట్లు ఇచ్చేస్తే వాళ్ళు ఎలా షాక్ అయిపోతారో అనే చిలిపి ఊహతో నవ్వుకుంటూ తనుకూడా నిద్రలోకి జారుకున్నాడు.

***

మర్నాడు ఉదయాన్నే లేచి ఎలాగూ సెలవు కాబట్టి తన ప్రణాళిక ప్రకారం త్రాగునీరు కాంట్రాక్టర్, బ్యాటరీ వాహనాల డీలర్, C C రోడ్ కాంట్రాక్టర్, రోడ్డు కి ఇరువైపులా చెట్లు మొక్కలు నాటే ల్యాండ్ స్కేపింగ్ వెండర్, వేసవి కాలంలో డివైడర్ మీద ఉన్న చెట్లకి నీరుపోసి ట్రాక్టర్ ఓనర్ ... ఇలా ఒకటేమిటి కమిషన్ ఇ(వ)చ్చే ప్రతి కాంట్రాక్టర్ తో మాట్లాడి ఏఏ పనులకి టెండర్ ఎప్పుడు వెయ్యాలి, ఎంతకి వెయ్యాలి, పనులు ఎప్పుడు మొదలెట్టాలి, తన వాటా ఎంత, ఎప్పుడు, ఎలా తీసుకోవాలో కూలంకషంగా చర్చించాడు. వాళ్ళకు ఇచ్చే అడ్వాన్స్ డబ్బులోంచి తనకు వెంటనే కనీసం ఐదు కోట్లు వచ్చే ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు చాలా ముఖ్యమైన కారణం ఉంది. అతడు ఓ ప్రాపర్టీ మీద మనసు పారేసుకున్నాడు, కొనే తాహతు లేకపోయినా. ఇప్పుడు అనుకోకుండా డబ్బు కలిసొచ్చేసరికి మళ్ళీ దాని మీద ఆశ కలిగింది. లక్కీగా వేరే బేరమేదీ కుదరక ఇంకా అమ్ముడవలేదు. ఈసారి ఆలస్యం చేయదల్చుకోలేదు ధర్మారావు.

సాయంత్రం ఆరింటికల్లా డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చాడు ప్రాపర్టీ ఏజెంట్ అమ్మకందారుతో సహా. అతడికి క్రితం రోజే మెసేజ్ పెట్టాడు మర్నాడు డీల్ పూర్తి చేద్దాం ఇంటికి రమ్మని.

“సర్, బాగా ఆలోచించుకోండి. ప్రాపర్టీ విలువ పదిహేను కోట్లు. నాకు డబ్బు బాగా అవసరం గనక మీకు పది కోట్లకే ఇచ్చేస్తున్నాను. వచ్చే వారం నాకు ఖచ్చితంగా ఐదు కోట్లు ఇవ్వాలి. బేలెన్స్ ముప్పై రోజుల్లో ఇవ్వాలి. ఒకవేళ మీరు డబ్బు ఇవ్వలేకపోతే, మీరు ఇప్పుడు ఇచ్చే యాభై లక్షలు నేను తిరిగి ఇవ్వను. అగ్రిమెంట్ కేన్సిల్ అవుతుంది!” చెప్పాడు అమ్మకందారు హెచ్చరిస్తున్నట్టుగా.

“మీ డబ్బు ఎక్కడకీ పోదు. నాకు రావాల్సిన డబ్బు ఖచ్చితంగా వచ్చే వారం వచ్చి తీరుతుంది. అన్ని ఏర్పాట్లూ అయిపోయినై.” నమ్మకంగా చెప్పి, యాభై లక్షలు ఉన్న బేగు అతడి చేతిలో పెట్టాడు ధర్మారావు.

మొత్తానికి ఆరోజు అనుకున్న పనులన్నీ సక్రమంగా పూర్తి చేసుకునేసరికి రాత్రి పది. పదిహేను కోట్ల విలువైన ఆస్తికి తను అధిపతి కాబోతున్నాడు. ఇంకో నెలరోజుల్లోనే! అంతా అయ్యాక, దేవుడికి తన వైపు నుండి ఏదైనా మంచి కానుక ఇవ్వాలి!

ఇంట్లో వారికి విషయం చెప్పాలా వొద్దా అని కాసేపు ఆలోచించి వారికోసం చూసాడు. ఎప్పటిలాగే ఇంట్లో ఎవరూ లేరు. పిల్లలు బయటకి, భార్య క్లబ్ కి వెళ్లారు. మరికొన్ని రోజుల్లో జరగబోయేది తల్చుకుంటే అతడికి మాటల్లో చెప్పలేని ఆనందం కలగసాగింది. కాసేపు డబ్బు మత్తులో గడిపాక, మద్యం మత్తులోకి కూడా వెళ్తే బావుంటుంది అని మూడవ అంతస్తుకి వెళ్ళాడు. బాగా తాగి అర్ధరాత్రి కిందకి దిగేసరికి ఎవరి అవస్థల్లో వాళ్ళు ఉన్నారు.

కొన్ని రోజుల్లో వీళ్ళ ఆర్ధిక పరిస్థితిని మార్చేసే తనని వీళ్ళు భవిష్యత్తు లో ఎలా ట్రీట్ చేస్తారో అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు ధర్మారావు.

***

మర్నాడు ఉదయం రెడీ అయ్యాక ఎప్పటిలానే ఆఫీసుకు వెళ్ళలేదు. భార్యను, పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకొని తను కొన్న ప్రాపర్టీ గురించి వివరించాడు. అందరి మొహాల్లోనూ సంబరం. కొనడానికి డబ్బెక్కడిదీ అని ఎవ్వరూ అడగలేదు. ఎవరి ఆలోచనల్లో వారు మునిగిపోయారు. ఈలోగా బేంక్ మేనేజర్ నుండి కాల్ వచ్చింది. చిరునవ్వుతో కాల్ అందుకొని మాట్లాడాడు ధర్మారావు.

చెప్పాల్సిన మూడు నాలుగు ముక్కలు చెప్పేసి బేంక్ మేనేజర్ ఫోన్ పెట్టేసాడు. కాళ్ళ కింద భూమి కదిలినట్టుగా అనిపించింది ధర్మారావుకి. అంత పెద్ద షాకు అతడికి ఎప్పుడూ తగల్లేదు! ఇంట్లోవారు అతడితో అన్నదేదీ అతడి చెవికి ఎక్కడంలేదు. పిచ్చెక్కినట్టుగా అయి దిక్కులు చూడసాగాడు. బేంకు మేనేజర్ చెప్పిందే మనసులో, మెదడులో మాటిమాటికీ మెదలసాగింది...

"సర్, వంద కోట్లు డొనేట్ చేసిన ఆ కోటేశ్వరరావు గాడి ఖాతా లో నూట పది రూపాయలు మాత్రమే ఉన్నాయి! ఆ చెక్కు చెల్లదు!”

క్రితం రోజు తను ప్రాపర్టీ కొనడానికి ఇచ్చిన యాభై లక్షలు పోయినట్టే అని అర్థమవటానికి రెండు మూడు నిమిషాలు పట్టింది. ఆ వెంటనే బీపీ అమాంతంగా పెరిగి గుండె పోటు వచ్చింది! గుండె పట్టుకొని సోఫాలోంచి జారి కింద పడ్డాడు అధర్మానికి మారుపేరైన ధర్మారావు! ఇంట్లోవారంతా ఏం జరిగిందో అర్థంకాక అతడి చుట్టూ మూగారు.

“నీకిది జరగాల్సిందే!” అన్నట్టుగా గోడకు తగిలించి ఉన్న ఫోటోలోంచి చిరునవ్వుతో జరిగేది చూడసాగాడు దేవుడు.

****

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు